మానవ తాత్వికతకు దర్పణం | Sakshi Guest Column On Human philosophy | Sakshi
Sakshi News home page

మానవ తాత్వికతకు దర్పణం

Published Sun, Oct 6 2024 12:21 AM | Last Updated on Sun, Oct 6 2024 12:21 AM

Sakshi Guest Column On Human philosophy

బాలగోపాల్‌ 2009 అక్టోబర్‌ 8న మరణించి ఇప్పటికి పదిహేనేళ్లు గడుస్తున్నా ఆయన ప్రాసంగికత కాలగమనాన్ని తట్టుకొని స్థిరంగా నిలబడే ఉన్నది. మనిషి ఉనికి, తాత్విక అర్థం, స్థూలంగా మానవ జీవితపు అంతరార్థం ఆయన వివరించినంత లోతుగా తెలుగునాట మరొకరు విశదీ కరించలేదన్నది అతిశయోక్తి కాదు. 

అంతరాలు నిండిన, అసమానతలతో కూడుకున్న సమాజం మనుషులకు వైకల్యంతో కూడిన ప్రాపంచిక దృక్పథాన్ని మాత్రమే అందించగలదనీ... సమానత్వ ప్రాతిపదికన, మనుషులను మనుషులుగా చూడగలిగే మానవీయ దృక్కోణాన్ని సంకల్పపూర్వకంగా అలవర్చుకోవా ల్సిందనీ బాలగోపాల్‌ నొక్కి వక్కాణించాడు. 

వైయక్తిక సంకల్పమే కాదు, సామాజిక ఆచరణ కూడా అంతే అవసరం అన్నాడు. ఈ సమానత్వ ప్రాపంచిక దృక్కోణాన్ని, మానవ ఆచరణను... సామాజిక నీతి నియమాలు, నిబంధనలు ఎంతగా ప్రభావితం చేస్తాయో కూడా తన రచనల ద్వారా వివరించాడు. 

ఒక్క మానవ తాత్వికతను మాత్రమే కాదు, దాని సామాజిక చలన సూత్రాలను, సామాజిక ఉద్యమాలలో దాని మూలాలను విశ్లేషించి విడదీయరాని సంబంధాన్ని నెలకొల్పిన ఉద్యమకారుడు కూడా ఆయనే. తన జీవితాన్ని ఈ సామాజిక తాత్విక దృక్పథానికి ఒక తిరుగులేని ప్రయోగశాలగా మార్చిన అరుదైన వ్యక్తి. 

సంక్లిష్టమైన భారత సామాజిక జీవితంలో అస మానతలు భిన్న పాయలుగా మన జీవితంలో పెన వేసుకు పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ అసమానతలను రూపు మాపటానికి చైతన్యపూరితంగా మనం చేయవలసిన కృషిని తను జీవించి ఉన్నంతకాలం మనకు తన జీవిత ఆచరణ ద్వారా మార్గదర్శనం చేశాడు. 

2024 ఆగస్ట్‌ 1న సుప్రీంకోర్టు వెలువరించిన ఎస్సీ వర్గీకరణ తీర్పులో సైతం ఆయన వాదనలను ఉటంకించటం దీనికి ఒకానొక ఉదాహరణ మాత్రమే. దళితులలో దళితులు అన్న పదం వాడగలిగిన ఏకైక వ్యక్తి ఆయన. వివక్ష ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్న తన సూక్ష్మ పరిశీలన ద్వారా దానిని పసి గట్టి ఆ వివక్ష తాత్విక మూలాల్ని సమాజానికి విశద పరిచిన వ్యక్తి బాలగోపాల్‌. 

వివక్ష అసలు అర్థం అసమానతేననీ, అది అసమానతను అనుభవిస్తున్న వర్గాల్లో సైతం ఆచరణలో ఉండగలదనీ, అక్కడ కూడా మనం సమానత్వ ప్రాతిపదికనే ఆ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుందనీ ఎలుగెత్తినవాడు ఆయన.

పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న దారుణ మారణకాండను చూసినప్పుడు ఇంత అమానవీయమైన హింసకాండకు కారణాలను ఆయన మనకు ఒక కొత్త కోణంలో, మానవీయ కోణంలో ఆవిష్కరించేవాడు అని మనం గుర్తు తెచ్చుకోకుండా ఉండలేము. 

తొలి రోజుల్లో వర్గ సిద్ధాంతపు ఆలోచనా ధోరణికి కొంత ప్రభావితమైనా మానవత్వపు విస్తృత పరిధి ఒక సిద్ధాంత చట్రంలో ఇమిడేది కాదనీ,  మానవత్వానికి నిర్వచనం మానవత్వంతో మాత్రమే ఇవ్వగలమనీ తన కార్యాచరణ ద్వారా గ్రహించిన ఆయన చివరికంటా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మాన వతను మానవీయ దృక్కోణంలోనే విస్తరించాడు. 

ప్రభుత్వం చేసే హింస మాత్రమే కాదు, దానికి తిరుగుబాటుగా వచ్చే ప్రతిహింస సైతం మానవ త్వానికి జవాబు దారీగా ఉండాలనీ, అలా కాని పక్షంలో అలాంటి ఉద్యమాలన్నీ రాజ్యానికి మరో అను కరణ మాత్రమే కాగలవనీ వివరించాడు బాలగోపాల్‌. 

అధికారం కేవలం రాజ్యం వద్దనో, ప్రభుత్వం వద్దనో మాత్రమే కాదు... సామాజిక ధోరణులలో, సంస్కృతులలో సైతం ఆధిపత్యాలు ఉండగలవనీ... ప్రజా జీవితంలో సైతం అసమానతలతో కూడిన సమాజాన్ని కొనసాగించడానికి అవసరమైన అధిప త్యాలు ఉండగలవనీ వాటికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయటం హక్కుల ఉద్యమపు బాధ్యత అని తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశమంతా కాలికి బలపం కట్టుకొని  ప్రచారం చేసిన వ్యక్తి బాలగోపాల్‌. 

ఆయన ఈరోజు లేకపోవచ్చు కానీ ఆయన తాత్విక దృక్పథం ఆయన రచనల ద్వారా అందుబాటులోనే ఉన్నది. తెలుగు సమాజం ఎదుర్కొంటున్న అనేక సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ సమస్యలకు ఆయన రచనలలో పరిష్కారాలు లభించ గలవు. 

అధికారాన్ని సందేహించనివారు హక్కుల కార్యకర్తలు కాజాలరు అన్న మాట ఆయనలోని నిండైన మానవత్వాన్ని ఆవిష్కరిస్తుంది. మానవీయ సమాజం కోసం, ప్రజాస్వామిక విలువల కోసం కృషి చేయడమే ఆయన జీవితాచరణ ద్వారా నిర్దేశించిన ఏకైక కర్తవ్యం.

– టి.హరికృష్ణ, మానవ హక్కుల వేదిక 
(నేడు హైదరాబాద్‌లో బాలగోపాల్‌ 15వ సంస్మరణ సదస్సు) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement