Timeline
-
‘ధన’ చరిత్ర! భారతీయ కరెన్సీ నోట్ల విశేషాలు తెలుసుకోండి..
భారతీయ కరెన్సీ సంవత్సరాలుగా మారుతూ వేగంగా అభివృద్ధి చెందింది. దేశ స్వాతంత్య్రానికి ముందే కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చినా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశం గణతంత్ర రాజ్యంగా మారిన అనంతరం అనేక డినామినేషన్ల నోట్లు చలామణిలోకి వచ్చాయి. ఇప్పటివరకు భారతీయ కరెన్సీ నోట్లపై ఎవరెవరి చిత్రాలు కనిపించాయి? మొదటిసారిగా మహాత్మా గాంధీ చిత్రం ఎప్పుడు కనిపించింది? నోట్లపై ఏయే భాషలు ఎప్పుడు ముద్రించారు? నోట్ల రద్దు, ఉపసంహరణలు ఎప్పుడు జరిగాయి? వంటి ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం. వలసరాజ్యాల నుంచి స్వతంత్ర భారతదేశానికి కరెన్సీ నిర్వహణ బదిలీ సాఫీగానే జరిగింది. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి వలస పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించింది. అయితే, 1950 జనవరి 26న దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది. కానీ అంతకు ముందు నుంచే భారతీయ రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ నోట్లను జారీ చేయడం ప్రారంభించింది. భారత ప్రభుత్వం రూపాయి నోటు కొత్త డిజైన్ని 1949లో తీసుకొచ్చింది. అప్పటికింకా స్వతంత్ర భారతదేశానికి నూతన చిహ్నాలను ఎంపిక చేయాల్సి ఉంది. నోట్లపై మొదట్లో ఉన్న రాజు చిత్రం స్థానంలో మహాత్మా గాంధీ చిత్రాన్ని పెట్టాలని భావించారు. ఆ మేరకు డిజైన్లు కూడా సిద్ధం చేశారు. కానీ చివరి నిమిషంలో గాంధీ చిత్రానికి బదులుగా సారనాథ్‌లోని లయన్ క్యాపిటల్ ఎంపికకు ఏకాభిప్రాయం వ్యక్తమైంది. మొదటి నోట్లు ఇవే.. రిపబ్లిక్ ఇండియా మొదటిసారిగా 1950లో రూ. 2, రూ. 5, రూ.10, రూ.100 కరెన్సీ నోట్లను జారీ చేసింది. ఈ నోట్ల రంగు, డిజైన్లలో స్వల్ప వ్యత్యాసం ఉండేది. అయితే రూ. 10 నోటు వెనుకవైపు ఉన్న షిప్ మోటిఫ్‌ను మాత్రం అలాగే కొనసాగించారు. 1953లో కొత్త నోట్లపై హిందీని ప్రముఖంగా ముద్రించారు. రూపాయ హిందీ బహువచనంపై చర్చ జరగడంతో రూపియేగా మార్చారు. 1954లో రూ. 1,000, రూ. 5,000, రూ.10,000 వంటి అధిక విలువ కలిగిన నోట్లు తిరిగి ప్రవేశపెట్టారు. 1946 నాటి నోట్ల రద్దు వంటి కారణాలతోనే 1978లో మరోసారి అధిక విలువ కలిగిన నోట్లను రద్దు చేశారు. రూ. 2, రూ.5 వంటి చిన్న డినామినేషన్ నోట్లను తీసుకొచ్చినప్పుడు ప్రారంభంలో ఆయా నోట్లపై పులి, జింక వంటి జంతువుల చిత్రాలను ముద్రించారు. 1975లో ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి భారతదేశం చేస్తున్న కృషి తెలియజేసేలా రూ. 100 నోటుపై వ్యవసాయం, తేయాకు ఆకులు తెంపడం వంటి పనులకు సంబంధించిన చిత్రాలను ముద్రించారు. మొదటిసారిగా గాంధీ చిత్రం 1960ల ఆరంభంలో దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 1967లో నోట్ల సైజ్‌లను తగ్గించారు. కరెన్సీ నోట్లపై మొదటిసారిగా గాంధీజీ కనిపించింది ఈ కాలంలోనే. మహాత్మా గాంధీ జయంతి శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని 1969లో సేవాగ్రామ్ ఆశ్రమం వద్ద కూర్చున్న గాంధీ చిత్రాన్ని ముద్రించిన స్మారక డిజైన్ సిరీస్‌ను విడుదల చేశారు. నోట్ల ముద్రణా ఖర్చులు తగ్గించుకునేందుకు 1972లో రూ.20 నోట్లు, రూ. 1975లో రూ.50 నోట్లను ముద్రించింది భారత ప్రభుత్వం. 1980 దశకంలో పూర్తిగా కొత్త నోట్లను విడుదల చేశారు. ఈ నోట్లపై మూలాంశాలను పూర్తిగా మార్చేశారు. సైన్స్ & టెక్నాలజీ ప్రాముఖ్యాన్ని తెలియజేసేలా రూ. 2 నోటుపై ఆర్యభట్ట చిత్రం, దేశ పురోగతిని చాటేలా రూ. 1 నోటుపై ఆయిల్ రిగ్, రూ. 5 నోటుపై ఫార్మ్ మెకనైజేషన్, రూ. 100 నోటుపై హీరాకుడ్ డ్యామ్ చిత్రాలను ముద్రించారు. అలాగే భారతీయ కళా రూపాలను ప్రదర్శించేలా రూ. 20 నోటుపై కోణార్క్ ఆలయ చక్రం, రూ. 10 నోటుపై నెమలి, షాలిమార్ గార్డెన్ చిత్రాలను తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ సిరీస్ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కరెన్సీ నిర్వహణ భారంగా మారడంతో 1987 అక్టోబర్‌లో మహాత్మా గాంధీ చిత్రంతో రూ. 500 నోటును ప్రవేశపెట్టారు. అశోక పిల్లర్ లయన్ క్యాపిటల్ మాత్రం వాటర్ మార్క్‌గా కొనసాగింది. రిప్రోగ్రాఫిక్ టెక్నిక్‌లు అభివృద్ధి చెందడంతో నోట్ల సాంప్రదాయ భద్రతా లక్షణాలు బలహీనమయ్యాయి. దీంతో కొత్త ఫీచర్లను పరిచయం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగా 1996లో కొత్త 'మహాత్మా గాంధీ సిరీస్'ను ప్రవేశపెట్టారు. కొత్త వాటర్‌మార్క్, విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్, గుప్త చిత్రం, అంధుల కోసం ఇంటాగ్లియో ఫీచర్లు వీటిలో ఉన్నాయి. ఇవే కొత్త ఫీచర్లతో 2000 అక్టోబర్ 9న రూ. 1000 నోట్లను కూడా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2000 నవంబర్ 18న రూ. 500 నోట్ల రంగు మార్చారు. అదనపు భద్రతా ఫీచర్‌గా మధ్యలో ఉన్న సంఖ్యా విలువలో కలర్-షిఫ్టింగ్ ఇంక్‌ను చేర్చారు. మెరుగైన భద్రతా ఫీచర్లు 2005లో మహాత్మా గాంధీ సిరీస్ నోట్లలో భాగంగా రూ.100, అంత కంటే ఎక్కువ డినామినేషన్ నోట్లపై వైడ్ కలర్ షిఫ్టింగ్ మెషిన్ రీడబుల్ మాగ్నెటిక్ విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్ వంటి మెరుగైన భద్రతా ఫీచర్లను తీసుకొచ్చారు. 2005లో మొదటిసారిగా నోట్లపై ముద్రణ సంవత్సరం ప్రవేశపెట్టారు. సీక్వెన్స్‌ని నిర్వహించడానికి, అదే క్రమ సంఖ్యతో లోపభూయిష్టమైన నోట్లను మళ్లీ ముద్రించకుండా ఉండేందుకు 2006లో నోట్లపై “స్టార్ సిరీస్” ప్రవేశపెట్టారు. రూపాయి చిహ్నం (₹) భారత రూపాయి గుర్తింపు చిహ్నంగా 2011లో రూపాయి చిహ్నాన్ని (₹) ప్రవేశపెట్టారు. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం కలిసి 2010లో భారత రూపాయికి ఒక విశిష్ట చిహ్నాన్ని (₹) లాంఛనప్రాయంగా రూపొందించాయి. 2011లో కొత్త రూపాయి చిహ్నాన్ని బ్యాంకు నోట్లు, నాణేలపై ముద్రించడం ప్రారంభించారు. నకిలీ నోట్ల బెడదను నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కరెన్సీ నోట్ల భద్రతా ఫీచర్లను కాలానుగుణంగా అప్-గ్రేడేషన్ చేస్తుంటాయి. భారతదేశంలో అటువంటి అప్-గ్రేడేషన్ 2005లో జరిగింది. తర్వాత 2015లో అధిక డినామినేషన్లపై బ్లీడ్ లైన్లు, ఎక్స్‌ప్లోడింగ్ నంబర్లు వంటి కొన్ని కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టారు. రూ. 50, రూ. 20 నోట్లపై ఇంటాగ్లియో ప్రింటింగ్‌ను 2016లో ఆపేశారు. భారత ప్రభుత్వం 2015లో రూపాయి నోటును తిరిగి ప్రవేశపెట్టింది. మహాత్మ గాంధీ నూతన సిరీస్ ద్రవ్య సంస్కరణల్లో భాగంగా భారత ప్రభుత్వం 2016 నవంబర్‌లో రెండో సారి పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2016 నవంబర్ 8 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన రూ. 500, రూ. 1,000 డినామినేషన్ల మహాత్మా గాంధీ సిరీస్ నోట్ల చట్టబద్ధమైన టెండర్ స్థితిని ఉపసంహరించింది. ఆ తర్వాత దేశ సాంస్కృతిక వారసత్వం , శాస్త్రీయ విజయాలను హైలైట్ చేస్తూ మహాత్మా గాంధీ నూతన సిరీస్‌లో కొత్త నోట్లను ప్రవేశపెట్టారు. ఒక్కో డినామినేషన్ నోటును ఒక్కో రంగు, సైజ్‌ల్లో రూపొందించారు. మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో భాగంగా 2016 నవంబర్ 8న రూ. 2000 నోటును 2017 ఆగస్టు 23న రూ. 200 నోటును కొత్తగా తీసుకొచ్చారు. కాగా రూ.2000 నోటును 2023 మే 19న చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇదీ చదవండి: Independence Day 2023: స్వాతంత్య్రానికి ముందే వందలాది బ్యాంకులు! ఘనమైన మన బ్యాంకింగ్ చరిత్ర -
పిల్లలంటే.చదువులు, మార్కులు, ర్యాంకులు..ఇంతేనా!
పిల్లలంటే కేవలం చదువులు, మార్కులు, ర్యాంకులు ఇంతేనా అంతకుమించి తెలుసుకోవాల్సింది ఏమి లేదా!. ఎప్పుడైనా గమనించారా! పిల్లలను మనం ఎలా పెంచుతున్నాం. వారికి చదువులు, మార్కుల కంటే ప్రధానంగా తెలుసుకోవల్సినవేంటో గమనించారో. అసలు చదువు, మార్కులు ఇలాంటివేమి లేకుండానే మన పెద్దలు ఎంతో చాకచక్యంగా సమర్ధవంతంగా జీవించడమే గాక సమాజంలో నెగ్గుకొచ్చారు. అయినా మనం వాటిని గమనించకుండా పిల్లలను ఓ యంత్రాల్లా ఇలానే బతకాలంటూ.. నిర్దేశించేస్తున్నాం. వారు నేర్చుకోవాల్సి అతి ముఖ్యమైన, విలువైన జీవిత పాఠాలను నేర్పించలేకపోతున్నాం అవే వాళ్ల చివరి ఫోటోలు.. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం మన హైదరాబాద్‌లో జులై 08, 2014న ఒక దారుణమైన సంఘటన జరిగింది. మీలో ఎవరికైనా గుర్తుందా? . తొమ్మిదేళ్ల క్రితం హైదరాబాద్ వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన దాదాపుగా 46 మంది విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్ కోసం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు.. అక్కడ సాయంత్రం 5:30 గంటలకు బియాస్ నదీ తీరాన ఫోటోలు తీసుకుందామని వెళ్లారు.. అప్పుడు నదిలో నీళ్లు లేవు. కేవలం రాళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ నది ప్రవహించే చోటున మధ్యలో ఒక పెద్ద బండరాయి వీళ్ళను ఆకర్షించింది. దానిపై నిలబడి, ఫోటోలు దిగుదామని వెళ్లారు. సరిగ్గా 6 గంటల సమయంలో ఒక సైరన్ మ్రోగింది.. అదేంటో వీళ్లకు అర్థం కాలేదు.. వీళ్ళున్న ప్రాంతానికి ముందు ఓ డ్యామ్ గేట్లు ఎత్తివేసి, నదీ జలాలను విడుదల చేశారు.. ఆ నదీ ప్రవాహం వీళ్ళ వైపుగా రావడాన్ని ఒడ్డున ఉన్న కొందరు చూశారు.. వీళ్ళను అలర్ట్ చెయ్యడానికి కేకలు వేశారు.. కానీ, వీళ్ళు పట్టించుకోలేదు.. ఆ నీళ్ళ మధ్యన నిలబడి, ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.. (వాళ్ళ చివరి ఫోటోలు అవే). అంతంతా చదువులు చదివిన పిల్లలేనా.. అంతలో నీటి మట్టం స్థాయి అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.. ఒడ్డుకు దగ్గరలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు చిన్నగా వచ్చేశారు.. అందులో ఒక అమ్మాయి తన చెప్పులు బండ మీద మర్చిపోయాను అని చెప్పుల కోసం మళ్ళీ నది మధ్యలోకి వెళ్లి పోయింది.. ఉన్నట్లుండి, నది ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది. నీటి మట్టం ఎత్తు దాదాపుగా 5 అడుగుల వరకూ చేరుకుంది.. రాళ్ళ మీద నిలుచున్న విద్యార్థులు నిస్తేజంగా నిలబడిపోయారు.. అందరూ చూస్తుండగానే నీటి ప్రవాహంలో కళ్లెదుటే కొట్టుకునిపోయారు.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.. ఇక్కడ మనం గమనించవలసింది, విజ్ఞాన్ ఇజనీరింగ్ కాలేజ్ లాంటి టాప్ కాలేజ్‌లో చదివిన వీళ్లకు, ప్రకృతి ఎంత శక్తివంతమైనది అని తెలియకపోవడం.. వీళ్ళలో ఎవరికీ ఈత రాకపోవడం.. "చెప్పుల" కోసం ప్రాణాలను పోగొట్టుకోవడం..చూస్తే ఇంత పెద్ద చదువులు చదవిన పిల్లలేనా అనే సందేహం రావడం లేదా!. ఇక్కడ ఎందరు పిల్లలకు ఈత వచ్చు? ఈత అని మాత్రమే కాదు.. ఉన్నట్లుండి మీ ఇంట్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడితే, ఏమి చెయ్యాలి అన్నది ఎందరు పిల్లలకు తెలుసు? అంతెందుకు ఎవరైనా పెద్దలకు సడెన్ హార్ట్ ఎటాక్ వచ్చి..ఊపిరి ఆడకపోతే తక్షణమే ఎలా స్పందించాలో తెలుసా?..లేదా చెయ్యి తెగి.. రక్తం ధారగా కారుతున్నపుడు ఏమి చెయ్యాలి అన్నది ఎందరు పిల్లలకు తెలుసు? చెప్పగలరా. కనీసం అలాంటి సమయాల్లో ముందుగా చేయాల్సిన ప్రథమ చికిత్స ..ఎలా చేయాలో తెలుసా? . ముఖ్యంగా పిల్లలకు మనం నేర్పిస్తున్నది ఏమిటో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా!. కేవలం చదువు..చదువు.. చదువు, మార్కులు, ర్యాంకులు, ఇజనీరింగ్, మెడిసిన్ సీట్లు, GRE, G-MAT, IELTS, TOEFL, US, UK.. డాలర్లు.. ఇవే చెబుతున్నాం. ఆ చదువులు కూడా వాళ్లని షాపింగ్‌మాల్స్‌లో బ్రాండెడ్ డ్రెసెస్ వేసుకోవడం, పిజ్జాలు, బర్గర్లు, చికెన్ టిక్కా ముక్కలు, బిర్యానీలు తినమని మాత్రమే చెబుతోంది. కామన్సెన్స్ నేర్పిస్తున్నామా.. ఆ చదువు సమస్య వస్తే ఎలా ఎదుర్కొని నిలబడాలో చెప్పడం లేదు. అసలు ప్రకృతి అందాలు చూడటమే కాదు. అది కన్నెర్రజేస్తే ఎలా ఉంటుందో చూపించాలి. అలాగే రాజ్యాంగంలోని మన హక్కుల గురించి, చట్టాల గురించి అవగాహన కల్పించాలి.. ఎదుటి వాడు దాడి చేస్తే రక్షించుకోవడం నేర్పించాలి.. సమాజంలో ఉన్న అన్ని రకాల మనుషులతో సమయస్పూర్తిగా మెలగడం అలవాటు చెయ్యాలి. అప్పుడే వాళ్ళకి మంచి , చెడు గురించి అవగాహన వస్తుంది.. అన్నింటికంటే ముందు "common sense" (ఇంగిత జ్ఞానము) అనేది లేకుండా పిల్లలను పెంచుతున్నాం... దాన్ని నేర్పకుండా.. చదువుకో, మార్కులు తెచ్చుకో, ర్యాంకులు సంపాదించు.. అంటూ ఒక యంత్రంలా తయారు చేస్తే, ఇదుగో.. ఫలితాలు.. ఇలాగే ఉంటాయి..... గమనించండి.... ఆలోచించండి.... ఈ దిశగా కూడా ప్రయత్నం చేయండి.. కొంతమందికి అయినా అవగాహన కల్పించి మన విద్యార్థుల విలువైన జీవితాలను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. (చదవండి: పాఠం కోసం ఫారిన్ వెళదాం చలోచలో!) -
న్యాయమూర్తుల నియామకంలో ఏమిటీ జాప్యం?
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం కోసం కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం సత్వరం నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తుండడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీరు విసుగు తెప్పించేలా ఉందని ఆక్షేపించింది. జడ్జీల నియామకాల ప్రక్రియకు భంగం కలిగించవద్దని సూచించింది. జడ్జీలను నిర్దేశిత గడువులోగా నియమించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్ 20న టైమ్‌లైన్ ప్రకటించింది. ఈ టైమ్‌లైన్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ కౌల్, జస్టిస్ ఓజాల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎప్పుటికప్పుడు ప్రకటించడం లేదని అటార్నీ జనరల్ వెంకటరమణికి ధర్మాసనం తెలియజేసింది. వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది. తమ అసహనాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేసింది. త్రిసభ్య ధర్మాసనం నిర్దేశించిన టైమ్‌లైన్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. కొలీజియం ఒకసారి ఒక పేరును సిఫార్సు చేసిందంటే, అక్కడితో ఆ ఆధ్యాయం ముగిసినట్లే. వాటిపై ప్రభుత్వం మళ్లీ సంప్రదింపులు జరిపే పరిస్థితి ఉండకూడదు’’ అని ఉద్ఘాటించింది. కొన్ని పేర్లు ఏడాదిన్నర నుంచి పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపింది. జడ్జీలుగా పదోన్నతి పొందాల్సిన వారు ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం కారణంగా వెనక్కి తగ్గుతున్నారని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఈ కేసులో ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తున్నాం. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి’’ అని ఏజేకు సూచించింది. తాము చట్టపరంగా నిర్ణయం తీసుకొనే పరిస్థితి తేవొద్దని కేంద్రానికి సూచించింది. నియామకాల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. ఉన్నత పదవుల్లో ఉంటూ అనుచిత వ్యాఖ్యలా? కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజుపై ధర్మాసనం ఆగ్రహం కొలీజియం వ్యవస్థ పట్ల కేంద్ర న్యాయ శాఖ కిరణ్ రిజిజు ఇటీవల చేసిన వ్యా్ఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తలను సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రిజిజు వ్యాఖ్యలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు అలా మాట్లాడడం సమంజసం కాదని పేర్కొంది. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టం కార్యరూపం దాల్చకపోవడం పట్ల కేంద్రం బహుశా అసహనంగా ఉన్నట్లు కనిపిస్తోందని జస్టిస్ ఎస్కే కౌల్ అన్నారు. కానీ న్యాయమూర్తుల నియామకంలో చట్ట నిబంధనలను పాటించకపోవడానికి అది కారణం కారాదని స్పష్టం చేశారు. ఆ పేర్లపై అభ్యంతరాలున్నాయి: కేంద్రం హైకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసిన 20 పేర్లను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ‘‘ఆ పేర్లపై చాలా గట్టి అభ్యంతరాలున్నాయి. కనుక మీ సిఫార్సులను పునఃపరిశీలించండి’’ అని సూచించింది!! కేంద్రం తిప్పి పంపిన ఈ 20 పేర్లలో 11 కొలీజియం రెండోసారి సిఫార్సు చేసినవి కావడం విశేషం! మిగతా తొమ్మిదేమో కొత్త పేర్లు. తాను స్వలింగ సంపర్కినని బాహాటంగా ప్రకటించిన అడ్వకేట్ సౌరభ్ కృపాల్ పేరు కూడా తిప్పి పంపిన జాబితాలో ఉంది. ఆయన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బి.ఎన్.కృపాల్ కుమారుడు. ఢిల్లీ హైకోర్టు కొలీజియం ఆయన పేరును 2017లో కొలీజియానికి సిఫార్సు చేసింది. దానిపై కొలీజియం మూడుసార్లు విభేదించింది. జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే సీజేఐగా ఉండగా కృపాల్ గురించి ప్రభుత్వం నుంచి మరింత సమాచారం కోరారు. అనంతరం 2021లో జస్టిస్ రమణ సీజేఐగా కృపాల్ పేరును ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సిఫార్సు చేశారు. -
బతుకులు బుగ్గి! అప్పుడు క్రాకర్స్, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికిల్స్..
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలోని దుకాణాలు, కంపెనీలు, సంస్థలు, గోదాముల్లో అగ్ని ప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. నాటి కార్తికేయ లాడ్జి, నేటి రూబీ లాడ్జీ ఉదంతాల్లో మాత్రం ఓ సారూప్యత ఉంది. మొదట అగ్ని ప్రమాదం ఈ రెండింటిలోనూ ప్రారంభంకాలేదు. వీటికి కింది అంతస్తుల్లో ఉన్న దుకాణాల్లో మొదలైన అగ్గి లాడ్జీలో బస చేసిన వారి ఉసురు తీసింది. ప్రమాదాలు ఎలా జరిగాయంటే.. ఉస్మాన్‌గంజ్‌లోని ప్రధాన రహదారిపై ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్లో శాంతిఫైర్ వర్క్స్ ఉంది. దీని మొదటి అంతస్తులో కెనరా బ్యాంక్ శాఖ ఉండగా... రెండు, మూడు అంతస్తుల్లో కలిపి కార్తికేయ లాడ్జి నడిచేది. ఈ రెండు ఉదంతాల్లోనూ మృతులు బయటి ప్రాంతాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఘరానా దొంగ మారుతి నయీం 2002 అక్టోబర్ 23న శాంతి ఫైర్ వర్క్స్‌లో చోరీ చేయడానికి వచ్చాడు. తన కారును అడ్డంగా పెట్టి షట్టర్ పగులకొట్టిన నయీం దుకాణంలోకి ప్రవేశించాడు. అందులో నగదు లభించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురై అక్కడ ఉన్న క్రాకర్స్‌ను నిప్పు పెట్టాడు. అలా మొదలైన మంటలు పై అంతస్తులకు పాకాయి. బ్యాంక్ దగ్ధం కాగా.. కార్తికేయ లాడ్జీలో బస చేసిన వాళ్లు, సిబ్బందితో సహా మొత్తం 12 మంది చనిపోయారు. తాజాగా సోమవారం రాత్రి జరిగిన రూబీ లాడ్జి ఉదంతమూ ఈ కోవకు చెందినదే. దీని సెల్లార్లో ఉన్న ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్‌లో అగ్గి రాజుకుంది. ఈ ధాటికి విడుదలైన మంటలు, పొగ.. పైన ఉన్న లాడ్జీలో బస చేసిన ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. మరో 10 మంది క్షతగాత్రులుగా మారారు. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..) నగరంలో భారీ అగ్ని ప్రమాదాల్లో మరికొన్ని.. ► 21.10.2006: సోమాజిగూడలోని మీన జ్యువెలర్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో పెయింటింగ్ పని చేయడానికి వచ్చిన వలస కార్మికులు పై అంతస్తులో నిద్రిస్తున్నారు. కింది ఫ్లోర్లో జరిగిన అగ్ని ప్రమాదంతో పెయింట్లు కాలి, విడుదలైన విష వాయువులతో ముగ్గురు చనిపోయారు. ► 24.11.2012: పుప్పాలగూడలోని బాబా నివాస్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. వాచ్‌మన్‌తో పాటు స్థానికుల అప్రమత్తత కారణంగా దాదాపు మరో పది మంది ప్రాణాలతో బయటపడ్డారు. ► 22.02.2017: అత్తాపూర్‌లోని పిల్లర్ నెం.253 సమీపంలో ఉన్న చిన్నతరహా పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూలర్ల పరిశ్రమలో మంటలు చెలరేగి ఆరుగురు ఒడిశాకు కార్మికులు చనిపోయారు. ► 23.03.2022: న్యూ బోయగూడ వద్ద శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో ఉన్న స్క్రాప్ గోదాంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 11 మంది బిహార్ కార్మికులు మృత్యువాత పడ్డారు. (క్లిక్ చేయండి: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: నిప్పుల్లో నిబంధనలు) -
‘ఎన్నికల’ పిటిషన్ల దాఖలుకు టైమ్‌లైన్ విధించండి
న్యూఢిల్లీ: అస్సాం, కేరళ, ఢిల్లీ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పిటిషన్లు దాఖలు చేయడానికి నిర్ధిష్టమైన గడువు(టైమ్‌లైన్) విధించాలని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి పిటిషన్లు దాఖలు చేయడానికి కోవిడ్–19 సెకండ్ వేవ్ కారణంగా గడువును పెంచుతూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చిందని, ఫలితంగా 6 రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను తాము ఇంకా భద్రపర్చాల్చి వస్తోందని పేర్కొంది. త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పెద్దసంఖ్యలో ఈవీఎంలు, వీవీప్యాట్లు అవసరమని తెలియజేసింది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరింది. ఎన్నికల సంఘం వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. దీనిపై వచ్చేవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. 6 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 కింద పిటిషన్లు దాఖలు చేయడానికి గడువును పెంచుతూ సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 27న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ గడువును పెంచుతున్నట్లు కోర్టు ప్రకటించింది. ఎన్నికైన అభ్యర్థులపై, ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలుంటే ఎవరైనా సరే కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టులో విచారణ ముగిసి, తీర్పు వచ్చేదాకా సదరు ఈవీఎంలు, వీవీప్యాట్లను భద్రపర్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. కోర్టులు వాటిని సాక్ష్యంగా పరిగణిస్తాయి. సాధారణ పరిస్థితుల్లో ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోగా పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 27న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు వల్ల భారీ సంఖ్యలో ఈవీఎంలు, వీవీప్యాట్లు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం వాటిని విడుదల చేయాలని ఎన్నికల సంఘం కోరుతోంది. -
జీఎస్టీ ప్రస్తావన: 17ఏళ్ల ప్రస్థానం.
దేశవ్యాప్తంగా మరికొన్ని గంటల్లో జీఎస్టీ అమల్లోకి రానుంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నేటి (శుక్రవారం, జూన్30) అర్థరాత్రి ప్రత్యేక సమావేశం లో జీఎస్టీకి ఘంటారావం మోగనుంది. జూలై 1 ఒకే దేశం ఒక పన్ను విధానం అమలు కానుంది. దేశీయ పన్నుల వ్యవస్థలో సమూల సంస్కరణ అంటూ బీజేపీ ప్రభుత్వం ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ను అమలు చేయనుంది. మరోవైపు జీఎస్టీ పరిణామాలపై తీవ్ర చర్చోప చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. 17 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత, ఈ జూలై1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానుంది. అయితే జీఎస్టీ అనే భావనను పరిచయం చేసింది ఎవరు. ఎక్కడనుంచి దీని ప్రస్థానం మొదలైంది ఒకసారి చూద్దాం. ఫిబ్రవరి 1986లో ఆర్థిక శాఖ మంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ 1986-87 సంవత్సర బడ్జెట్లో ఎక్సైజ్ టాక్సేషన్ నిర్మాణంలో ఒక ప్రధాన సవరణను ప్రతిపాదించారు. అనంతరం 2000లో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్ జీఎస్టీని పరిచయం చేశారు. అలాగే అప్పటి పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అసిమ్ దాస్ గుప్తా నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇదే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ప్రయాణానికి నాందిగా చెప్పుకోవాలి. 2003లో విజయ్ కేల్కర్ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటుద్వారా ప్రస్తుత పన్నుల వ్యవస్థను జీఎస్టీతో రీప్లేస్ చేయాలని చెప్పారు. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చింది. ఫిబ్రవరి 28, 2006 అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మొదటిసారి బడ్జెట్ ప్రసంగంలో జీఎస్టీ గురించి ప్రస్తావించారు. ఏప్రిల్ 1, 2010 నాటికి ప్రతిష్టాత్మక జీఎస్టీ అమలుకానుందని చెప్పారు. దీని అమలుకోసం ఆర్థిక మంత్రి మంత్రుల సాధికారిక కమిటీ ద్వారా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తుందని చెప్పారు. ఈ కమిటీని ఏర్పాటుకు రెండేళ్ల సమయం పట్టగా.. 2008లో ఈ కమిటీ ఏర్పాటైంది. 2008 ఏప్రిల్ 30న 'ఎ మోడల్ అండ్ రోడ్ మ్యాప్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ పేరతో తన రిపోర్ట్ అందించింది. ఆ తర్వాత ఏడాదికి.. అంటే 2009లో ఎంపవర్డ్ కమిటీ తొలి డిస్కషన్ పేపర్‌ను అందించింది. కానీ అప్పటితో యూపీఏ-వన్ పదవీకాలం ముగిసిపోయింది. తిరిగి 2009లో యూపీఏ రెండో సారి అధికారం దక్కించుకున్నాక ఆర్థిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ పదవీ స్వీకారం చేశారు. అనంతరం ఆయన జీఎస్టీ బేసిక్ నిర్మాణాన్ని వివరించారు. జీఎస్టీ అమలుకు 2010 డెడ్ లైన్‌గా పునరుద్ఘాటించారు. అపుడు బీజేపీ దీన్ని వ్యతిరేకించింది. 2011లో లోక్‌సభలో జీఎస్టీకి అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. మార్చి 29, 2011లో యశ్వంత్ సిన్హా నాయకత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని జిఎస్టి బిల్లును ప్రస్తావించింది. అసిమ్ దాస్ గుప్తా కమిటీకి రాజీనామా చేయడంతో కేరళ ఆర్థిక మంత్రి కెఎం మణి ఆ స్థానాన్ని ఆక్రమించారు. 2013లో జీఎస్టీని అమలు చేయాలని యుపిఎ ప్రభుత్వం తీర్మానించింది. చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో జీఎస్టీ వల్ల నష్టపోయిన రాష్ట్రాలకు రూ.9000 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 2012 నవంబరులో ఆర్థికమంత్రి చిదంబరం రాష్ట్ర ఆర్థిక మంత్రులతో సమావేశం డిసెంబరు 31 నాటికి అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయం. 2013 ఆగస్టులో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జిఎస్టీ కొత్త ప్రతిపాదనలతో నివేదిక సమర్పించింది. కాగా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ జిఎస్టి బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. దీని కారణంగా ప్రతి సంవత్సరం రూ.14,000 కోట్లు నష్టమని విమర్శించారు. అయితే 2013 ఆగస్ట్‌లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జీఎస్టీపీ తన నివేదికను అందించగా.. ఈ కమిటీ నివేదించిన సూచనలను బిల్లులో చేర్చారు. 2013 సెప్టెంబర్‌లో సాధికారిక కమిటీకి సవరించిన బిల్లును పంపారు. ఈ కమిటీ అందించిన సూచనల ప్రకారం 2014మార్చ్‌లో మరోసారి బిల్లును సవరించారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జీఎస్టీ అమలుపై వేగంగా చర్యలు చేపట్టింది. డిసెంబరు 18న జీఎస్టీకి 122 వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. జీఎస్టీ కోసం రాజ్యాంగ సవరణ బిల్లుకు 2015 మే నెలలో లోక్‌సభ ఆమోదం లభించింది. ఇక్కడ మళ్లీ ప్రతిపక్షంలో కాంగ్రెస్ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. జీఎస్టీని 18 శాతానికి పరిమితం చేయాలని పట్టుబట్టింది కాంగ్రెస్. అలాగే 1 శాతం ఎంట్రీ ట్యాక్స్‌ను తొలగించాల్సిందేనని తేల్చి చెప్పింది. 2016 ఆగస్ట్‌లో ప్రధాన అడ్డంకిగా ఉన్న రాజ్యసభ కూడా జీఎస్టీ బిల్లును ఆమోదించింది. సెప్టెంబరు 12న కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు కాగా, సెప్టెంబర్ 22-23 తేదీల్లో కౌన్సిల్ మొదటిసారి సమావేశమైంది. ఈ సందర్బంగా ఆదాయం నష్టపోయే రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించేలా 2016 అక్టోబర్ 18న జీఎస్టీ కౌన్సిల్ ఒక ప్రతిపాదన చేసింది. అదే ఏడాది నవంబర్ 3న 5, 12, 18, 28 శాతం అంటూ నాలుగు శ్లాబుల విధానానికి జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అలాగే సెస్‌ను కూడా ఆమోదించారు. సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీలపై ఏకాభిప్రాయం కుదర్చడంలో జీఎస్టీ కౌన్సిల్ విఫలం అయింది. 2016 డిసెంబర్ 23న జీఎస్టీ కౌన్సిల్లో రెండు చట్టాలకు ఒప్పందం కుదిరినా.. ద్వంద్వ నియంత్రణ మాత్రం ప్రశ్నార్ధకంగానే నిలిచింది. 2017 జనవరి 3న కాంపెన్సేషన్ కార్పస్‌ను 55 వేల కోట్ల రూపాయల నుంచి 90వేల కోట్లకు పెంచడంతో చాలా సమస్యలకు పరిష్కారం లభించింది. 2017 జనవరి 16న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో పన్ను విధించే అధికారంలో ద్వంద్వ నియంత్రణపై వచ్చిన సమస్యలకు పరిష్కారం లభించింది. 2017 ఫిబ్రవరి 18న డ్రాఫ్ట్ కాంపెన్సేషన్ బిల్లును జీఎస్టీ కౌన్సిల్ తుది రూపునిచ్చింది. అనంతరం సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, యూనియన్ టెరిటరీ జీఎస్టీలకు ఆమోదం లభించింది. మార్చ్ 20న కేంద్ర కేబినెట్ అన్ని (5)జీఎస్టీ బిల్లులకు ఆమోదం పలుకగా.. మార్చ్ 27న లోక్‌సభలో తుది బిల్లులను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. 2017 మార్చ్ 29న లోక్‌సభ జీఎస్టీకి ఆమోదం పలకగా.. మే నెలలో జీఎస్టీ కౌన్సిల్ పలు మార్లు చర్చలు జరిపి.. వస్తువులు-సేవలపై రేట్లను ఖరారు చేశారు. ఫైనల్‌గా ప్రతిపక్షాల నిరసనల మధ్య ఈ అర్థరాత్రి నుంచి జీఎస్టీ అమలుకు శంఖారావం పూరించనుంది బీజేపీ సర్కార్. -
ఎఫ్బీ స్టేటస్లు వాటికవే దాగిపోతాయ్
న్యూయార్క్ : ఫేస్ బుక్ లో ఏదైనా స్టేటస్ ను అప్ డేట్ చేసిన తర్వాత అది కనిపించకుండా (హైడ్ ) చేయడం కొత్త ఫీచరేమీ కాదు. కానీ సోషల్ మీడియా దిగ్గజం కొత్త 'హైడ్ ఫ్రమ్ యువర్ టైమ్ లైన్' అనే ఫీచర్‌ను టెస్ట్ చేసింది. స్టేటస్ ను అప్ డేట్ చేసిన తర్వాత యూజర్లు 'హైడ్ టైమ్ ఫ్రమ్ టైమ్ లైన్' అనే ఆప్షన్ ను నొక్కకుండానే, పోస్టును టైమ్ లైన్ లో నుంచి తొలగించేలా టెస్ట్ చేసింది. ఫేస్ బుక్ టెస్ట్ చేసిన ఈ కొత్త పోస్టు ద్వారా స్టేటస్ అప్ డేట్ కేవలం న్యూస్ ఫీడ్ కు మాత్రమే కనిపించేలా.. యూజర్ టైమ్ లైన్ లో కనిపించాల్సిన అవసరం లేకుండా చేసింది. స్టేటస్ అప్ డేట్ ను న్యూస్ ఫీడ్ లో పోస్టు చేసిన తర్వాత ఆ పోస్టు యూజర్ల టైమ్ లైన్ పై చూపించదు. ఈ కొత్త ఆప్షన్ ప్రస్తుతం వెబ్ సైట్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, మొబైల్ యూజర్లకు అందుబాటులో ఉండదని ఫేస్ బుక్ తెలిపింది. అయితే న్యూస్ పీడ్ నుంచి షేర్ చేసే పోస్టులకు ఈ కొత్త ఫీచర్ పనిచేయదని ఫేస్ బుక్ చెప్పింది. -
ట్విటర్లోనూ టైమ్‌లైన్
శాన్ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్‌లోని టైమ్‌లైన్ తరహాలో అల్గారిథమిక్ టైమ్‌లైన్‌ను ప్రారంభించేందుకు ట్విటర్ రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే వారంలోగా ఈ కొత్త టైమ్‌లైన్‌ను భారతదేశంతో పాటు మొత్తం 23 దేశాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ట్వీటర్ సంస్థ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ కొత్త టైమ్‌లైన్ ద్వారా సైన్ఇన్ చేయకపోయిన ముఖ్య అంశాలను ఎక్కువమందికి అందుబాటులోకి తీసుకురావచ్చు. ఇంతవరకు వ్యక్తిగత ట్వీట్స్ మాత్రమే గమనించేందుకు వీలుండేదని కాని ఈ టైమ్‌లైన్ వల్ల ఇప్పుడు సైన్ఇన్ చేయకపోయినా కథనాలు, సంభాషణలు చెక్‌చేసుకునే అవకాశం కలుగుతుందని ట్విటర్ మేనేజర్ పాల్ లాంబార్ట్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. -
ఎన్నో కూల్చివేతలు.. మరెన్నో మరణాలు
క్షిపణి దాడిలోనో, మరో రకంగానో కూలిపోయిన సంఘటనలలో మలేషియా విమానానిది మొదటిది కాదు, చివరిదీ కాదని చెప్పలేం. దాదాపు నాలుగు దశాబ్దాలకు ముందు నుంచే ఈ తరహా కాల్పులు, విమానాల కూల్చివేతలు ఉన్నాయి. వాటి వివరాలేంటో ఓసారి చూద్దామా.. 1973 ఫిబ్రవరి 21: ట్రిపోలి నుంచి కైరో వెళ్తున్న లిబియన్ ఎయిర్‌లైన్స్ విమానం 114 సూయెజ్ కాలువ దాటి ఇజ్రాయెల్ ఆధీనంలోని సినై ఎడారి ప్రాంతంలోకి ప్రవేశిస్తుండగా ఇజ్రాయెల్‌కు చెందిన రెండు ఫాంటమ్ జెట్ విమానాలు దాన్ని బలవంతంగా దింపేందుకు కాల్పులు జరిపాయి. విమానం అదుపుతప్పి కూలిపోవడంతో 108 మంది మరణించారు. ఐదుగురు బయటపడ్డారు. 1978 ఏప్రిల్ 20: 110 మంది ప్రయాణికులతో వెళ్తున్న దక్షిణ కొరియా విమానంపై సోవియట్ మిగ్ ఫైటర్ దాడిచేసింది. ముర్మాంస్క్ సమీపంలోని ఓ గడ్డకట్టిన చెరువులో బలవంతంగా దిగాల్సి రావడంతో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. 1983 సెప్టెంబర్ 1: న్యూయార్క్ నుంచి సియోల్ వెళ్తున్న కొరియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని సోవియట్ ఫైటర్ జెట్ కాల్చింది. అది నిఘా విమానం అనుకుని పొరబడి కాల్పులు జరపడంతో మొత్తం విమానంలో ఉన్న 269 మందీ మరణించారు. 1988 ఏప్రిల్ 10: సోవియట్ తయారీ విమానాన్ని అఫ్ఘాన్ గెరిల్లాలు కాల్చడంతో అందులో ఉన్న 29 మంది మరణించారు. 1988 జూలై 3: పర్షియన్ గల్ఫ్ మీదుగా వెళ్తున్న ఇరానీ ప్రయాణికుల విమానాన్ని యుద్ధవిమానం అనుకుని అమెరికా యుద్ధనౌక మీదనుంచి కాల్పులు జరిపారు. దాంతో అందులో ఉన్న 290 మంది మరణించారు. 1993 సెప్టెంబర్ 22: జార్జియాలో అబ్ఖాజియాన్ తిరుగుబాటుదారులు కాల్పులు జరపడంతో విమానంలో ఉన్న 80 మంది మరణించారు. సరిగ్గా దానికి ఒక్కరోజు ముందు రష్యన్ విమానాన్ని అబ్ఖాజియాన్ ఫైర్ ఢీకొనడంతో నల్లసముద్రంలో పడిపోయింది. 1998 అక్టోబర్ 20: తూర్పు కాంగోలో వేర్పాటువాదులు కాంగో ఎయిర్‌లైన్స్ విమానంపై కాల్పులు జరిపారు. దాంతో ఆ విమానం దట్టమైన అటవీ ప్రాంతంలో పడి కూలిపోయింది. -
ఓటరు దేవుని ప్రసన్నం కోసంఆఖరి యత్నాలు
నేటితో ప్రచారానికి తెర .. మండుటెండలో అభ్యర్థుల పోటీ ప్రచారం జోరుగా పాదయాత్రలు, బైక్ ర్యాలీలు కాంగ్రెస్, బీజేపీలకు జీవన్మరణ సమస్య సర్వశక్తులూ ఒడ్డుతున్న సీఎం సిద్ధు పలుచోట్ల ‘జేడీఎస్’ అభ్యర్థులతో లోపాయికారి ఒప్పందాలు పెద్దగా ప్రభావం చూపని ‘ఆమ్ ఆద్మీ’ ‘మందు’ చూపుతో మద్యం దుకాణాల వద్ద మందు బాబులు క్యూ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నిలకు మంగళవారం సాయంత్రం ప్రచారం ముగియనుండడంతో అభ్యర్థులు ఓటరు దేవుని ప్రసన్నం చేసుకోవడానికి తుది ప్రయత్నాలు చేస్తున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాదయాత్రలు, బైక్ ర్యాలీల ద్వారా ప్రచారాన్ని విస్తృతం చేశారు. ప్రధాన పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వివిధ లేఔట్లలో ర్యాలీలు నిర్వహించారు. పార్టీ అభ్యర్థుల కరపత్రాలను పంచుతూ ముందుకు సాగారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే రోడ్డు షోలు, బహిరంగ సభలకు అవకాశం ఉంటుంది. అనంతరం ఇంటింటి ప్రచారానికి అవకాశం ఉన్నా, అభ్యర్థులు వేరే ‘పనుల్లో’ నిమగ్నమైపోతారు. కాంగ్రెస్, బీజేపీ ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావిస్తున్నాయి. మంచి ఫలితాలు సాధించకపోతే స్థాన భ్రంశం తప్పదనే అధిష్టానం సంకేతాలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్వ శక్తులను ఒడ్డి అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్నారు. గ్రూపు రాజకీయాలను పక్కన పెట్టి అందరూ ఏక తాటిపై నిలవాల్సిందిగా పార్టీ నాయకులకు ఉద్బోధిస్తున్నారు. ‘సెక్యులర్’ ఓట్లలో చీలిక ఏర్పడి, బీజేపీకి లాభిస్తుందనే చోట్ల ‘జేడీఎస్’ అభ్యర్థులను లోపాయికారిగా తప్పించడానికి ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే ఉత్తర కన్నడ నియోజక వర్గంలో జేడీఎస్ అభ్యర్థి శివానంద్ నాయక్ చివరి నిమిషంలో నామినేషన్‌ను ఉపసంహరించుకోగా, బెల్గాంలో పార్టీ అభ్యర్థి నజీర్ భగ్వాన్, కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. మరో రెండు చోట్ల కూడా జేడీఎస్ అభ్యర్థులు ప్రచారంలో పాల్గొనకుండా కాంగ్రెస్ అభ్యర్థులకు పరోక్షంగా మద్దతునిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు మోడీ ప్రభంజనంపై గట్టి ఆశలు పెట్టుకున్న బీజేపీ, కనీసం 20 స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఎన్డీఏ సర్కారు ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలనుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు తమ ఓట్లకు గండి కొడతారని తొలుత భయపడిన బీజేపీ అభ్యర్థులు, క్రమేణా ఆ పార్టీ ప్రభావం బలహీన పడుతుండడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా గురువారం ఒకే దశలో రాష్ర్టంలోని మొత్తం 28 నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగనుంది. ‘మందు’ చూపు ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్రంలోని మద్యం దుకాణాలను మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి మూడు రోజుల పాటు మూసి వేయనున్నారు. ఎన్నికల కమిషన్ కొరడా ఝుళిపిస్తుండడంతో గతంలో లాగా మద్యం దుకాణాలను మూసి వేసినా విచ్చల విడిగా మద్యం దొరికే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో మందు బాబులు అప్పు సొప్పో చేసి మూడు రోజులకు సరిపడా మద్యాన్ని స్టాక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరో వైపు బార్లు సైతం ‘రేపు సాయంత్రం 4.30 గంటల నుంచి గురువారం వరకు షాపులు మూసివేయబడును’ అని బోర్డులు వేలాడదీసి మందు బాబులను మరింత ‘అప్రమత్తం’ చేస్తున్నాయి.