‘‘తన కోపమె తన శత్రువు...’’ అన్న పద్యంలో దయ చుట్టంబౌ... అన్నారు. దయ చుట్టమెలా అవుతుంది? మనలో దయ అనే గుణం ఉంటే... అది చుట్టంతో సమానంగా, అంతకంటే ఎక్కువగా, ఆపద్బంధువులా కాపాడుతూనే ఉంటుంది. ఒకానొకప్పుడు ఒక రైతు పొలంలో పని చేసుకుంటున్నాడు. పొలం పక్కన పెద్ద సేద్యపు బావి ఉంది. చెరువులు, దొరువుల్లాగానే కొన్ని ప్రాంతాల్లో పెద్ద సేద్యపు బావులకింద సాగుపనులు నడుస్తుంటాయి. ఉన్నట్లుండి బావిలో దభేల్మని పెద్ద చప్పుడయింది. ఎవరో పడిపోయినట్లున్నారు... రక్షించండి, రక్షించండి.. అని అరుస్తున్నారు. చేతిలో పని వదిలేసి ఆ రైతు ఒక్క ఉదుటున వెళ్ళి చూస్తే... ఎవరో పిల్లవాడు మెల్లిమెల్లిగా నీటిలోకి మునిగిపోతున్నాడు. క్షణం కూడా ఆలోచించకుండా నూతిలోకి దూకి ఆ పిల్లవాణ్ణి పైకి తెచ్చి, సపర్యలు చేసి లోపలికి మింగిన నీళ్ళన్నీ కక్కించాడు. కొద్దిగా తేరుకున్న తరువాత తనింటికి తీసుకెళ్ళాడు.
ఆ రైతుకూ ఓ కొడుకున్నాడు. ఇంట్లో ఈ అబ్బాయిని అప్పగించి వాడు కోలుకోవడానికి ఆ రాత్రికి తనవద్దనే ఉంచుకున్నాడు. తెల్లవారింది. ఆ పిల్లవాడి వివరాలు తెలుసుకుని వాడింటికి తీసుకెళ్ళి అప్పగిద్దామని అనుకుంటుండగానే... ఇంటి ముందు పెద్ద పడవంత కారొచ్చి ఆగింది. అందులోనుంచి ఓ ధనవంతుడు ఆదుర్దాగా నడుచుకుంటూ లోపలికి వచ్చాడు.‘‘అయ్యా! మీరు కాపాడిన అబ్బాయి నా కుమారుడే. నిన్న పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఆ నూతిలో పడిపోయాడట. అది తెలియక నిన్నటినుంచీ వెతికిస్తున్నా. ఇప్పుడే తెలిసింది. నూతిలో మీరు దూకి రక్షించారట కదా. వాడు నాకు ఒక్కగానొక్క కొడుకు. ఐశ్వర్యానికి కొదువలేదు. కానీ వాడికి ఏమయినా అయితే నేను తట్టుకోలేను. వాడినే కాదు, మమ్మల్ని కూడా కాపాడారు. మీ రుణం తీర్చుకోలేం.. అయినా కృతజ్ఞత గా...’’ అంటూ డబ్బున్న ఓ ఇనప్పెట్టెను రైతు ముందుంచాడు.
దానికి రైతు ‘‘ఆపదలో ఉన్న వారిని కాపాడడం, దయతో వ్యవహరించడం నా సహజ లక్షణం. నా కొడుకు ప్రమాదంలో ఉంటే కాపాడుకోనా... క్షమించండి. నా బాధ్యతకొద్దీ కాపాడినదానికి నేను డబ్బు తీసుకోను... సంతోషంగా మీ అబ్బాయిని మీరు తీసుకెళ్ళండి’’ అని అంటూండగానే రైతు కొడుకు లోపలినుంచి వచ్చాడు. ఈ అబ్బాయి ఎవరని ధనవంతుడు అడిగాడు. ‘‘అయ్యా, నా కుమారుడేనండీ, కొంతవరకు చదువుకొన్నాడు.. ఇక ఆ పై చదివించే శక్తి లేక చేతికింద పెట్టుకుని పొలం పనులకు తీసుకెడుతున్నా..’’ అని పరిచయం చేసాడు.
‘‘మీరు నా కొడుకును బతికించారు. డబ్బిస్తే వద్దంటున్నారు... కానీ మీరు చేసిన సాయానికి మా తృప్తికోసం మీకు అభ్యంతరం లేకపోతే మీ వాడిని నాతోపంపండి. మా అబ్బాయిలాగే చూసుకుంటూనే చదివిస్తా. ఈ ఉపకారం చేయండి’’ అనడంతో రైతు దానికి అంగీకరించి తన కొడుకును కూడా వారి వెంట పంపాడు.
ఆ ధనవంతుడి కొడుకే పెద్దయిన తరువాత బ్రిటన్ ప్రధానిగా చేసిన విన్‌స్టన్ చర్చిల్. ఆయనకొకసారి ప్రాణాంతక జ్వరం వచ్చింది. ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు. అప్పడు ఒక్క ఇంజక్షన్ తో ఆయన కోలుకున్నాడు. ఆ ఇంజక్షన్ పెన్సిలిన్. దానిని కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎవరో కాదు.. ఆ రైతు కొడుకే. అదీ దయ చుట్టం కావడమంటే...
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment