మనోశుద్ధి అంటే చిత్తశుద్ధి. చిత్తం ఈ మలినాల నుండి విముక్తి చెందడం. అలా విముక్తి చెందిన చిత్తంలో తిరిగి మరలా అమానవీయ విషయాలు మొలకెత్తవు. సమూలంగా నిర్మూలించబడతాయి.
ఒకసారి బుద్ధుడు తన భిక్షువులతో కలసి ఒక విశాలమైన పొలంలోంచి నడిచిపోతున్నాడు. ఆ పొలం అంతకుముందే తగలబడి ఉంది. పంటను తీశాక రైతులు చెత్తనంతా తగలబెట్టారు. కానీ... ఆ తర్వాత వర్షం పడింది. ఆ తగలబడిన మసిలోంచి పచ్చని గడ్డి పిలకలు నవనవలాడుతూ పైకి లేస్తున్నాయి. బుద్ధుడు వాటి వంక చూస్తూ ముందుకు నడిచాడు. ఆ పొలం దాటి పెద్ద కాలువ కట్ట ఎక్కారు. ఆ కట్ట మీద మొదలు పైకి నరికిన పెద్ద తుమ్మచెట్టు మోడు కనిపించింది. ఆ తర్వాత రకరకాల చెట్ల మోడులు కనిపించాయి. వాటి మద్య నరికేసిన తాటిచెట్లు మోడులూ కనిపించాయి.
బుద్ధుడూ, భిక్షువులూ ఆ మోళ్ళను గమనిస్తూనే ముందుకు నడిచి వెళ్ళారు. వారు కొంత దూరం పోయాక నదీ తీరంలో పెద్ద మర్రిచెట్టు కనిపించింది. అప్పటికే ఎండ ఎక్కుతూ ఉంది. కొంత సేపు సేద తీరడానికి ఆ చెట్టు కింద ఆగారు. భిక్షువులు కొన్ని సందేహాలు అడిగారు. వాటికి సమాధానమిచ్చాడు. ఆ తరువాత ఆయన ప్రబోధం ‘చిత్త మలినాలు’ మీదికి మళ్ళింది. ఆ విషయం చెప్తూ స్వచ్ఛ జలం గురించి చెప్పాడు. బుద్ధునికి నిత్య జీవితంలో తమకు అనుభవమయ్యే అంశాల్ని జోడించి, తేలికగా అర్థం అయ్యేలా చెప్పటం అలవాటు. దానితో అప్పటి వరకూ తాము నడచి వచ్చిన దారిలోని సంఘటనలు తీసుకున్నాడు.
‘‘భిక్షువులారా! చూశారుగా! మనం నడచి వచ్చిన పొలాన్ని తగులబెట్టారు. అయినా ఆ తరువాత దానిలోని గడ్డి, తుంగ పరకలూ మొలకెత్తాయి. అలాగే... గట్టు మీది ఎన్నో చెట్లు మొదలంటూ నరికినా, మరలా పిలకలు వేశాయి. చివురులు తొడిగాయి. ఐతే ఒకే ఒక జాతి వృక్షాలు మాత్రం నరికివేశాక అవి ఎలాంటి చివురులు తొడగలేవు. అవి ఏమిటో గమనించారా?’’ అని అడిగాడు. ఒక భిక్షువు వినమ్రంగా ‘భగవాన్! తాటిచెట్లు’ అన్నాడు. బుద్ధుడు చిరుమందహాసంతో –‘‘అవును భిక్షూ! నీ పరిశీలన సరైనదే! మన మనస్సులో రాగద్వేషాలూ, కోరికలూ, మోహాలు అనే అకుశలాలు అన్నీ అలాగే నరికివేయబడాలి. అవి మరలా మొలకెత్తకూడదు. చివురులు తొడక్కూడదు.
తాటిచెట్టును కొట్టి వేశాక, ఎలా చివురులు వేయదో, పిలకలు తొడగదో మన మనో క్షేత్రంలో అకుశలాల్ని, కోర్కెల్ని (తృష్ణల్ని) అలాగే తొలగించుకోవాలి. మొదలంటూ నరికిన తాటిచెట్టులా తృష్ణల్ని తెగతెంచుకోవాలి. అదే తృష్ణాక్షయం. అలాంటి చిత్తమే నిర్మల చిత్తం. స్వచ్ఛమైన నీటిలాంటి చిత్తం. మన ధర్మ సాధనంతా అలాంటి నిర్మల చిత్తం కోసమే!’’ అన్నాడు. ఆ గంభీర ధర్మోపదేశం వారి హృదయాల్ని తాకింది. వారి మనో ఫలకంపై మొదలు నరికిన తాటిచెట్టు ప్రత్యక్షం అయింది. అప్రయత్నంగా అందరూ కనురెప్పలు మెల్లగా మూశారు. ఏకాగ్రతలోకి జారుకున్నారు. ధ్యాన నిమగ్నులయ్యారు.
– డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment