ఎం హెచ్ 17: గతంలోనూ ఇలాంటి విమాన ప్రమాదాలు జరిగాయి...
ఎం హెచ్ 17: గతంలోనూ ఇలాంటి విమాన ప్రమాదాలు జరిగాయి...
Published Fri, Jul 18 2014 10:15 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM
యుద్ధంలో విమానాల్ని కూల్చేయడం మామూలు. కానీ పౌర విమానాలను సైనికులు లేదా గెరిల్లాలు కూల్చేయడం చాలా అరుదు. ఇప్పటి దాకా ఇలాంటి సంఘటను 24 సార్లు జరిగాయి. అయితే మలేషియా విమానాన్ని మిసైల్ తో కుప్పకూల్చేసిన సంఘటన మాత్రం చరిత్రలోనే అతి పెద్దది.
* ప్రపంచ చరిత్రలో ఇలాంటి సంఘటన తొలి సారి 1943 లో జరిగింది. నాజీ జర్మనీ సైనలు లిస్బన్ నుంచి లండన్ వెళ్తున్న బ్రిటిష్ విమానాన్ని కుప్పకూల్చేశారు. అయితే నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియన్ విమానాన్ని కూల్చిన సంఘటన మాత్రం పూర్తిగా భిన్నమైనది. నెదర్లాండ్స్, మలేషియాలకు ప్రస్తుతం ఉక్రేన్ లో జరుగుతున్న యుద్ధానికి ఎలాంటి సంబంధమూ లేదు.
* 2001 అక్టోబర్ లో సైబీరియా ఎయిర్ లైన్స్ కి చెందిన ఒక విమానాన్ని ఉక్రేన్ సైనికులు కుప్ప కూల్చేశారు. ఈ సంఘటనలో 64 మంది యాత్రీకులు, 12 మంది సిబ్బంది చనిపోయారు. ఈ సంఘటన తరువాత ఉక్రేన్ రక్షణ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది.
* 1983 లో రష్యా దక్షిణ కొరియాకి చెందిన ఫ్లైట్ 007 ను రష్యా గగనతలం మీద నుంచి ప్రయాణిస్తూండగా కుప్పకూల్చేసింది. ఈ సంఘటనలో 269 మంది చనిపోయారు. దీని వల్ల రష్యాకు అంతర్జాతీయంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది.
* 1988 లో ఇరాన్ కి చెందిన ఫ్లైట్ 655 ను అమెరికా గురిపెట్టి కాల్చింది. ఈ సంఘటనిరాన్, ఇరాక్ యుద్ధం జరుగుతున్న సందర్భంగా జరిగింది. అమెరికా ప్రభుత్వం ఇరాన్ కి నష్టపరిహారం కూడా చెల్లించాల్సి వచ్చింది.
* 1980 లో ఇటావియా ఫ్లైట్ కుప్పకూలింది. ఈ సంఘటన టిరెనెయన్ సముద్రంలో సిసిలీకి దగ్గర జరిగింది. ఒక మిసైల్ తాకడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెబుతారు. అయితే ఎందుకు, ఎలా ఈ ప్రమాదం జరిగిందన్న విషయం మాత్రం ఇప్పటికీ తేలలేదు.
* ఎల్ ఆల్ ఫ్లైట్ కూల్చివేత సంఘటన జులై 1955 లో జరిగింది. బల్గేరియా గగన తలంలో ఇజ్రాయిల్ కి చెందిన విమానాన్ని కూల్చేశారు. దీనిలో 58 మంది చనిపోయారు. ఈ సంఘటనలో బల్గేరియా ఇజ్రాయిల్ కి నష్టపరిహారం చెల్లించింది.
* 1954 లో చైనా సైనికులు ఒక కాథే పసిఫిక్ విమానాన్ని కూల్చేశారు. విమానం బ్యాంకాక్ నుంచి హాంకాంగ్ వస్తూండగా ఈ సంఘటన జరిగింది. చైనా హాంకాంగ్ కు ఈ సంఘటన తరువాత క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది.
* 1973 లో లిబియాకు చెందిన పౌర విమానం దారి తప్పి ఇజ్రాయిల్ అధీనంలో ఉన్న మౌట్ సినాయ్ ప్రాంతంలోకి వచ్చింది. దీన్ని ఇజ్రాయిలీలు కూల్చేశారు. ఈ సంఘటనలో 108 మంది ప్రయాణికులు చనిపోయారు.
Advertisement
Advertisement