విధి ఆడిన వింత నాటకం!
విధి చాలా విచిత్రమైంది. మనుషుల జీవితాలతో అది చిత్రమైన విన్యాసాలాడుతుంది. ఊహించని పరిణామాలతో మనిషిని ఉక్కిరిబక్కిరి చేస్తుంది. సాఫీగా సాగిపోతున్న జీవితాలను ఎప్పుడు ఏ మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. విధిలీలా విన్యాసంలో స్టివార్డు సంజిద్ సింగ్ సంధు ఆయన భార్యకు శాశ్వతంగా దూరమయ్యాడు. ఉక్రెయిన్ లో మలేసియా విమానం కుప్పకూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారిలో భారత సంతతికి సంధు ఉన్నాడు.
సెలవు రోజున ఇంటిలో ఉండ్సాలిన అతడిని విధి వెంటాడించింది. గురువారం వారంతపు సెలవుకావడంతో ఇంట్లో ఉన్న సందు... తోటి ఉద్యోగి అభ్యర్థన మేరకు ఎంహెచ్-17 విమానంలో విధులకు వెళ్లి విగతజీవిగా మారిపోయాడు. విధి విచిత్రం ఏంటంటే షిఫ్టు మార్చుకోవడం వల్లే అతడి భార్య నాలుగు నెలల క్రితం మృత్యువు నుంచి తప్పించుకుంది. సంధు భార్య కూడా మలేషియా ఎయిర్లైన్స్లో స్టివార్డెస్గా పనిచేస్తోంది.
ఈ ఏడాది మార్చి 8న అదృశ్యమైన ఎంహెచ్-370 విమానంలో సంధు విధి నిర్వహణకు వెళ్లాల్సివుండగా చివరి నిమిషంలో ఆమె షిప్ట్ మార్చుకుంది. తన బదులు వేరే ఉద్యోగిని సర్దుబాటు చేసి సెలవు తీసుకుంది. ఈ విమానం ఏమైందో ఇప్పటివరకు తెలియలేదు. ఇక రెండు విమాన ప్రమాదాల్లోనూ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన ఓ కుటుంబం నలుగురు సభ్యులను కోల్పోయింది. మొన్న కొడుకు, కోడలు.. నిన్న మనవరాలు, ఆమె భర్త మృత్యువాత పడ్డారు. విధి ఆడిన వింత నాటకం అంటే ఇదేనేమో!