ఎంహెచ్-17:ఆధిపత్య పోరుతో అమాయకుల ప్రాణాలు గాల్లోకి
రెండు దేశాల ఆధిపత్య పోరులో 295 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 295 మందితో అమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్‌కు బయల్దేరిన మలేసియా విమానాన్ని గురువారం సాయంత్రం ఉక్రెయిన్ గగనతలంపై కూల్చివేసిన విషయం తెలిసిందే. రష్యా సరిహద్దుల్లో ఉక్రెయిన్ ప్రభుత్వ దళాలు, రష్యా అనుకూల తిరుగుబాటుదారుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతంలో.. ఆ విమానం కూలిపోయింది.
ఘటనలో విమానంలో ఉన్న 280 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది.. మొత్తం 295 మంది మరణించారు. పేల్చివేతపై ఇప్పటివరకూ ఎవరూ బాధ్యత తీసుకోలేదు. కానీ ఉక్రెయిన్ దళాలే పేల్చేశాయని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు పేర్కొంటుండగా.. అది తిరుగుబాటుదారుల పనేనంటూ ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. అయితే ప్రయాణీకుల విమానాన్ని కూల్చివేయడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
నాలుగు నెలల కిందట హిందూ మహా సముద్రంలో అంతు చిక్కని రీతిలో అదృశ్యమైన ఎంహెచ్ 370 విమాన ఘటనను మరచిపోకముందే ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన ఈ రెండు విమానాలు మలేసియన్ ఏర్‌లైన్స్‌కు చెందినవే కావడం గమనార్హం. గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్‌కు చెందిన పలు మిలటరీ విమానాలను రష్యా అనుకూల తిరుగుబాటు దారులు పేల్చేస్తున్నారు.
బుధవారం కూడా తమ యుద్ధవిమానాన్ని పేల్చేశారని ఉక్రెయిన్ ప్రకటించింది. తిరుగుబాటుదారులకు రష్యా అన్నిరకాలుగా సహకరిస్తోందని, అత్యాధునిక క్షిపణులను వారికి అందిస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ సాయుధ దళాలు గగన లక్ష్యాలపై ఎలాంటి దాడులు చేయలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరొషెంకొ తన అధికారిక వెబ్‌సైట్లో ప్రకటించారు. ఉక్రెయిన్ వైమానిక దళమే మలేసియా ప్యాసెంజర్ విమానాన్ని పేల్చేసిందని తిరుగుబాటుదారుల నేత అలెక్జాండర్ బొరొదాయి ఆరోపించారు.