ఓ గురువు అటవీ ప్రాంతంలోని మారుమూల ఉన్న చిన్నచిన్న గ్రామాలకు వెళ్ళి సత్సంగం చేయాలని బయలుదేరాడు. ఆయనతోపాటు శిష్యబృందం కూడా బయలుదేరింది. కొండలు, గుట్టలు, సెలయేర్లు దాటి వెళ్తూ ఉన్నారు. దారిలో ఓ శిష్యుడు, గురువుని ‘ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఎలా?’’ అని అడిగాడు.
‘‘మానవ శరీరం దేవుడిచ్చిన ఒకే ఒక అవకాశం. మరలా రమ్మంటే రాదు. అందుకని దాని విలువ తెలుసుకుని క్షణం క్షణం ఆనందంగా జీవించాలి!’’ అన్నాడు.
‘‘అదెలా?’’ అని అడిగాడు శిష్యుడు.
ఇంతలో దూరంగా కొందరు మహిళలు పొయ్యిపైన నీళ్ళు కాగిస్తూ కనిపించారు గురువుకి. శిష్యుడిని అక్కడే కొద్దిసేపు ఆగమని చె΄్పాడు. ఆ కట్టెలు కాలే వాసన పీల్చి కాలుతున్నదేదో చెప్పమన్నాడు.
వాసన పీల్చిన శిష్యుడు ఆశ్చర్యపోయాడు.
‘తను గమనించింది వాస్తవమా కాదా’ అని ఒకటికి రెండుసార్లు సరి చూసుకున్నాడు. తను చూస్తున్నది ముమ్మాటికీ నిజమేనని అర్థమయ్యింది.
‘‘అక్కడ కాలుతున్నది చందనం కట్టెలు. అయ్యో, ఎందుకలా చేస్తున్నారు. ఎంతో విలువైన చందనం కొయ్యలను వంటచెరుకుగా వాడటమేమిటి?’’ అని మనసులో అనుకున్నాడు.
‘భర్తలకు తెలియకుండా వారు పొరపాటుగా అలా చేస్తున్నారేమోనని’ అనుమానమేసింది. జాగ్రత్తగా గమనించిన అతడికి మరింత ఆశ్చర్యం కలిగింది. అది ఏమిటంటే ఆ మహిళలకు కొద్ది దూరంలోనే వారి భర్తలు చందనం కొయ్యలను కత్తితో నరికి పొయ్యిలో పెట్టడానికి అనువుగా కట్టెలు చీల్చుతున్నారు.
అదే విషయాన్ని శిష్యుడు బాధగా ‘బంగారంలాంటి చందనాన్ని మంటపాలు చేయడం’ గురించి గురువుకు చెప్పాడు.
దానికి గురువు నవ్వి ‘‘చందనం కొయ్యల విలువ, వాటి ప్రత్యేకత వారికి తెలియదు. అందుకే వాటిని పొయ్యిలోపెట్టి తగులబెట్టేస్తున్నారు. వారి కళ్ళకు అవి మామూలు కట్టెల్లాగే అగుపిస్తున్నాయి. నీకు వాటి విలువ తెలుసు కాబట్టే ఆశ్చర్యపోతున్నావు. వారు చేస్తున్నది తప్పని చెబుతున్నావు. వారికి వాటి విలువ తెలిసేంత వరకు వారు చేస్తున్నది సరైనదేనని అనుకుంటారు. మనిషి కూడా అంతే. జీవితం విలువ తెలుసుకోక లేనిపోని పట్టింపులు, అహం, అసూయాద్వేషాలు, కోపం, ప్రతీకారం, ప్రపంచాన్ని మార్చాలనే ప్రయత్నం... ఇలాంటి వాటితో ఎంతోకాలం వృథా చేస్తున్నాడు. జీవితం విలువైనదన్న ఎరుక ఉంటే చాలు, ఆనందం మన వెంటే ఉంటుంది’’ అని వివరించాడు.
జీవితం చాలా చిన్నదనీ, ప్రతిక్షణం ప్రకృతి ప్రసాదమని, అది తెలుసుకోక΄ోతే అసలైన ఆనందాన్ని కోల్పోతామని గ్రహించిన శిష్యబృందం ముందుకు నడిచింది.
– ఆర్.సి. కృష్ణస్వామి రాజు
Comments
Please login to add a commentAdd a comment