ఎంహెచ్-17: నాడు అన్న.. నేడు కూతురు
రెండు ప్రమాదాలు.. రెండూ మలేషియన్ విమానాలే. రెండుసార్లూ ఆ కుటుంబంలో విషాదమే. ఓ ఆస్ట్రేలియన్ మహిళకు ఈ అనుభవం ఎదురైంది. నాలుగు నెలల క్రితం ఎంహెచ్ 370 విమాన దుర్ఘటనలో ఆమె తన అన్నయ్యను కోల్పోతే.. ఇప్పుడు ఎంహెచ్ 17 దుర్ఘటనలో తన కూతురిని కోల్పోయింది. కేలీన్ మన్ సోదరుడు రాడ్ బరోస్, ఆయన భార్య మేరీ బరోస్ ఇద్దరూ ఎంహెచ్ 370 విమానంలో వెళ్లి, విమానంతో పాటే గల్లంతయ్యారు. గురువారం రాత్రి నాటి ఘటనలో మన్ కుమార్తె మేరీ రిక్ ఎంహెచ్17 విమానంలో సహ ప్రయాణికులతో పాటే కాలి బూడిదైపోయింది.
దీంతో మన్ గుండె బద్దలైపోయింది. కనీసం ఏం జరిగిందో చెప్పే పరిస్థితిలో కూడా ఆమె కనిపించడంలేదు. ఒకే విమానయాన సంస్థకు చెందిన రెండు విమానాల దుర్ఘటనలో తమ కుటుంబ సభ్యులు ఇలా ప్రాణాలు కోల్పోవడం ఆమెను తీవ్ర షాక్కు గురిచేసింది. రిక్తో పాటు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందిన ఆమె భర్త ఆల్బర్ట్ నాలుగు వారాల పాటు యూరప్లో సెలవులు గడిపి, తిరిగి ఇంటికి వస్తున్నారు. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది. ఇలా తమ కుటుంబంలో రెండు విషాదాలు జరిగినా.. మలేసియా ఎయిర్లైన్స్ అంటే మాత్రం బరోస్ దంపతులకు ఎలాంటి కోపం లేదు. అలా జరుగుతుందని ఎవరూ ఊహించరని, అందులో వాళ్లు చేయగలిగింది కూడా ఏమీ లేదని అన్నారు.