ఎంహెచ్ 17: గుట్టు విప్పనున్న బ్లాక్బాక్సు
మలేషియన్ విమానం కుప్పకూలింది. మొత్తం అందులో ఉన్న 295 మందీ ప్రాణాలు కోల్పోయారు. అయితే విమాన ప్రమాదానికి కారణం ఏంటి.. అందరూ చెబుతున్నట్లు నిజంగానే క్షిపణిదాడి వల్లే కుప్పకూలిందా? ఈ విషయం కచ్చితంగా తెలియాలంటే బ్లాక్బాక్స్ను పరిశీలించాలి. ఎంతటి పెను ప్రమాదం సంభవించినా కూడా బ్లాక్బాక్స్ మాత్రం భద్రంగా ఉంటుంది. వాస్తవానికి నారింజరంగులో ఉండే ఈ బాక్సులో మొత్తం వివరాలన్నీ రికార్డు అవుతాయి. ఇక్కడ సంభవించిన ప్రమాదంలో ఎంహెచ్17 విమానంలోని బ్లాక్బాక్స్ను ఇప్పుడు ఎవరు తెస్తారన్నది అతిపెద్ద సమస్యగా మారింది. విమాన శిథిలాలను అంతర్జాతీయ పరిశీలకుల బృందం వెళ్లి చూడాలని ఐక్యరాజ్య సమితితో పాటు మలేషియా ప్రభుత్వం కూడా కోరుతోంది.
అయితే, విమానం కూలిన ప్రదేశం మీద ఆధిపత్యం కోసం ఇప్పుడు కూడా ఉక్రెయిన్, రష్యా అనుకూల దళాలు తీవ్రంగా పోరాడుకుంటున్నాయి. మరోపక్క ఆ ప్రాంతంతో పాటు బ్లాక్బాక్స్ కూడా తమ ఆధీనంలోనే ఉన్నట్లు డోనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రకటించింది. వాటిని మాస్కోకు పంపాలని భావిస్తోంది. కాగా, మలేషియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ కూడా దీనిపై స్పందించారు. అంతర్జాతీయ దర్యాప్తు బృందం అక్కడకు వెళ్లేందుకు వీలుగా మానవీయ కోణంలోఆలోచించి మార్గం సుగమం చేయాలని ఆయన కోరారు.