ఆధ్యాత్మిక ప్రయాణం కోసం ఓ వ్యక్తి చేసే ప్రయాణం కథాంశంగా రాబిన్ శర్మ రాసిన పుస్తకం The Monk Who Sold His Ferrari ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. అదే చరిత్రలో.. గౌతమ బుద్ధుడు ఇలా రాజభోగాలను వదిలేసి సన్యాసం తీసుకున్నాడని చదువుకున్నాం. కానీ.. నిజ జీవితంలో ఇలా కోట్ల సంపదను వదిలేసి సన్యాసి జీవితం గడుపుతారా?. అయితే.. ఈ మోడ్రన్ డే సిద్ధార్థుడి కథ చదవాల్సిందే.
శ్రీలంక- తమిళ సంతతికి చెందిన ఆనంద్ కృష్ణన్. మలేషియాలో బిలియనీర్. ఆ దేశ ధనికుల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. సుమారు రూ. 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. ఆయన ఒక్కగానొక్క కొడుకే పైన ఫొటోలో ఉన్న వెన్ అజన్ సరిపన్యో.
👉మలేషియాలో మూడో అత్యంత సంపన్నుడిగా పేరున్న తండ్రిని.. ఆయనకున్న టెల్‌కాం, శాటిలైట్స్, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కాదనుకున్నారు అజన్ సరిపన్యో. ఒకానొక టైంలో సీఎస్కే టీంకు స్పాన్సర్ చేసిన ఎయిర్‌సెల్ కంపెనీకి ఓనర్ ఈయన తండ్రే.
👉రెండు పదుల వయసొచ్చేదాకా రిచ్చెస్ట్ పర్సన్ కొడుకుగానే తన ఇద్దరు సోదరీమణులతో లండన్‌లో పెరిగాడు. ఆ టైంలోనే ఎనిమిది భాషలపై అనర్గళంగా పట్టు సాధించారు. ఇక్కడ మరో విషయం.. ఈయన తల్లి మామ్వాజారోగీస్ సుప్రిందా చక్రబన్ థాయ్‌లాండ్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తే. అయితే ఈ మూలాలే అతని జీవితాన్ని మార్చిపడేసింది.
👉తన 18వ ఏట తల్లి కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు థాయ్‌లాండ్ వెళ్లాడు అజన్ సరిపన్యో. వెళ్లేముందు ఆ ట్రిప్ సరదాగా సాగుతుందని భావించాడు. కానీ, అది అతని జీవితంలో ఊహించని మార్పు తెచ్చింది. అక్కడ ఆధ్యాత్మికత అతన్ని ఎంతగానో ఆకర్షించింది. ఇదే తన జీవిత పరమార్థం అనుకుని.. భోగభాగ్యాలను వదులుకుని సన్యాసం పుచ్చేసుకున్నాడతను.
👉గౌతమబుద్ధుడి స్ఫూర్తితో అజన్ అవన్నీ వదులుకుని సన్యాసిగా మారిపోయి స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవ చేస్తున్నాడు. వేల కోట్ల సంపదలో ఈ ఆనందం దొరకదంటాడాయన. మయన్మార్-థాయ్‌లాండ్ సరిహద్దులోని ఓ మారుమూల ప్రాంతంలో నివసిస్తూ ఓ మఠాధిపతిగా ఉంటూనే.. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఈ అభినవ బుద్ధుడు.
👉తన ఆస్తులన్నీ అజన్ సరిపన్యోకు అప్పగించాలనుకుని విశ్రాంతి తీసుకోవాలనుకుని భావించాడు ఆనంద్ కృష్ణన్. కానీ, అజన్ మాత్రం పెద్ద షాకే ఇచ్చాడు. ఆ నిర్ణయం బాధించేదే అయినా అజన్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఆ తండ్రి గౌరవించాడు.
👉తండ్రి బాటలో అడుగులు వేసి వ్యాపారరంగంలో రాణిస్తున్న అంబానీ వారసుల గురించే కాదు.. ప్రాపంచిక ఆస్తుల నుంచి విడిపోయి బౌద్ధమతాన్ని స్వీకరించి ధార్మిక కార్యక్రమాల్లో మునిగితేలుతున్న అజన్ గురించి కూడా ఈ ప్రపంచానికి తెలియాల్సిందే కదా.
Comments
Please login to add a commentAdd a comment