ఉద్యోగరీత్యా హైదరాబాద్ సిటీ వదిలి నాలుగేళ్లు పనిచేసాకనే నాకు మళ్ళీ రాజధాని నగరంలో ఒక పోస్ట్ లభించింది. భాగ్యనగర నివాస భాగ్యం, సొంత ఇంట్లో ఉండే అవకాశం రెండూ ఒకేసారి కలిసి వచ్చిన ఆ రోజు మేం పొందింది మహదానందం. నేను అప్పుచేసి మరీ కొన్న మొట్టమొదటి టీవీ ( EC ) మా ఇంటికి చేరిన రోజు ( 1984 మార్చ్ 17 ) వాళ్లకు కలిగింది బ్రహ్మానందం. ఎందుకంటే ఆ రోజుల్లో దూరదర్శన్‌లో వచ్చిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి కామెడీ షో ‘ఆనందో బ్రహ్మ’ మా పిల్లలను ఆనందపరవశులను చేసేది. ఆనందం ( Happiness ) ఒక భావోద్వేగం. నచ్చిన ఆహార విహారాలు, ఆటా పాటలు, ప్రేమ స్నేహాలు, సిరి సంపదలు, మంచి వాతావరణం, ప్రకృతి సౌందర్యం వంటివి మనిషికి ఎంతో సంతోషాన్ని కలిగించడం సహజం.
అయితే ఇది దేశాలకు కూడా వర్తిస్తుందని, అక్కడి మనుషుల జీవన ప్రమాణాలు, వారికున్న స్వేచ్చా స్వాతంత్య్రాలు, అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, లంచగొండితనం ఆధారంగా 2012 నుంచి ప్రతి ఏటా ‘అంతర్జాతీయ హ్యాపీనెస్ డే ( మార్చి 20 ) ’ సందర్బంగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రచురిస్తున్న ప్రపంచ సంస్థ ఐక్యరాజ్య సమితి. వీరి 2024 సంవత్సరం రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోని 143 దేశాల్లో ముందున్న అత్యంత సంతోషకరమైన 10 దేశాలు ఫిన్లాండ్, డెన్మార్క్ , ఐస్లాండ్ , స్వీడెన్, ఇజ్రాయెల్, నెదర్లాండ్, నార్వే , లక్సంబెర్గ్ , స్విడ్జెర్లాండ్ , ఆస్ట్రేలియాలు కాగా చివర్లో బిక్కుబిక్కు మంటున్నవి లెబనాన్, అఫ్గనిస్థాన్ లు.
ఇందులో విశేషం ఏమిటంటే సంతోషకరమైన దేశాల్లో భారత్ ర్యాంక్ 126 . ఆధ్యాత్మిక చింతనతో మనం ఎంతో ఆత్మానందాన్ని పొందుతున్నా మనుకుంటూ ఇలా కిందికి జారిపోవడమే మింగుడుపడని విషయం. మనకన్నా ఆనందడోలికల్లో తెలుతున్నవి లిబ్యా , ఇరాక్ , పాలస్తినా, నైగర్ వంటి దేశాలు ,అంతేకాదు పాకిస్థాన్ కూడా . నిరంతర యుద్ధ జ్వాలలతో రగిలిపోతున్న రష్యా , ఉక్రైన్ లు కూడా మనపైనే ఉన్నాయి. ఆసియా వరకే చూస్తే సింగపూర్, తైవాన్, జపాన్ , సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్ ప్రజలు ఆనందంలో ముందున్నారట.
మనదేశంలో మిజోరాం రాష్ట్రవాసులు ఎక్కువ ఆనందంగా ఉన్నారట. ఈ విషయంలో కేరళను క్యూట్ స్టేట్ అన్నారు. సిటీల్లో కాన్పూర్, జైపూర్, చెన్నై, మంగళూర్, మైసూర్‌ల తర్వాతనే మన హైదరాబాద్ స్థానం. భారత్‌లో యువతరం హ్యాపీగానే ఉన్నారట, బోలెడంత నిరుద్యోగం ఉన్నా కూడా ( బహుశా అంతర్జాలంలో తేలిపోతూ కావచ్చు ). వృద్ధతరం కూడా పర్వాలేదు అంటున్నారు, వీరిలో జీవనసాఫల్య సాధనలో మాత్రం మహిళామణులే ఓ అడుగు ముందున్నారట, సంతోషం. మధ్య వయస్కులు మాత్రం ( సంసార సాగరాన్ని ఈదలేకనేమో ) కాస్త విచారంలో ఉంటున్నారట.
మరో విశేషం ఏమిటంటే ప్రపంచంలోనే అగ్ర రాజ్యంగా చెప్పుకునే అమెరికాలో హ్యాపీనెస్ అంతంతే అంటున్నారు. ఆనందకరమైన మొదటి 20 దేశాల్లో వీరు లేకుండా 23 వ స్థానానికి పడిపోవడం. అందుకు ముఖ్యమైన కారణాల్లో ఆ దేశ యువతలోని అసంతృప్తి, అక్కడున్న ఒంటరితనం అంటున్నారు. ఫలితంగా వారు ఎన్నో శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కుంటున్నారట. అందుకే యుక్తవయసు రాగానే పెళ్లిళ్లు చేసేసుకుంటే గొడవే లేదు, ఇంటిపోరుతో బోలెడంత టైమ్ పాస్ కదా అంటున్నారు పెద్దలు !
వేముల ప్రభాకర్
(చదవండి: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగేస్తున్నారా? నిపుణులు ఏమంటున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment