ఎంహెచ్ -17: పుతిన్ విమానాన్ని పేల్చబోయారా?
మలేషియా విమానాన్ని పేల్చింది ఎవరు? రష్యన్ దళాలే తమ సైనిక విమానాలను గత కొన్ని వారాలుగా లక్ష్యం చేసుకుంటున్నాయని.. అందువల్ల ఈ విమానాన్ని కూడా తమ సైనిక విమానం అనుకుని వాళ్లు పేల్చేశారని ఉక్రెయిన్ వర్గాలు అంటున్నాయి. కానీ తమమీద ఎలాంటి మచ్చ పడకుండా ఉండేందుకు రష్యా మరో కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. వాస్తవానికి బ్రిక్స్ సదస్సు ముగించుకుని వస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమానం కూడా సరిగ్గా అదే మార్గంలో వస్తోందని, దాన్ని పేల్చేయాలనుకుని.. గురి తప్పి మలేషియా విమానాన్ని ఉక్రెయిన్ వర్గాలే కూల్చేశాయని చెబుతోంది.
వాస్తవానికి విమాన ప్రమాదం సంభవించిన తర్వాత చాలాసేపటి వరకు రష్యా నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. తమ దేశం మీద విధించిన ఆంక్షలను తొలగించాలంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మాట్లాడిన పుతిన్.. పనిలో పనిగా ఆయనకు విమాన ప్రమాదం గురించి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో రష్యా పాత్ర ఏంటన్న ప్రశ్నలు వస్తాయనే ఆలోచనతోనో ఏమో గానీ.. ఈ సరికొత్త కుట్ర సిద్ధాంతం ఒకటి వెలుగులోకి వచ్చిందని కొన్ని వార్తా సంస్థలు చెబుతున్నాయి. కానీ నిజానికి ఇంతవరకు ఏ దేశానికి సంబంధించిన క్షిపణి దాడి వల్ల విమానం కూలిపోయిందో మాత్రం నిర్ధారణ కాలేదు.
ప్రమాదం సంభవించడానికి దాదాపు గంట ముందుగా వార్సా సమీపంలో ఎంహెచ్ 17 విమానాన్ని పుతిన్ ప్రయాణిస్తున్న విమానం దాటిందని అనధికార వర్గాలను ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ ఇంటర్ఫాక్స్ తెలిపింది. దూరం నుంచి చూస్తే రెండు విమానాలు ఒకేలా ఉంటాయంటూ ఓ కల్పిత గ్రాఫిక్ను కూడా తయారుచేసింది.
అయితే ఇదంతా తనకేమీ తెలియదన్నట్లు పుతిన్ మాత్రం చాలా భారంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ''ఈ భూమ్మీద శాంతి ఉండి ఉంటే ఈ విషాదం జరిగి ఉండేదే కాదు. లేదా.. కనీసం ఆగ్నేయ ఉక్రెయిన్ ప్రాంతంలో సైనిక దాడులు పునరుద్ధరించకపోయినా ఇలా జరిగేది కాదు'' అని ఆయన అన్నారు.