దేశాల పోరులో సామాన్యులే సమిధలా?
రాజ్యాల ఆధిపత్య పోరులో అమాయకుల ప్రాణాలు గాల్లోనే బూడిదయ్యాయి. దేశాల మధ్య రాజుకున్న విభేదాలు వందల మంది పౌరుల ప్రాణాలు బలి తీసుకున్నాయి. రష్యా, ఉక్రెయిన్ ఆధిపత్య యుద్ధం ఆకాశాయానం చేస్తున్న 295 మంది అమాయక పౌరుల ప్రాణాలను తోడేసింది. రష్యా సరిహద్దుల్లో కొనసాగుతున్న సమరంలో విమాన ప్రయాణికులు పావులుగా మారి మృత్యువాత పడ్డారు.
ఆదిమ కాలం నుంచి ఆధునిక యుగం వరకు రాజ్యాల పోరులో అమాయక పౌరులే బలవడం ఆనవాయితీగా మారిపోయింది. ఆధునికతకు శిఖరాగ్రమని చెప్పుకుంటున్న నేటి కాలంలోనూ పరిస్థితి మార్పు రాకపోవడం దురదృష్టకరం. ఇందుకు కారణాలనేకం. ఏదేమైనా చరిత్ర పుటల్లో మరో నరమేధం నమోదయింది. మలేసియా నాలుగు నెలల స్వల్ప కాలంలోనే రెండో విమాన ప్రమాదాన్ని చవిచూసింది.
ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడం తప్ప మనమేం చేయగలం. విమాన దుర్ఘటన మృతులకు 'సాక్షి' సంతాపం తెలుపుతోంది. దీనికి కారణం ఉగ్రవాద దాడి అని భావిస్తున్నారా? దేశాల మధ్య పోరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి.