MH-17
-
'నా కూతురిని చంపిన వారికి ధన్యవాదాలు'
ద హేగ్: ఉక్రెయిన్ లో విమానం పేల్చివేసిన దారుణోదంతం ఎన్నో కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసింది. ఈ దుర్ఘటనలో తన ఒక్కగానొక్క కూతురిని కోల్పోయి పుట్టు దుఃఖంలో మునిపోయిన ఓ నెదర్లాండ్ దేశస్థుడు నేరుగా రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ కు బహిరంగ లేఖ రాశాడు. 'నా కూతురిని చంపిన వారికి ధన్యవాదాలు' అంటూ లేఖలో పేర్కొని ఎవరూ చేయని విధంగా నిరసన వ్యక్తం చేశాడు. తన హృదయ వేదనను లేఖ రూపంలో అక్షరీకరించాడు. 'నా ఒక్కగానొక్క కూతుర్ని చంపినందుకు పుతిన్ కు, రష్యా తిరుగుబాటుదారులకు లేదా ఉక్రెయిన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు' అంటూ నెదర్లాండ్ కు చెందిన హాన్స్ డీ బోర్ట్స్ రాసిన బహిరంగ లేఖను డచ్ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. 17 ఏళ్ల ఆయన కుమార్తె ఎల్స్మీక్- విమాన ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయింది. ఆకాశయానం చేస్తూ విదేశీ యుద్ధ రంగంలో తగిలిన దెబ్బతో తన కుమార్తె కానరాని లోకాలకు వెళ్లిపోయిందని హాన్స్ డీ బోర్ట్స్ వాపోయాడు. వచ్చే ఏడాదితో పాఠశాల విద్య పూర్తి చేసుకోబోతున్న తన కూతురు డెలఫ్ట్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదవాలని ఆశ పడిందని తెలిపాడు. ఒక యువతి జీవితాన్ని అర్థాంతరంగా అంతం చేసినందుకు అద్దంలో చూసుకుని మీరు గర్వపడతారనని తాను అనుకుంటున్నానని పుతిన్ కు రాసిన లేఖలో హాన్స్ డీ బోర్ట్స్ రాశారు. తన లేఖను ఇంగ్లీషులోని అనువదించుకుని వెంటనే చదువుతారని ఆకాంక్షించాడు. విమానం కూల్చివేత ఘటనలో తమ దేశానికి పౌరులు అత్యధిక మంది మృతి చెందడంతో నెదర్లాండ్స్ లో ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. -
బ్లాక్‌బాక్సులను అప్పగించిన రష్యా రెబల్స్
విమాన దుర్ఘటన జరిగిన దాదాపు వారం రోజులకు ఎట్టకేలకు బ్లాక్ బాక్సులు అధికారుల చేతికి వచ్చాయి. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో విమానం కూలిన ప్రాంతంలో ఉన్న వీటిని మలేషియన్ అధికారులకు రష్యాన్ తిరుగుబాటుదారులు అందించారు. డోనెట్స్క్ ప్రాంతంలో వీటిని తమ అధికారులకు ఇచ్చినట్లు మలేషియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ వెల్లడించారు. వీటిని తదుపరి విశ్లేషణ కోసం నిపుణులకు పంపుతామని ఆయన చెప్పారు. విమాన దుర్ఘటన విషయంలో ఇప్పుడు మరో కొత్త వాదన మొదలైంది. ఉక్రెయిన్‌కు చెందిన ఓ ఫైటర్ జెట్ విమానం గాలిలోంచి గాలిలోకి ప్రయోగించి క్షిపణులతో ఎంహెచ్-17 విమానాన్ని వెంబడించినట్లు రష్యా సైన్యానికి చెందిన సీనియర్ అధికారులు తాజాగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించి తమకు ఉపగ్రహ చిత్రాల సాక్ష్యాలు ఉన్నాయని, ఆ ఫైటర్ విమానం ఎక్కడినుంచి ఎక్కడు వెళ్లిందో వివరించాలని ఉక్రెయిన్ను నిలదీస్తున్నారు. -
ప్రయాణికులకు మలేషియన్ ఎయిర్ లైన్స్ ఆఫర్
కౌలాలంపూర్:ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న రెండు వరుస దుర్ఘటనలు మలేషియన్ ఎయిర్ లైన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఎంహెచ్17 కుప్పకూలడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న మలేషియన్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కసరత్తులు ఆరంభించింది. ఇక నుంచి ప్రయాణికులు తమ ప్రయాణాల్లో మార్పు చేసుకున్నా.. రద్దు చేసుకున్నా టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు నడుంబిగించింది. దీనికి సంబంధించి మలేషియన్ ఎయిర్ లైన్స్ ఆదివారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కేవలం ఇది సాధారణ టికెట్లకే కాదు.. నాన్ రిఫెండబుల్ టికెట్లు కూడా వర్తింపచేస్తున్నట్లు తెలిపింది. ఈ విధానాన్ని గురువారం నుంచి బుక్ చేసుకున్న ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది. ఈ అవకాశం జూలై 18 మొదలుకొని డిసెంబర్ 31 వరకూ అమల్లో ఉంటుందని ఎయిర్స్ లైన్స్ అధికారి ఒకరు తెలిపారు. గత మూడు రోజుల క్రితం నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ బయలుదేరిన విమానం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ సమీపంలో తిరుబాటుదారులు క్షిపణులతో పేల్చివేశారు. ఆ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 280, సిబ్బంది 15 మంది మొత్తం 295 మంది మరణించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఈ ఏడాది మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయలుదేరుతూ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 237 మంది గల్లంతయ్యారు. -
విధి ఆడిన వింత నాటకం!
విధి చాలా విచిత్రమైంది. మనుషుల జీవితాలతో అది చిత్రమైన విన్యాసాలాడుతుంది. ఊహించని పరిణామాలతో మనిషిని ఉక్కిరిబక్కిరి చేస్తుంది. సాఫీగా సాగిపోతున్న జీవితాలను ఎప్పుడు ఏ మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. విధిలీలా విన్యాసంలో స్టివార్డు సంజిద్ సింగ్ సంధు ఆయన భార్యకు శాశ్వతంగా దూరమయ్యాడు. ఉక్రెయిన్ లో మలేసియా విమానం కుప్పకూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారిలో భారత సంతతికి సంధు ఉన్నాడు. సెలవు రోజున ఇంటిలో ఉండ్సాలిన అతడిని విధి వెంటాడించింది. గురువారం వారంతపు సెలవుకావడంతో ఇంట్లో ఉన్న సందు... తోటి ఉద్యోగి అభ్యర్థన మేరకు ఎంహెచ్-17 విమానంలో విధులకు వెళ్లి విగతజీవిగా మారిపోయాడు. విధి విచిత్రం ఏంటంటే షిఫ్టు మార్చుకోవడం వల్లే అతడి భార్య నాలుగు నెలల క్రితం మృత్యువు నుంచి తప్పించుకుంది. సంధు భార్య కూడా మలేషియా ఎయిర్‌లైన్స్‌లో స్టివార్డెస్గా పనిచేస్తోంది. ఈ ఏడాది మార్చి 8న అదృశ్యమైన ఎంహెచ్-370 విమానంలో సంధు విధి నిర్వహణకు వెళ్లాల్సివుండగా చివరి నిమిషంలో ఆమె షిప్ట్ మార్చుకుంది. తన బదులు వేరే ఉద్యోగిని సర్దుబాటు చేసి సెలవు తీసుకుంది. ఈ విమానం ఏమైందో ఇప్పటివరకు తెలియలేదు. ఇక రెండు విమాన ప్రమాదాల్లోనూ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన ఓ కుటుంబం నలుగురు సభ్యులను కోల్పోయింది. మొన్న కొడుకు, కోడలు.. నిన్న మనవరాలు, ఆమె భర్త మృత్యువాత పడ్డారు. విధి ఆడిన వింత నాటకం అంటే ఇదేనేమో! -
ఎంహెచ్ 17 : తప్పు మీదంటే మీదంటూ..
-
విమానం కూల్చివేత వాళ్ల పనేనా?!
-
ఎంహెచ్-17: నాడు అన్న.. నేడు కూతురు
రెండు ప్రమాదాలు.. రెండూ మలేషియన్ విమానాలే. రెండుసార్లూ ఆ కుటుంబంలో విషాదమే. ఓ ఆస్ట్రేలియన్ మహిళకు ఈ అనుభవం ఎదురైంది. నాలుగు నెలల క్రితం ఎంహెచ్ 370 విమాన దుర్ఘటనలో ఆమె తన అన్నయ్యను కోల్పోతే.. ఇప్పుడు ఎంహెచ్ 17 దుర్ఘటనలో తన కూతురిని కోల్పోయింది. కేలీన్ మన్ సోదరుడు రాడ్ బరోస్, ఆయన భార్య మేరీ బరోస్ ఇద్దరూ ఎంహెచ్ 370 విమానంలో వెళ్లి, విమానంతో పాటే గల్లంతయ్యారు. గురువారం రాత్రి నాటి ఘటనలో మన్ కుమార్తె మేరీ రిక్ ఎంహెచ్17 విమానంలో సహ ప్రయాణికులతో పాటే కాలి బూడిదైపోయింది. దీంతో మన్ గుండె బద్దలైపోయింది. కనీసం ఏం జరిగిందో చెప్పే పరిస్థితిలో కూడా ఆమె కనిపించడంలేదు. ఒకే విమానయాన సంస్థకు చెందిన రెండు విమానాల దుర్ఘటనలో తమ కుటుంబ సభ్యులు ఇలా ప్రాణాలు కోల్పోవడం ఆమెను తీవ్ర షాక్‌కు గురిచేసింది. రిక్‌తో పాటు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందిన ఆమె భర్త ఆల్బర్ట్ నాలుగు వారాల పాటు యూరప్‌లో సెలవులు గడిపి, తిరిగి ఇంటికి వస్తున్నారు. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది. ఇలా తమ కుటుంబంలో రెండు విషాదాలు జరిగినా.. మలేసియా ఎయిర్‌లైన్స్ అంటే మాత్రం బరోస్ దంపతులకు ఎలాంటి కోపం లేదు. అలా జరుగుతుందని ఎవరూ ఊహించరని, అందులో వాళ్లు చేయగలిగింది కూడా ఏమీ లేదని అన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
ఎంహెచ్-17కు 25 కిలోమీటర్ల దూరంలో మన విమానం
ఒకళ్లు కారు.. ఇద్దరు కారు.. దాదాపు 126 మంది ప్రయాణికులు. అంతా ఎయిరిండియా విమానం ఏఐ-113లో ఉన్నారు. విషయం తెలియగానే వాళ్లందరికీ గుండెలు ఒక్కసారిగా ఝల్లుమన్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే, బక్ క్షిపణి దాడిలో మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్-17 విమానం కూలిపోయినప్పుడు.. దానికి ఈ ఎయిర్ ఇండియా విమానం కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే, ఆ విమానం కొద్ది ఆలస్యమైనా.. ఇది కొంచెం ముందున్నా చాలా దారుణం జరిగేదన్నమాట. సరిగ్గా ఎంహెచ్-17 విమానం రాడార్ నుంచి అదృశ్యం అయిపోయినప్పుడు.. దానికి ఎయిరిండియా విమానం పాతిక కిలోమీటర్ల దూరంలో ఉందని ప్రపంచవ్యాప్తంగా విమానాల రాకపోకలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండే ఫ్లైట్రాడార్24.కామ్ అనే వెబ్సైట్ తెలిపింది. దుర్ఘటన జరిగిన తర్వాత.. ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న విమానం సహా పలు విమానాలను ఎయిరిండియా మార్గం మార్చింది. యూరప్, ఆసియా ఖండాల మధ్య విమానాలు తిరిగేందుకు ఉక్రెయిన్ గగనతలమే అత్యంత అనుకూలం కావడంతో ఇది ఎప్పుడూ విమానాల రాకపోకలతో బిజీగా ఉంటుంది. అయితే.. ఈ సంఘటన తర్వాత దాదాపుగా ఈ మార్గంలో వెళ్లే విమానాలన్నీ దారిమళ్లించుకున్నాయి. విమానాలు వెళ్లడానికి ఉన్న మరో మార్గం కూడా ప్రమాదకరంగానే ఉంటుంది. అది సింఫెరోపోల్ ఎఫ్ఐఆర్ మార్గం. అయితే.. ఆ మార్గం అటు ఉక్రెయిన్, ఇటు రష్యా.. రెండూ తమదంటే తమదేనని ప్రకటించుకోవడంతో పాటు రెండు ఏటీసీలు ఉండటంతో భద్రతా కారణాల రీత్యా అటు విమానాలు వెళ్లడంలేదు. యూరప్, అమెరికాలకు మన దేశం నుంచి రెండే విమానయాన సంస్థలు విమానాలు నడుపుతున్నాయి. అవి ఎయిరిండియా, జెట్ ఎయిర్వేస్. ఎంహెచ్-17 దుర్ఘటన తర్వాత తూర్పు ఉక్రెయిన్ మార్గం మీదుగా వెళ్లొద్దని ఈ రెండు సంస్థలకు భారత విమానయాన నియంత్రణ సంస్థ తెలిపింది. -
ఎవరిదీ పాపం.. ఎవరికీ శాపం?
-
'ఎంత ఘోరం... మాటలు కూడా రావడం లేదు'
వాషింగ్టన్: మలేసియా ఎయిర్ లైన్స్ విమానాన్ని కూల్చివేత ఘటనపై దర్యాప్తులో సహాయం అందించేందుకు అమెరికా ముందుకు వచ్చింది. విమానం పేల్చివేతపై అంతర్జాతీయ దర్యాప్తులో సహాయం చేసేందుకు సిద్దమని అమెరికా అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ప్రకటించారు. ఎంహెచ్ 17 విమాన పేల్చివేతను అత్యంత ఘోరమైన ఘటనగా ఆయన వర్ణించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపేందుకు కూడా మాటలు రావడం లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో మలేసియా, నెదర్లాండ్స్ ప్రభుత్వాలకు సానుభూతితో కూడిన సహాయం చేస్తామని జాన్ కెర్రీ తెలిపారు. మృతుల కుటుంబాలకు కూడా సహాయం అందించేందుకు సిద్దమని ప్రకటించారు. -
'కూల్చిన వారిని చట్టం ముందు నిలబెట్టాలి'
కౌలాలంపూర్/కీవ్: ఉక్రెయిన్ గగనతలంపై ఎయిర్ లైన్స్ విమానం పేల్చివేతపై అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రయాణీకుల విమానాన్ని కూల్చివేయడంపై తీవ్ర ఆందోళన తెలిపింది. విమానం కూల్చివేతపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరిపించాలని, ఈ నరమేధానికి కారణమైన వారిని చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేసింది. కాగా సంఘటనా స్థలంలో సహాయక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు సాగిస్తున్నారు. పొద్దుతిరుగుడు తోటల్లో ఛిద్రమైన స్థితిలో చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఇప్పటివరకు 181 మృతదేహాలు బయటకు తీశారు. మృతి చెందిన వారిలో 173 మంది నెదర్లాండ్స్ చెందిన వారున్నారు. మృతుల్లో దాదాపు 100 మంది ఎయిడ్స్ పరిశోధకులున్నారు. -
చైనా విమానాల దారి మళ్లింపు
బీజింగ్: మలేసియా ఎయిర్ లైన్స్ విమానాన్ని కూల్చివేత ఘటనతో ఉక్రెయిన్ మీదుగా వెళ్లే విమానాలు రద్దవుతున్నాయి. ఇప్పటికే భారత్- ఉక్రెయిన్ కు విమాన సర్వీసులు రద్దు చేసింది. చైనా కూడా ఉక్రెయిన్ మీదుగా వెళ్లే తమ విమానాలను మళ్లించింది. ఉక్రెయిన్ మీదుగా వెళ్లే అన్ని విమాన సర్వీసులను వేరే మార్గాల్లో నడపాలని నిర్వహించినట్టు చైనా పౌర విమానయాన శాఖ తెలిపింది. తూర్పు ఉక్రెయిన్ మీదుగా చైనా విమానాలు వారానికి 28 రౌండ్ల ట్రిప్పులు వేస్తాయని చైనా పౌర విమానయాన పరిపాలన విభాగం(సీఏఏసీ) వెల్లడించింది. అయితే చైనా, ఉక్రెయిన్ మధ్య రెగ్యులర్ విమాన సర్వీసులు లేవని తెలిపింది. ఉక్రెయిన్ లో తలెత్తిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నేటి నుంచి తమ విమానాలను మళ్లిస్తున్నట్టు చైనా ప్రకటించింది. -
ఎంహెచ్ 17 ప్రమాదం జరిగిందిలా..
-
విమానాన్ని కూల్చివేసింది వారే: ఎస్‌బీయూ
కీవ్: మలేసియా ఎయిర్ లైన్స్ విమానాన్ని కూల్చివేసింది తామేనని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు ఒప్పుకున్నారని ఎక్రెయిన్ భద్రతా విభాగం(ఎస్‌బీయూ) తెలిపింది. రష్యా సైనిక నిఘా విభాగం అధికారులకు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణల ద్వారా తమకీ విషయం తెలిసిందని ఎస్‌బీయూ వెల్లడించింది. విమానం కూలిపోయిన 20 నిమిషాల తర్వాత రష్యా సైనిక నిఘా అధికారి ఇగోర్ బెజ్లర్.. రష్యా భద్రతాధికారి వాసిలి జెరానిన్ కు ఫోన్ చేశారని పేర్కొంది. 'దొనెస్క్ ప్రాంతంలో విమానాన్ని ఇప్పుడే కూల్చివేశాం' అని జెరానిన్ కు బ్లెజర్ ఫోన్ తెలిపాడని వెల్లడించింది. స్వయం ప్రకటిత దొనెస్క్ పీపుల్స్ రిపబ్లిక్ సంస్థకు బ్లెజర్ కమాండర్ గా ఉన్నాడు. మేజర్, గ్రీక్ పేరుతో ఇద్దరు తీవ్రవాదులు జరిపిన సంభాషణను కూడా ఎస్‌బీయూ విడుదల చేసింది. -
370... 130... 17
అదేంటో గాని మలేషియా ఎయిర్ లైన్స్ విమానాలని ప్రమాదాలు నిడలా వెంటాడుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానం మన జ్ఞాపకాల దొంతర నుంచి చెరిగిపోక మునుపే గురువారం సాయంత్రం ఎమ్హెచ్ 17 విమానం కుప్పకూలింది. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ బయలుదేరిన విమానం గురువారం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ సమీపంలో తిరుబాటుదారులు క్షిపణులతో పేల్చివేశారు. ఆ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 280, సిబ్బంది 15 మంది మొత్తం 295 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విమానంలోని మృతుల్లో అత్యధికులు అంటే సగానికి సగం మంది డచ్ దేశానికి చెందిన వారే ఉన్నారు. ఈ ఏడాది మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు బయలుదేరింది. బయలుదేరిన కొద్ది గంటకే ఆ విమానం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ రాడార్ స్క్రీన్ నుంచి మాయమైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతయ్యారు. ఆ విమాన ఆచూకీ కోసం... ప్రపంచదేశాలు ఏకమై జల్లెడ పట్టిన ఇంత వరకు ఆ విమానం జాడ దొరకలేదు. దాంతో తమ బంధువుల ఆచూకీ తెలుసుకోవడంతో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమాన ప్రయాణికుల బంధువులు స్నేహితులు మలేషియా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. మలేషియా ప్రభుత్వానికి ఎమ్హెచ్ 370 విమానం ఆచూకీ కనుగోవడం పెద్ద తల నొప్పిగా తయారైంది. అంతలో నిన్న సాయంత్రం మరో విమానం ప్రమాదం జరగడంతో మలేషియా ప్రభుత్వం తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ రెండు విమాన ప్రమాదాలు కేవలం 130 రోజులు తేడాలో జరిగాయి. -
ఎన్నో కూల్చివేతలు.. మరెన్నో మరణాలు
క్షిపణి దాడిలోనో, మరో రకంగానో కూలిపోయిన సంఘటనలలో మలేషియా విమానానిది మొదటిది కాదు, చివరిదీ కాదని చెప్పలేం. దాదాపు నాలుగు దశాబ్దాలకు ముందు నుంచే ఈ తరహా కాల్పులు, విమానాల కూల్చివేతలు ఉన్నాయి. వాటి వివరాలేంటో ఓసారి చూద్దామా.. 1973 ఫిబ్రవరి 21: ట్రిపోలి నుంచి కైరో వెళ్తున్న లిబియన్ ఎయిర్‌లైన్స్ విమానం 114 సూయెజ్ కాలువ దాటి ఇజ్రాయెల్ ఆధీనంలోని సినై ఎడారి ప్రాంతంలోకి ప్రవేశిస్తుండగా ఇజ్రాయెల్‌కు చెందిన రెండు ఫాంటమ్ జెట్ విమానాలు దాన్ని బలవంతంగా దింపేందుకు కాల్పులు జరిపాయి. విమానం అదుపుతప్పి కూలిపోవడంతో 108 మంది మరణించారు. ఐదుగురు బయటపడ్డారు. 1978 ఏప్రిల్ 20: 110 మంది ప్రయాణికులతో వెళ్తున్న దక్షిణ కొరియా విమానంపై సోవియట్ మిగ్ ఫైటర్ దాడిచేసింది. ముర్మాంస్క్ సమీపంలోని ఓ గడ్డకట్టిన చెరువులో బలవంతంగా దిగాల్సి రావడంతో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. 1983 సెప్టెంబర్ 1: న్యూయార్క్ నుంచి సియోల్ వెళ్తున్న కొరియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని సోవియట్ ఫైటర్ జెట్ కాల్చింది. అది నిఘా విమానం అనుకుని పొరబడి కాల్పులు జరపడంతో మొత్తం విమానంలో ఉన్న 269 మందీ మరణించారు. 1988 ఏప్రిల్ 10: సోవియట్ తయారీ విమానాన్ని అఫ్ఘాన్ గెరిల్లాలు కాల్చడంతో అందులో ఉన్న 29 మంది మరణించారు. 1988 జూలై 3: పర్షియన్ గల్ఫ్ మీదుగా వెళ్తున్న ఇరానీ ప్రయాణికుల విమానాన్ని యుద్ధవిమానం అనుకుని అమెరికా యుద్ధనౌక మీదనుంచి కాల్పులు జరిపారు. దాంతో అందులో ఉన్న 290 మంది మరణించారు. 1993 సెప్టెంబర్ 22: జార్జియాలో అబ్ఖాజియాన్ తిరుగుబాటుదారులు కాల్పులు జరపడంతో విమానంలో ఉన్న 80 మంది మరణించారు. సరిగ్గా దానికి ఒక్కరోజు ముందు రష్యన్ విమానాన్ని అబ్ఖాజియాన్ ఫైర్ ఢీకొనడంతో నల్లసముద్రంలో పడిపోయింది. 1998 అక్టోబర్ 20: తూర్పు కాంగోలో వేర్పాటువాదులు కాంగో ఎయిర్‌లైన్స్ విమానంపై కాల్పులు జరిపారు. దాంతో ఆ విమానం దట్టమైన అటవీ ప్రాంతంలో పడి కూలిపోయింది. -
దేశాల పోరులో సామాన్యులే సమిధలా?
రాజ్యాల ఆధిపత్య పోరులో అమాయకుల ప్రాణాలు గాల్లోనే బూడిదయ్యాయి. దేశాల మధ్య రాజుకున్న విభేదాలు వందల మంది పౌరుల ప్రాణాలు బలి తీసుకున్నాయి. రష్యా, ఉక్రెయిన్ ఆధిపత్య యుద్ధం ఆకాశాయానం చేస్తున్న 295 మంది అమాయక పౌరుల ప్రాణాలను తోడేసింది. రష్యా సరిహద్దుల్లో కొనసాగుతున్న సమరంలో విమాన ప్రయాణికులు పావులుగా మారి మృత్యువాత పడ్డారు. ఆదిమ కాలం నుంచి ఆధునిక యుగం వరకు రాజ్యాల పోరులో అమాయక పౌరులే బలవడం ఆనవాయితీగా మారిపోయింది. ఆధునికతకు శిఖరాగ్రమని చెప్పుకుంటున్న నేటి కాలంలోనూ పరిస్థితి మార్పు రాకపోవడం దురదృష్టకరం. ఇందుకు కారణాలనేకం. ఏదేమైనా చరిత్ర పుటల్లో మరో నరమేధం నమోదయింది. మలేసియా నాలుగు నెలల స్వల్ప కాలంలోనే రెండో విమాన ప్రమాదాన్ని చవిచూసింది. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడం తప్ప మనమేం చేయగలం. విమాన దుర్ఘటన మృతులకు 'సాక్షి' సంతాపం తెలుపుతోంది. దీనికి కారణం ఉగ్రవాద దాడి అని భావిస్తున్నారా? దేశాల మధ్య పోరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి. -
ఎంహెచ్-17:ఆధిపత్య పోరుతో అమాయకుల ప్రాణాలు గాల్లోకి
రెండు దేశాల ఆధిపత్య పోరులో 295 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 295 మందితో అమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్‌కు బయల్దేరిన మలేసియా విమానాన్ని గురువారం సాయంత్రం ఉక్రెయిన్ గగనతలంపై కూల్చివేసిన విషయం తెలిసిందే. రష్యా సరిహద్దుల్లో ఉక్రెయిన్ ప్రభుత్వ దళాలు, రష్యా అనుకూల తిరుగుబాటుదారుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతంలో.. ఆ విమానం కూలిపోయింది. ఘటనలో విమానంలో ఉన్న 280 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది.. మొత్తం 295 మంది మరణించారు. పేల్చివేతపై ఇప్పటివరకూ ఎవరూ బాధ్యత తీసుకోలేదు. కానీ ఉక్రెయిన్ దళాలే పేల్చేశాయని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు పేర్కొంటుండగా.. అది తిరుగుబాటుదారుల పనేనంటూ ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. అయితే ప్రయాణీకుల విమానాన్ని కూల్చివేయడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నాలుగు నెలల కిందట హిందూ మహా సముద్రంలో అంతు చిక్కని రీతిలో అదృశ్యమైన ఎంహెచ్ 370 విమాన ఘటనను మరచిపోకముందే ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన ఈ రెండు విమానాలు మలేసియన్ ఏర్‌లైన్స్‌కు చెందినవే కావడం గమనార్హం. గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్‌కు చెందిన పలు మిలటరీ విమానాలను రష్యా అనుకూల తిరుగుబాటు దారులు పేల్చేస్తున్నారు. బుధవారం కూడా తమ యుద్ధవిమానాన్ని పేల్చేశారని ఉక్రెయిన్ ప్రకటించింది. తిరుగుబాటుదారులకు రష్యా అన్నిరకాలుగా సహకరిస్తోందని, అత్యాధునిక క్షిపణులను వారికి అందిస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ సాయుధ దళాలు గగన లక్ష్యాలపై ఎలాంటి దాడులు చేయలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరొషెంకొ తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించారు. ఉక్రెయిన్ వైమానిక దళమే మలేసియా ప్యాసెంజర్ విమానాన్ని పేల్చేసిందని తిరుగుబాటుదారుల నేత అలెక్జాండర్ బొరొదాయి ఆరోపించారు. -
'కూలిన విమానంలో భారతీయులు లేరు'
-
'కూలిన విమానంలో భారతీయులు లేరు'
న్యూఢిల్లీ: కూలిపోయిన మలేషియా విమానంలో భారతీయులు లేరని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు తెలిపారు. మరణించినవారిలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన విమానసిబ్బంది మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో కూలిపోయిన విమానం బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఇందులోని సమాచారం ఆధారంగా విమానం కూలిపోవడానికి గల కారణాలు తెలుసుకోనున్నారు. మరోవైపు ఉక్రెయిన్ మీదుగా విమాన రాకపోకలను విమానసంస్థలు నిలిపేశాయి. 295 మందితో అమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్‌కు బయల్దేరిన విమానాన్ని గురువారం సాయంత్రం ఉక్రెయిన్ గగనతలంపై పేల్చేశారు. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న వారందరూ మృతి చెందారు. -
ఎంహెచ్-17: షిఫ్టు మార్చుకున్నాడు.. ప్రాణం పోయింది
అమ్మ కమ్మగా వండిపెడుతుంది.. వెళ్లి తినాలంటూ షిఫ్టు మార్చుకున్నాడు. అదే అతడి ప్రాణాలు తీసింది. అతడెవరో కాదు.. భారత సంతతికి చెందిన సంజిద్ సింగ్ సంధు. ఆయన విమానంలో స్టివార్డుగా పనిచేస్తున్నారు. స్వతహాగా పంజాబీ అయిన సంధు నిజానికి ఎంహెచ్-17 విమానంలో వెళ్లాల్సిన వాడు కాదు. కానీ, వేరే సహచరుడితో షిఫ్టు మార్చుకుని మరీ ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్లే విమానం ఎక్కాడు. సంధు మలేషియాలోని పెనాంగ్ నగరంలో ఉన్న తమ ఇంటికి రాగానే అతడికి ఇష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టాలని ఆయన తల్లి భావించినట్లు తండ్రి జిజర్ సింగ్ తెలిపారు. విమానం ఎక్కడానికి కొద్ది సేపటి ముందే తనతో ఫోన్లో మాట్లాడాడని, అదే తమ అబ్బాయితో చిట్టచివరి సంభాషణ అని అన్నారు. ఎందుకిలా జరిగిందంటూ ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. సంధు భార్య కూడా మలేషియా ఎయిర్‌లైన్స్‌లో స్టివార్డెస్గా పనిచేస్తున్నారు. ఆమె ద్వారానే అత్తమామలకు ఈ విషయం తెలిసింది. జిజర్ సింగ్ దంపతులకు సంజిద్ ఒక్కడే కుమారుడు. -
ఎంహెచ్-17: మృతుల్లో ఇద్దరు భారత సంతతివాళ్లు!
మలేషియా విమాన ప్రమాదంలో మొత్తం 295 మంది మరణించారు. వారిలో ఇద్దరు భారత సంతతికి చెందిన విమాన సిబ్బంది అని తెలుస్తోంది. జన్మతః భారతీయులైన వీళ్లు మలేషియా ఎయిర్‌లైన్స్ సంస్థలో ఉద్యోగానికి వెళ్లి ఆ ప్రయాణంలోనే అసువులు బాశారు. ఇక మృతులలో చాలామంది ఎవరన్న విషయం తెలియడంతో వాళ్ల బంధువులకు సమాచారం అందించినట్లు మలేషియా ఎయిర్‌లైన్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే.. 47 మంది మాత్రం ఎవరన్నది ఇంకా గుర్తించలేకపోయారు. వాళ్లు ఏ దేశానికి చెందినవాళ్లో, వాళ్ల ఊరు-పేరు ఏమిటో అనే విషయం ఖరారు కాలేదు. విమానంలో ఉన్నవారిలో మొత్తం 154 మంది డచ్ దేశస్థులు కాగా, 43 మంది మలేషియన్లు. వాళ్లలో 15 మంది విమాన సిబ్బంది. వీళ్లు కాకుండా ఇంకా 27 మంది ఆస్ట్రేలియన్లు, 12 మంది ఇండోనేషియన్లు, ఆరుగురు బ్రిటిష్ వాళ్లు, నలుగురు జర్మన్లు, నలుగురు బెల్జియన్లు, ముగ్గురు ఫిలిప్పీన్స్ వాసులు, ఒక కెనడియన్ ఉన్నారు. మిగిలిన 47 మంది గురించి మాత్రం ఇంకా తెలియలేదు. మొత్తం ప్రయాణికుల్లో 100 మంది ఎయిడ్స్ పరిశోధకులు ఉన్నారు. ఓ సదస్సులో పాల్గొనడానికి వీళ్లంతా వెళ్తున్నట్లు తెలిసింది. -
ఎంహెచ్-17: గుర్తించాల్సిన 5 ప్రధానాంశాలు
మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గురువారం రాత్రి కుప్పకూలడంతో అందులో ఉన్న మొత్తం 295 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ విమానం గురించి గుర్తించాల్సిన 5 ప్రధానాంశాలివి.. మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్-17 విమానం నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నం 12.14 గంటలకు బయల్దేరింది. శుక్రవారం ఉదయం 6.10 గంటలకు ఇది కౌలాలంపూర్ చేరుకోవాల్సి ఉంది. అందులో 280 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. బోయింగ్ 777-200ఇఆర్ తరహా విమానాన్ని 1997 జూలై 30వ తేదీన మలేషియా ఎయిర్‌లైన్స్‌కు అందజేశారు. ఇప్పటివరకు అది 43వేల గంటల పాటు ప్రయాణించింది. ఉక్రెయిన్ గగనతలంలో ఉండగా దాంతో తమకు సంబంధాలు తెగిపోయినట్లు మలేషియా ఎయిర్‌లైన్స్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల ఎత్తులో అది ప్రయాణిస్తుండగా చిట్టచివరిసారిగా ఓ సైనిక నిఘా ఉపగ్రహం దీన్ని కనుగొంది. అయితే, సరిగ్గా అది ఏ ప్రాంతంలో ఉండగా క్షిపణి తాకిందో మాత్రం కనుగొనలేకపోయింది. అలాగే, క్షిపణి సరిగ్గా ఎక్కడినుంచి బయల్దేరి వచ్చి ఈ విమానాన్ని ఢీకొందనే విషయాన్ని తేల్చడానికి గణిత సూత్రాలు, హైస్పీడ్ కంప్యూటర్లు, ఇతర సెన్సర్లను విశ్లేషకులు ఉపయోగిస్తున్నారు. -
ఎంహెచ్ -17: పుతిన్ విమానాన్ని పేల్చబోయారా?
మలేషియా విమానాన్ని పేల్చింది ఎవరు? రష్యన్ దళాలే తమ సైనిక విమానాలను గత కొన్ని వారాలుగా లక్ష్యం చేసుకుంటున్నాయని.. అందువల్ల ఈ విమానాన్ని కూడా తమ సైనిక విమానం అనుకుని వాళ్లు పేల్చేశారని ఉక్రెయిన్ వర్గాలు అంటున్నాయి. కానీ తమమీద ఎలాంటి మచ్చ పడకుండా ఉండేందుకు రష్యా మరో కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. వాస్తవానికి బ్రిక్స్ సదస్సు ముగించుకుని వస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమానం కూడా సరిగ్గా అదే మార్గంలో వస్తోందని, దాన్ని పేల్చేయాలనుకుని.. గురి తప్పి మలేషియా విమానాన్ని ఉక్రెయిన్ వర్గాలే కూల్చేశాయని చెబుతోంది. వాస్తవానికి విమాన ప్రమాదం సంభవించిన తర్వాత చాలాసేపటి వరకు రష్యా నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. తమ దేశం మీద విధించిన ఆంక్షలను తొలగించాలంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మాట్లాడిన పుతిన్.. పనిలో పనిగా ఆయనకు విమాన ప్రమాదం గురించి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో రష్యా పాత్ర ఏంటన్న ప్రశ్నలు వస్తాయనే ఆలోచనతోనో ఏమో గానీ.. ఈ సరికొత్త కుట్ర సిద్ధాంతం ఒకటి వెలుగులోకి వచ్చిందని కొన్ని వార్తా సంస్థలు చెబుతున్నాయి. కానీ నిజానికి ఇంతవరకు ఏ దేశానికి సంబంధించిన క్షిపణి దాడి వల్ల విమానం కూలిపోయిందో మాత్రం నిర్ధారణ కాలేదు. ప్రమాదం సంభవించడానికి దాదాపు గంట ముందుగా వార్సా సమీపంలో ఎంహెచ్ 17 విమానాన్ని పుతిన్ ప్రయాణిస్తున్న విమానం దాటిందని అనధికార వర్గాలను ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ ఇంటర్ఫాక్స్ తెలిపింది. దూరం నుంచి చూస్తే రెండు విమానాలు ఒకేలా ఉంటాయంటూ ఓ కల్పిత గ్రాఫిక్‌ను కూడా తయారుచేసింది. అయితే ఇదంతా తనకేమీ తెలియదన్నట్లు పుతిన్ మాత్రం చాలా భారంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ''ఈ భూమ్మీద శాంతి ఉండి ఉంటే ఈ విషాదం జరిగి ఉండేదే కాదు. లేదా.. కనీసం ఆగ్నేయ ఉక్రెయిన్ ప్రాంతంలో సైనిక దాడులు పునరుద్ధరించకపోయినా ఇలా జరిగేది కాదు'' అని ఆయన అన్నారు. -
ఎంహెచ్ 17: గుట్టు విప్పనున్న బ్లాక్‌బాక్సు
మలేషియన్ విమానం కుప్పకూలింది. మొత్తం అందులో ఉన్న 295 మందీ ప్రాణాలు కోల్పోయారు. అయితే విమాన ప్రమాదానికి కారణం ఏంటి.. అందరూ చెబుతున్నట్లు నిజంగానే క్షిపణిదాడి వల్లే కుప్పకూలిందా? ఈ విషయం కచ్చితంగా తెలియాలంటే బ్లాక్‌బాక్స్‌ను పరిశీలించాలి. ఎంతటి పెను ప్రమాదం సంభవించినా కూడా బ్లాక్‌బాక్స్ మాత్రం భద్రంగా ఉంటుంది. వాస్తవానికి నారింజరంగులో ఉండే ఈ బాక్సులో మొత్తం వివరాలన్నీ రికార్డు అవుతాయి. ఇక్కడ సంభవించిన ప్రమాదంలో ఎంహెచ్17 విమానంలోని బ్లాక్‌బాక్స్‌ను ఇప్పుడు ఎవరు తెస్తారన్నది అతిపెద్ద సమస్యగా మారింది. విమాన శిథిలాలను అంతర్జాతీయ పరిశీలకుల బృందం వెళ్లి చూడాలని ఐక్యరాజ్య సమితితో పాటు మలేషియా ప్రభుత్వం కూడా కోరుతోంది. అయితే, విమానం కూలిన ప్రదేశం మీద ఆధిపత్యం కోసం ఇప్పుడు కూడా ఉక్రెయిన్, రష్యా అనుకూల దళాలు తీవ్రంగా పోరాడుకుంటున్నాయి. మరోపక్క ఆ ప్రాంతంతో పాటు బ్లాక్‌బాక్స్ కూడా తమ ఆధీనంలోనే ఉన్నట్లు డోనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రకటించింది. వాటిని మాస్కోకు పంపాలని భావిస్తోంది. కాగా, మలేషియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ కూడా దీనిపై స్పందించారు. అంతర్జాతీయ దర్యాప్తు బృందం అక్కడకు వెళ్లేందుకు వీలుగా మానవీయ కోణంలోఆలోచించి మార్గం సుగమం చేయాలని ఆయన కోరారు. -
9/11 తరువాత అతి పెద్ద ప్రమాదం
మలేషియా విమానం ఉక్రేన్ గగన తలంలో మిసైల్ కి బలైపోయిన సంఘటన 9/11 సంఘటన తరువాత జరిగిన అతి పెద్ద విమాన ప్రమాద సంఘటన. 9/11 లో నాలుగు విమానాలు హైజాక్ కి గురై న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగన్ లను ఢీకొన్నాయి. ఇంకో విమానం కూడా కుప్పకూలింది. ఆ తరువాత జరిగిన అతి పెద్ద విమాన ప్రమాద ఘటన ఉక్రేన్ లో జరిగిన మలేషియా విమాన ప్రమాదం. ఈ సంఘటనలో 298 మంది చనిపోయారు. 9/11 సంఘటనలో 2996 మంది చనిపోయారు. -
క్షణక్షణానికీ సమాచారం
తమ విమానం ప్రమాదానికి గురైన వెంటనే మలేషియన్ ఎయిర్‌లైన్స్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా బాహ్య ప్రపంచానికి అందించింది. ఆ వివరాలు ఇవీ.. * ఆమ్స్టర్డామ్ నుంచి బయల్దేరిన ఎంహెచ్17 విమానంతో మలేషియా ఎయిర్‌లైన్స్ కాంటాక్ట్ కోల్పోయింది. చిట్టచివరిగా ఆ విఆమనం ఉక్రెయిన్ గగనతలంలో కనిపించింది. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది * సంఘటన తెలియగానే మొత్తం యూరోపియన్ విమానాలన్నింటినీ ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించాం * అత్యవసరంగా స్పందించే బృందాలతో కలిపి పనిచేయడమే ఇప్పుడు మా ముందున్న కర్తవ్యం. వాళ్ల పూర్తి సహాయం తీసుకుని ఎంహెచ్17 విమానానికి కావల్సిన రక్షణ అంతా కల్పిస్తాం * ఎంహెచ్17 వెళ్తున్న మార్గం అత్యంత సురక్షితం, ఎలాంటి అడ్డంకులు లేనిదని ఐసీఏఓ, ఐఏటీఏ ప్రకటించాయి. అందుకే అది ఆ మార్గంలో వెళ్లింది * ఎంహెచ్ 17 విమాన ప్రమాదంలో మరణించిన వారి వివరాలను వాళ్ల వారసులకు తెలియజేసే పనిలో ఉన్నాం. ఆ పని మొత్తం అయిన తర్వాత జాబితా విడుదల చేస్తాం * మాకు అండదండలు అందించిన అందరికీ కృతజ్ఞతలు. మా ఆలోచనలు, ప్రార్థనలు అన్నీ ప్రయాణికులు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులతో ఉంటాయి Malaysia Airlines has lost contact of MH17 from Amsterdam. The last known position was over Ukrainian airspace. More details to follow. — Malaysia Airlines (@MAS) July 17, 2014 [#MASalert] With immediate effect, all European flights will be taking alternative routes avoiding the usual route http://t.co/HUIWQXl7dx — Malaysia Airlines (@MAS) July 17, 2014 Our focus now is to work with the emergency responders and mobilize its full support to provide all possible care to the #MH17 next-of-kin. — Malaysia Airlines (@MAS) July 18, 2014 Malaysia Airlines #MH17 flight route was declared safe and unrestricted by ICAO & IATA - http://t.co/HUIWQXl7dx — Malaysia Airlines (@MAS) July 18, 2014 We are in the process of notifying #MH17 next-of-kin. Once all have been notified, the passenger's manifest will be released. — Malaysia Airlines (@MAS) July 18, 2014 Thank you for all your support. Our thoughts and prayers are with #MH17 passengers and crew and their family members. — Malaysia Airlines (@MAS) July 18, 2014 -
ఎం హెచ్ 17: గతంలోనూ ఇలాంటి విమాన ప్రమాదాలు జరిగాయి...
యుద్ధంలో విమానాల్ని కూల్చేయడం మామూలు. కానీ పౌర విమానాలను సైనికులు లేదా గెరిల్లాలు కూల్చేయడం చాలా అరుదు. ఇప్పటి దాకా ఇలాంటి సంఘటను 24 సార్లు జరిగాయి. అయితే మలేషియా విమానాన్ని మిసైల్ తో కుప్పకూల్చేసిన సంఘటన మాత్రం చరిత్రలోనే అతి పెద్దది. * ప్రపంచ చరిత్రలో ఇలాంటి సంఘటన తొలి సారి 1943 లో జరిగింది. నాజీ జర్మనీ సైనలు లిస్బన్ నుంచి లండన్ వెళ్తున్న బ్రిటిష్ విమానాన్ని కుప్పకూల్చేశారు. అయితే నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియన్ విమానాన్ని కూల్చిన సంఘటన మాత్రం పూర్తిగా భిన్నమైనది. నెదర్లాండ్స్, మలేషియాలకు ప్రస్తుతం ఉక్రేన్ లో జరుగుతున్న యుద్ధానికి ఎలాంటి సంబంధమూ లేదు. * 2001 అక్టోబర్ లో సైబీరియా ఎయిర్ లైన్స్ కి చెందిన ఒక విమానాన్ని ఉక్రేన్ సైనికులు కుప్ప కూల్చేశారు. ఈ సంఘటనలో 64 మంది యాత్రీకులు, 12 మంది సిబ్బంది చనిపోయారు. ఈ సంఘటన తరువాత ఉక్రేన్ రక్షణ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. * 1983 లో రష్యా దక్షిణ కొరియాకి చెందిన ఫ్లైట్ 007 ను రష్యా గగనతలం మీద నుంచి ప్రయాణిస్తూండగా కుప్పకూల్చేసింది. ఈ సంఘటనలో 269 మంది చనిపోయారు. దీని వల్ల రష్యాకు అంతర్జాతీయంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. * 1988 లో ఇరాన్ కి చెందిన ఫ్లైట్ 655 ను అమెరికా గురిపెట్టి కాల్చింది. ఈ సంఘటనిరాన్, ఇరాక్ యుద్ధం జరుగుతున్న సందర్భంగా జరిగింది. అమెరికా ప్రభుత్వం ఇరాన్ కి నష్టపరిహారం కూడా చెల్లించాల్సి వచ్చింది. * 1980 లో ఇటావియా ఫ్లైట్ కుప్పకూలింది. ఈ సంఘటన టిరెనెయన్ సముద్రంలో సిసిలీకి దగ్గర జరిగింది. ఒక మిసైల్ తాకడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెబుతారు. అయితే ఎందుకు, ఎలా ఈ ప్రమాదం జరిగిందన్న విషయం మాత్రం ఇప్పటికీ తేలలేదు. * ఎల్ ఆల్ ఫ్లైట్ కూల్చివేత సంఘటన జులై 1955 లో జరిగింది. బల్గేరియా గగన తలంలో ఇజ్రాయిల్ కి చెందిన విమానాన్ని కూల్చేశారు. దీనిలో 58 మంది చనిపోయారు. ఈ సంఘటనలో బల్గేరియా ఇజ్రాయిల్ కి నష్టపరిహారం చెల్లించింది. * 1954 లో చైనా సైనికులు ఒక కాథే పసిఫిక్ విమానాన్ని కూల్చేశారు. విమానం బ్యాంకాక్ నుంచి హాంకాంగ్ వస్తూండగా ఈ సంఘటన జరిగింది. చైనా హాంకాంగ్ కు ఈ సంఘటన తరువాత క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. * 1973 లో లిబియాకు చెందిన పౌర విమానం దారి తప్పి ఇజ్రాయిల్ అధీనంలో ఉన్న మౌట్ సినాయ్ ప్రాంతంలోకి వచ్చింది. దీన్ని ఇజ్రాయిలీలు కూల్చేశారు. ఈ సంఘటనలో 108 మంది ప్రయాణికులు చనిపోయారు.