విలువలతో కూడిన జీవితమే సాఫల్యానికి సోపానం | devotional information by Muhammad Usman Khan | Sakshi
Sakshi News home page

విలువలతో కూడిన జీవితమే సాఫల్యానికి సోపానం

Published Sun, Aug 26 2018 1:29 AM | Last Updated on Sun, Aug 26 2018 1:29 AM

devotional information by Muhammad Usman Khan - Sakshi

జీవితం విజయ పథంలో ముందుకు సాగాలంటే మానవులు కొన్ని విలువలు పాటించాలి. మంచీ చెడుల పట్ల విచక్షణ కనబరచాలి. నిజానికి ప్రతి ఒక్కరిలో ప్రాథమికంగా ఈ విలువలు నిక్షిప్తమై ఉంటాయి. కావలసిందల్లా వాటిని వెలికితీసి నిత్యజీవితంలో ఆచరణలో పెట్టగలగడమే. అంటే  జీవితంలోని అన్ని రంగాల్లో విలువలు పాటించగలగాలి. ఉద్యోగ రంగమైనా, వ్యాపారరంగమైనా, విద్యారంగమైనా, సామాజిక రంగమైనా, సాంస్కృతిక రంగమైనా, ఆర్ధిక రంగమైనా, ఆధ్యాత్మిక రంగమైనా, రాజకీయ రంగమైనా ప్రతి విషయంలో వీటిని ఆచరించాలి. సాధ్యమైనంతవరకు, శక్తివంచన లేకుండా విలువలతో కూడిన జీవితం గడపడానికి ప్రయత్నించాలి. ఎట్టిపరిస్థితిలోనూ ఇతరుల్ని తక్కువగా భావించకూడదు. మనతో ఏకీభవించని వారిపట్ల కూడా సద్భావనతోనే మెలగాలి. ఎందుకంటే అభిప్రాయ భేదాలన్నవి మానవ సమాజంలో సహజం. దాన్ని భూతద్దంలో చూడడమే విలువలకు వ్యతిరేకం అవుతుంది.

జీవితంలో ఏది సాధించాలన్నా ఈనాడు ధనమే ప్రధానమైపోయింది. మంచీ చెడు, న్యాయం అన్యాయం, విలువలు అని మడి కట్టుకుంటే ఈ ప్రాపంచిక పరుగు పందెంలో వెనుకబడి పోవడం ఖాయమన్నభావన బలపడింది. బాగా డబ్బు గడించి విలాసవంతమైన జీవితం గడుపుతున్నవారితో పోల్చుకొని నిరాశకు గురవుతూ ఉంటాం. ఇదే దురాశకు దారితీసి, జీవితంలో శాంతి లేకుండా చేస్తుంది. చట్టసమ్మతమైన, ధర్మబద్దమైనమార్గంలో ఎంత సంపాదించినా ఎవరికీ అభ్యంతరం ఉండదు.అది ఆమోదయోగ్యమే. అయితే సంపాదనే లక్ష్యంగా అడ్డమైన గడ్డికరుస్తూ దొడ్డిదారుల్లో సంపాదించాలనుకుంటే తరువాత చేదుఅనుభవాలను రుచి చూడవలసి ఉంటుంది. ఇలా సాధించిన సంపాదనా, సోపానాలు కేవలం తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు. అంతేకాదు, అది జీవితంలో అశాంతికి, అభద్రతకు, అపజయాలకు కారణమవుతుంది.

పేరు ప్రఖ్యాతుల కోసం, అధికారం హోదాలకోసం సంపాదనకు వక్రమార్గాలు అవలంబిస్తే ఖచ్చితంగా మనశ్శాంతి దూరమవుతుంది. విజయం దరిచేరినట్లనిపించినా అది నీటిబుడగతో సమానం. అసలు విజయం, నిజమైన శాంతి సంతృప్తి నైతిక విలువలతోనే సాధ్యం. ఇహలోక విజయమైనా, పరలోక సాఫల్యమైనా విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా మంచీ చెడుల విచక్షణా జ్ఞానంతో, ధర్మబద్దమైన జీవితం గడిపితేనే. అందుకే ముహమ్మద్‌ ప్రవక్త  మానవజీవితంలో నైతిక విలువలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చారు.

‘నైతికత, మానవీయ విలువల పరంగా మీలో ఎవరు ఉత్తములో వారే అందరికన్నా శ్రేష్టులని, ప్రళయ దినాన విశ్వాసి కర్మల త్రాసులో ఉత్తమ నడవడి కన్నా బరువైన, విలువైన వస్తువు మరొకటి ఉండదని’ అన్నారాయన. ప్రజల్ని ఎక్కువగా స్వర్గానికి తీసుకుపోయే కర్మలు ‘దైవభీతి, నైతిక విలువలే’ అని ఉపదేశించారు. కనుక నిత్యజీవితంలో అనైతికతకు, అక్రమాలకు, అమానవీయతకు తావులేకుండా సాధ్యమైనంత వరకు, విలువలతో కూడిన జీవితం గడపడానికి ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే సమాజంలో ఆదరణ, గౌరవం లభిస్తాయి. దేవుడుకూడా మెచ్చుకుంటాడు.మంచి ప్రతి ఫలాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్‌ మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement