- నేటితో ప్రచారానికి తెర ..
- మండుటెండలో అభ్యర్థుల పోటీ ప్రచారం
- జోరుగా పాదయాత్రలు, బైక్ ర్యాలీలు
- కాంగ్రెస్, బీజేపీలకు జీవన్మరణ సమస్య
- సర్వశక్తులూ ఒడ్డుతున్న సీఎం సిద్ధు
- పలుచోట్ల ‘జేడీఎస్’ అభ్యర్థులతో లోపాయికారి ఒప్పందాలు
- పెద్దగా ప్రభావం చూపని ‘ఆమ్ ఆద్మీ’
- ‘మందు’ చూపుతో మద్యం దుకాణాల వద్ద మందు బాబులు క్యూ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నిలకు మంగళవారం సాయంత్రం ప్రచారం ముగియనుండడంతో అభ్యర్థులు ఓటరు దేవుని ప్రసన్నం చేసుకోవడానికి తుది ప్రయత్నాలు చేస్తున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాదయాత్రలు, బైక్ ర్యాలీల ద్వారా ప్రచారాన్ని విస్తృతం చేశారు. ప్రధాన పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వివిధ లేఔట్లలో ర్యాలీలు నిర్వహించారు.
పార్టీ అభ్యర్థుల కరపత్రాలను పంచుతూ ముందుకు సాగారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే రోడ్డు షోలు, బహిరంగ సభలకు అవకాశం ఉంటుంది. అనంతరం ఇంటింటి ప్రచారానికి అవకాశం ఉన్నా, అభ్యర్థులు వేరే ‘పనుల్లో’ నిమగ్నమైపోతారు. కాంగ్రెస్, బీజేపీ ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావిస్తున్నాయి. మంచి ఫలితాలు సాధించకపోతే స్థాన భ్రంశం తప్పదనే అధిష్టానం సంకేతాలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్వ శక్తులను ఒడ్డి అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్నారు.
గ్రూపు రాజకీయాలను పక్కన పెట్టి అందరూ ఏక తాటిపై నిలవాల్సిందిగా పార్టీ నాయకులకు ఉద్బోధిస్తున్నారు. ‘సెక్యులర్’ ఓట్లలో చీలిక ఏర్పడి, బీజేపీకి లాభిస్తుందనే చోట్ల ‘జేడీఎస్’ అభ్యర్థులను లోపాయికారిగా తప్పించడానికి ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే ఉత్తర కన్నడ నియోజక వర్గంలో జేడీఎస్ అభ్యర్థి శివానంద్ నాయక్ చివరి నిమిషంలో నామినేషన్‌ను ఉపసంహరించుకోగా, బెల్గాంలో పార్టీ అభ్యర్థి నజీర్ భగ్వాన్, కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.
మరో రెండు చోట్ల కూడా జేడీఎస్ అభ్యర్థులు ప్రచారంలో పాల్గొనకుండా కాంగ్రెస్ అభ్యర్థులకు పరోక్షంగా మద్దతునిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు మోడీ ప్రభంజనంపై గట్టి ఆశలు పెట్టుకున్న బీజేపీ, కనీసం 20 స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఎన్‌డీఏ సర్కారు ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలనుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు తమ ఓట్లకు గండి కొడతారని తొలుత భయపడిన బీజేపీ అభ్యర్థులు, క్రమేణా ఆ పార్టీ ప్రభావం బలహీన పడుతుండడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా గురువారం ఒకే దశలో రాష్ర్టంలోని మొత్తం 28 నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగనుంది.
‘మందు’ చూపు
ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్రంలోని మద్యం దుకాణాలను మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి మూడు రోజుల పాటు మూసి వేయనున్నారు. ఎన్నికల కమిషన్ కొరడా ఝుళిపిస్తుండడంతో గతంలో లాగా మద్యం దుకాణాలను మూసి వేసినా విచ్చల విడిగా మద్యం దొరికే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో మందు బాబులు అప్పు సొప్పో చేసి మూడు రోజులకు సరిపడా మద్యాన్ని స్టాక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరో వైపు బార్లు సైతం ‘రేపు సాయంత్రం 4.30 గంటల నుంచి గురువారం వరకు షాపులు మూసివేయబడును’ అని బోర్డులు వేలాడదీసి మందు బాబులను మరింత ‘అప్రమత్తం’ చేస్తున్నాయి.