పూర్వం కురు రాజ్యాన్ని ఇంద్రప్రస్థ నగరం రాజధానిగా ధనంజయ కౌరవ్యుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతని ఆస్థాన పురోహితుడు, మంత్రి సుచీరతుడు అనే పండితుడు. ఒకరోజున వారిద్దరూ కూర్చొని పరిపాలన విషయాలు చర్చించుకుంటూ ఉండగా ‘ధర్మయజ్ఞం’ అనే విషయం చర్చకు వచ్చింది. ‘‘అశ్వమేధం, రాజసూయం, పుత్రకామేష్టి మొదలైన యాగాలు తెలుసు. ధర్మ యాగం ఎలా చేయాలి అచార్యా!’’ అని అడిగాడు రాజు.
‘‘మహారాజా! నాకూ పూర్తిగా తెలియదు. మన రాజ్యంలో భగీరథీ తీరంలో విదుర పండితుడు ఉన్నాడు. ఆయన సర్వజ్ఞుడు. వెళ్ళి వివరంగా తెలుసుకు వస్తాను. శెలవియ్యండి’’ అని అడిగి మరునాడు బయలుదేరి వెళ్ళి విదుర పండితుణ్ణి కలుసుకున్నాడు. విదురుడు తన మిత్రుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు. కుశల ప్రశ్నల తర్వాత తాను వచ్చిన విషయం చెప్పాడు సుచీరతుడు.అంతలో ఎందరో శిష్యులు ఆయన సందర్శన కోసం వచ్చారు. దానితో ....‘‘మిత్రమా! నేను ఈ సమయంలో ధర్మయాగం గురించి చెప్పలేను. అదిగో.. అక్కడ అడవి సమీపంలో నా పెద్ద కుమారుడు భద్రకారుని ఆశ్రమం ఉంది. అతనూ పండితుడే. వెళ్ళి భద్రకారుణ్ణి అడుగు’’ అని చెప్పి పంపాడు
సుచీరతుడు ఆయన వద్దకు వెళ్లి తాను వచ్చిన విషయాన్ని వివరించగా... ‘‘మహాశయా! మీ ప్రశ్నకు సమాధానం చెప్పే యోగ్యత నాకు లేదు. ఇంకా రెండు యోజనాల దూరం ముందుకు వెళ్ళు. అక్కడ నదీతీరంలో ఒక ఆశ్రమం ఉంటుంది. అది నా పెద్ద తమ్ముడు సంజయునిది. అతడు ప్రాజ్ఞుడు. నీకు అతను సమాధానం చెప్తాడు’’ అని సగౌరవంగా సాగనంపాడు భద్రకారుడు. సుచీరతుడు వెళ్ళే సమయానికి సంజయుడు అక్కడ లేడు. తిరిగి వచ్చేసరికి సాయంత్రం అయ్యింది. వచ్చాక, సుచీరతునికి తగు సత్కారాలు చేశాడు. ఆ విషయం తెలుసుకుని– ‘‘సుచీరతా! నేను కూడా దీనికి సమాధానం చెప్పలేను.
నిజం చెప్పాలంటే అందుకు తగను. సదాచార భ్రష్టుణ్ణి. ఇందుకు తగినవాడు మా అందరికంటే చిన్నవాడు మా తమ్ముడు సంభవుడు. అతని ఆశ్రమం ఈ పక్కనే ఉంది. వెళ్ళు’’ అని మర్యాద పూర్వకంగా చెప్పాడు. సుచీరతుడు మరునాటి వేకువనే లేచి సంభవుని దగ్గరకు వెళ్ళాడు. విషయం అంతా చెప్పాడు. ఉదయం స్నానాదికాలు పూర్తయ్యాక వారిద్దరూ ఒక మామిడి చెట్టు కింద కూర్చున్నారు. ‘‘సుచీరతా! ధర్మయాగం చేసేవారు ఐదు విషయాలు పాటించాలి. అందులో మొదటిది; ఎప్పుడు చేసే పని అప్పుడే చేయాలి. తరువాత చేయవచ్చులే అని బద్ధకించకూడదు. నిర్లక్ష్యం తగదు. ఈ రెండు లక్షణాల్ని సమయపాలన అనే యజ్ఞగుండంలో కాల్చి బూడిద చెయ్యాలి.
ఇక రెండోది; ఎవ్వరు ఏది చెప్పినా జాగ్రత్తగా వినాలి. విన్న ప్రతిదాన్ని ఆచరించకూడదు. బాగా ఆలోచించి సరైన వాటిని మాత్రమే ఆచరించాలి.
మూడోది; ఏ విషయంలోనూ హద్దు దాటకూడదు. ప్రకృతిలో ఒక్కో శక్తికి ఒక్కో హద్దు ఉంటుంది. సమాజంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో హద్దు ఉంటుంది. అర్హత ఉంటుంది. ప్రతి వారు తమ తమ హద్దులు తెలుసుకోవాలి. ఈ హద్దులు అమానవీయ, అకుశల విషయాల్లో లింగ భేదాల్లో కాదు. మన సామాజిక నైతిక నడవడికలో తండ్రికి, తల్లికి, తనయులకీ, గురువులకీ ఒక్కొక్కరికి ఒక్కో హద్దులుంటాయి. వారి వారి హద్దుల్లో వారికి గౌరవ మర్యాదలు దక్కుతాయి. నైతిక హద్దులు దాటడం చాలా ప్రమాదం. అలాగే అధర్మ కార్యాలు చేయకూడదు. మనం చేసే పనులు మనకూ, పరులకూ హితాన్ని, సుఖాన్ని ఇవ్వాలి. ఇలా అందరికీ సుఖాన్నిచ్చేవే ధర్మకార్యాలు.
అధర్మ కార్యాలు చేసేవారు రేవు కాని చోట నదిలో స్నానానికి దిగిన వారితో సమానం. అది వారికే ప్రమాదం. ఇక ఐదో విషయం; చెడు తలపులు మానాలి. చెడు చేష్టలే కాదు. చెడ్డ ఆలోచనల్ని మన మనసులోకే రానీయకూడదు. ఒకవేళ వచ్చినా యజ్ఞ జ్వాలలో మండించే సమిధల్లా వాటిని కాల్చి బూడిద చెయ్యాలి. సుచీరతా! ఈ ఐదూ పాటిస్తే అదే ధర్మయాగం. ఈ యాగం చేసినవారు శుక్ల పక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెంది, పున్నమి చంద్రునిలా శోభిల్లుతారు’’ అని చెప్పాడు. సుచీరతుడు ఇంద్రప్రస్థం చేరి ధనంజయు కౌరవ్యునికి ఈ విషయాలు చెప్పాడు. తన రాజ్యంలో ప్రజలందరూ– ‘ధర్మయాగం’ చేయవలసిందిగా రాజు చాటింపు వేయించాడు.
– డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment