కాంగ్రెస్‌కు గడ్డుకాలం
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి
దొడ్డబళ్లాపురం : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం దాపురించిందని, సిద్ధరామయ్యనే ఆ పార్టీకి చిట్టచివరి ముఖ్యమంత్రిగా మిగిలిపోనున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. స్థానిక బసవభవన్‌లో బుధవారం నిర్వహించిన బీజేపీ మహా సంపర్క అభియాన్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపే చర్యలను ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు చేపట్టడం లేదని విమర్శించారు. ఆరు నెలలుగా పాలకు ప్రోత్సాహ ధనం ఇవ్వడం లేదన్నారు. రుణగ్రహీతలైన రైతులపై బ్యాంకులు గాని, వడ్డీ వ్యాపారులు గాని ఒత్తిడి చేయరాదని కోరారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను తాను అనుభవం ఉన్న పాలకుడనుకున్నానని అనుకున్నానని, అయితే అహంభావం ఉన్న మనిషని ఇటీవలే తెలిసిందన్నారు అసహనం వ్యక్తం చేశారు.
సిద్ధరామయ్య ప్రవర్తనతో, మొండితనంతో కాంగ్రెస్ పార్టీలోని నేతలు కార్యకర్తలే విసిగిపోయారని, వారే సిద్ధరామయ్యను ఇంటికి పంపించే పనిచేస్తారన్నారు. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు పార్టీ ప్రముఖులతో కూడిన ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీబీఎంపీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుందని, సిద్ధరామయ్య పదవికి గండం ఏర్పడుతుందని చెప్పారు. అనంతరం బీజేపీ మద్దతుతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిని సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జె.నరసింహస్వామి, కె.ఎం.హనుమంతరాయప్ప, హనుమంతేగౌడ, పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.