ప్రయాణికులకు మలేషియన్ ఎయిర్ లైన్స్ ఆఫర్
కౌలాలంపూర్:ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న రెండు వరుస దుర్ఘటనలు మలేషియన్ ఎయిర్ లైన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఎంహెచ్17 కుప్పకూలడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న మలేషియన్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కసరత్తులు ఆరంభించింది. ఇక నుంచి ప్రయాణికులు తమ ప్రయాణాల్లో మార్పు చేసుకున్నా.. రద్దు చేసుకున్నా టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు నడుంబిగించింది. దీనికి సంబంధించి మలేషియన్ ఎయిర్ లైన్స్ ఆదివారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కేవలం ఇది సాధారణ టికెట్లకే కాదు.. నాన్ రిఫెండబుల్ టికెట్లు కూడా వర్తింపచేస్తున్నట్లు తెలిపింది. ఈ విధానాన్ని గురువారం నుంచి బుక్ చేసుకున్న ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది. ఈ అవకాశం జూలై 18 మొదలుకొని డిసెంబర్ 31 వరకూ అమల్లో ఉంటుందని ఎయిర్స్ లైన్స్ అధికారి ఒకరు తెలిపారు.
గత మూడు రోజుల క్రితం నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ బయలుదేరిన విమానం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ సమీపంలో తిరుబాటుదారులు క్షిపణులతో పేల్చివేశారు. ఆ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 280, సిబ్బంది 15 మంది మొత్తం 295 మంది మరణించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఈ ఏడాది మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్కు బయలుదేరుతూ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 237 మంది గల్లంతయ్యారు.