సమవుజ్జీలు
- కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా ముగిసిన పోరు
- మంచి ఫలితాలిచ్చిన సిద్ధు సంక్షేమ పథకాలు
- కమలనాథుల ఆశలపై నీళ్లు
- యడ్డి, శ్రీరాములు రాకతోబీజేపీకి కొంత ఉపశమనం
- హాసన, మండ్య, చిక్కబళ్లాపురంలలో జేడీఎస్ హవా
- కోస్తాలో బీజేపీ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 28 స్థానాలకు గాను జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీ జేడీఎస్‌లు ఎన్ని స్థానాల్లో గెలుస్తాయనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ సాగుతోంది. బెట్టింగులకూ కొదవ లేదు. పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినప్పటికీ, ఎన్నికల నియమావళి ప్రకారం తుది దశ పోలింగ్ ముగిసేంత వరకు ఆ ఫలితాలను బహిర్గత పరచకూడదు.
ఈ నేపథ్యంలో గూఢచార విభాగం తన అంచనాలను ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. ఆ నివేదిక ప్రకారం... అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. జేడీఎస్ పాత మైసూరు ప్రాంతంలో తిరిగి పట్టు నిలుపుకొనే ప్రయత్నాలు చేసింది. మోడీ హవాతో 20 స్థానాలకు పైగా గెలుచుకుంటామని కమలనాథులు ఆశిస్తున్నప్పటికీ వాస్తవ చిత్రం తద్విరుద్ధంగా ఉంది.
కేంద్రంలోని యూపీఏ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ, పది నెలల కిందట అధికారంలోకి వచ్చిన సిద్ధరామయ్య వాయు వేగం, మనో వేగంతో అమలు చేసిన సంక్షేమ పథకాలు మోడీ పవనాలకు అడ్డు పడ్డాయి. స్థూలంగా కొద్దిగా అటు ఇటుగా ఇరు పార్టీలు సమాన బలాన్ని ప్రదర్శించే అవకాశాలున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా పోలింగ్ శాతం అధికంగా నమోదు కావడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొనడం సహజమే.
కాంగ్రెస్, బీజేపీలకు చెరో 38 శాతం ఓట్లు, జేడీఎస్‌కు 18 శాతం ఓట్లు లభించే అవకాశాలున్నాయి. ఒకటి, రెండు చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ... బీజేపీ లేదా కాంగ్రెస్ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బ తీసేలా ఉంది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మాజీ మంత్రి శ్రీరాములు రాక బీజేపీకి గరిష్టంగా లాభించింది. గత ఎన్నికల్లో ముంబై-కర్ణాటకలోని నాలుగు స్థానాలనూ గెలుచుకున్న బీజేపీ, ఈసారి ఓ సీటును కాంగ్రెస్‌కు కోల్పోవాల్సి వస్తుంది.
హైదరాబాద్-కర్ణాటక ప్రాం తంలో కాంగ్రెస్‌కు ఐదు, బీజేపీకి రెండు స్థానాలు లభించే అవకాశాలున్నాయి. మధ్య కర్ణాటకగా పి లిచే శివమొగ్గ, చిత్రదుర్గ, దావణగెరెలలో ఇరు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగింది. బెంగళూరులోని మూడు స్థానాలకు గా ను రెండు బీజేపీకి, ఒకటి కాంగ్రెస్‌కు లభించే అవకాశాలున్నాయి. మైసూరు-కొడగు, చామరాజ నగరలలో విజయ లక్ష్మి ఎవరిని వరిస్తుందో ఊహకందడం లేదు.
హాసన, మండ్య, చిక్కబళ్లాపురంల లో జేడీఎస్ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది. తుమకూరు, కోలారులలో ఈ పార్టీ కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చింది. కోస్తాలో ఎప్పటిలాగే బీజేపీ త న ఆధిపత్యాన్ని నిలుపుకోనుంది. 2009లో జరిగి న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 19, కాంగ్రెస్ ఆరు, జేడీఎస్ మూడు స్థానాలను గెలుచుకున్నాయి.