ఎంహెచ్-17: మృతుల్లో ఇద్దరు భారత సంతతివాళ్లు!
మలేషియా విమాన ప్రమాదంలో మొత్తం 295 మంది మరణించారు. వారిలో ఇద్దరు భారత సంతతికి చెందిన విమాన సిబ్బంది అని తెలుస్తోంది. జన్మతః భారతీయులైన వీళ్లు మలేషియా ఎయిర్లైన్స్ సంస్థలో ఉద్యోగానికి వెళ్లి ఆ ప్రయాణంలోనే అసువులు బాశారు. ఇక మృతులలో చాలామంది ఎవరన్న విషయం తెలియడంతో వాళ్ల బంధువులకు సమాచారం అందించినట్లు మలేషియా ఎయిర్లైన్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే.. 47 మంది మాత్రం ఎవరన్నది ఇంకా గుర్తించలేకపోయారు. వాళ్లు ఏ దేశానికి చెందినవాళ్లో, వాళ్ల ఊరు-పేరు ఏమిటో అనే విషయం ఖరారు కాలేదు.
విమానంలో ఉన్నవారిలో మొత్తం 154 మంది డచ్ దేశస్థులు కాగా, 43 మంది మలేషియన్లు. వాళ్లలో 15 మంది విమాన సిబ్బంది. వీళ్లు కాకుండా ఇంకా 27 మంది ఆస్ట్రేలియన్లు, 12 మంది ఇండోనేషియన్లు, ఆరుగురు బ్రిటిష్ వాళ్లు, నలుగురు జర్మన్లు, నలుగురు బెల్జియన్లు, ముగ్గురు ఫిలిప్పీన్స్ వాసులు, ఒక కెనడియన్ ఉన్నారు. మిగిలిన 47 మంది గురించి మాత్రం ఇంకా తెలియలేదు. మొత్తం ప్రయాణికుల్లో 100 మంది ఎయిడ్స్ పరిశోధకులు ఉన్నారు. ఓ సదస్సులో పాల్గొనడానికి వీళ్లంతా వెళ్తున్నట్లు తెలిసింది.