సంతోషమే  సంపూర్ణ  బలం | International Day of Happiness | Sakshi
Sakshi News home page

సంతోషమే  సంపూర్ణ  బలం

Published Sun, Mar 17 2019 12:12 AM | Last Updated on Sun, Mar 17 2019 12:12 AM

International Day of Happiness - Sakshi

మార్చి 20 ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ హ్యాపీనెస్‌ సందర్భంగా సంతోషం గురించి కొన్ని విశేషాలు...

సంతోషమే సగం బలం అని నానుడి. నిజానికి మనుషులకు సంతోషమే సంపూర్ణ బలం. సంతోషం ఒక మానసిక స్థితి. సంతోషంగా బతకాలని మనుషులంతా కోరుకుంటారు. జీవితం పట్ల సంతృప్తి, అవసరాలకు తగినంత సంపద, ఆరోగ్యం, జీవన భద్రత వం టి చాలా అంశాలు మనుషుల సంతోషానికి దోహదపడతాయి. ‘మనుషులు తమ కోసం తాము కోరుకునే ఒకే ఒక్క అంశం సంతోషం మాత్రమే’ అని అరిస్టాటిల్‌ వెల్లడించాడు. క్రీస్తుపూర్వం 350 ఏళ్ల నాడే తాను రచించిన ‘నికోమాషెన్‌ ఎథిక్స్‌’ గ్రంథంలో సంతోషం గురించి విపులంగా చర్చించాడు. సంతోషభరితమైన జీవితమే ఉత్తమమైన జీవితమని తేల్చి చెప్పాడు. సంతోషం గురించి తత్వవేత్తలు, మత బోధకులు క్రీస్తుపూర్వం నాటి నుంచే  రకరకాల సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ప్రపంచంలోని మతాలూ శాస్త్రాలూ కూడా సంతోషం గురించి రకరకాల సిద్ధాంతాలను ప్రతిపాదించాయి. 

ఆధునికుల్లో పంతొమ్మిదో శతాబ్దికి చెందిన బ్రిటిష్‌ తత్వవేత్త జాన్‌ స్టూవర్ట్‌ మిల్‌ ‘మానవుల చర్యలకు సంతోషమే పరమావధి’ అని చెప్పాడు. ‘మనిషి అంతిమ లక్ష్యం సంతోషమే’నని పంతొమ్మిదో శతాబ్దికి చెందిన జర్మన్‌ తత్వవేత్త ఫ్రెడెరిక్‌ నీషే అభిప్రాయపడ్డాడు. సంతోషం గురించి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, అవేవీ సంతోషానికి స్పష్టమైన నిర్వచనాలు కావు. సంతోషం ఒక భావన. సంతోషం ఒక అనుభూతి. సంతోషం ఒక అనుభవం. ఎవరి సంతోషం వారిదే. ఒకరికి సంతోషం కలిగించేది మరొకరికి సంతోషం కలిగించలేకపోవచ్చు. సంతోషం గురించి శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా రకరకాల పరిశోధనలు సాగిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం మాత్రం ప్రజల సంతోషంపై ఆలస్యంగా దృష్టి సారించింది. ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో సంతోషం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఇరవైఒకటో శతాబ్దిలోని మొదటి దశాబ్ది గడచిన తర్వాత మాత్రమే నడుం బిగించి, చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగానే ఐక్యరాజ్య సమితి 2012 నుంచి ఏటా ‘వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్ట్‌’ విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా 2018లో విడుదల చేసిన నివేదికలోని మొత్తం 156 దేశాల జాబితా ప్రకారం భారత్‌ 133వ స్థానంలో ఉంది. మన ప్రభుత్వాలు అభివృద్ధి గురించి ఎన్ని ప్రగల్భాలు చెప్పుకుంటే మాత్రం లాభమేముంది? మన దేశ జనాభాలో అత్యధికులు సంతోషంగా లేరనే వాస్తవాన్ని ‘వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్ట్‌’ తేటతెల్లం చేస్తోంది.

మానవ జీవితానికి అంతిమ ధ్యేయం సంతోషమేనని అద్వైతం బోధిస్తోంది. భౌతిక సుఖాలేవీ శాశ్వత సంతోషాన్ని ఇవ్వలేవని, ఆత్మ పరమాత్మల మధ్య అభేదాన్ని గుర్తించినప్పుడే శాశ్వత ఆనందం లభిస్తుందనేది అద్వైత సిద్ధాంతం. యోగ సూత్రాలను రచించిన పతంజలి తన గ్రంథంలో సంతోషానికి గల మానసిక, అధిభౌతిక కారణాలను విపులంగా విశ్లేషించాడు. సద్గుణాలు, సత్కార్యాలు, సంగీతం మనిషికి సంతోషాన్ని కలిగిస్తాయని చైనాకు చెందిన కన్ఫ్యూషియస్‌ మత గురువు మిన్సియస్‌ అభిప్రాయపడ్డాడు. దైవారాధనలో సంతోషమే కీలకమని, దైవారాధన చేసేటప్పుడు అందరూ సంతోషంగా ఉండాలని, సంతోషభరితమైన గీతాలతో దైవాన్ని ప్రార్థించాలని యూదు మతం బోధిస్తోంది. మానవ జీవితానికి చరమ లక్ష్యం సంతోషమేనని క్రీస్తుశకం నాలుగో శతాబ్దికి చెందిన క్రైస్తవ బోధకులు సెయింట్‌ అగస్టీన్, సెయింట్‌ థామస్‌ అక్వినాస్‌లు అభిప్రాయపడ్డారు. ఇస్లాం కూడా సంతోషానికి తగిన ప్రాధాన్యమిచ్చింది. క్రీస్తుశకం పదకొండో శతాబ్దికి చెందిన సూఫీ గురువు అల్‌ ఘజలీ ఏకంగా ‘ఆల్కెమీ ఆఫ్‌ హ్యాపీనెస్‌’ అనే గ్రంథాన్నే రచించాడు. ‘యునైటెడ్‌ స్టేట్స్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ ఇండిపెండెన్స్‌’ ప్రకటనను 1776లో రాసిన థామస్‌ జెఫర్సన్, సంతోషం కోసం ప్రయత్నించడం మనుషులకు గల విశ్వజనీనమైన హక్కుగా గుర్తించాడు. ఇదిలా ఉంటే, మత విశ్వాసాలు లేని వాళ్లతో పోలిస్తే, మత విశ్వాసాలు ఉన్న వాళ్లే ఎక్కువ సంతోషంగా ఉంటున్నట్లు ‘వరల్డ్‌ వాల్యూ సర్వే’ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ నిపుణులు 1981 నుంచి 2014 వరకు సుదీర్ఘకాలం నిర్వహించిన అధ్యయనంలో బయటపడిన వాస్తవాలతో రూపొందించిన నివేదిక అది. ఆ నివేదిక ప్రకారం యవ్వనంలో ఆరోగ్యంగా ఉన్నవాళ్లు, పరిమితమైన ఆకాంక్షలు కలిగిన వాళ్లు, పనికి తగిన ప్రతిఫలం పొందుతున్న వాళ్లు, చేస్తున్న పనిలో సంతృప్తి పొందుతున్న వాళ్లు, వైవాహిక బంధంలో ఉన్నవాళ్లు, ఆత్మగౌరవం నిలుపుకొనే వాళ్లు, జీవితం పట్ల ఆశావహ దృక్పథం ఉన్న వాళ్లు సంతోషంగా ఉంటున్నట్లు తేలింది.

వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్ట్‌–2018
వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్ట్‌–2018లోని మొదటి పది స్థానాల్లో అగ్రరాజ్యాలేవీ చోటు దక్కించుకోకపోవడం గమనార్హం. ఈ జాబితాలో అమెరికా 18వ స్థానంలోను, బ్రిటన్‌ 19వ స్థానంలోను నిలిచాయి. అత్యధిక జనాభా గల చైనా 86వ స్థానంలో నిలిచింది. మన పొరుగు దేశాల్లో పాకిస్తాన్‌ 75వ స్థానంలోను, నేపాల్‌ 101 వ స్థానంలోను, బంగ్లాదేశ్‌ 115వ స్థానంలోను, శ్రీలంక 116వ స్థానంలోను, మయాన్మార్‌ 130వ స్థానంలోను నిలిచాయి. ఒకప్పుడు ఈ జాబితాలో టాప్‌–10లో చోటు దక్కించుకున్న భూటాన్‌ ఈసారి 97వ స్థానానికి దిగజారింది. వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్ట్‌–2018 ప్రకారం మన పొరుగు దేశాలే మన కంటే మెరుగ్గా ఉన్నాయి. 

సంతోషం అంటేనే హడలు
ప్రపంచంలోని మనుషులంతా సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. ఇది నిర్వివాదాంశమే అయినా, అతి అరుదుగా కొందరు ఉంటారు. సంతోషంగా ఉండాలంటేనే వాళ్లు భయంతో హడలిపోతారు. సంతోషం అంటేనే భయపడటం ఒక మానసిక రుగ్మత. దీనినే మనస్తత్వ శాస్త్ర పరిభాషలో ‘కీరో ఫోబియా’ అంటారు. అలాగని కీరోఫోబియాతో సతమతమయ్యే వాళ్లంతా నిత్యం విషాదంలో మునిగి ఉంటారనుకుంటారేమో! అలాంటిదేమీ ఉండదు. వాళ్లు ఇతరత్రా మామూలుగానే ఉంటారు. అయితే, సంతోషాన్ని కలిగించే సందర్భాలను మాత్రం వీలైనంత వరకు నివారిస్తూ ఉంటారు. సంతోషంతో తుళ్లుతూ ఉల్లాసంగా గడిపే మిత్రబృందాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ ఉంటారు. 

ఆనంద రసాయనాలు
మెదడులోని ఒక ప్రాంతం ఆనందానికి కేంద్రం. సంతోషాన్ని కలిగించే ఎండార్ఫిన్‌ వంటి జీవరసాయనాలు అక్కడి నుంచే ఉత్పత్తవుతూ ఉంటాయి. ఆనందాన్ని కలిగించే ఒక రసాయనాన్ని మెకలమ్‌ అనే శాస్త్రవేత్త 1992లో కనుగొన్నాడు. దానికి ‘ఆనందమైడ్‌’ అని పేరు పెట్టారు. సంతోషానికి కారణమయ్యే మరిన్ని రసాయనాలనూ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎన్‌– ఆరాకిడోనోయల్‌ డోపమైన్, నలడోయిన్, ఆరాకిడోనోయల్‌ గ్లిసరాల్, వైరోడమైన్‌ వంటి రసాయనాలు మెదడులో స్రవిస్తూ ఉంటాయి. ఇతరులకు సాయం చేసినప్పుడు, చేసిన మంచి పనుల వల్ల ప్రశంసలు పొందినప్పుడు, ఏదైనా విజయం సాధించినప్పుడు మెదడులో ఇలాంటి రసాయనాలు స్రవిస్తుంటాయి. ఇవి ఆనందాన్ని కలిగిస్తాయి. ఇవి కలిగించే ప్రభావాలనే కొన్ని రకాల మొక్కల ఉత్పత్తులు, కృత్రిమ రసాయనాల ద్వారా కూడా పొందవచ్చు. వీటి ద్వారా భ్రమాజనిత సంతోషం, చెప్పనలవి కాని ప్రశాంతత కలుగుతాయి. ఇవి ఉత్సాహాన్ని పెంచుతాయి. బాధను తగ్గిస్తాయి. వీటిని ఉపయోగించాక ఆకలి పెరుగుతుంది. మొక్కల ఉత్పత్తులు, రసాయన ఔషధాల ద్వారా పొందే ఆనందానుభూతి తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. మళ్లీ మళ్లీ అదే ఆనందానుభూతిని పొందాలనుకునేవారు గంజాయి, నల్లమందు వంటి మొక్కల ఉత్పత్తులను, ఓపియాయిడ్స్, ఎండార్ఫిన్స్, డైనార్ఫిన్స్‌ వంటి కృత్రిమ రసాయన ఔషధాలను తరచుగా తీసుకుంటూ ఉంటారు. ఇవి తాత్కాలికంగా ఆనందం కలిగించినా, వీటికి బానిసలై దీర్ఘకాలం వాడుతూ పోతే ఇవి ఆరోగ్యంపై నానా దుష్ప్రభావాలు చూపి, జీవితంలోని ఆనందాన్ని మొత్తంగా హరించేస్తాయి. అకాల మరణానికి దారితీస్తాయి. అందువల్ల తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే కృత్రిమ పద్ధతుల జోలికి పోకుండా సహజసిద్ధంగా సంతోషం పొందడమే మేలు. 

సంతోషాన్నిచ్చే ముఖ్యాంశాలు
ఆధ్యాత్మిక చింతన
కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత
అయిన వారి ఆదరాభిమానాలు
ఇతరుల పట్ల సానుకూల ప్రవర్తన
ఇతరులకు సాయం చేసే ధోరణి
ఇష్ట సంభాషణలు కృతజ్ఞతా భావన
మంచి వ్యాపకాలతో కాలక్షేపం

సంతోషం వల్ల లాభాలు
రోగ నిరోధక శక్తి పెరుగుదల
బాధల నుంచి సత్వర ఉపశమనం
పనితీరులో మెరుగుదల
దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం
విజయ సాధనమానసిక స్థైర్యం
అవరోధాలను అధిగమించే శక్తి
మెరుగైన సామాజిక సంబంధాలు

ఆనందం గురించి అవీ ఇవీ...
ఆనందం కూడా ఆవులింతల్లాగానే ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది. మూడ్‌ బాగోలేకుంటే ఆనందంగా కాలక్షేపం చేసే మిత్రుల దగ్గరకు వెళ్లండి. మనసు తేలిక పడుతుంది. వాళ్ల ఆనందం మీకూ అంటుకుంటుంది. మనసంతా సంతోషంతో నిండిపోతుంది. సంతోషం ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా వ్యాపిస్తుందని పదేళ్ల కిందట ‘టైమ్‌’ మ్యాగజీన్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.చదువు సంధ్యలు లేనివాళ్లతో పోలిస్తే విద్యావంతులే కొంత ఎక్కువ సంతోషంగా ఉంటారు. చదువుకునేటప్పుడు చదువు తక్షణమే సంతోషం కలిగించకపోయినా, ఆ తర్వాత జీవితంలో సంతోషానికి ఇతోధికంగా దోహదపడుతుందని ‘ఫౌండేషన్స్‌ ఆఫ్‌ హెడోనిక్‌ సైకాలజీ’ అధ్యయనంలో తేలింది.డబ్బుతో సంతోషాన్ని కొనలేమని చాలామంది అపోహ పడతారు గాని, సంతోషం పొందటానికి డబ్బు కూడా ఒక ముఖ్య సాధనం. అయితే, డబ్బును ఎలా ఖర్చు చేశామనే దానిపై సంతోషం స్థాయి ఆధారపడి ఉంటుంది. వస్తువులను కొనడానికి డబ్బు వెచ్చించడం కంటే అనుభవాలు పొందటానికి డబ్బు వెచ్చించడం ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని లండన్‌లోని క్వీన్‌ మేరీ యూనివర్సిటీకి చెందిన మార్కెటింగ్‌ సైకాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ లిల్లీ జామ్‌పోల్‌ నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది.అన్నీ వేదాల్లోనే ఉన్నాయనేది పాతకాలం అపోహ. అన్నీ జన్యువుల్లోనే ఉన్నాయనేది ఈనాటి వాస్తవం. ఆనందం కూడా అందుకు మినహాయింపు కాదు. యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ సైకాలజీ ప్రొఫెసర్‌ పీటర్‌ ఫోనగీ చేపట్టిన పరిశోధనల్లో మనుషుల్లోని సంతోషం స్థాయికి జన్యువులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలింది.ఆనందం ఆయువును పెంచుతుంది. దిగులుగా రోజులు వెళ్లదీసే వారితో పోలిస్తే, సంతృప్తిగా సంతోషంగా ఉండేవారు ఎక్కువకాలం బతుకుతారని కాలిఫోర్నియా అలమెడా కౌంటీలో అమెరికన్‌ శాస్త్రవేత్తలు దాదాపు మూడు దశాబ్దాల పాటు నిర్వహించిన సుదీర్ఘ పరిశోధనలో వెల్లడైంది. సంతోషంగా ఉండేవాళ్లు సంతోషంగా లేనివారి కంటే దాదాపు ఏడేళ్ల నుంచి పదేళ్ల కాలం ఎక్కువగా బతుకుతారని ఆ పరిశోధనతో వెలుగులోకి వచ్చింది.

ఆనందంపై అపోహలు వాస్తవాలు
ఆనందంపై చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయి. నిజానికి అవేవీ అంతగా ఆనందాన్ని ఇచ్చేవి కాదు. ఒకవేళ అవి కాస్త ఆనందాన్ని ఇచ్చినా, ఆ ఆనందం చాలా తాత్కాలికమైనదే.

అపోహ: నిర్దేశిత లక్ష్యాలను సాధించడం ద్వారా సంతోషం పొందవచ్చు.
వాస్తవం: నిర్దేశిత లక్ష్యాలను సాధించినప్పుడు దొరికే సంతోషం చాలా తాత్కాలికమైనది. ఒక లక్ష్యం సాధించిన తర్వాత మరో లక్ష్యం మన ముందుకు వస్తూనే ఉంటుంది. అది మరింత కఠినమైన సవాళ్లతో కూడుకున్న లక్ష్యమైతే ఇదివరకటి లక్ష్య సాధన ద్వారా దొరికిన సంతోషం ఆవిరైపోవడానికి ఎంతోసేపు పట్టదు. లక్ష్య సాధన ద్వారా సంతోషం పొందడం కంటే లక్ష్యాలను సాధించే ప్రక్రియను ఆస్వాదించడాన్ని అలవాటు చేసుకుంటేనే మనుషులు ఎక్కువ సంతోషంగా ఉండగలుగుతారని అమెరికన్‌ మార్కెటింగ్‌ సైకాలజీ నిపుణురాలు స్టేసీ కాప్రియో చెబుతున్నారు.

అపోహ: వయసు పెరిగే కొద్ది తగ్గే సంతోషం
వాస్తవం: వయసు పెరిగే కొద్దీ సంతోషం తగ్గుతుందని అంతా అనుకుంటారు. అమాయకమైన బాల్యంలో నిజంగానే సంతోషం స్థాయి ఎక్కువగానే ఉంటుంది. యవ్వనంలోనూ ఆనందం ఉంటుంది. నడి వయసుకొచ్చే సరికి బాధ్యతల భారం నెత్తిన పడుతుంది. ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటే మొదలవుతాయి. మానసిక ఒత్తడి పెరిగి సంతోషంగా ఉండే సందర్భాలు చాలా వరకు తగ్గిపోతాయి. రిటైరైన తర్వాత కాస్త ఆరోగ్యంగా ఉంటే చాలు, విశ్రాంత జీవితాన్ని ఆనందంగా గడపడం అసాధ్యమేమీ కాదు, నిజానికి విశ్రాంత జీవితంలోనే వృద్ధులు దాదాపు చిన్నపిల్లలంత సంతోషంగా ఉండగలుగుతారని అమెరికన్‌ మనస్తత్వ నిపుణురాలు డయానే ల్యాంగ్‌ చెబుతున్నారు.
  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement