'నా కూతురిని చంపిన వారికి ధన్యవాదాలు'
ద హేగ్: ఉక్రెయిన్ లో విమానం పేల్చివేసిన దారుణోదంతం ఎన్నో కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసింది. ఈ దుర్ఘటనలో తన ఒక్కగానొక్క కూతురిని కోల్పోయి పుట్టు దుఃఖంలో మునిపోయిన ఓ నెదర్లాండ్ దేశస్థుడు నేరుగా రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ కు బహిరంగ లేఖ రాశాడు. 'నా కూతురిని చంపిన వారికి ధన్యవాదాలు' అంటూ లేఖలో పేర్కొని ఎవరూ చేయని విధంగా నిరసన వ్యక్తం చేశాడు. తన హృదయ వేదనను లేఖ రూపంలో అక్షరీకరించాడు.
'నా ఒక్కగానొక్క కూతుర్ని చంపినందుకు పుతిన్ కు, రష్యా తిరుగుబాటుదారులకు లేదా ఉక్రెయిన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు' అంటూ నెదర్లాండ్ కు చెందిన హాన్స్ డీ బోర్ట్స్ రాసిన బహిరంగ లేఖను డచ్ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. 17 ఏళ్ల ఆయన కుమార్తె ఎల్స్మీక్- విమాన ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయింది. ఆకాశయానం చేస్తూ విదేశీ యుద్ధ రంగంలో తగిలిన దెబ్బతో తన కుమార్తె కానరాని లోకాలకు వెళ్లిపోయిందని హాన్స్ డీ బోర్ట్స్ వాపోయాడు.
వచ్చే ఏడాదితో పాఠశాల విద్య పూర్తి చేసుకోబోతున్న తన కూతురు డెలఫ్ట్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదవాలని ఆశ పడిందని తెలిపాడు. ఒక యువతి జీవితాన్ని అర్థాంతరంగా అంతం చేసినందుకు అద్దంలో చూసుకుని మీరు గర్వపడతారనని తాను అనుకుంటున్నానని పుతిన్ కు రాసిన లేఖలో హాన్స్ డీ బోర్ట్స్ రాశారు. తన లేఖను ఇంగ్లీషులోని అనువదించుకుని వెంటనే చదువుతారని ఆకాంక్షించాడు. విమానం కూల్చివేత ఘటనలో తమ దేశానికి పౌరులు అత్యధిక మంది మృతి చెందడంతో నెదర్లాండ్స్ లో ఆందోళనలు ఎక్కువవుతున్నాయి.