ethics
-
మానవ తాత్వికతకు దర్పణం
బాలగోపాల్ 2009 అక్టోబర్ 8న మరణించి ఇప్పటికి పదిహేనేళ్లు గడుస్తున్నా ఆయన ప్రాసంగికత కాలగమనాన్ని తట్టుకొని స్థిరంగా నిలబడే ఉన్నది. మనిషి ఉనికి, తాత్విక అర్థం, స్థూలంగా మానవ జీవితపు అంతరార్థం ఆయన వివరించినంత లోతుగా తెలుగునాట మరొకరు విశదీ కరించలేదన్నది అతిశయోక్తి కాదు. అంతరాలు నిండిన, అసమానతలతో కూడుకున్న సమాజం మనుషులకు వైకల్యంతో కూడిన ప్రాపంచిక దృక్పథాన్ని మాత్రమే అందించగలదనీ... సమానత్వ ప్రాతిపదికన, మనుషులను మనుషులుగా చూడగలిగే మానవీయ దృక్కోణాన్ని సంకల్పపూర్వకంగా అలవర్చుకోవా ల్సిందనీ బాలగోపాల్ నొక్కి వక్కాణించాడు. వైయక్తిక సంకల్పమే కాదు, సామాజిక ఆచరణ కూడా అంతే అవసరం అన్నాడు. ఈ సమానత్వ ప్రాపంచిక దృక్కోణాన్ని, మానవ ఆచరణను... సామాజిక నీతి నియమాలు, నిబంధనలు ఎంతగా ప్రభావితం చేస్తాయో కూడా తన రచనల ద్వారా వివరించాడు. ఒక్క మానవ తాత్వికతను మాత్రమే కాదు, దాని సామాజిక చలన సూత్రాలను, సామాజిక ఉద్యమాలలో దాని మూలాలను విశ్లేషించి విడదీయరాని సంబంధాన్ని నెలకొల్పిన ఉద్యమకారుడు కూడా ఆయనే. తన జీవితాన్ని ఈ సామాజిక తాత్విక దృక్పథానికి ఒక తిరుగులేని ప్రయోగశాలగా మార్చిన అరుదైన వ్యక్తి. సంక్లిష్టమైన భారత సామాజిక జీవితంలో అస మానతలు భిన్న పాయలుగా మన జీవితంలో పెన వేసుకు పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ అసమానతలను రూపు మాపటానికి చైతన్యపూరితంగా మనం చేయవలసిన కృషిని తను జీవించి ఉన్నంతకాలం మనకు తన జీవిత ఆచరణ ద్వారా మార్గదర్శనం చేశాడు. 2024 ఆగస్ట్ 1న సుప్రీంకోర్టు వెలువరించిన ఎస్సీ వర్గీకరణ తీర్పులో సైతం ఆయన వాదనలను ఉటంకించటం దీనికి ఒకానొక ఉదాహరణ మాత్రమే. దళితులలో దళితులు అన్న పదం వాడగలిగిన ఏకైక వ్యక్తి ఆయన. వివక్ష ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్న తన సూక్ష్మ పరిశీలన ద్వారా దానిని పసి గట్టి ఆ వివక్ష తాత్విక మూలాల్ని సమాజానికి విశద పరిచిన వ్యక్తి బాలగోపాల్. వివక్ష అసలు అర్థం అసమానతేననీ, అది అసమానతను అనుభవిస్తున్న వర్గాల్లో సైతం ఆచరణలో ఉండగలదనీ, అక్కడ కూడా మనం సమానత్వ ప్రాతిపదికనే ఆ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుందనీ ఎలుగెత్తినవాడు ఆయన.పాలస్తీనాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దారుణ మారణకాండను చూసినప్పుడు ఇంత అమానవీయమైన హింసకాండకు కారణాలను ఆయన మనకు ఒక కొత్త కోణంలో, మానవీయ కోణంలో ఆవిష్కరించేవాడు అని మనం గుర్తు తెచ్చుకోకుండా ఉండలేము. తొలి రోజుల్లో వర్గ సిద్ధాంతపు ఆలోచనా ధోరణికి కొంత ప్రభావితమైనా మానవత్వపు విస్తృత పరిధి ఒక సిద్ధాంత చట్రంలో ఇమిడేది కాదనీ, మానవత్వానికి నిర్వచనం మానవత్వంతో మాత్రమే ఇవ్వగలమనీ తన కార్యాచరణ ద్వారా గ్రహించిన ఆయన చివరికంటా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మాన వతను మానవీయ దృక్కోణంలోనే విస్తరించాడు. ప్రభుత్వం చేసే హింస మాత్రమే కాదు, దానికి తిరుగుబాటుగా వచ్చే ప్రతిహింస సైతం మానవ త్వానికి జవాబు దారీగా ఉండాలనీ, అలా కాని పక్షంలో అలాంటి ఉద్యమాలన్నీ రాజ్యానికి మరో అను కరణ మాత్రమే కాగలవనీ వివరించాడు బాలగోపాల్. అధికారం కేవలం రాజ్యం వద్దనో, ప్రభుత్వం వద్దనో మాత్రమే కాదు... సామాజిక ధోరణులలో, సంస్కృతులలో సైతం ఆధిపత్యాలు ఉండగలవనీ... ప్రజా జీవితంలో సైతం అసమానతలతో కూడిన సమాజాన్ని కొనసాగించడానికి అవసరమైన అధిప త్యాలు ఉండగలవనీ వాటికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయటం హక్కుల ఉద్యమపు బాధ్యత అని తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశమంతా కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేసిన వ్యక్తి బాలగోపాల్. ఆయన ఈరోజు లేకపోవచ్చు కానీ ఆయన తాత్విక దృక్పథం ఆయన రచనల ద్వారా అందుబాటులోనే ఉన్నది. తెలుగు సమాజం ఎదుర్కొంటున్న అనేక సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ సమస్యలకు ఆయన రచనలలో పరిష్కారాలు లభించ గలవు. అధికారాన్ని సందేహించనివారు హక్కుల కార్యకర్తలు కాజాలరు అన్న మాట ఆయనలోని నిండైన మానవత్వాన్ని ఆవిష్కరిస్తుంది. మానవీయ సమాజం కోసం, ప్రజాస్వామిక విలువల కోసం కృషి చేయడమే ఆయన జీవితాచరణ ద్వారా నిర్దేశించిన ఏకైక కర్తవ్యం.– టి.హరికృష్ణ, మానవ హక్కుల వేదిక (నేడు హైదరాబాద్‌లో బాలగోపాల్ 15వ సంస్మరణ సదస్సు) -
B20 Summit 2023: నైతిక ‘కృత్రిమ మేధ’ అత్యావశ్యం
న్యూఢిల్లీ: అధునాతన సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేథ(ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ)ను నైతికంగా వినియోగించాలని, లేదంటే విపరిణామాలు తప్పవని ప్రధాని మోదీ హెచ్చరించారు. నూతన సాంకేతికతలో నైతికత లోపిస్తే సమాజంపై ఏఐ ప్రతికూల ప్రభావాలు ఎక్కువ అవుతాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం ఢిల్లీలో కొనసాగుతున్న బీ–20(బిజినెస్ ఫోరమ్–20) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘ఏఐ వినియోగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి ఏకరూప మార్గనిర్దేశకాలు అవసరం. నిబంధనల చట్రం లేకుంటే క్రిప్టో కరెన్సీ వంటి అంశాల్లో సమస్యలు మరింత ఎక్కువ అయ్యే ప్రమాదముంది. పర్యావరణానికి హాని తలపెట్టని రీతిలో జీవన, వ్యాపార విధానాలకు పారిశ్రామిక వర్గాలు ప్రాధాన్యతనివ్వాలి. ఇందుకు వ్యాపారవర్గాలు, ఆయా దేశాల ప్రభుత్వాలు కలసి కట్టుగా ముందుకు సాగాలి’ ఆయన మోదీ కోరారు. ‘పర్యావరణ మార్పు, ఇంథన రంగంలో సంక్షోభం, ఆహార గొలుసులో లోపించిన సమతుల్యత, నీటి భద్రత వంటివి అంతర్జాతీయంగా వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యలకు దేశాలన్నీ ఉమ్మడిగా పరిష్కరించుకోవాలి’ అని ఆయన అభిలíÙంచారు. వ్యాపారవర్గాలు తమ వ్యాపార సంబంధ అంశాలను చర్చించేందుకు జీ20కి అనుబంధంగా ఏర్పాటుచేసుకున్న వేదికే బిజినెస్ 20(బీ20) ఫోరమ్. విధాన నిర్ణేతలు, వ్యాపారదిగ్గజాలు, నిపుణులుసహా జీ20 దేశాల ప్రభుత్వాలు ఉమ్మడిగా బీ20 ఇండియా తీర్మానంపై చర్చలు జరుపుతాయి. ఈ తీర్మానంలో 54 సిఫార్సులు, 172 విధానపర చర్యలు ఉన్నాయి. వీటిని సెపె్టంబర్ 9–10 తేదీల్లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో సమరి్పస్తారు. వారే ఆర్థికాభివృద్ధి చోదక శక్తులు ‘ప్రస్తుతం భారత్‌లో చాలా మంది పేదరికం నుంచి బయటపడి కొత్తగా ‘మధ్యతరగతి’ వర్గంలో చేరుతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘పేదరికాన్ని నిర్మూలిస్తూ కేంద్రం అవలంభిస్తున్న విప్లవాత్మక విధానాల కారణంగా మరో 5–7 ఏళ్లలో కోట్ల భారీ సంఖ్యలో మధ్యతరగతి జనాభా అవతరించనుంది. వీరే భారత ఆర్థికాభివృద్ధి చోదక శక్తులు. వీరే దేశంలో అతిపెద్ద వినియోగదారులు. కొంగొత్త ఆకాంక్షలతో శ్రమిస్తూ దేశార్థికాన్ని ముందుకు నడిపిస్తారు. ప్రభుత్వం పేదలను పై స్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తోంది. దీంతో ఆ తర్వాత లబ్ధిపొందేది మధ్యతరగతి, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల వర్గాలే. మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే వ్యాపారాలు వరి్ధల్లుతాయి. వ్యాపారాలు, వినియోగదారుల మధ్య సమతూకం సాధిస్తే లాభదాయ మార్కెట్ సుస్థిరంగా కొనసాగుతుంది. ప్రపంచ దేశాలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. వినియోగ దేశాలు బాగుండాలంటే వస్తూత్పత్తి దేశాలను పట్టించుకోవాలి. లేదంటే వస్తూత్పత్తి దేశాలు కష్టాల కడలిలో పడతాయి. అందుకే ఏటా అంతర్జాతీయ వినియోగ సంరక్షణ దినం జరుపుకుందాం’ అని వ్యాపార వర్గాలకు మోదీ పిలుపునిచ్చారు. -
సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?
ఏదైనా వ్యాపారంలో రాణించాలంటే నైతికత, నిబద్ధత చాలా అసవరం. కానీ చాలా సంస్థలు దీన్ని పెద్దగా పట్టించుకోవు. కానీ రతన్ టాటా ఆధ్వర్యంలోని టాటా గ్రూప్, తమ కార్పొరేట్ పాలనలో, వ్యాపారం చేసే విధానంలో నైతికతను తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తుంది. ఇటీవలికాలంలో కంపెనీ సుదీర్ఘ చరిత్రలో తొలిసారి చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్ నియమించుకుంది. తాజాగా హెచ్డీఎఫ్సీ ఈ కోవలో చేరింది. కంపెనీ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్‌గా మాజీ ఈడీ అధికారి ప్రసూన్ సింగ్‌ను నియమించింది. అసలు ఏవరీ ప్రసూన్ సింగ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్ పోస్టును సృష్టించి మరీ ప్రసూన్ సింగ్‌కు కీలక పోస్ట్‌ను ఇవ్వడం విశేషం. రూ. 9,24,235 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న బ్యాంకుకు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా ఉన్న ప్రసూన్ సింగ్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్‌గా ఎలా ఎదిగారు. (సల్మాన్ బ్రాండ్ న్యూ బుల్లెట్ ప్రూఫ్ కార్: ఇంటర్నెట్లో వీడియో హల్చల్) ప్రసూన్ సింగ్ ఎవరు? బిహార్‌లోని ముజఫర్ లోని సెయింట్ జేవియర్స్ స్కూల్ నుండి పాఠశాల విద్యను,. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత ఇక్కడ నుంచే బీఏ ఆనర్స్ చేశారు. నవీ ముంబైలోని సీఎస్ఎంయూలో న్యాయశాస్త్రం అభ్యసించారు. అతను MIT స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో మేనేజ్మెంట్ నేర్చుకున్నారు. (రోజుకు కేవలం రూ.73: యాపిల్ ఐఫోన్ 12మినీ మీ సొంతం!) ప్రసూన్ సింగ్ కరియర్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్ మెంట్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అతను ముంబైలో పోస్టింగ్ పొందారు. ఏడేళ్లు పనిచేసిన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)కి వెళ్లారు. ఆతరువాత ఏడేళ్లకు పైగా ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు. జూలై 2013ల ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌గా చేరారు. నాలుగేళ్ల తర్వాత ప్రైవేట్ రంగంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా చేరారు. అక్కడ కూడా ఏడేళ్లపాటు ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు. దీని తర్వాత, అతను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదా ఈడీకి మారారు. అక్కడ కూడా సుమారు నాలుగేళ్లపాటు అధికారిగా పనిచేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సివో)గా, 9సంవత్సరాల 9 నెలలకు పైగా హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సేవలందించారు ప్రసూన్. తాజాగా బ్యాంక్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్‌గా ఎంపియ్యారు. ♦ 2009, నవంబరు నుంచి జూలై 2013 మధ్య ఈడీ అధికారిగా ♦ 2002 జూలై - 2009 నవంబర్ మధ్య ఇంటెలిజెన్స్ అధికారి ♦ 1995 మే- 2002 జూలై మధ్య ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నైతికత గురించి రతన్ టాటా ఏమన్నారంటే కంపెనీలు లాభాలు ఆర్జించడం తప్పు కాదు, ఈ పనిని నైతికంగా చేయడం కూడా అవసరమని టాటా గ్రూప్ ఎమిరిటస్ చైర్మన్ రతన్ టాటా నమ్ముతారు. లాభం పొందడానికి మీరు ఏమి చేస్తున్నారో ఈ ప్రశ్న చాలా ముఖ్యమనీ. లాభాలను ఆర్జిస్తున్నప్పుడు, కస్టమర్లు వాటాదారులకు ఎలాంటి ప్రయోజ నాందిస్తున్నామో కంపెనీలు గుర్తుంచు కోవడం కూడా ముఖ్యం. అలాగే ప్రస్తుత పరిస్థితిలో, నిర్వాహకులు తాము తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవా? కాదా? అని తమను తాము ప్రశ్నించు కోవాలి. కంపెనీ ఎక్కువ కాలం మనుగడ సాగించదని, అది ఉద్యోగుల పట్ల సున్నితంగా ఉండదని కూడా ఆయన అన్నారు. వ్యాపారం గురించి తన ఆలోచనను వివరిస్తూ, వ్యాపారం అంటే లాభాలు సంపాదించడం మాత్రమే కాదని అన్నారు. మీతో అనుబంధం ఉన్న వాటాదారులు, కస్టమర్లు, ఉద్యోగుల ప్రయోజనాలు చాలా ముఖ్యమని రతన్ టాటా చెబుతారు. (అమెరికా ఫైనాన్స్‌లో ఇండో-అమెరికన్ మహిళల సత్తా) -
కామన్ ఎంట్రన్స్‌తో నైతికత ఉన్న విద్యార్థులు దొరక్కపోవచ్చు: సీజేఐ
పణాజి: నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్(సీఎల్ఏటీ) ద్వారా సరైన నైతికత ఉన్న విద్యార్థులు దొరక్కపోవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఎల్లప్పుడూ పరీక్షల్లో ఉత్తీర్ణతకే తప్ప, విలువ ఆధారిత విద్యను ప్రోత్సహించకపోవడమే ఇందుకు కారణం కావచ్చని ఆయన చెప్పారు. శనివారం ఆయన గోవాలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొదటి విద్యా సంవత్సరం సెషన్‌ను ప్రారంభించి మాట్లాడారు. -
పత్రికల్లో పాతతరం విలువలు రావాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
సాక్షి, నెల్లూరు: ‘ ప్రస్తుతం రాజకీయాలు చూస్తే రోతపుడుతున్నాయి. అలాగే పత్రికల్లోనూ విలువలు దిగజారిపోయి సంచలనాల కోసం ఒక వర్గానికే కొమ్ముకాస్తున్నాయి. అన్ని పత్రికలు చదివితే కానీ వాస్తవాలు తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. పత్రికల్లో పాతతరం విలువలు రావాలి’ అని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్‌లో జరిగిన లాయర్ వారపత్రిక 40 వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసగించారు. రాను రాను పత్రికల విలువల్లో మార్పు వస్తోందని ఇది కొందరికే వర్తించే అంశమే అయినా ఈ దిశగా ప్రతి పాత్రికేయుడు ఆలోచించాలని సూచించారు. పాలిటిక్స్, జర్నలి జం, మెడిసిన్ ఈ మూడు వ్యాపార ధోరణిలోకి పోకూడదని.. కానీ ఆ మూడు వ్యాపార దోరణీలోనే ఉన్నాయన్నారు. పాత్రికేయ రంగంలో నార్ల వెంకటేశ్వరరావు లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రతిపక్షపాత్ర పోషించాల్సిన బాధ్యత పత్రికలపై ఉందన్నారు. నెల్లూరులో పులిబొంగరాల న్నా... శెట్టెమ్మ దోశెలన్నా.. ట్రంకురోడ్డులో తెలిసిన వారితో తిరగాలన్నా.. తనకెంతో ఇష్టమని ఈ పదవుల వల్ల అక్కడికి వెళ్లి తినలేని పరిస్థితి ఉందని వెంకయ్య నాయుడు అన్నారు. కరోనా సమయంలో అశువులు బాసిన జర్నలిస్టుల స్మృతికి నివాళులు అర్పించారు. డీఆర్డీవో చైర్మన్ జి.సతీష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, శాంతా బయోటెక్ ఎండీ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ కొల్లి శ్రీనాథ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. స్వప్నకు తుంగా అవార్డు తుంగా రాజగోపాల్‌రెడ్డి జ్ఞాపకార్థం ప్రతిఏటా ఇచ్చే అవార్డుకు ఈ ఏడాది ప్రముఖ జర్నలిస్టు స్వప్నను ఎంపిక చేసి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఇచ్చారు. వీఆర్ కళాశాల పూర్వ అధ్యాపకుడు రామచంద్రరావును సన్మానించారు. పుస్తకావిష్కరణ.. లాయర్ వారపత్రిక సంపాదకుడు తుంగా ప్రభాత్‌రెడ్డి (ప్రభు) రచించిన ‘‘విజయపథంలో నెల్లూరీయులు’’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. -
న్యాయమూర్తులకు నైతికతే కీలకం
న్యూఢిల్లీ: సమాజంలో న్యాయమూర్తులు అత్యున్నత నైతిక స్థలాన్ని ఆక్రమిస్తారని, న్యాయ కల్పనపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడంలో వీరు ఎంతదూరమైనా వెళ్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏస్థాయిలోని న్యాయమూర్తైనా అత్యున్నత ప్రమాణాలను ఆచరించాలని తెలిపింది. సివిల్ జడ్జిగా నియమించేందుకు తాను అనర్హుడినంటూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు న్యాయమూర్తి, నైతికతపై వ్యాఖ్యలు చేసింది. పిటీషనర్‌పై కొన్ని ఎఫ్ఐఆర్లు దాఖలైనట్లు, కొన్నికేసుల్లో రాజీ కుదుర్చుకున్నట్లు గమనించామని కోర్టు తెలిపింది. ఏ కేసులో శిక్ష పడనందున ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను పక్కనబెడుతున్నట్లు తెలిపింది. సివిల్ జడ్జి పోస్టుకు సరైనవారిని ఎంపిక చేయడం హైకోర్టు బాధ్యతని, కానీ ఈ సందర్భంలో హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. చదవండి: ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ -
సంతోషమే సంపూర్ణ బలం
మార్చి 20 ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సందర్భంగా సంతోషం గురించి కొన్ని విశేషాలు... సంతోషమే సగం బలం అని నానుడి. నిజానికి మనుషులకు సంతోషమే సంపూర్ణ బలం. సంతోషం ఒక మానసిక స్థితి. సంతోషంగా బతకాలని మనుషులంతా కోరుకుంటారు. జీవితం పట్ల సంతృప్తి, అవసరాలకు తగినంత సంపద, ఆరోగ్యం, జీవన భద్రత వం టి చాలా అంశాలు మనుషుల సంతోషానికి దోహదపడతాయి. ‘మనుషులు తమ కోసం తాము కోరుకునే ఒకే ఒక్క అంశం సంతోషం మాత్రమే’ అని అరిస్టాటిల్ వెల్లడించాడు. క్రీస్తుపూర్వం 350 ఏళ్ల నాడే తాను రచించిన ‘నికోమాషెన్ ఎథిక్స్’ గ్రంథంలో సంతోషం గురించి విపులంగా చర్చించాడు. సంతోషభరితమైన జీవితమే ఉత్తమమైన జీవితమని తేల్చి చెప్పాడు. సంతోషం గురించి తత్వవేత్తలు, మత బోధకులు క్రీస్తుపూర్వం నాటి నుంచే రకరకాల సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ప్రపంచంలోని మతాలూ శాస్త్రాలూ కూడా సంతోషం గురించి రకరకాల సిద్ధాంతాలను ప్రతిపాదించాయి. ఆధునికుల్లో పంతొమ్మిదో శతాబ్దికి చెందిన బ్రిటిష్ తత్వవేత్త జాన్ స్టూవర్ట్ మిల్ ‘మానవుల చర్యలకు సంతోషమే పరమావధి’ అని చెప్పాడు. ‘మనిషి అంతిమ లక్ష్యం సంతోషమే’నని పంతొమ్మిదో శతాబ్దికి చెందిన జర్మన్ తత్వవేత్త ఫ్రెడెరిక్ నీషే అభిప్రాయపడ్డాడు. సంతోషం గురించి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, అవేవీ సంతోషానికి స్పష్టమైన నిర్వచనాలు కావు. సంతోషం ఒక భావన. సంతోషం ఒక అనుభూతి. సంతోషం ఒక అనుభవం. ఎవరి సంతోషం వారిదే. ఒకరికి సంతోషం కలిగించేది మరొకరికి సంతోషం కలిగించలేకపోవచ్చు. సంతోషం గురించి శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా రకరకాల పరిశోధనలు సాగిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం మాత్రం ప్రజల సంతోషంపై ఆలస్యంగా దృష్టి సారించింది. ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో సంతోషం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఇరవైఒకటో శతాబ్దిలోని మొదటి దశాబ్ది గడచిన తర్వాత మాత్రమే నడుం బిగించి, చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగానే ఐక్యరాజ్య సమితి 2012 నుంచి ఏటా ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’ విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా 2018లో విడుదల చేసిన నివేదికలోని మొత్తం 156 దేశాల జాబితా ప్రకారం భారత్ 133వ స్థానంలో ఉంది. మన ప్రభుత్వాలు అభివృద్ధి గురించి ఎన్ని ప్రగల్భాలు చెప్పుకుంటే మాత్రం లాభమేముంది? మన దేశ జనాభాలో అత్యధికులు సంతోషంగా లేరనే వాస్తవాన్ని ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’ తేటతెల్లం చేస్తోంది. మానవ జీవితానికి అంతిమ ధ్యేయం సంతోషమేనని అద్వైతం బోధిస్తోంది. భౌతిక సుఖాలేవీ శాశ్వత సంతోషాన్ని ఇవ్వలేవని, ఆత్మ పరమాత్మల మధ్య అభేదాన్ని గుర్తించినప్పుడే శాశ్వత ఆనందం లభిస్తుందనేది అద్వైత సిద్ధాంతం. యోగ సూత్రాలను రచించిన పతంజలి తన గ్రంథంలో సంతోషానికి గల మానసిక, అధిభౌతిక కారణాలను విపులంగా విశ్లేషించాడు. సద్గుణాలు, సత్కార్యాలు, సంగీతం మనిషికి సంతోషాన్ని కలిగిస్తాయని చైనాకు చెందిన కన్ఫ్యూషియస్ మత గురువు మిన్సియస్ అభిప్రాయపడ్డాడు. దైవారాధనలో సంతోషమే కీలకమని, దైవారాధన చేసేటప్పుడు అందరూ సంతోషంగా ఉండాలని, సంతోషభరితమైన గీతాలతో దైవాన్ని ప్రార్థించాలని యూదు మతం బోధిస్తోంది. మానవ జీవితానికి చరమ లక్ష్యం సంతోషమేనని క్రీస్తుశకం నాలుగో శతాబ్దికి చెందిన క్రైస్తవ బోధకులు సెయింట్ అగస్టీన్, సెయింట్ థామస్ అక్వినాస్లు అభిప్రాయపడ్డారు. ఇస్లాం కూడా సంతోషానికి తగిన ప్రాధాన్యమిచ్చింది. క్రీస్తుశకం పదకొండో శతాబ్దికి చెందిన సూఫీ గురువు అల్ ఘజలీ ఏకంగా ‘ఆల్కెమీ ఆఫ్ హ్యాపీనెస్’ అనే గ్రంథాన్నే రచించాడు. ‘యునైటెడ్ స్టేట్స్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్’ ప్రకటనను 1776లో రాసిన థామస్ జెఫర్సన్, సంతోషం కోసం ప్రయత్నించడం మనుషులకు గల విశ్వజనీనమైన హక్కుగా గుర్తించాడు. ఇదిలా ఉంటే, మత విశ్వాసాలు లేని వాళ్లతో పోలిస్తే, మత విశ్వాసాలు ఉన్న వాళ్లే ఎక్కువ సంతోషంగా ఉంటున్నట్లు ‘వరల్డ్ వాల్యూ సర్వే’ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ నిపుణులు 1981 నుంచి 2014 వరకు సుదీర్ఘకాలం నిర్వహించిన అధ్యయనంలో బయటపడిన వాస్తవాలతో రూపొందించిన నివేదిక అది. ఆ నివేదిక ప్రకారం యవ్వనంలో ఆరోగ్యంగా ఉన్నవాళ్లు, పరిమితమైన ఆకాంక్షలు కలిగిన వాళ్లు, పనికి తగిన ప్రతిఫలం పొందుతున్న వాళ్లు, చేస్తున్న పనిలో సంతృప్తి పొందుతున్న వాళ్లు, వైవాహిక బంధంలో ఉన్నవాళ్లు, ఆత్మగౌరవం నిలుపుకొనే వాళ్లు, జీవితం పట్ల ఆశావహ దృక్పథం ఉన్న వాళ్లు సంతోషంగా ఉంటున్నట్లు తేలింది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్–2018 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్–2018లోని మొదటి పది స్థానాల్లో అగ్రరాజ్యాలేవీ చోటు దక్కించుకోకపోవడం గమనార్హం. ఈ జాబితాలో అమెరికా 18వ స్థానంలోను, బ్రిటన్ 19వ స్థానంలోను నిలిచాయి. అత్యధిక జనాభా గల చైనా 86వ స్థానంలో నిలిచింది. మన పొరుగు దేశాల్లో పాకిస్తాన్ 75వ స్థానంలోను, నేపాల్ 101 వ స్థానంలోను, బంగ్లాదేశ్ 115వ స్థానంలోను, శ్రీలంక 116వ స్థానంలోను, మయాన్మార్ 130వ స్థానంలోను నిలిచాయి. ఒకప్పుడు ఈ జాబితాలో టాప్–10లో చోటు దక్కించుకున్న భూటాన్ ఈసారి 97వ స్థానానికి దిగజారింది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్–2018 ప్రకారం మన పొరుగు దేశాలే మన కంటే మెరుగ్గా ఉన్నాయి. సంతోషం అంటేనే హడలు ప్రపంచంలోని మనుషులంతా సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. ఇది నిర్వివాదాంశమే అయినా, అతి అరుదుగా కొందరు ఉంటారు. సంతోషంగా ఉండాలంటేనే వాళ్లు భయంతో హడలిపోతారు. సంతోషం అంటేనే భయపడటం ఒక మానసిక రుగ్మత. దీనినే మనస్తత్వ శాస్త్ర పరిభాషలో ‘కీరో ఫోబియా’ అంటారు. అలాగని కీరోఫోబియాతో సతమతమయ్యే వాళ్లంతా నిత్యం విషాదంలో మునిగి ఉంటారనుకుంటారేమో! అలాంటిదేమీ ఉండదు. వాళ్లు ఇతరత్రా మామూలుగానే ఉంటారు. అయితే, సంతోషాన్ని కలిగించే సందర్భాలను మాత్రం వీలైనంత వరకు నివారిస్తూ ఉంటారు. సంతోషంతో తుళ్లుతూ ఉల్లాసంగా గడిపే మిత్రబృందాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ ఉంటారు. ఆనంద రసాయనాలు మెదడులోని ఒక ప్రాంతం ఆనందానికి కేంద్రం. సంతోషాన్ని కలిగించే ఎండార్ఫిన్ వంటి జీవరసాయనాలు అక్కడి నుంచే ఉత్పత్తవుతూ ఉంటాయి. ఆనందాన్ని కలిగించే ఒక రసాయనాన్ని మెకలమ్ అనే శాస్త్రవేత్త 1992లో కనుగొన్నాడు. దానికి ‘ఆనందమైడ్’ అని పేరు పెట్టారు. సంతోషానికి కారణమయ్యే మరిన్ని రసాయనాలనూ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎన్– ఆరాకిడోనోయల్ డోపమైన్, నలడోయిన్, ఆరాకిడోనోయల్ గ్లిసరాల్, వైరోడమైన్ వంటి రసాయనాలు మెదడులో స్రవిస్తూ ఉంటాయి. ఇతరులకు సాయం చేసినప్పుడు, చేసిన మంచి పనుల వల్ల ప్రశంసలు పొందినప్పుడు, ఏదైనా విజయం సాధించినప్పుడు మెదడులో ఇలాంటి రసాయనాలు స్రవిస్తుంటాయి. ఇవి ఆనందాన్ని కలిగిస్తాయి. ఇవి కలిగించే ప్రభావాలనే కొన్ని రకాల మొక్కల ఉత్పత్తులు, కృత్రిమ రసాయనాల ద్వారా కూడా పొందవచ్చు. వీటి ద్వారా భ్రమాజనిత సంతోషం, చెప్పనలవి కాని ప్రశాంతత కలుగుతాయి. ఇవి ఉత్సాహాన్ని పెంచుతాయి. బాధను తగ్గిస్తాయి. వీటిని ఉపయోగించాక ఆకలి పెరుగుతుంది. మొక్కల ఉత్పత్తులు, రసాయన ఔషధాల ద్వారా పొందే ఆనందానుభూతి తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. మళ్లీ మళ్లీ అదే ఆనందానుభూతిని పొందాలనుకునేవారు గంజాయి, నల్లమందు వంటి మొక్కల ఉత్పత్తులను, ఓపియాయిడ్స్, ఎండార్ఫిన్స్, డైనార్ఫిన్స్ వంటి కృత్రిమ రసాయన ఔషధాలను తరచుగా తీసుకుంటూ ఉంటారు. ఇవి తాత్కాలికంగా ఆనందం కలిగించినా, వీటికి బానిసలై దీర్ఘకాలం వాడుతూ పోతే ఇవి ఆరోగ్యంపై నానా దుష్ప్రభావాలు చూపి, జీవితంలోని ఆనందాన్ని మొత్తంగా హరించేస్తాయి. అకాల మరణానికి దారితీస్తాయి. అందువల్ల తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే కృత్రిమ పద్ధతుల జోలికి పోకుండా సహజసిద్ధంగా సంతోషం పొందడమే మేలు. సంతోషాన్నిచ్చే ముఖ్యాంశాలు ఆధ్యాత్మిక చింతన కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అయిన వారి ఆదరాభిమానాలు ఇతరుల పట్ల సానుకూల ప్రవర్తన ఇతరులకు సాయం చేసే ధోరణి ఇష్ట సంభాషణలు కృతజ్ఞతా భావన మంచి వ్యాపకాలతో కాలక్షేపం సంతోషం వల్ల లాభాలు రోగ నిరోధక శక్తి పెరుగుదల బాధల నుంచి సత్వర ఉపశమనం పనితీరులో మెరుగుదల దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం విజయ సాధనమానసిక స్థైర్యం అవరోధాలను అధిగమించే శక్తి మెరుగైన సామాజిక సంబంధాలు ఆనందం గురించి అవీ ఇవీ... ఆనందం కూడా ఆవులింతల్లాగానే ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది. మూడ్ బాగోలేకుంటే ఆనందంగా కాలక్షేపం చేసే మిత్రుల దగ్గరకు వెళ్లండి. మనసు తేలిక పడుతుంది. వాళ్ల ఆనందం మీకూ అంటుకుంటుంది. మనసంతా సంతోషంతో నిండిపోతుంది. సంతోషం ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా వ్యాపిస్తుందని పదేళ్ల కిందట ‘టైమ్’ మ్యాగజీన్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.చదువు సంధ్యలు లేనివాళ్లతో పోలిస్తే విద్యావంతులే కొంత ఎక్కువ సంతోషంగా ఉంటారు. చదువుకునేటప్పుడు చదువు తక్షణమే సంతోషం కలిగించకపోయినా, ఆ తర్వాత జీవితంలో సంతోషానికి ఇతోధికంగా దోహదపడుతుందని ‘ఫౌండేషన్స్ ఆఫ్ హెడోనిక్ సైకాలజీ’ అధ్యయనంలో తేలింది.డబ్బుతో సంతోషాన్ని కొనలేమని చాలామంది అపోహ పడతారు గాని, సంతోషం పొందటానికి డబ్బు కూడా ఒక ముఖ్య సాధనం. అయితే, డబ్బును ఎలా ఖర్చు చేశామనే దానిపై సంతోషం స్థాయి ఆధారపడి ఉంటుంది. వస్తువులను కొనడానికి డబ్బు వెచ్చించడం కంటే అనుభవాలు పొందటానికి డబ్బు వెచ్చించడం ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన మార్కెటింగ్ సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ లిల్లీ జామ్పోల్ నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది.అన్నీ వేదాల్లోనే ఉన్నాయనేది పాతకాలం అపోహ. అన్నీ జన్యువుల్లోనే ఉన్నాయనేది ఈనాటి వాస్తవం. ఆనందం కూడా అందుకు మినహాయింపు కాదు. యూనివర్సిటీ కాలేజ్ లండన్ సైకాలజీ ప్రొఫెసర్ పీటర్ ఫోనగీ చేపట్టిన పరిశోధనల్లో మనుషుల్లోని సంతోషం స్థాయికి జన్యువులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలింది.ఆనందం ఆయువును పెంచుతుంది. దిగులుగా రోజులు వెళ్లదీసే వారితో పోలిస్తే, సంతృప్తిగా సంతోషంగా ఉండేవారు ఎక్కువకాలం బతుకుతారని కాలిఫోర్నియా అలమెడా కౌంటీలో అమెరికన్ శాస్త్రవేత్తలు దాదాపు మూడు దశాబ్దాల పాటు నిర్వహించిన సుదీర్ఘ పరిశోధనలో వెల్లడైంది. సంతోషంగా ఉండేవాళ్లు సంతోషంగా లేనివారి కంటే దాదాపు ఏడేళ్ల నుంచి పదేళ్ల కాలం ఎక్కువగా బతుకుతారని ఆ పరిశోధనతో వెలుగులోకి వచ్చింది. ఆనందంపై అపోహలు వాస్తవాలు ఆనందంపై చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయి. నిజానికి అవేవీ అంతగా ఆనందాన్ని ఇచ్చేవి కాదు. ఒకవేళ అవి కాస్త ఆనందాన్ని ఇచ్చినా, ఆ ఆనందం చాలా తాత్కాలికమైనదే. అపోహ: నిర్దేశిత లక్ష్యాలను సాధించడం ద్వారా సంతోషం పొందవచ్చు. వాస్తవం: నిర్దేశిత లక్ష్యాలను సాధించినప్పుడు దొరికే సంతోషం చాలా తాత్కాలికమైనది. ఒక లక్ష్యం సాధించిన తర్వాత మరో లక్ష్యం మన ముందుకు వస్తూనే ఉంటుంది. అది మరింత కఠినమైన సవాళ్లతో కూడుకున్న లక్ష్యమైతే ఇదివరకటి లక్ష్య సాధన ద్వారా దొరికిన సంతోషం ఆవిరైపోవడానికి ఎంతోసేపు పట్టదు. లక్ష్య సాధన ద్వారా సంతోషం పొందడం కంటే లక్ష్యాలను సాధించే ప్రక్రియను ఆస్వాదించడాన్ని అలవాటు చేసుకుంటేనే మనుషులు ఎక్కువ సంతోషంగా ఉండగలుగుతారని అమెరికన్ మార్కెటింగ్ సైకాలజీ నిపుణురాలు స్టేసీ కాప్రియో చెబుతున్నారు. అపోహ: వయసు పెరిగే కొద్ది తగ్గే సంతోషం వాస్తవం: వయసు పెరిగే కొద్దీ సంతోషం తగ్గుతుందని అంతా అనుకుంటారు. అమాయకమైన బాల్యంలో నిజంగానే సంతోషం స్థాయి ఎక్కువగానే ఉంటుంది. యవ్వనంలోనూ ఆనందం ఉంటుంది. నడి వయసుకొచ్చే సరికి బాధ్యతల భారం నెత్తిన పడుతుంది. ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటే మొదలవుతాయి. మానసిక ఒత్తడి పెరిగి సంతోషంగా ఉండే సందర్భాలు చాలా వరకు తగ్గిపోతాయి. రిటైరైన తర్వాత కాస్త ఆరోగ్యంగా ఉంటే చాలు, విశ్రాంత జీవితాన్ని ఆనందంగా గడపడం అసాధ్యమేమీ కాదు, నిజానికి విశ్రాంత జీవితంలోనే వృద్ధులు దాదాపు చిన్నపిల్లలంత సంతోషంగా ఉండగలుగుతారని అమెరికన్ మనస్తత్వ నిపుణురాలు డయానే ల్యాంగ్ చెబుతున్నారు. -
కనుమరుగు కావడం సహజం!
అది కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతం. విజేతలైన వీరులు చివరి రోజు రాత్రి శత్రు శిబిరంలో విశ్రమించాలన్న ఆనాటి ఆచారం మేరకు పాండవులను వెంటబెట్టుకుని కౌరవుల శిబిరం వద్దకు వెళ్ళాడు కృష్ణుడు. తరువాత కృష్ణుడు అర్జునుని ఉద్దేశించి, ‘‘అర్జునా! నీవు గాండీవాన్ని, ఇతర ఆయుధాలను తీసుకుని రథం నుంచి కిందికి దిగి దూరం వెళ్లు’’ అని ఆదేశించాడు. అర్జునుడు అణుమాత్రం సందేహించకుండా గాండీవం, ఇతర ఆయుధాలను తీసుకుని రథం దిగాడు. కృష్ణుడు కూడా ఇన్నాళ్లు సారథిగా తన చేతిలో ఉన్న చర్నాకోలను, గుర్రాల కళ్ళాలకు వేసే పగ్గాలను అక్కడే వదిలేసి రథం మీద నుంచి కిందికి ఎగిరి దూకాడు. కృష్ణుడు రథం నుంచి దూకిన మరుక్షణమే హనుమంతుడు నిలిచి ఉన్న ధ్వజ కేతనం అంతరిక్షంలోకి ఎగురుతూ పోయి అదృశ్యమైంది. పాండవులు ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తుండగానే, రథంలో అగ్ని జ్వాలలు చెలరేగి, క్షణాల్లో రథం కాస్తా బూడిద కుప్పగా మిగిలింది. ఆ దృశ్యాన్ని చూసి అర్జునుడు తట్టు్టకోలేకపోయాడు. ఖాండవ దహన సమయంలో అగ్నిదేవుడు అర్జునుడికిచ్చిన కానుక ఆ రథం. అప్పటి నుంచి అర్జునునికి, ఆ రథానికి విడదీయరాని సంబంధం ఏర్పడింది. అలాంటి రథం దగ్ధం కావడంతో అర్జునుడు అప్రతిభుడయ్యాడు. అతి కష్టం మీద కన్నీటిని అపుకుంటూ, ‘‘కృష్ణా! ఎందుకిలా జరిగింది? శత్రు భీకరమైన ఈ రథం ఎందుకిలా ...’’ ఆ పై మాట్లాడాలంటే గొంతు పెగలలేదు అర్జునుడికి. కృష్ణుడు తన సహజశైలిలో చిరునవ్వు రువ్వాడు. ‘‘అర్జునా! ఇది అసామాన్యులైన భీష్మద్రోణాదులు, ఇతర వీరుల భయంకరాస్త్రాల ప్రభావానికి గురైంది. నేను సారథిగా ఉండి అన్ని అస్త్రాల శక్తిని అణచి ఉంచాను. నీవు సురక్షితంగా బయటపడ్డా్డవు. కథ ముగిసిపోయింది. చివరగా నేను దిగి పోగానే ఆ అస్త్రాల శక్తిని వదలడంతో అది కాలి దగ్ధమైంది. ఇక దానితో నీకు పని లేదు. నిర్దేశిత కార్యం కోసం వచ్చిన అవతార పురుషులు, వస్తువులు ఆ కార్యం పూర్తి కాగానే కనుమరుగు కావడం సహజం. ఆ కోవలోనే ఆ రథం తన కర్తవ్యాన్ని నిర్వహించి అదృశ్యమైంది. పుట్టిన ప్రతి జీవికి నిశ్చితమైన లక్ష్యం, కార్యకలాపాలు ఉంటాయి. తన లక్ష్యం సాధించుకున్న తర్వాత ఆ జీవితో ప్రపంచానికి గాని, ప్రపంచానికి ఆ జీవితో గానీ అవసరం ఉండదు. అప్పుడు భూమిని విడిచి వెళ్లిపోతాడు. లేకపోతే భూమికి భారమే కదా ఇక. కాబట్టి నీవు ఈ విషయాన్ని గుర్తుంచుకో. రథం కోసం దుఃఖించకు’’ అని ఊరడించాడు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవల్సిన నీతి. – డి.వి.ఆర్. భాస్కర్ -
మొక్కు'బడి విలువలు'
రాయవరం (మండపేట): నేటి ఆధునిక సమాజంలో నైతికత–మానవ విలువలు, పర్యావరణ విద్య ప్రాధాన్యత అంశాలుగా గుర్తించి ఇంటర్ విద్యలో పాఠ్యాంశంగా చేర్చారు. ఏటా ఈ అంశాలపై నిర్వహిస్తున్న పరీక్షల తీరు మొక్కుబడిగా మారిపోతోందనే విమర్శలున్నాయి. చాలా కళాశాలల్లో ఈ అంశాలపై బోధన మాటే ఉండడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వకుండానే పరీక్షలు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది విద్యాశాఖ పలు సంస్కరణలకు చర్యలు తీసుకుంటున్నా.. అవి ఎంత వరకు సఫలం అవుతాయన్నది ప్రశ్నార్థ్ధకమే. నైతిక విలువల సుగంధాలను అద్దేందుకే.. పెరిగి పోతున్న పాశ్చాత్య పెడ ధోరణుల్లో విద్యార్థి లోకానికి నైతిక విలువల సుగంధాన్ని అందించేందుకు రాష్ట్ర మానవ వనరుల శాఖ 2015 నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ‘నైతికత–మానవ విలువలు’, పర్యావరణం అనే పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టారు. ఈ నెల 27న నైతిక, మానవ విలువలు, 29న పర్యావరణ విద్యపై పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష పాసై తీరాలి... ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశ పెట్టిన ఈ పరీక్షలో విద్యార్థి ఉత్తీర్ణత కాకుంటే ఇంటర్ తప్పినట్లుగా పరిగణిస్తారు. అయితే మార్కులను పరిగణనలోనికి తీసుకోరు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఆయా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైనా ‘నైతికత–మానవ విలువలు’, ‘పర్యావరణ విద్య’ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు కాకపోతే మార్కుల జాబితాను అందజేయరు. జిల్లాలో 43 ప్రభుత్వ, 18 ఎయిడెడ్, 237 ప్రెవేటు జూనియర్ కళాశాలల్లో 53,713 మంది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పాఠ్యప్రణాళికలో దక్కని చోటు.. ఇంటర్లో పర్యావరణ విద్య, నైతికత–మానవ విలువలును పాఠ్యాంశంగా 2015 నుంచి అమలు చేస్తున్నారు. ఈ అంశాలను పాఠ్య ప్రణాళికలో మాత్రం చేర్చకుండా ఇంటర్‌బోర్డు విస్మరిస్తోంది. ఏటా ఈ అంశాలపై పరీక్షలను ఫస్టియర్ విద్యార్థులకు నిర్వహిస్తున్నా.. పాఠ్య ప్రణాళికలో చోటు కల్పిద్దామన్న ఆలోచన విద్యాశాఖకు ఉండడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. మొక్కుబడిగా పరీక్షలు.. పాస్ మార్క్ వస్తే చాలని, ఇంటర్ మార్కులకు వీటిని కలపక పోవడంతో ఈ సబ్జెక్టును కేవలం మొక్కుబడిగానే పరిగణిస్తున్నారు. ఈ పరీక్షలను ఏ కళాశాలలో చదివే విద్యార్థులకు ఆ కళాశాలలోనే నిర్వహిస్తున్నారు. దీని వల్ల కళాశాలల్లో చూచిరాతలు కొనసాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. వీటిని ప్రాధాన్యం లేని పరీక్షలుగా పలు ప్రైవేటు యాజమాన్యాలు కొట్టి పారేస్తున్నాయి. ఉత్తీర్ణత తప్పనిసరి.. 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 60 మార్కులకు నిర్వహించే ప్రశ్నా పత్రంలో ఐదు కేటగిరీల్లో ఒక్కో దానికి 15 మార్కులు చొప్పున ఐదు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. వీటితో పాటు సుమారుగా 15 ప్రాజెక్టులు ఉంటాయి. వీటిలో నచ్చిన ప్రాజెక్టును ఎంపిక చేసుకుని పూర్తి చేయాలి. రాత పరీక్షకు 60 మార్కులు, వ్యక్తిగత ప్రాజెక్టుకు 20, గ్రూపు ప్రాజెక్టుకు 20మార్కులు ఉంటాయి. -
నైతికం..వైద్యానికి ప్రాణం
– కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ కర్నూలు(హాస్పిటల్): నైతికత వైద్యానికి ప్రాణం వంటిందని కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ అన్నారు. హౌస్‌సర్జన్ పూర్తి చేసుకున్న వైద్యవిద్యార్థులకు శనివారం ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. వైద్యవృత్తిలో నైతిక విలువలపై ఎథిక్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ మాధవీలత వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ మాట్లాడుతూ.. బోధనాసుపత్రిలో అభ్యసిస్తున్నప్పుడే వైద్యవిద్యార్థులు ఎన్నో విషయాలు నేర్చుకుంటారన్నారు. వారి ప్రవర్తన, నడవడికలోనూ మార్పులు రావాలన్నారు. వారి నడవడిక సరిగ్గా లేకపోతే సర్టిఫికెట్లు ఇవ్వబోమన్నారు. వైద్యుడంటే హుందాగా ఉండాలన్నారు. రోగులతో మమేకమై ప్రవర్తించాలని, వారి బాధలను ఓపికతో వినాలని సూచించారు. వైద్యుని వద్దకు వచ్చే పేదలను అవహేళన చేస్తే ఆ భగవంతుడు పరిహాసం చేస్తాడని హెచ్చరించారు. ప్రస్తుత తరంలో రోగులు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాధులపై అవగాహన పెంచుకుంటున్నారని, ఈ సమయంలో వైద్యులు ఎల్లప్పుడూ అప్డేట్ కావాల్సి ఉంటుందన్నారు. ఏ స్థాయిలో ఉన్నా వైద్య విద్యార్థులు ఎప్పుడూ పాఠ్యపుస్తకాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వైద్యవృత్తి చేసేటప్పుడు ఇచ్చే ప్రతి సర్టిఫికెట్ గురించి తెలుసుకుని ఉండాలని, వాటి వివరాలను భద్రపరుచుకోవాలని సూచించారు. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి ఇబ్బందులకు గురికావద్దని తెలిపారు. ప్రజల డబ్బులతో చదువుకున్నారు కాబట్టి వారికి నిబద్ధులై ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
క్రోధానికి విరుగుడు శాంతమే!
పురానీతి ఒకనాటి సాయంత్రం శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వనవిహారానికి వెళ్లారు. కబుర్లాడుకుంటూ వెళుతుండటంతో కాలం తెలియలేదు. చీకటి ముసురుకునే వేళకు ముగ్గురూ ఒక కీకారణ్యంలోకి చేరుకున్నారు. ముందుకు సాగడానికైనా, వెనక్కు మళ్లడానికైనా ఏ మాత్రం అనువుకాని సమయం. ఇక చేసేదేమీ లేక ఆ రాత్రికి ఎలాగోలా కీకారణ్యంలోనే గడపాలని నిశ్చయించుకున్నారు. అడవిలో ముగ్గురూ ఒకేసారి ఆదమరచి నిద్రపోవడం క్షేమం కాదని, అందువల్ల ఇద్దరు నిద్రిస్తున్నప్పుడు మిగిలిన వారు కాపలా ఉండాలని, ఇలా వంతుల వారీగా మేలుకొని కాపలా ఉంటూ రాత్రి పొద్దుపుచ్చాలని అనుకున్నారు. ముందుగా శ్రీకృష్ణుడు, బలరాముడు ఒక చెట్టు కింద నిద్రకు ఉపక్రమించారు. సాత్యకి వారికి కాపలాగా మేలుకొని ఉన్నాడు. ఒళ్లంతా కళ్లు చేసుకుని, చుట్టూ గస్తీ తిరగసాగాడు. అంతలోనే ఒక రాక్షసుడు కృష్ణ బలరాముల వైపు వడివడిగా రావడం కనిపించింది. సాత్యకి వెంటనే ఆ రాక్షసుడిని అడ్డగించాడు. రాక్షసుడు సాత్యకిపై దాడికి దిగాడు. సాత్యకి క్రోధావేశాలతో తన గదాయుధంతో అతడిని ఎదుర్కొన్నాడు. సాత్యకిలో క్రోధం మొదలైన మరుక్షణమే రాక్షసుడి శరీరం రెట్టింపైంది. సాత్యకికి కోపం మరింత పెరిగింది. రాక్షసుడి శరీరం కూడా పెరిగింది. సాత్యకి కోపం చల్లారకపోగా, అంతకంతకూ పెరగడంతో రాక్షసుడి శరీరం విపరీతంగా పెరిగింది. రాక్షసుడి శరీరం ముందు సాత్యకి ఆటబొమ్మలా కనిపించసాగాడు. రాక్షసుడు సాత్యకిని ఎత్తిపట్టుకుని, గిరగిరా తిప్పి కింద పడేసి వెళ్లిపోయాడు. గాయాలపాలైన సాత్యకి కొద్దిసేపటికి శక్తి కూడదీసుకుని తెప్పరిల్లాడు. అదే సమయానికి మేలుకున్న బలరాముడు ఇక తాను కాపలాగా ఉంటానని చెప్పి, సాత్యకిని నిద్రపొమ్మన్నాడు. రాక్షసుడితో పోరులో అలసి సొలసిన సాత్యకి నెమ్మదిగా చెట్టు కిందకు చేరుకుని, ఆదమరచి నిద్రలోకి జారుకున్నాడు. బలరాముడు అటూ ఇటూ తిరుగుతూ కాపలా కాయసాగాడు. సాత్యకికి ఎదురైన రాక్షసుడే బలరాముడికీ ఎదురయ్యాడు. యుద్ధానికి కవ్వించాడు. బలరాముడు అసలే ప్రథమకోపి. కట్టలు తెంచుకున్న కోపంతో తన హలాయుధాన్ని ఎత్తి రాక్షసుడిపై దాడి చేశాడు. రాక్షసుడు వికటాట్టహాసం చేస్తూ తన శరీరాన్ని పెంచాడు. బలరాముడి కోపం మరింత పెరిగింది. బలరాముడి కోపంతో పాటే రాక్షసుడి శరీరం పెరుగుతూ రాసాగింది. చివరకు భీకరాకారం దాల్చిన రాక్షసుడు బలరాముడిని కూడా మట్టికరిపించి, వెనుదిరిగాడు. ఇంతలోగా తనవంతు కాపలా కాయడానికి శ్రీకృష్ణుడు మేలుకున్నాడు. ఇంకా తెల్లారలేదు కదా, ఓ కునుకు తీయమన్నాడు బలరాముడిని. రాక్షసుడి ధాటికి ఒళ్లు హూనమైన బలరాముడు నెమ్మదిగా చెట్టుకిందకు చేరుకుని నడుం వాల్చాడు. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. శ్రీకృష్ణుడు అటూ ఇటూ కలియదిరుగుతూ కాపలా కాయసాగాడు. కొద్దిసేపటికి సాత్యకిని, బలరాముడిని మట్టికరిపించిన రాక్షసుడు శ్రీకృష్ణుడి ఎదుటికి వచ్చాడు. యుద్ధం చేయమంటూ కవ్వించాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ సై అన్నాడు. రాక్షసుడు కృష్ణుడి మీదకు లంఘించాడు. కృష్ణుడు ఒడుపుగా తప్పించుకున్నాడు. ప్రశాంతంగా అతడి వైపు చూసి మల్లయుద్ధానికి చెయ్యి కలిపాడు. రాక్షసుడి శరీరం సగానికి సగం తగ్గిపోయింది. అతడు ఎంతగా కవ్విస్తున్నా, కృష్ణుడు చెక్కుచెదరని చిరునవ్వుతో అతడిని ఎదుర్కోసాగాడు. శ్రీకృష్ణుడు ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తున్న కొద్దీ రాక్షసుడి శరీరం అంతకంతకూ తగ్గిపోసాగింది. చివరకు గుప్పిట్లో పట్టేంత చిన్నగా తయారయ్యాడు ఆ రాక్షసుడు. శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడిని అరచేత పట్టుకుని, తన ఉత్తరీయం అంచుకు మూటలా కట్టేశాడు. కొద్దిసేపటికి తెల్లవారింది. అడవిలో పక్షుల కిలకిలలు మొదలయ్యాయి. సాత్యకి, బలరాముడు మేలుకున్నారు. తమ దగ్గరే ఉన్న కృష్ణుడిని చూశారు. తమ ఒంటి మీద ఉన్న గాయాలను చూసుకున్నారు. రాత్రి తమకు కనిపించిన రాక్షసుడి గురించి చెప్పారు. ‘అలాంటి రాక్షసుడు నీకు కనిపించలేదా?’ అని అడిగారు. ‘వీడేనా ఆ రాక్షసుడు’ అంటూ తన ఉత్తరీయం అంచున కట్టిన మూటను విప్పాడు కృష్ణుడు. అందులోంచి బయటపడ్డాడు గుప్పెండంత పరిమాణంలో ఉన్న రాక్షసుడు. బలరాముడు, సాత్యకి ఆశ్చర్యపోయారు. ‘నిన్న మాకు కనిపించింది వీడే. అయితే, అప్పుడు బాగా పెద్దగా ఉన్నాడు. కోపంగా అతడితో పోరు సాగించే కొద్దీ మరింతగా పెరిగిపోసాగాడు’ అని చెప్పారు. ‘ఈ రాక్షసుడు మూర్తీభవించిన క్రోధం. క్రోధానికి విరుగుడు క్రోధం కాదు, శాంతం. మీరిద్దరూ కోపంతో రెచ్చిపోయి తలపడ్డారు. అందుకే ఇతడి చేతుల్లో పరాజితులయ్యారు’ అని చెప్పాడు కృష్ణుడు. అప్పుడు జ్ఞానోదయమైంది సాత్యకీ బలరాములకు. నీతి: క్రోధం వల్ల సాధించేదేమీ ఉండదు. కోపానికి విరుగుడు శాంతమే. శాంతం వహిస్తే, క్రోధాన్ని అవలీలగా జయించవచ్చు. -
నైతిక విలువలతో హక్కుల ఉల్లంఘన అదుపు
జస్టిస్ కేజీ శంకర్ ఏఎన్‌యూ: నైతిక విలువలను పాటించడం ద్వారా మానవ హక్కుల ఉల్లంఘనను అరికట్టవచ్చని చెన్నైకి చెందిన డెబ్ట్స్ రికవరీ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ జస్టిస్ కేజీ శంకర్ అన్నారు. యూనివర్సిటీ పీజీ డిపార్ట్స్‌మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ‘హ్యూమన్ రైట్స్ అండ్ వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్ ’ అంశంపై రెండు రోజులపాటు జరగనున్న జాతీయ సదస్సు సోమవారం యూనివర్సిటీలో ప్రారంభమయ్యింది. జస్టిస్ శంకర్ మాట్లాడుతూ వ్యక్తికి సమస్య వస్తే న్యాయస్థానాలను ఆశ్రయించాలా, మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాలా అనే దానిపై చాలామందికి అవగాహన లేదన్నారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడు కాకుమాను పెదపేరిరెడ్డి మాట్లాడుతూ కేవలం చట్టాల ద్వారానే కాకుండా మానవీయ కోణంలో కూడా వ్యక్తుల సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. వీసీ కె.వియ్యన్నారావు మాట్లాడుతూ ప్రాథమిక హక్కులైన విద్య, ఆహారం, వైద్య హక్కులు అందరికీ సమానంగా ఉండాలన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు నైతిక విలువలపై పాఠ్యాంశాలను ప్రవేశ పెట్టాలన్నారు. కార్యక్రమానికి యూనివర్సిటీ ఆర్ట్స్, కామర్స్, లా కళాశాల ప్రిన్సిపాల్ వి.చంద్రశేఖరరావు అధ్యక్షత వహించారు. లా డీన్ వైపీ రామసుబ్బయ్య, విభాగాధిపతి ఎల్.జయశ్రీ ప్రసంగించారు. ఏపీ లా యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ఎ.సుబ్రహ్మణ్యం, పలువురు న్యాయశాస్త్ర నిపుణులు, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు. -
అడవి పిలిచింది!
నార్త్ లండన్‌లో ఉండే జాక్ సోమర్విల్లి నమీబియా అడవుల్లో నివసించే సాన్ తెగ ప్రజల గురించి ఎన్నోసార్లు విన్నాడు. వారి గురించి విన్నప్పుడల్లా... వారిని చూడాలని, వారి జీవనశైలిని చిత్రించాలనే కోరిక బలంగా కలిగేది. తన కోరికను నిజం చేసుకోవడానికి కెమెరాతో నమీబియా అడవుల్లోకి వెళ్లాడు సోమర్విల్లి. అక్కడికి వెళ్లి వారి జీవనశైలిని, జంతువుల పట్ల వారి ప్రవర్తన తీరు తెన్నులను కెమెరాలో బంధించాడు. ‘‘ప్రకృతిని అమితంగా ప్రేమిస్తారు’’ అని సాన్ ప్రజల గురించి చెబుతున్నాడు సోమర్. కేవలం ప్రకృతికి సంబంధించిన విషయాలే కాదు... నైతికవిలువలకు సంబంధించి కూడా ఈ పురాతన జాతి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అంటాడు సోమర్విల్లి. సోమర్విల్లి తీసిన ఫోటోలను చూస్తే... మనం కూడా నమీబియా అడవుల్లో సంచరించినట్లుగానే ఉంటుంది. -
పిల్లలకు నైతిక విలువలు నేర్పాలి
తల్లిదండ్రులకు దలైలామ సూచన తుమకూరు: తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే నైతిక విలువలు నేర్పించాలని నోబల్ శాంతి అవార్డు గ్రహీత, ధార్మిక గురువు దలైలామ పిలుపునిచ్చారు. తుమకూరు నగరంలోని తుమకూరు విశ్వవిద్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అధ్యయన కేంద్రంలోని బైలుకుప్ప సేరా జీ మెనాస్టిక్ యూనివర్సిటి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సమ్మేళనాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. నైతిక విలువలతో కూడిన విద్యాబోధన, శిక్షణ వల్లే సమాజంలో శాంతి నెలకొంటుందని అన్నారు. అప్పుడే సమాజంలో జరిగే అ న్యాయాలు, అక్రమాలను అడ్డుకోవచ్చన్నారు. చిన్నారులు చెడు వ్యసనాలకు లోను కాకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని, అప్పుడే మంచి సమాజం ఏర్పడుతుందని అన్నా రు. శాంతితో నిండిన దేశం వైపే ప్రపంచం చూస్తుందన్నారు. భారతీయులు అహింస అనే ఆయుధంతోనే స్వతంత్రాన్ని సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దగంగ మఠానికి చెందిన శివకుమార స్వామి, ఇన్చార్జ్ మంత్రి టీ బీ జయచంద్ర, సాంఘీక సంక్షేమశాఖ మంత్రి ఆంజినేయప్రసాద్, చిత్రదుర్ఘ ఎంపీ చంద్రప్ప పాల్గొన్నారు. -
బతుకు-బతకనివ్వు, బడుగుకు భరోసానివ్వు!
పద్యానవనం: ఇవాళ మనం గొప్పగా చెప్పుకునే ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్ వంటి విశ్వవిద్యాలయాలు పది, పదకొండు ఆ తర్వాతి శతాబ్దాల్లో వచ్చినవే. అంతకు అయిదారు వందల సంవత్సరాల పూర్వమే మొదట విశ్వవిద్యాలయాల భావనను ఆచరణలోకి, ప్రాచుర్యంలోకి తెచ్చింది భారతదేశమే! ధరణిదేనువు బిదుకంగ దలచితేని జనుల బోషింపుమధిప వత్సముల మాడ్కి జనులు పోషింపబడుచుండ జగతి కల్పలత తెఱంగున సకల ఫలంబు లొసగు.. రాజనీతి అనేక రకాలుగా ఉంటుంది. ధర్మనిరతికి లోబడే ఉండాలనేది పెద్దల మాట. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు వేల సంవత్సరాలుగా ధార్మిక, ఆధ్యాత్మికాంశాల్లో మార్గదర్శకాలుగా ఉంటూ వస్తున్నాయి. అయితే, ధర్మసూత్రాలు, నీతిశాస్త్రాల నుంచే కాకుండా నిరంతరం సాగే ప్రకృతి పరిణామాలు, అనేకానేక వ్యావహారిక ఆచరణల నుంచి కూడా మంచిని గ్రహించి రాజులు అనుసరించేవారు. ఆ అనుభవసారంతో జనరంజకమైన సుపరిపాలన అందించేవారు. ఆదివేదమైన రుగ్వేదంలో ఓ గొప్ప మాటుంది. జ్ఞానమనే వెలుగును అన్ని వైపుల నుంచీ ప్రసరించనీయాలనీ, ఆహ్వానించాలనీ! ప్రకృతిలో మౌలికంగా ఎన్నో మంచి అంశాలుంటాయి. వాటి నుంచి సాపేక్షంగా మంచిని గ్రహించి అనుసరించడం ద్వారా మనిషి జీవిత లక్ష్యాల్ని తేలికగా సాధించగలడు. పూర్వం రుష్యాశ్రమ విద్యా బోధనలో ఇటువంటివి చాలా చెప్పేవారు. ప్రాకృతికమైన ఓ అంశంతో పోల్చి జీవన సత్యాల్ని వివరించేవారు. వేమన పద్యాలైనా, బద్దెన సుమతీ శతక పద్యాలైఏనా ఇటువంటివే! ‘అవును కదా!’ అనిపించే నిజాల్ని కళ్లకు కట్టినట్టు చెబితే, చిరు మెదళ్లలో అవి బాగా, బలంగా నాటుకునేవి. ధర్మనిరతి, సత్యనిష్ఠ, మానవతా విలువలు, సచ్ఛీలత ఇలాంటివన్నీ గొప్ప గొప్ప ఆదర్శాలుగా కనిపించేవి, అనుసరణీయం అనిపించేవి. అనుసరణో, అనుకరణో... ఎవరికి వారు యథాశక్తి వాటిని పాటించేందుకు యత్నించేవారు. దాంతో గొప్ప వ్యక్తిత్వ వికాసం జరిగేది. సమాజం విలువలతో విలసిల్లేది. ఇటీవలి కాలం వరకు కూడా అది గొప్పగానే కొనసాగింది. పరంపరగా ఇటువంటి నైతిక జ్ఞాన వ్యాప్తికి భారతీయ చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంప్రదాయాల్లో ఎంతో ప్రాధాన్యత ఉండేది. పూర్వపు విద్యా విధానంలో ఇటువంటి అంశాల బోధనకు పెద్దపీట వేసేవారు. ఇవాళ మనం గొప్పగా చెప్పుకునే ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్ వంటి విశ్వవిద్యాలయాలు పది, పదకొండు ఆ తర్వాతి శతాబ్దాల్లో వచ్చినవే. అంతకు అయిదారు వందల సంవత్సరాల పూర్వమే మొదట విశ్వవిద్యాలయాల భావనను ఆచరణలోకి, ప్రాచుర్యంలోకి తెచ్చింది భారతదేశమే! నాగరికత వికాస క్రమంలో విజ్ఞానం కోసం ప్రపంచం ఆర్తితో ఉన్నపుడు వివిధ దేశాల నుంచి విద్యార్థుల్ని ఆకట్టుకున్న నలంద, తక్షశిల, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాల్ని నడిపిన నేల ఇది. అంతకు పూర్వం, తర్వాత జైనుడు, మహావీరుడు, బుద్ధుడు, శంకరాచార్యుడు, బసవేశ్వరుడు, కబీరు, వేమన, నిన్నమొన్నటి వివేకానందుడి వరకు... ఇలా ఎందరెందరో తాత్వికులు, ఆధ్యాత్మిక చింతనాపరులు, మానవతావాదులు ఈ నేలపై నడచిన వారే! భర్తృహరి సంస్కృతంలో చెప్పిన ఓ గొప్ప మాటను ఏనుగులక్ష్మణ కవి తెలుగులో ఈ పద్యంగా మలిచారు. భూమి అనే గోవు నుంచి ధనం పిండుకోవాలనుకుంటే దూడను పోషించిన విధంగా జనులను పోషించాలి రాజా! అంటాడు. జనుల్ని చక్కగా పోషించే భారాన్ని, బాధ్యతని తీసుకుంటే జగత్తుమొత్తం కల్పవృక్షపు కొమ్మలాగా, తీగెలాగా కోరినవన్నీ ఫలాలుగా అందిస్తుంది అంటాడు. ఆ స్పృహ పాలకులకు ఉండాలి. దూడలను గాలికి వదిలి పాలన్నీ తామే పితుక్కోవాలని అత్యాశకు వెళితే, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులకే పలాయనం తప్పలేదు. స్వాతంత్య్రోద్యమ కాలంలో తెలుగునాట ఉద్యమ స్ఫూర్తిని రగిలించి, యువతను ఉర్రూతలూగించిన పద్యం చిలకమర్తి లక్ష్మీనర్సింహం రాశారు. ‘‘భరత ఖండంబు చక్కని పాడియావు, లేగదూడలై హిందువులేడ్చుచుండ, పితుకుచున్నారు మూతులు బిగియగట్టి, తెల్లవారను గడుసరి గొల్లవారు’’ అన్న పద్యం నాటి సామ్రాజ్యవాదుల దుర్నీతికి నిలువుటద్దం. ఇక్కడ భర్తృహరి చెప్పిన దానికి పూర్తి విరుద్ధం. పరాయిపాలన పోయి, సర్వసత్తాక స్వతంత్ర రాజ్యంగా భారతదేశం ఆవిర్భవించిన ఆరు దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ఆ చెడు పోకడలు పోలేదు. నేటి పాలకులు కూడా భూమిని చెరబట్టి, భూమి మీదే భుక్తి వెతుక్కుంటున్న బడుగు జీవుల్ని ఎండబెట్టి తామే సర్వం దండుకోవాలనీ, తమ వారికి సంపద కొల్లగొట్టిపెట్టాలనీ చూసినప్పుడు మన మానవత, నైతికత, ధార్మికత ఎక్కడ మరుగునపడ్డాయి? అని బాధ కలుగుతుంది. పాలకులారా! గతం నుంచి పాఠాలు నేర్చుకోండి, ‘బతుకు-బతకనివ్వు’ అన్న మంచి మాటను ఆచరించండీ!! అని గట్టిగా అరవాలనిపిస్తుంది. - దిలీప్‌రెడ్డి -
ముద్దు పవిత్రం... ప్రచారమే అసభ్యం
‘కిస్ ఆఫ్ లవ్’ ఉద్యమంపై చర్చలు, వాదోపవాదాలు ఇంకా రాజుకుంటూనే ఉన్నాయి. కోర్టులు ఇలాంటి చర్యలను సమర్థించినప్పటికీ, నైతిక విలువల పరిరక్షక సేనలు ఏ మాత్రం రాజీ పడడం లేదు. బహిరంగ చుంబనాలను ఇవి ఖండిస్తున్నాయి. వాటిని నివారించే, నిరోధించే ప్రయత్నాలను చేస్తున్నాయి. సేనలతో ఇప్పుడు ఉదారవాదులు, స్త్రీవాదులు సైతం చేతులు కలిపారు. సాధారణంగా మానవ కమిషన్ల మీద, ఉమెన్ కమిషన్ల మీద మనకో అభిప్రాయం ఉంటుంది. మనుషులు ఎంత చెడ్డా, వారి హక్కులకు భంగం కలిగించే అధికారం వ్యక్తులకు గానీ, ప్రభుత్వాలకు గానీ ఉండకూడదని ఈ కమిషన్లు వాదిస్తాయని అనుకుంటాం. అయితే ఇప్పుడీ అభిప్రాయాన్ని మనం మార్చుకోవాలి. తాజాగా కర్ణాటక మహిళా కమిషన్ ‘కిస్ ఆఫ్ లవ్’ను ‘అనాగరకమైన, ఆటవికమైన’ చర్యగా అభివర్ణించింది. ఇలాంటి ప్రదర్శనలకు అనుమతి ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై కర్ణాటక మహిళా కమిషన్ ైచె ర్ పర్సన్ మంజులా మానస ఆ రాష్ట్ర హోమ్ మంత్రి కె.జె.జార్జికి ఒక లేఖ రాశారు. అందులో ఆమె ‘కిస్ ఆఫ్ లవ్’ ప్రదర్శనలను, వాటి నిర్వాహకులను విమర్శించడానికి ఎలాంటి తడబాట్లూ ప్రదర్శించలేదు. నిక్కచ్చిగా, నిస్సంకోచంగా తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ‘‘కొన్ని ప్రవర్తనలు మనుషులకు, జంతువులకు మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తాయి. ఆ వ్యత్యాసాలను మనుషులు పాటించాలి. నైతిక విలువల పరిరక్షకులకు వ్యతిరేకంగా వీధులలో బహిరంగంగా వీళ్లు చేస్తున్న ముద్దుల ప్రదర్శన అర్థరహితమైనది. ఎంతో పవిత్రమైన ముద్దును వీళ్లు బజారుకీడుస్తున్నారు. ఇదొక అసభ్యకరమైన ప్రచార ధోరణి’’ అని మంజులా మానస ఆ లేఖలో రాశారు. ‘‘ఈ ధోరణిని కనుక నిరోధించకపోతే సభ్య సమాజపు పునాదులే కదిలిపోతాయి’’అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మంజుల లేఖను హోమ్‌మంత్రి జార్జి, బెంగళూరు పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డికి పంపుతూనే, రాజ్యాంగం ప్రకారం సంఘ విద్రోహం కాని సంఘటనలను నిషేధించే హక్కు ప్రభుత్వానికి లేదని అంటున్నారు. మంజులా మానస ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఏమిటీ ‘కిస్ ఆఫ్ లవ్’? ఇదొక నిరసన ప్రదర్శన. ‘మోరల్ పోలీసింగ్’కి వ్యతిరేకంగా 2014 నవంబర్ 2న కొచ్చి (కేరళ)లోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ప్రారంభమయింది. ఆ తర్వాత ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్ నగరాలకు ఒక ఉద్యమంలా వ్యాపించింది. సామాజిక విలువల పరిరక్షకులమని చెప్పుకుంటున్న కొన్ని మత సంస్థలు, రాజకీయ పక్షాలు యువతీయువకుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా తమపై దౌర్జన్యానికీ, దాడులకు పాల్పడడాన్నే ‘మోరల్ పోలీసింగ్’గా ప్రదర్శనకారులు వ్యవహరిస్తున్నారు. మొదట ఫేస్ బుక్ ద్వారా ‘కిస్ ఆఫ్ లవ్’ ఉద్యమం ఊపిరి పోసుకుంది. మోరల్ పోలీసింగ్‌పై తమ నిరసనను వ్యక్తం చేయడానికి యువతీయువకులు ఒకర్నొకరు బహిరంగంగా ముద్దుపెట్టుకోవాలని ఫేస్బుక్లో అందిన పిలుపునకు దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన లభించింది. కొన్ని గంటల్లోనే లక్షా 20 వేలకు పైగా ‘లైక్’లు వచ్చాయి! తర్వాతి సంగతి తెలిసిందే. దేశంలోని మెట్రో నగరాలలో కిస్ ఆఫ్ లవ్ ప్రదర్శనలు జరిగాయి. వీటిపై ఎప్పటిలాగే భారతీయ జనతా యువమోర్చా, విశ్వహిందూ పరిషత్, శివసేన, ఎస్.డి.పి.ఐ. (సోషల్ డెమెక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా), భజరంగ దళ్, హిందూసేన వంటి పార్టీలు విరుచుకు పడ్డాయి. కొసమెరుపు ఏమిటంటే, బహిరంగ ప్రదేశాలలో ముద్దులు పెట్టుకోవడం అసభ్యత కాదని, అందుచేత ఈ చర్యలను నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడం! -
విద్యా వ్యవస్థలో మార్పులు
ప్రైవేటు విద్యాసంస్థలపై నిఘా నైతిక విలువలపై టీచర్లకు శిక్షణ విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి విశాఖపట్నం: అందరికీ విద్య అందించేందుకు అవసరమైతే ఓ ఉద్యమంలా పటిష్టమైన చర్యలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి అన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుకు భవిష్యత్‌లో విద్యా వ్యవ స్థలో పలు మార్పులు తీసుకొస్తామని ఆమె చెప్పారు. స్వచ్ఛ విద్యాలయం కార్యక్రమంలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో కలసి ముచ్చటించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం విద్యావ్యవ స్థలో నైతిక విలువలు కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్న పిల్లలకు సులభతరమైన రీతిలో నైతిక విలువలు, సమాజం పట్ల అవగాహన, దేశభక్తి తదితర అంశాల్లో అదనపు తరగతల ద్వారా బోధన అందంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. మన టీవీ ద్వారా ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. రాష్ర్టంలో విద్యార్థులు అత్యధికంగా ఉన్న పాఠశాల్లో మొదటిది మదనపల్లి కాగా, రెండోది విశాఖలోని మధురవాడ హైస్కూల్ అని తెలిపారు. అయినా ఈ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఉత్తమ ఫలితాలను అందిస్తున్న పాఠశాలలకు తల్లితండ్రులు, స్థానికులు సహకరించాలని కోరారు. విద్యావ స్థలో రాజకీయ జోక్యం ఇబ్బందికరంగా మారిందని కాలక్రమేనా ఇది రూపుమాపేందుకు కృషిచేస్తామని తెలిపారు. బట్టీ పద్ధతికి స్వస్తి.. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులను రోబోలు లాగా మారిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బట్టిపద్ధతికి స్వస్తిపలికేలా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అకడమిక్ కేలండర్‌ను రూపొందిస్తున్నామని, ఇది ప్రవేటు పాఠశాలలకూ వర్తింపచేయనున్నామని తెలిపారు. విద్యాశాఖ ఆస్తులను రక్షిస్తాం మధురవాడలోని ఎమ్మార్సీ కార్యాలయానికి చెందిన స్థలంలో అనధికారికంగా వెలసిన ఆక్రమణలపై విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి కిందస్థాయి అధికారులపై మండిపడ్డారు. ఎంతో విలువైన స్థలాన్ని ఆక్రమణలకు గురైతే ఎందుకు ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. -
నిజాయితీగా ఉంటేనే భవిష్యత్‌లో నీతిమయ సమాజం
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: భవిష్యత్ తరాలు నీతి నిజాయితీతో బతకాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముందు తాము నిజాయితీగా ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ సీఎస్ మోహన్ కందా రచించిన ‘ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్-రెజల్యూషన్ ఆఫ్ డైలమాస్’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. సమాజాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దేందుకు మేధావులు కృషి చేయాలని... విసుగు, విరామం లేకుండా అంతిమ శ్వాస వరకూ అవినీతికి వ్యతిరేకంగా పనిచేయాలని అప్పుడే నూతన భారతావనిని చూడగలుగుతామని జస్టిస్ చంద్రకుమార్ వ్యాఖ్యానించారు. పదవీ విరమణ అనంతరం వ్యక్తులు సమాజానికి ఉపయోగపడేలా మేధస్సును వినియోగించాలన్నారు. మేధావులు తలచుకుంటే ఈ సమాజాన్ని ఉద్ధరించగలరని, సమాజంలోని సమస్యలను పారద్రోలేందుకు మేధావులు తగిన సలహాలు, సూచనలను పుస్తకాల రూపంలో తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మేధావులు ఏసీ గదుల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అవి ఎవరి శ్రేయస్సు కోసం తీసుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. అనంతరం మోహన్ కందా మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల తన పాలనానుభవంలో నైతిక విలువలు, పాలన అనేవి ఎంతగానో ఆకర్షించాయన్నారు. పుస్తకాల్లో ఉండేవాటికి ఆచరణలో చేసేవాటికి చాలా వ్యత్యాసం ఉంటుందని.. ఒక్కో సందర్భంలో ఒక్కోటి పైచేయిని సాధిస్తుంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎం.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.