క్షిపణి దాడిలోనో, మరో రకంగానో కూలిపోయిన సంఘటనలలో మలేషియా విమానానిది మొదటిది కాదు, చివరిదీ కాదని చెప్పలేం. దాదాపు నాలుగు దశాబ్దాలకు ముందు నుంచే ఈ తరహా కాల్పులు, విమానాల కూల్చివేతలు ఉన్నాయి. వాటి వివరాలేంటో ఓసారి చూద్దామా..
1973 ఫిబ్రవరి 21: ట్రిపోలి నుంచి కైరో వెళ్తున్న లిబియన్ ఎయిర్లైన్స్ విమానం 114 సూయెజ్ కాలువ దాటి ఇజ్రాయెల్ ఆధీనంలోని సినై ఎడారి ప్రాంతంలోకి ప్రవేశిస్తుండగా ఇజ్రాయెల్కు చెందిన రెండు ఫాంటమ్ జెట్ విమానాలు దాన్ని బలవంతంగా దింపేందుకు కాల్పులు జరిపాయి. విమానం అదుపుతప్పి కూలిపోవడంతో 108 మంది మరణించారు. ఐదుగురు బయటపడ్డారు.
1978 ఏప్రిల్ 20: 110 మంది ప్రయాణికులతో వెళ్తున్న దక్షిణ కొరియా విమానంపై సోవియట్ మిగ్ ఫైటర్ దాడిచేసింది. ముర్మాంస్క్ సమీపంలోని ఓ గడ్డకట్టిన చెరువులో బలవంతంగా దిగాల్సి రావడంతో ఇద్దరు ప్రయాణికులు మరణించారు.
1983 సెప్టెంబర్ 1: న్యూయార్క్ నుంచి సియోల్ వెళ్తున్న కొరియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని సోవియట్ ఫైటర్ జెట్ కాల్చింది. అది నిఘా విమానం అనుకుని పొరబడి కాల్పులు జరపడంతో మొత్తం విమానంలో ఉన్న 269 మందీ మరణించారు.
1988 ఏప్రిల్ 10: సోవియట్ తయారీ విమానాన్ని అఫ్ఘాన్ గెరిల్లాలు కాల్చడంతో అందులో ఉన్న 29 మంది మరణించారు.
1988 జూలై 3: పర్షియన్ గల్ఫ్ మీదుగా వెళ్తున్న ఇరానీ ప్రయాణికుల విమానాన్ని యుద్ధవిమానం అనుకుని అమెరికా యుద్ధనౌక మీదనుంచి కాల్పులు జరిపారు. దాంతో అందులో ఉన్న 290 మంది మరణించారు.
1993 సెప్టెంబర్ 22: జార్జియాలో అబ్ఖాజియాన్ తిరుగుబాటుదారులు కాల్పులు జరపడంతో విమానంలో ఉన్న 80 మంది మరణించారు. సరిగ్గా దానికి ఒక్కరోజు ముందు రష్యన్ విమానాన్ని అబ్ఖాజియాన్ ఫైర్ ఢీకొనడంతో నల్లసముద్రంలో పడిపోయింది.
1998 అక్టోబర్ 20: తూర్పు కాంగోలో వేర్పాటువాదులు కాంగో ఎయిర్లైన్స్ విమానంపై కాల్పులు జరిపారు. దాంతో ఆ విమానం దట్టమైన అటవీ ప్రాంతంలో పడి కూలిపోయింది.
ఎన్నో కూల్చివేతలు.. మరెన్నో మరణాలు
Published Fri, Jul 18 2014 3:10 PM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM
Advertisement