
అజ్ఞానానికి గురయినవాడు వాస్తవాన్ని తెలుసుకోలేడు. అవాస్తవాన్ని వాస్తవంగా నమ్ముకొంటాడు. తాను నమ్ముకొన్న దానిని ధర్మమార్గంగా భ్రమిస్తాడు. అందుకు నిదర్శనంగా కాంతపై కనకంపై ధనంపై పదవిపై భార్యాబిడ్డలపై అధికమైన ఆపేక్ష కలిగి వర్తిస్తాడు.
భార్యాబిడ్డల వ్యామోహం కుటుంబ పోషణకు మాత్రమే కొనసాగాలి. పోషకుడు తామరాకుపై నీటిబిందువు వలె నిమిత్తమాత్రుడుగా మెలగాలి. నదీప్రవాహం తగ్గినప్పుడు అందులోని కట్టెలు కంపపుల్లలు ఒకచోట చేరుతాయి. ప్రవాహం ఉధృతమైన వెంటనే విడిపోయి దూరంగా పయనిస్తాయి. దానితో సమానమే సంసారంలో ఉండే సభ్యుల సమాగమం.
అజ్ఞానానికి గురయినవాడు వాస్తవాన్ని తెలుసుకోలేడు. అవాస్తవాన్ని వాస్తవంగా నమ్ముకొంటాడు. తాను నమ్ముకొన్న దానిని ధర్మమార్గంగా భ్రమిస్తాడు. అందుకు నిదర్శనంగా కాంతపై కనకంపై ధనంపై పదవిపై భార్యాబిడ్డలపై అధికమైన ఆపేక్ష కలిగి వర్తిస్తాడు. దానినే మోహం లేక వ్యామోహం అంటారు. మోహం మనిషి కంటికి కనబడకుండా కష్టాలుపెట్టే ఆరుగుణాల్లో నాల్గవది గా పేర్కొనబడింది.
ఉర్విలోసర్వానికి సాక్షిగా ఉంటూసర్వాన్ని సక్రమమైన మార్గంలో నడిపించే చైతన్యస్వరూపుడు (పరమాత్ముడు) నిత్యుడు సత్యమైనవాడు అనడం వాస్తవం. పరమాత్మ కంటికి కనబడని ఆనందమయుడు అవనిలో ఆకర్షణీయమైన వస్తుజాలమంతా అవాస్తవం. క్షణభంగురం,అందుకే వ్యక్తి ఆలోచించడం మాట్లాడటం వినడం, కనడం, చేయడం అనేప్రక్రియలు వాస్తవాన్ని ప్రతిబింబింపజేసే పద్ధతిలో పయనించాలి. అవాస్తవం, అన్యాయం, అక్రమం, అధర్మం, అనే సర్పాల కోరలకు బలికాకుండా జాగ్రత్త వహించాలి.
పరస్త్రీ మానధనాన్ని చెరచడం, పరధనాపహరణం రెండూ ప్రాణాలకు ప్రమాదాన్ని తెచ్చే దుర్మార్గపు చర్యలైన వ్యామోహాలు. అవి భయకరమైన పరధర్మానికి ప్రతీకలు. శాస్త్రధర్మానికి విరుద్ధాలు. అధికార వ్యామోహం, భార్యాబిడ్డల భ్రాంతి శాస్త్రమర్యాదకు సంబంధమైన స్వధర్మానికి అనుగుణంగా ఆచరిస్తే వ్యక్తిసౌఖ్యానికి, సమసమాజ క్షేమానికి, ప్రపంచమంతా నిండి ఉండే పరమేశ్వరుని కరుణకు పాత్రులుగా మనవచ్చు.
అధికారం జనధిక్కారం కాకుండా ఉంటూ పరిపాలన రామరాజ్యాన్ని తలపించేదిగా రాణించాలి. అప్పడది స్వధర్మాచరణకు సాక్ష్యంగా నిలుస్తుంది. భార్యాబిడ్డల వ్యామోహం కుటుంబ పోషణకు మాత్రమే కొనసాగాలి. పోషకుడు తామరాకుపై నీటిబిందువు వలె నిమిత్తమాత్రుడుగా మెలగాలి. నదీప్రవాహం తగ్గినప్పుడు అందులోని కట్టెలు కంపపుల్లలు ఒకచోట చేరుతాయి. ప్రవాహం ఉధృతమైన వెంటనే విడిపోయి దూరంగా పయనిస్తాయి. దానితో సమానమే సంసారంలో ఉండే సభ్యుల సమాగమం.
పరస్త్రీ వ్యామోహంతో పాడయిపోయిన వారిలో సైంధపుడొకడు. పాండవులు తమ నివాసంలో లేనప్పుడు, ద్రౌపది ఒంటరిగా ఉండటం చూసి మానభంగం చేయదలచి రథంపై ఎక్కించుకుని తీసుకెళ్లడాన్ని తెలిసికొన్న పాండవులు వచ్చి వానికి తగిన ప్రాయశ్చిత్తం పెట్టడమేకాక తలగొరిగించి పంపారు. పరుల ఆస్తిపై వ్యామోహం కలిగిన దుర్యోధనుడు న్యాయబద్ధంగా పాండవులకు ఇవ్వవలసిన రాజ్యభాగాన్ని ఇవ్వకుండా యుద్ధం చేసి తానేగాక తన వంశనాశానికి కారణమయ్యాడు.
మోహానికి వలపు అనే పదాన్ని పర్యాయపదంగా చెబుతారు. ధర్మబద్ధమైన పవిత్ర దాంపత్య బంధమైన గంగా శంతనుల వలపు తో దేవవ్రతుడు (భీష్ముడు) జన్మించాడు. అతడు మహావీరుడుగా మాట తప్పని వాడి గా మనటమే గాక విఘ్ణవును సహస్ర నామాలలø స్తుతించే జ్ఞానిగా తన గొప్పతనాన్ని చిరస్థాయిగా నిలుపుకొన్నాడు. మంచిచెడుల మధ్యలో మనిషి జీవించడం తప్పనందున పాలను మాత్రమే స్వీరించి నీటిని వదలే హంస వలె మంచిగా మనాలి.
– విద్వాన్ వల్లూరు చిన్నయ్య