డబ్బు, స్టైలేకాదు.. ముందు విలువలుండాలి
ముంబయి: ఓ వ్యక్తి చూడ్డానికి చక్కగా కనిపించొచ్చు.. బాగా డబ్బు కలిగుండొచ్చు ఇంకా స్టైల్గా కూడా ఉండవచ్చు కానీ.. అలాంటి వ్యక్తికి మాత్రం మంచి ప్రవర్తన ఉండదని, ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా సరిగా తెలిసి ఉండదని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా అంది. తనది మంచి వ్యక్తిత్వం అనుకునే ప్రతి వ్యక్తి అది వాస్తవ జీవితంలోనూ, సామాజిక అనుసంధాన వేదికల్లోనూ ఒకే మాదిరిగా ఉండాలని చెప్పారు.
ట్విట్టర్లో ఆమె ఆదివారం వాస్తవ జీవితంలో, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తుల ప్రవర్తనలు, నడుచుకునే తీరు అనే అంశంపై చర్చ జరిపారు. చూడ్డానికి గొప్పగా కనిపించేవారి ప్రవర్తన తీరు సరిగా లేకుంటే ఇంకే ఉన్నా వ్యర్థమే అని చెప్పారు. సాధారణంగా జీవిస్తూ దయాగుణంతో, ఎదుటి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతోషంగా బతికేయాలని సెలవిచ్చింది ఈ అమ్మడు. అంతేకాకుండా చిన్నారులు కూడా విలువలు మర్చిపోతున్నారని, భారత్లో మెయిడ్ కల్చర్ పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.