భారతీయ కరెన్సీ సంవత్సరాలుగా మారుతూ వేగంగా అభివృద్ధి చెందింది. దేశ స్వాతంత్య్రానికి ముందే కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చినా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశం గణతంత్ర రాజ్యంగా మారిన అనంతరం అనేక డినామినేషన్ల నోట్లు చలామణిలోకి వచ్చాయి. ఇప్పటివరకు భారతీయ కరెన్సీ నోట్లపై ఎవరెవరి చిత్రాలు కనిపించాయి? మొదటిసారిగా మహాత్మా గాంధీ చిత్రం ఎప్పుడు కనిపించింది? నోట్లపై ఏయే భాషలు ఎప్పుడు ముద్రించారు? నోట్ల రద్దు, ఉపసంహరణలు ఎప్పుడు జరిగాయి? వంటి ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం.
వలసరాజ్యాల నుంచి స్వతంత్ర భారతదేశానికి కరెన్సీ నిర్వహణ బదిలీ సాఫీగానే జరిగింది. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి వలస పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించింది. అయితే, 1950 జనవరి 26న దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది. కానీ అంతకు ముందు నుంచే భారతీయ రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ నోట్లను జారీ చేయడం ప్రారంభించింది. భారత ప్రభుత్వం రూపాయి నోటు కొత్త డిజైన్‌ని 1949లో తీసుకొచ్చింది. అప్పటికింకా స్వతంత్ర భారతదేశానికి నూతన చిహ్నాలను ఎంపిక చేయాల్సి ఉంది. నోట్లపై మొదట్లో ఉన్న రాజు చిత్రం స్థానంలో మహాత్మా గాంధీ చిత్రాన్ని పెట్టాలని భావించారు. ఆ మేరకు డిజైన్లు కూడా సిద్ధం చేశారు. కానీ చివరి నిమిషంలో గాంధీ చిత్రానికి బదులుగా సారనాథ్‌లోని లయన్ క్యాపిటల్ ఎంపికకు ఏకాభిప్రాయం వ్యక్తమైంది.
మొదటి నోట్లు ఇవే..
రిపబ్లిక్ ఇండియా మొదటిసారిగా 1950లో రూ. 2, రూ. 5, రూ.10, రూ.100 కరెన్సీ నోట్లను జారీ చేసింది. ఈ నోట్ల రంగు, డిజైన్‌లలో స్వల్ప వ్యత్యాసం ఉండేది. అయితే రూ. 10 నోటు వెనుకవైపు ఉన్న షిప్ మోటిఫ్‌ను మాత్రం అలాగే కొనసాగించారు. 1953లో కొత్త నోట్లపై హిందీని ప్రముఖంగా ముద్రించారు. రూపాయ హిందీ బహువచనంపై చర్చ జరగడంతో రూపియేగా మార్చారు. 1954లో రూ. 1,000, రూ. 5,000, రూ.10,000 వంటి అధిక విలువ కలిగిన నోట్లు తిరిగి ప్రవేశపెట్టారు.
1946 నాటి నోట్ల రద్దు వంటి కారణాలతోనే 1978లో మరోసారి అధిక విలువ కలిగిన నోట్లను రద్దు చేశారు. రూ. 2, రూ.5 వంటి చిన్న డినామినేషన్ నోట్లను తీసుకొచ్చినప్పుడు ప్రారంభంలో ఆయా నోట్లపై పులి, జింక వంటి జంతువుల చిత్రాలను ముద్రించారు. 1975లో ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి భారతదేశం చేస్తున్న కృషి తెలియజేసేలా రూ. 100 నోటుపై వ్యవసాయం, తేయాకు ఆకులు తెంపడం వంటి పనులకు సంబంధించిన చిత్రాలను ముద్రించారు.
మొదటిసారిగా గాంధీ చిత్రం
1960ల ఆరంభంలో దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 1967లో నోట్ల సైజ్‌లను తగ్గించారు. కరెన్సీ నోట్లపై మొదటిసారిగా గాంధీజీ కనిపించింది ఈ కాలంలోనే. మహాత్మా గాంధీ జయంతి శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని 1969లో సేవాగ్రామ్ ఆశ్రమం వద్ద కూర్చున్న గాంధీ చిత్రాన్ని ముద్రించిన స్మారక డిజైన్ సిరీస్‌ను విడుదల చేశారు. నోట్ల ముద్రణా ఖర్చులు తగ్గించుకునేందుకు 1972లో రూ.20 నోట్లు, రూ. 1975లో రూ.50 నోట్లను ముద్రించింది భారత ప్రభుత్వం.
1980 దశకంలో పూర్తిగా కొత్త నోట్లను విడుదల చేశారు. ఈ నోట్లపై మూలాంశాలను పూర్తిగా మార్చేశారు. సైన్స్ & టెక్నాలజీ ప్రాముఖ్యాన్ని తెలియజేసేలా రూ. 2 నోటుపై ఆర్యభట్ట చిత్రం, దేశ పురోగతిని చాటేలా రూ. 1 నోటుపై ఆయిల్ రిగ్, రూ. 5 నోటుపై ఫార్మ్ మెకనైజేషన్, రూ. 100 నోటుపై హీరాకుడ్ డ్యామ్ చిత్రాలను ముద్రించారు. అలాగే భారతీయ కళా రూపాలను ప్రదర్శించేలా రూ. 20 నోటుపై కోణార్క్ ఆలయ చక్రం, రూ. 10 నోటుపై నెమలి, షాలిమార్ గార్డెన్ చిత్రాలను తీసుకొచ్చారు.
మహాత్మా గాంధీ సిరీస్
ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కరెన్సీ నిర్వహణ భారంగా మారడంతో 1987 అక్టోబర్‌లో మహాత్మా గాంధీ చిత్రంతో రూ. 500 నోటును ప్రవేశపెట్టారు. అశోక పిల్లర్ లయన్ క్యాపిటల్ మాత్రం వాటర్ మార్క్‌గా కొనసాగింది. రిప్రోగ్రాఫిక్ టెక్నిక్‌లు అభివృద్ధి చెందడంతో నోట్ల సాంప్రదాయ భద్రతా లక్షణాలు బలహీనమయ్యాయి. దీంతో కొత్త ఫీచర్లను పరిచయం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగా 1996లో కొత్త 'మహాత్మా గాంధీ సిరీస్'ను ప్రవేశపెట్టారు. కొత్త వాటర్‌మార్క్, విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్, గుప్త చిత్రం, అంధుల కోసం ఇంటాగ్లియో ఫీచర్లు వీటిలో ఉన్నాయి.
ఇవే కొత్త ఫీచర్లతో 2000 అక్టోబర్ 9న రూ. 1000 నోట్లను కూడా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2000 నవంబర్ 18న రూ. 500 నోట్ల రంగు మార్చారు. అదనపు భద్రతా ఫీచర్‌గా మధ్యలో ఉన్న సంఖ్యా విలువలో కలర్-షిఫ్టింగ్ ఇంక్‌ను చేర్చారు.
మెరుగైన భద్రతా ఫీచర్లు
2005లో మహాత్మా గాంధీ సిరీస్ నోట్లలో భాగంగా రూ.100, అంత కంటే ఎక్కువ డినామినేషన్ నోట్లపై వైడ్ కలర్ షిఫ్టింగ్ మెషిన్ రీడబుల్ మాగ్నెటిక్ విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్ వంటి మెరుగైన భద్రతా ఫీచర్లను తీసుకొచ్చారు. 2005లో మొదటిసారిగా నోట్లపై ముద్రణ సంవత్సరం ప్రవేశపెట్టారు. సీక్వెన్స్‌ని నిర్వహించడానికి, అదే క్రమ సంఖ్యతో లోపభూయిష్టమైన నోట్లను మళ్లీ ముద్రించకుండా ఉండేందుకు 2006లో నోట్లపై “స్టార్ సిరీస్” ప్రవేశపెట్టారు.
రూపాయి చిహ్నం (₹)
భారత రూపాయి గుర్తింపు చిహ్నంగా 2011లో రూపాయి చిహ్నాన్ని (₹) ప్రవేశపెట్టారు. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం కలిసి 2010లో భారత రూపాయికి ఒక విశిష్ట చిహ్నాన్ని (₹) లాంఛనప్రాయంగా రూపొందించాయి. 2011లో కొత్త రూపాయి చిహ్నాన్ని బ్యాంకు నోట్లు, నాణేలపై ముద్రించడం ప్రారంభించారు. నకిలీ నోట్ల బెడదను నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కరెన్సీ నోట్ల భద్రతా ఫీచర్లను కాలానుగుణంగా అప్-గ్రేడేషన్ చేస్తుంటాయి. భారతదేశంలో అటువంటి అప్-గ్రేడేషన్ 2005లో జరిగింది. తర్వాత 2015లో అధిక డినామినేషన్‌లపై బ్లీడ్ లైన్‌లు, ఎక్స్‌ప్లోడింగ్ నంబర్లు వంటి కొన్ని కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టారు. రూ. 50, రూ. 20 నోట్లపై ఇంటాగ్లియో ప్రింటింగ్‌ను 2016లో ఆపేశారు. భారత ప్రభుత్వం 2015లో రూపాయి నోటును తిరిగి ప్రవేశపెట్టింది.
మహాత్మ గాంధీ నూతన సిరీస్
ద్రవ్య సంస్కరణల్లో భాగంగా భారత ప్రభుత్వం 2016 నవంబర్‌లో రెండో సారి పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2016 నవంబర్ 8 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన రూ. 500, రూ. 1,000 డినామినేషన్‌ల మహాత్మా గాంధీ సిరీస్ నోట్ల చట్టబద్ధమైన టెండర్ స్థితిని ఉపసంహరించింది. ఆ తర్వాత దేశ సాంస్కృతిక వారసత్వం , శాస్త్రీయ విజయాలను హైలైట్ చేస్తూ మహాత్మా గాంధీ నూతన సిరీస్‌లో కొత్త నోట్లను ప్రవేశపెట్టారు. ఒక్కో డినామినేషన్ నోటును ఒక్కో రంగు, సైజ్‌ల్లో రూపొందించారు. మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో భాగంగా 2016 నవంబర్ 8న రూ. 2000 నోటును 2017 ఆగస్టు 23న రూ. 200 నోటును కొత్తగా తీసుకొచ్చారు. కాగా రూ.2000 నోటును 2023 మే 19న చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.
ఇదీ చదవండి: Independence Day 2023: స్వాతంత్య్రానికి ముందే వందలాది బ్యాంకులు! ఘనమైన మన బ్యాంకింగ్ చరిత్ర
Comments
Please login to add a commentAdd a comment