పిల్లలంటే కేవలం చదువులు, మార్కులు, ర్యాంకులు ఇంతేనా అంతకుమించి తెలుసుకోవాల్సింది ఏమి లేదా!. ఎప్పుడైనా గమనించారా! పిల్లలను మనం ఎలా పెంచుతున్నాం. వారికి చదువులు, మార్కుల కంటే ప్రధానంగా తెలుసుకోవల్సినవేంటో గమనించారో. అసలు చదువు, మార్కులు ఇలాంటివేమి లేకుండానే మన పెద్దలు ఎంతో చాకచక్యంగా సమర్ధవంతంగా జీవించడమే గాక సమాజంలో నెగ్గుకొచ్చారు. అయినా మనం వాటిని గమనించకుండా పిల్లలను ఓ యంత్రాల్లా ఇలానే బతకాలంటూ.. నిర్దేశించేస్తున్నాం. వారు నేర్చుకోవాల్సి అతి ముఖ్యమైన, విలువైన జీవిత పాఠాలను నేర్పించలేకపోతున్నాం
అవే వాళ్ల చివరి ఫోటోలు..
సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం మన హైదరాబాద్‌లో జులై 08, 2014న ఒక దారుణమైన సంఘటన జరిగింది. మీలో ఎవరికైనా గుర్తుందా? . తొమ్మిదేళ్ల క్రితం హైదరాబాద్ వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన దాదాపుగా 46 మంది విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్ కోసం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు.. అక్కడ సాయంత్రం 5:30 గంటలకు బియాస్ నదీ తీరాన ఫోటోలు తీసుకుందామని వెళ్లారు.. అప్పుడు నదిలో నీళ్లు లేవు. కేవలం రాళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ నది ప్రవహించే చోటున మధ్యలో ఒక పెద్ద బండరాయి వీళ్ళను ఆకర్షించింది. దానిపై నిలబడి, ఫోటోలు దిగుదామని వెళ్లారు. సరిగ్గా 6 గంటల సమయంలో ఒక సైరన్ మ్రోగింది.. అదేంటో వీళ్లకు అర్థం కాలేదు.. వీళ్ళున్న ప్రాంతానికి ముందు ఓ డ్యామ్ గేట్లు ఎత్తివేసి, నదీ జలాలను విడుదల చేశారు.. ఆ నదీ ప్రవాహం వీళ్ళ వైపుగా రావడాన్ని ఒడ్డున ఉన్న కొందరు చూశారు.. వీళ్ళను అలర్ట్ చెయ్యడానికి కేకలు వేశారు.. కానీ, వీళ్ళు పట్టించుకోలేదు.. ఆ నీళ్ళ మధ్యన నిలబడి, ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.. (వాళ్ళ చివరి ఫోటోలు అవే).
అంతంతా చదువులు చదివిన పిల్లలేనా..
అంతలో నీటి మట్టం స్థాయి అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.. ఒడ్డుకు దగ్గరలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు చిన్నగా వచ్చేశారు.. అందులో ఒక అమ్మాయి తన చెప్పులు బండ మీద మర్చిపోయాను అని చెప్పుల కోసం మళ్ళీ నది మధ్యలోకి వెళ్లి పోయింది.. ఉన్నట్లుండి, నది ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది. నీటి మట్టం ఎత్తు దాదాపుగా 5 అడుగుల వరకూ చేరుకుంది.. రాళ్ళ మీద నిలుచున్న విద్యార్థులు నిస్తేజంగా నిలబడిపోయారు.. అందరూ చూస్తుండగానే నీటి ప్రవాహంలో కళ్లెదుటే కొట్టుకునిపోయారు.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.. ఇక్కడ మనం గమనించవలసింది, విజ్ఞాన్ ఇజనీరింగ్ కాలేజ్ లాంటి టాప్ కాలేజ్‌లో చదివిన వీళ్లకు, ప్రకృతి ఎంత శక్తివంతమైనది అని తెలియకపోవడం.. వీళ్ళలో ఎవరికీ ఈత రాకపోవడం.. "చెప్పుల" కోసం ప్రాణాలను పోగొట్టుకోవడం..చూస్తే ఇంత పెద్ద చదువులు చదవిన పిల్లలేనా అనే సందేహం రావడం లేదా!.
ఇక్కడ ఎందరు పిల్లలకు ఈత వచ్చు? ఈత అని మాత్రమే కాదు.. ఉన్నట్లుండి మీ ఇంట్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడితే, ఏమి చెయ్యాలి అన్నది ఎందరు పిల్లలకు తెలుసు? అంతెందుకు ఎవరైనా పెద్దలకు సడెన్ హార్ట్ ఎటాక్ వచ్చి..ఊపిరి ఆడకపోతే తక్షణమే ఎలా స్పందించాలో తెలుసా?..లేదా చెయ్యి తెగి.. రక్తం ధారగా కారుతున్నపుడు ఏమి చెయ్యాలి అన్నది ఎందరు పిల్లలకు తెలుసు? చెప్పగలరా. కనీసం అలాంటి సమయాల్లో ముందుగా చేయాల్సిన ప్రథమ చికిత్స ..ఎలా చేయాలో తెలుసా? . ముఖ్యంగా పిల్లలకు మనం నేర్పిస్తున్నది ఏమిటో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా!. కేవలం చదువు..చదువు.. చదువు, మార్కులు, ర్యాంకులు, ఇజనీరింగ్, మెడిసిన్ సీట్లు, GRE, G-MAT, IELTS, TOEFL, US, UK.. డాలర్లు.. ఇవే చెబుతున్నాం. ఆ చదువులు కూడా వాళ్లని షాపింగ్‌మాల్స్‌లో బ్రాండెడ్ డ్రెసెస్ వేసుకోవడం, పిజ్జాలు, బర్గర్లు, చికెన్ టిక్కా ముక్కలు, బిర్యానీలు తినమని మాత్రమే చెబుతోంది.
కామన్‌సెన్స్ నేర్పిస్తున్నామా..
ఆ చదువు సమస్య వస్తే ఎలా ఎదుర్కొని నిలబడాలో చెప్పడం లేదు. అసలు ప్రకృతి అందాలు చూడటమే కాదు. అది కన్నెర్రజేస్తే ఎలా ఉంటుందో చూపించాలి. అలాగే రాజ్యాంగంలోని మన హక్కుల గురించి, చట్టాల గురించి అవగాహన కల్పించాలి.. ఎదుటి వాడు దాడి చేస్తే రక్షించుకోవడం నేర్పించాలి.. సమాజంలో ఉన్న అన్ని రకాల మనుషులతో సమయస్పూర్తిగా మెలగడం అలవాటు చెయ్యాలి. అప్పుడే వాళ్ళకి మంచి , చెడు గురించి అవగాహన వస్తుంది.. అన్నింటికంటే ముందు "common sense" (ఇంగిత జ్ఞానము) అనేది లేకుండా పిల్లలను పెంచుతున్నాం... దాన్ని నేర్పకుండా.. చదువుకో, మార్కులు తెచ్చుకో, ర్యాంకులు సంపాదించు.. అంటూ ఒక యంత్రంలా తయారు చేస్తే, ఇదుగో.. ఫలితాలు.. ఇలాగే ఉంటాయి..... గమనించండి.... ఆలోచించండి.... ఈ దిశగా కూడా ప్రయత్నం చేయండి.. కొంతమందికి అయినా అవగాహన కల్పించి మన విద్యార్థుల విలువైన జీవితాలను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం.
(చదవండి: పాఠం కోసం ఫారిన్ వెళదాం చలోచలో!)
Comments
Please login to add a commentAdd a comment