Happiness
-
రెజ్లింగ్ పాటకు మొసలి హుషారు
90వ దశకంలో టీవీల్లో వచ్చే రెజ్లింగ్ క్రీడకు భారతీయ టీనేజర్లలో క్రేజీ అంతాఇంతా కాదు. అలాంటి క్రేజ్ ఇప్పుడు భారత్‌లో తగ్గిపోయినా అమెరికా తదితర దేశాల్లో ఇంకా ఉంది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ) అభిమానులకు ఒక మొసలి సైతం జతకలిసింది. స్టార్‌వార్స్ ప్రఖ్యాత థీమ్సాంగ్ అయిన ‘ది ఇంపీరియల్ మార్చ్’ పాట వినబడగానే ఈ మొసలి హుషారుగా కదలివస్తోంది. గంటలతరబడి కదలకుండా ఉండగలిగే మొసలిలో సైతం మా సాంగ్ కదలిక తెప్పిస్తోందని, మెప్పిస్తోందంటూ పలువురు రెజ్లింగ్ అభిమానులు సంబంధిత వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఎవర్గ్లేడ్స్ హాలిడే పార్క్‌లో డార్త్ గేటర్ అనే మొసలి ఉంది. ఇది ఈ పాట వినగానే చేస్తున్న హంగామా చూసి గేటర్బాయ్స్ టీవీషో స్టార్ పౌల్ బేడార్ట్ సైతం ఆశ్చర్యం వ్యక్తంచేశారు. స్వయంగా మొసలి సమీపానికి వెళ్లి మాంసం ముక్కలను పట్టుకుని థీమ్‌సాంగ్‌ను ప్లే చేయడం, మొసలి వచ్చి హుషారుగా ముక్కలను లటుక్కున మింగేయడం వీడియోలో రికార్డయింది. దీనిని ఇప్పుడు లక్షలాది మంది లైక్‌లు, షేర్లు కొడుతున్నారు. – న్యూయార్క్ -
నో బ్యూటీ పార్లర్.. నా అందం, ఆనందం రహస్యం అదే! నటి
ఈ విషయం వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. నీనా గుప్తాకు బ్యూటీ పార్లర్లకు వెళ్లే అలవాటు లేదు. ‘అవునా!! గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారు తరచూ పార్లర్ లకు వెళ్తుంటారు కదా! అందమే కదా అసలు ఎవరికైనా ఆనందం?’ అని మీరు అడిగి చూడండి... నీనా చెప్పే సమాధానం మిమ్మల్ని మరింతగా ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ‘నా కూతురే నా ఆనందం‘ అంటారు నీనా!ఆనందం అందాన్నిస్తుంది. ఆ ఆనందం కూతురు మసాబా రూపంలో నీనా కళ్లెదుట ఉంది. ఇక ఆమెకు ఫేషియల్స్ ఎందుకు? పార్లర్లు ఎందుకు? నీనా వయసు 65. సింగిల్ మదర్‌కి స్ట్రెస్ ఉంటుంది. కూతురు ఉన్న సింగిల్ మదర్‌కి మరింత స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్, మరింత స్ట్రెస్‌లను మించిన మూడోస్ట్రెస్ కూడా ఉండేది నీనాకు. అదేమిటో అందరికీ తెలిసిందే. ఆమె కూతురి తండ్రి ఇండియన్ కాదు. 1980ల నాటి వెస్ట్ ఇండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్. నీనా, రిచర్డ్స్కు పుట్టిన అమ్మాయే మసాబా. రిచర్డ్స్ కు అప్పటికే పెళ్లి అయి ఉండటంతో ఆయన్ని పెళ్లి చేసుకోకుండా, మసాబా పెరిగి పెద్దయ్యే వరకు – ఒంటరిగానే ఉండిపోయారు నీనా. ప్రస్తుతం మసాబా వయసు 35 ఏళ్లు. ఇప్పటికీమసాబానే నీనా కంటి వెలుగు. మసాబానే ఆమె అందం, ఆనందం. ‘ఎదుగుతున్న వయసులో నా కూతురి కోసం నేను రెండు పనులు ఎప్పటికీ చేయకూడదు అని ఒట్టు పెట్టుకున్నాను. ఒకటి: ఆమె చదువు కోసం ‘ఎవరినీ డబ్బు సాయం అడగకూడదు.’ రెండు : తండ్రి (దగ్గర) లేని పిల్లగా ఆమె కోసం ‘ఎవరి ఎమోషనల్ సపోర్టూ తీసుకోకూడదు.’ ఈ రెండిటిపై గట్టిగా నిలబడ్డాను. మనం డబ్బు, సపోర్ట్ అడగం అని తెలిస్తే ఎవరైనా ధైర్యంగా మన దగ్గరకు వస్తారు. మనమూ అంతే.. ఎవరి దగ్గరకైనా ధైర్యంగా వెళ్లగలం అని ‘బ్రట్ ఇండియా’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కుషా కపిల్‌తో చెప్పారు నీనా గుప్తాకూతురు మాత్రమే కాదు, సింగిల్ మదర్‌గా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ రావటం కూడా నీనా అందానికి కారణం అయి ఉంటుంది -
అందం అంటే..?
‘అందమె ఆనందం’ అని ఒక సినిమా కవి అందాన్ని నిర్వచించాడు, ఆనందానికి నిర్వచనం ఇవ్వ బోతూ. ఆనందాన్ని కలిగించ కలిగింది మాత్రమే అందమని కవిహృదయం. ఎవరికి దేని వల్ల ఆనందం కలుగుతుందో చెప్పలేము. అందుకని అందం చూసే వాళ్ళ కళ్లలో ఉంటుందే కానీ వస్తువులో కాదు అనే ఆంగ్ల సామెత వచ్చింది. పైగా అందం వ్యక్తిగతం.‘‘లోకో భిన్న రుచిః’’ అన్నట్టు ఒక్కొక్కరి కళ్ళకి అందంగా కనిపించింది వేరొకరికి అందంగా కనిపించక పోవచ్చు. అందం విషయంలో చాలామంది దృష్టి చర్మం దగ్గర ఆగిపోతుంది. కానీ,‘‘నిజమైన అందం శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుంది’’ అంటాడు ఆంగ్లకవి జాన్ కీట్స్.అందం అన్నది వస్తుగతం కాదు అనే విషయం పాశ్చాత్యులు కూడా బాగా అర్థం చేసుకున్నారు అని అర్థమయింది కదా!అందానికి సంబంధించి ఒక్కొక్క దేశంలో ప్రమాణాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. చైనా దేశంలో స్త్రీల పాదాలు ఎంత చిన్నవిగా ఉంటే అంతటి అందగత్తెలుగా పరిగణిస్తారు. ముక్కు కొస పైకి ఉండి, ముక్కు రంధ్రాలు కనపడేట్టు ఉండటం అందంగా కొన్ని పాశ్చాత్య దేశాలలో పరిగణించబడుతుంది. భారతీయులు అందంగా పరిగణించే పొడవుగా, కోటేరు వేసినట్టు ముక్కు ఉంటే ఏనుగు ముక్కు అని వేళాకోళం చేస్తారట కూడా. ఆఫ్రికా దేశంలో పెదవులు ఎంత పెద్దగా ఉంటే అంత అందంగా ఉన్నట్టు. అందుకోసం చిన్నతనంలో పెదవులకి చిన్న చిన్న చిడతల వంటి వాటిని తగిలిస్తారట! భారతీయుల సౌందర్య దృష్టిలో కూడా పారమార్థికత ఉంది. సౌందర్యం పరమాత్ముడి లక్షణాలు, లేక తత్వాలలో ఒకటి. సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ తత్త్వం ‘‘సత్యం, శివం, సుందరం’’.సృష్టిలోని అందమంతా మూర్తీభవించిన పురుషరూపం శివుడు.ఆయనే చొక్కనాథుడు, సుందరేశ్వరుడు. అదే స్త్రీ రూపమైతే లలితా త్రిపురసుందరి. భౌతికమైన అందం శాశ్వతం కాదు. ముద్దుముద్దుగా చూడగానే ముచ్చట గొలిపే పాలబుగ్గల పసివాడు చూస్తూ ఉండగానే పెద్దవాడు అవుతాడు. అప్పుడు పాలబుగ్గలు అందానికి హేతువు కాదు అని అర్థమవుతుంది.ఈ భౌతికరూపాన్ని అధిగమించిన అందాన్ని గురించి మాత్రమే భారతీయ ఋషులు, దార్శనికులు ప్రస్తావించారు. ఆ ప్రమాణాలని అనుసరించే ్రపాచీన కవులు సౌందర్య వర్ణన చేశారు. చేతులని, పాదాలని, ముఖాన్ని, కన్నులని కూడా పద్మాలతో పోల్చుతారు. కారణం వాటి ఆకారం అట్లా ఉందని కాదు. పద్మం అందమైనది.ఆహ్లాదకరమైనది, మృదువైనది, శుభప్రదమైనది, పవిత్రమైనది. కనుక ఆ అవయవాలు అంతటి పవిత్రమైనవి అని సూచించటం.ఇతరమైన ఉపమానాలు కూడా అటువంటివే. పైకి భౌతికరూప వర్ణనలాగా అనిపించినా అంతరార్థం వేరు. బాహ్యసౌందర్యం ఆత్మసౌందర్య వ్యక్తీకరణ మాత్రమే. భారతీయులకి అందం వస్తువు లేక మనిషికి సంబంధించింది కాదు. మనస్సుకి ఆత్మకి సంబంధించింది. ఆత్మసౌందర్యం మొదలైన పదబంధాలని వింటూనే ఉన్నాము. అంటే అందం వస్తువు లేక మనిషి మూలతత్త్వానికి సంబంధించింది. ఉదాహరణకి బెల్లం చూడటానికి అందంగా కనిపించదు. దాని అందం అంతా దాని రుచిలో ఉంటుంది. మనిషి మనసు స్వచ్ఛంగా ఉంటే అందంగా ఉన్నట్టు అనిపిస్తారు. నిజానికి వారి అవయవాల్లో ఒక్కటి కూడా అందాల పోటీల వాళ్ళ కొలతలకి సరిపోవు. అవయవాల పొందిక వల్ల అందంగా ఉన్నట్టు కనిపిస్తారు. పొందికకి తోడు వారి ప్రేమపూరితమైన మనస్సు. దయ, సుహృద్భావం వంటి సద్భావనలతో మనస్సు నిండి ఉంటే ఆ సానుకూల భావతరంగాలు మనసు నుండి కనుల ద్వారా వెలువడి ముఖాన్ని కాంతిమంతంగా చేస్తాయి. అప్పుడు అందంగా కనిపించదా? దీన్ని వర్చస్సు అని కూడా చెప్పవచ్చు. – డా.ఎన్.అనంతలక్ష్మి -
ఆనందమే జీవిత మకరందం!
ఉద్యోగరీత్యా హైదరాబాద్ సిటీ వదిలి నాలుగేళ్లు పనిచేసాకనే నాకు మళ్ళీ రాజధాని నగరంలో ఒక పోస్ట్ లభించింది. భాగ్యనగర నివాస భాగ్యం, సొంత ఇంట్లో ఉండే అవకాశం రెండూ ఒకేసారి కలిసి వచ్చిన ఆ రోజు మేం పొందింది మహదానందం. నేను అప్పుచేసి మరీ కొన్న మొట్టమొదటి టీవీ ( EC ) మా ఇంటికి చేరిన రోజు ( 1984 మార్చ్ 17 ) వాళ్లకు కలిగింది బ్రహ్మానందం. ఎందుకంటే ఆ రోజుల్లో దూరదర్శన్‌లో వచ్చిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి కామెడీ షో ‘ఆనందో బ్రహ్మ’ మా పిల్లలను ఆనందపరవశులను చేసేది. ఆనందం ( Happiness ) ఒక భావోద్వేగం. నచ్చిన ఆహార విహారాలు, ఆటా పాటలు, ప్రేమ స్నేహాలు, సిరి సంపదలు, మంచి వాతావరణం, ప్రకృతి సౌందర్యం వంటివి మనిషికి ఎంతో సంతోషాన్ని కలిగించడం సహజం.అయితే ఇది దేశాలకు కూడా వర్తిస్తుందని, అక్కడి మనుషుల జీవన ప్రమాణాలు, వారికున్న స్వేచ్చా స్వాతంత్య్రాలు, అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, లంచగొండితనం ఆధారంగా 2012 నుంచి ప్రతి ఏటా ‘అంతర్జాతీయ హ్యాపీనెస్ డే ( మార్చి 20 ) ’ సందర్బంగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రచురిస్తున్న ప్రపంచ సంస్థ ఐక్యరాజ్య సమితి. వీరి 2024 సంవత్సరం రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోని 143 దేశాల్లో ముందున్న అత్యంత సంతోషకరమైన 10 దేశాలు ఫిన్లాండ్, డెన్మార్క్ , ఐస్లాండ్ , స్వీడెన్, ఇజ్రాయెల్, నెదర్లాండ్, నార్వే , లక్సంబెర్గ్ , స్విడ్జెర్లాండ్ , ఆస్ట్రేలియాలు కాగా చివర్లో బిక్కుబిక్కు మంటున్నవి లెబనాన్, అఫ్గనిస్థాన్ లు.ఇందులో విశేషం ఏమిటంటే సంతోషకరమైన దేశాల్లో భారత్ ర్యాంక్ 126 . ఆధ్యాత్మిక చింతనతో మనం ఎంతో ఆత్మానందాన్ని పొందుతున్నా మనుకుంటూ ఇలా కిందికి జారిపోవడమే మింగుడుపడని విషయం. మనకన్నా ఆనందడోలికల్లో తెలుతున్నవి లిబ్యా , ఇరాక్ , పాలస్తినా, నైగర్ వంటి దేశాలు ,అంతేకాదు పాకిస్థాన్ కూడా . నిరంతర యుద్ధ జ్వాలలతో రగిలిపోతున్న రష్యా , ఉక్రైన్ లు కూడా మనపైనే ఉన్నాయి. ఆసియా వరకే చూస్తే సింగపూర్, తైవాన్, జపాన్ , సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్ ప్రజలు ఆనందంలో ముందున్నారట. మనదేశంలో మిజోరాం రాష్ట్రవాసులు ఎక్కువ ఆనందంగా ఉన్నారట. ఈ విషయంలో కేరళను క్యూట్ స్టేట్ అన్నారు. సిటీల్లో కాన్పూర్, జైపూర్, చెన్నై, మంగళూర్, మైసూర్ల తర్వాతనే మన హైదరాబాద్ స్థానం. భారత్‌లో యువతరం హ్యాపీగానే ఉన్నారట, బోలెడంత నిరుద్యోగం ఉన్నా కూడా ( బహుశా అంతర్జాలంలో తేలిపోతూ కావచ్చు ). వృద్ధతరం కూడా పర్వాలేదు అంటున్నారు, వీరిలో జీవనసాఫల్య సాధనలో మాత్రం మహిళామణులే ఓ అడుగు ముందున్నారట, సంతోషం. మధ్య వయస్కులు మాత్రం ( సంసార సాగరాన్ని ఈదలేకనేమో ) కాస్త విచారంలో ఉంటున్నారట. మరో విశేషం ఏమిటంటే ప్రపంచంలోనే అగ్ర రాజ్యంగా చెప్పుకునే అమెరికాలో హ్యాపీనెస్ అంతంతే అంటున్నారు. ఆనందకరమైన మొదటి 20 దేశాల్లో వీరు లేకుండా 23 వ స్థానానికి పడిపోవడం. అందుకు ముఖ్యమైన కారణాల్లో ఆ దేశ యువతలోని అసంతృప్తి, అక్కడున్న ఒంటరితనం అంటున్నారు. ఫలితంగా వారు ఎన్నో శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కుంటున్నారట. అందుకే యుక్తవయసు రాగానే పెళ్లిళ్లు చేసేసుకుంటే గొడవే లేదు, ఇంటిపోరుతో బోలెడంత టైమ్ పాస్ కదా అంటున్నారు పెద్దలు !వేముల ప్రభాకర్(చదవండి: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగేస్తున్నారా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
ఈ తరం తీరే వేరు! నేటి తరంలో ఆనందం తక్కువ.. ఎందుకంటే!
జీవితానికి అర్థం, పరమార్థం జీవించడమే, ఆనందంగా జీవించడమే. మనం ఉద్యోగం సాధించినా, ఇల్లు కట్టించినా, కారు కొన్నా, విదేశీ ప్రయాణం చేసినా, మరే పని చేసినా సరే.. లక్ష్యం ఆనందం. ఆనందాన్ని వెంబడించడమనేది శాశ్వతమైన మానవ ప్రయత్నం. అయితే కాలంతో పాటు దాన్ని సాధించే మార్గాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా ప్రతి 15 సంవత్సరాలను ఒక జనరేషన్గా పరిగణిస్తారు. జనరేషన్ జనరేషన్‌కూ ప్రాధాన్యాలు మారుతూ ఉంటాయి. 1965-80 మధ్య పుట్టిన జనరేషన్-ఎక్స్ వారికి ఆర్థిక భద్రత సాధించడం, పిల్లలు సాధించేలా చూడటం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సాధించడమే లక్ష్యంగా ఉండేది. అందులోనే వారు ఆనందాన్ని పొందేవారు. 1981-1996 మధ్య పుట్టిన జనరేషన్-వై వారికి వ్యక్తిగత ఎదుగుదల, మంచి కుటుంబ జీవితం ఆనందాన్నిచ్చేవి. వారితో పోల్చినప్పుడు 1997-2012 మధ్య పుట్టిన జనరేషన్-జీ వారిలో ఆనందం తగ్గిందని, కేవలం మూడింట రెండు వంతుల మంది మాత్రమే సంతోషంగా ఉన్నారని గాలప్ సర్వే కనుగొంది. యుక్త వయసులోకి ప్రవేశించినప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కారణం తెలుసా? ఈ తరం వారికి ఆర్థిక భద్రత, వ్యక్తిగత ఎదుగుదల కంటే కూడా పని చేయడంలో ప్రయోజనం (sense of purpose) ముఖ్యం. ఆ క్లారిటీ ఉన్నప్పుడు, ఉన్నవారు మాత్రమే సంతోషంగా జీవిస్తున్నారు. నా పనికి ప్రయోజనం ఉందా? ఈ తరం వారికి కార్పొరేట్ నిచ్చెనలు ఎక్కడంపైనే, మెటీరియలిస్టిక్ విజయాలు సాధించడంపైనే దృష్టి ఉంటుందని చాలామంది విమర్శిస్తుంటారు. కానీ అదంతా అబద్ధమని సర్వేలో తేలింది. పాత తరాలకు భిన్నంగా జనరేషన్-జీ వారు తమ పనికి, జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఈ తరం వారికి అందుబాటులో ఉన్న ఉద్యోగాలలో ఈ అంతర్గత ప్రేరణ లేదు. ఆఫీసుల్లో ఏ అంశంపైనైనా బహిరంగంగా మాట్లాడే స్వభావం, దాన్ని భరించలేని పాతకాలపు వర్క్ ప్లేస్ లు వారిలో అసంతృప్తిని పెంచుతున్నాయి. అంటే ఈ తరం వారికి భారీగా జీతాలు అందుకోవడం లేదా ప్రమోషన్లు పొందడం కంటే కూడా తాము చేస్తున్న పనివల్ల ఎవరికైనా, ఏదైనా ప్రయోజనం ఉందా? వారి జీవితాలను ప్రభావితం చేయగలుగుతున్నామా? అనేది చాలా ముఖ్యం. అలాంటి ప్రయోజనం ఉన్నప్పుడే పనిలో ఆనందాన్ని పొందుతున్నారు. ఈ మూడూ ఉంటేనే సంతోషం జనరేషన్-జీ ఆనందంలో ప్రయోజనంతోపాటు మరో మూడు అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని గాలప్ అధ్యయనం గుర్తించింది. అవి.. రీఛార్జ్, రిలాక్సేషన్: హైపర్ కనెక్టివిటీ వల్ల ప్రపంచం నిరంతరం మేల్కొనే ఉంటుంది. అందువల్ల చాలామందికి నిద్ర కరువవుతోంది. తగినంత విశ్రాంతి, నిద్ర పొందడం ఆనందానికి మార్గమవుతోంది. బలమైన సామాజిక సంబంధాలు: సోషల్ మీడియా యుగంలో ఒక్కొక్కరికీ వేలల్లో, లక్షల్లో ఆన్లైన్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల ప్రేమ, మద్దతు పొందడం చాలా ముఖ్యం. వారితో సన్నిహిత సంబంధాలే సంతోషానికి మార్గాలవుతాయి. పోలికనుండి తప్పించుకోవడం: సోషల్ మీడియాలో లేదా మరెక్కడైనా నిరంతరం ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. జనరేషన్-జీలో ఈ కంపేరిజన్ ట్రాప్ చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి అవగాహన పెంచుకోవడం, ప్రతీ వ్యక్తి ప్రత్యేకమని గుర్తించి ముందుకు సాగడం ఆనందం జీవనం కోసం అద్భుతమైన వ్యూహం. విద్యాసంస్థలు, కార్యాలయాలు ఈ అంశాలను గుర్తించి జనరేషన్-జీ దీర్ఘకాలిక ఆనందాన్ని సాధించడంలో మద్దతునివ్వాల్సిన అవసరం ఉంది. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
Mukthar Ansari : ‘‘అన్సారీ మరణంతో మాకు న్యాయం జరిగింది’’
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ ముఖ్తార్ అన్సారీ మృతితో తమకు న్యాయం జరిగిందని 2005లో అన్సారీ చేతిలో హత్యకు గురైన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారు. కృష్ణానందరాయ్ కుమారుడు పియూష్ రాయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అన్సారీ మృతితో తమ కుటుంబం సంతోషంగా ఉందని చెప్పారు. ‘బాబా గోరక్నాథ్ దయతోనే మాకు న్యాయం జరిగింది. రంజాన్ నెలలోనే అన్సారీకి దేవుడు తగిన శిక్ష విధించాడు. పంజాబ్‌లోని జైళ్లలో ఉండి కూడా అన్సారీ అక్కడి నుంచి నేరాలకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌కు వచ్చిన తర్వాత అతడికి తగిన శాస్తి జరిగింది. ప్రతిపక్షాలకు కేవలం రాజకీయాలు కావాలి. ఒక క్రిమినల్‌కు ఆయా పార్టీల నేతలు మద్దతు పలకడం దారుణం’అని పియూష్ రాయ్ వ్యాఖ్యానించారు. అన్సారీ నేరాల వల్ల గాయపడ్డ కుటుంబాలకు ఇప్పుడు న్యాయం జరిగిందని, తాము సంతోషంగా ఉన్నామని ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ భార్య అల్కా రాయ్ అన్నారు. ఇదీ చదవండి.. అన్సారీపై విష ప్రయోగం -
ఆనందమా! నువ్వెక్కడ?
భవిష్యత్తు ఇలాగే ఉంటుందని ఎవరూ చెప్పలేరు. ఇంతకంటే బాగుండాలనే అందరూ అనుకుంటారు. ఆశపడతారు. అయితే అందుకు తగ్గట్టు ఏమి చేస్తున్నారనేదే ప్రశ్న. ఆనందం; పరమానందం; బ్రహ్మానందం- మాటలకు వేదాంత కోణంలో వేరే అర్థాలున్నా – మనం లౌకిక అర్థమే చూద్దాం. ఆనందం వెతుక్కోవడంలోనే మనం తికమక పడుతున్నాం. ఆనందం కానిది ఆనందం అనుకుని పరుగులు తీస్తున్నాం. జీవితం ఎప్పుడూ సరళరేఖ కానేకాదు. ఒకేవేగం, ఒకే పద్ధతిలో వెళ్ళదు. ఎగుడు దిగుళ్లు; లాభనష్టాలు; కష్టసుఖాలు సహజం. అయితే లాభమూ సుఖమూ ఆనందించదగ్గది – నష్టమూ కష్టమూ భరించకూడనిది అవుతుంది. ఇక్కడే వస్తోంది చిక్కంతా. జీవితం సంక్లిష్టం కావాలని ఎవరూ కోరుకోరు. కానీ సంక్లిష్టమయినప్పుడు బయటపడడానికి, ఆ ప్రయత్నంలో ఆనందం వెతుక్కోవడానికి ప్రయత్నించేవారు తక్కువ. ఆనందం దానికదిగా వస్తువు కాదు. మార్కెట్లో దొరకదు. ఆనందం అక్షరాలా మనకు మనమే తయారుచేసుకోవాల్సిన పదార్థం. మనలో మనమే వెతికి పట్టుకోవాల్సిన వస్తువు. మనలోపలే ఉన్నా మనం లేదనుకుని వెతికే ఫీలింగ్. ఒక అనుభూతి. ఒక మానసిక స్థితి. మరి – మనలోపలే ఆనందం టన్నుల కొద్దీ ఉంటే మనకెందుకు కనిపించదు? అనిపించదు? గెలుపు ఆనందం- ఓటమి బాధ. స్థూలంగా ఆనందానికి- బాధకు మన నిర్వచనం ఇది. లక్ష్యం , గమ్యం ఆనందం. చేరేదారి, గమనం బాధ. నొప్పి, అసహ్యం, అసహనం, అసంతృప్తి. గమ్యంతోపాటు గమనాన్ని, చేరే దారిని కూడా ఆనందించాలి, ప్రేమించాలి, అనుభవించాలి. జీవితం చాలాసార్లు సవాళ్లు విసురుతుంది. ఇక మార్గమే లేనట్లుగా చేస్తుంది. బరువుగా మారుతుంది. దిగులుగా చేస్తుంది. నీరసపరుస్తుంది. నిస్పృహ నింపుతుంది. మొండిగా బండగా మారుస్తుంది. కానీ ఇలాంటి సమయాల్లో కూడా ఆనందాలను వెతుక్కోవాలి. అలవికాని ఆశలు, అంచనాలు, ఇతరులతో పోలిక, ఇతరులు ఏమనుకుంటారోనన్న ఆందోళనలు వదిలేస్తే ఎన్నెన్నో ఆనందాలు కళ్ళముందే ప్రత్యక్షమవుతాయి. -పమిడికాల్వ మధుసూదన్ -
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం అదే!
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ మరోసారి తొలి స్థానంలో నిలిచింది. ఏడు సార్లుగా అదే స్థానంలో నిలవడం విశేషం. అంతర్జాతీయ సంతోష దినోత్సవమైన బుధవారం (మార్చి 20)న యూఎన్ ఆధారిత వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ సంస్థ తాజాగా ఈ ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచంలోని 143కి పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకుని దీన్ని రూపొందించారు. సంతోష సూచీల్లో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్(1), డెన్మార్క్(2), ఐస్లాండ్(3) వరుసగా తొలి మూడు ర్యాంకుల్లో నిలిచాయి. ఈ జాబితాలో భారత్ గతేడాదిలానే 126వ స్థానంలో ఉంది. ఇక చైనా (60), నేపాల్ (95), పాకిస్థాన్ (108), మయన్మార్(118) దేశాలు ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 2020లో తాలిబాన్ నియంత్రణలోకి వెళ్లినప్పటి నుంచి మానవతా విపత్తుతో బాధపడుతోంది అఫ్ఘనిస్తాన్. దీంతో ఈ హ్యపీనెస్ ఇండెక్స్ 143 దేశాలలో అఫ్ఘనిస్తాన్ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇక ఈ నివేదికను ఆత్మ సంతృప్తి, తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, జీవన కాలం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారు. దాదాపు దశాబ్దకాలంలో అమెరికా, జర్మనీ మొదటిసారిగా తొలి 20 స్థానాల నుంచి కిందకు దిగజారాయి. అవి వరుసగా 23, 23 స్థానాల్లో నిలిచాయి. అయితే టాప్ 20లో కోస్టారికా(12), కువైట్(13) స్థానాలు దక్కించుకోవడం విశేషం. ఈ ఏడడా టాప్ 10లో పెద్ద దేశమేది లేదని నివేదిక పేర్కొంది. ఇక ఈ జాబితాలో తొలి టాప్ 10లో 1.5 కోట్ల కంటే ఎక్కువ జనాభా కలిగినవి నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా మాత్రమే ఉన్నాయి. ఇక టాప్ 20లో మాత్రం మూడు కోట్ల కంటే అధిక జనాభా ఉన్న కెనడా, యూకేలు ఉన్నాయి. అలాగే ఈ నివేదికలో పెద్ద వారితో పోలిస్తే తక్కువ వయసు వారే ఆనందంగా ఉన్నట్లు వెల్లడయ్యింది. కానీ ఇదంతా ప్రపంచవ్యాప్తంగా ఒకేవిధంగా లేదని పేర్కొంది. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో సంతోషం గణనీయంగా తగ్గింది. అక్కడి పెద్దలే ఆనందంగా ఉన్నట్లు తేలింది. మధ్య, తూర్పు ఐరోపాలో మాత్రం అన్ని వయసులవారిలో సంతోషం పెరిగినట్లు పేర్కొంది. పశ్చిమ ఐరోపాలో అందరూ ఒకేరకమైన ఆనందాన్ని అనుభవిస్తున్నట్లు తేలింది. సంతోషకర స్థాయిలో అసమానత ఒక్క ఐరోపా మినహా ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని.. ఇది ఆందోళన కలిగించే విషయమని నివేదిక అభిప్రాయపడింది. అగ్రస్థానంలో ఫిన్లాండ్ దేశమే ఎందుకంటే.. మనస్తత్వవేత్త ఫ్రాంక్ మార్టెల్లా ప్రకారం, ఫిన్లాండ్ దేశం సంతోషంగా ఉండటానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఇతర దేశాలు దీనిని అనుసరిస్తే, అవి కూడా జీవితంలో సంతోషంగా ఉండవచ్చు. మొదటిది ఐక్యతా భావం అది ఇక్కడ ఎక్కువ. ఎలాంటి చెడు పరిస్థితులతోనైనా పోరాడే శక్తిని కలిగి ఉంటారు. అలాగే అందరితో సామరస్యంగా జీవించడం వంటివి ఉంటాయి. ప్రధానంగా చుట్టుపక్కల వారి పట్ల శ్రద్ధ వహించాలని ఫిన్లాండ్ దేశ ప్రజలకు చిన్నప్పటి నుంచి నేర్పుతారు. ఇది వారి అభివృద్ధిలో ముఖ్యమైన భాగం. అంతేగాదు ఫిన్లాండ్లో నిర్వహించిన అనేక అధ్యయనాల్లో ప్రతి కుటుంబం తమ పొరుగువారితో సంతోషంగా గడుపుతాయని తేలింది. సమస్యలన్నీ మాట్లాడుకోవడం వల్ల భారం తగ్గుతుంది. ఇక్కడ అందరిలోనూ దయ కూడా ఎక్కువే. రెండవది, ఇక్కడి ప్రభుత్వ సంస్థలు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. మూడవది సమానత్వం. ఇక్కడ ఎక్కువ సంపాదించేవారు, తక్కువ సంపాదించేవారు అనే తేడా ఉండదు. అందువల్ల ఇక్కడ పేదరికం ఉండదు. అవినీతికి తావుండదు. అదీగాక ఫిన్లాండ్ సంపన్న దేశం. జనాభా తక్కువ. డబ్బు కొరత లేని దేశం. ఈ కారణాల రీత్యా ఫిన్లాండ్ అత్యంత సంతోషకరమైన దేశంగా ఏడోసారి తొలి స్థానంలో కొనసాగుతోంది. (చదవండి: అమెరికా ఆపద్బంధువు 911 హడావిడి! ) -
ఆ సుఖం...నిజమైన సుఖం కాదు!
అది ‘కురువుల’ పట్టణం. దాని సమీపంలో యమునా నది. చల్లని నీడనిచ్చే మామిడి చెట్ల వనం. అందులో అగ్ని భరద్వాజుని ఆశ్రమం. ఆ సమయంలో బుద్ధుడు ఆ ఆశ్రమంలో ఉంటున్నాడు. అగ్ని భరద్వాజుడు బుద్ధునికి తగిన ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఒకరోజు బుద్ధుడు ఆ పట్టణంలోకి వెళ్ళి భిక్ష స్వీకరించి వచ్చి, ఈ వనంలో ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. సమయం మధ్యాహ్నం దాటింది. అగ్ని భరద్వాజుని దగ్గరకు మాగందియుడు అనే తాపసి వచ్చాడు. పరస్పర కుశల ప్రశ్నల తర్వాత వారిద్దరూ కలిసి మామిడి తోటలో బుద్ధుడున్న చోటుకు వెళ్లారు. అప్పటికీ మాగందియుని విషయం బుద్ధునికి తెలుసు. వారు వచ్చాక కొంత సంభాషణ కామసుఖాల మీద జరిగింది... ‘‘మాగందియా! కామసుఖాలకంటే సుఖాన్నిచ్చే గొప్పసుఖం వేరే ఉంది.’’ అన్నాడు బుద్ధుడు. వారిద్దరూ శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. ‘‘నేను యువరాజుగా ఉన్నప్పుడు నాకోసం మూడు ప్రత్యేక భవంతులు నిర్మించారు. వేసవిలో, వర్షాకాలంలో, హేమంత కాలాల్లో నివసించడానికి అనువైన భవనాలు అవి. ఆయా కాలాల్లో హాయిని చేకూర్చే భవనాలు. దివ్య సుఖాన్నిచ్చే భవనాలు నేను ఆ నాలుగు నెలూ ఆ భవనాలు దిగి వచ్చేవాడినే కాదు. చివరికి ఈ కామ సుఖాల బేలతనాన్ని తెలుసుకున్నాను. నాలో కామతృష్ణ తొలగిపోయింది. పిపాస నశించింది. రాగం వదిలిపోయింది. అప్పుడు కూడా ఆనందించాను. కామం, తృష్ణ, పిపాసలు ఇవ్వలేని ఆనందాన్ని కూడా పొందాను. ఆనందం, దుఃఖం భవనాల్లో లేవు. మన మనస్సులోనే ఉంటాయి.’’ అని వారివైపు చూశాడు బుద్ధుడు. శ్రద్ధగా వింటూ కనిపించారు. ‘‘మాగందియా! రాగం ద్వేషం, పిపాస ఉన్న మనస్సునే ప్రక్షాళన చేయాలి. కుష్ఠు వ్యాధి శరీరం, వేడి గ్రహించి హాయి పొందినట్లు రాగద్వేషాలతో ఉన్న మనస్సు కూడా వాటిని పొందినప్పుడు హాయి పొందుతుంది. రాజ భవనాల్లో నేను పొందిన హాయి అలాంటిదే! కుష్ఠువ్యాధి తగ్గిన శరీరం వేడికి హాయి పొందదు. దానికి వేడితో పనిలేదు. అలాగే రాగరహిత హృదయానికి భవనాలు సుఖాలు అవసరం లేదు. ఆరోగ్యమైన శరీరానికి మంటల వేడి అవసరం లేనట్లే... ఆరోగ్యమైన మనస్సుకి కోర్కెలు అవసరం లేదు. మాగందియా! ఈ కామభోగలాలసలు గతంలోనూ, భవిష్యత్‌లోనూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. దుఃఖాన్ని కలిగిస్తూనే ఉంటాయి. ఇంద్రియాల్ని లోబరుచుకుంటూనే ఉంటాయి. వీటికి లోబడి పొందే సుఖం, కుష్ఠువారు వేడివల్ల పొందే సుఖం లాంటిది. ఆ సుఖం సుఖం కాదు. దుఃఖమే!’’ అన్నాడు. ‘‘భగవాన్! చల్లని మీ మాటల ద్వారా ఏది నిజమైన సుఖమో, ఏది సత్యమైన దుఃఖరహిత మార్గమో... తెలుసుకోగలిగాను. నన్ను కూడా ఇకనుంచి మీ అనుయాయిగా స్వీకరించండి’’ అంటూ ప్రణమిల్లాడు మాగందియుడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: ఏది గొప్పది... స్వర్గమా! కాశీనా!!! -
Freedom: స్వేచ్ఛ
సృష్టి లోని జీవులన్నీ కోరుకునేది స్వేచ్ఛ. కాని, అది ఎంత వరకు సాధ్యం? మనమే తల్లి తండ్రులని ఎంచుకుని, పుట్టటం మన చేతుల్లో లేదు అనుకుంటాం. పుట్టిన తరువాత ఇక చేయగలిగినది ఏమీ లేదు. తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఆ బంధంలో నుండి బయట పడాలని తాపత్రయం. బొడ్డు కోసి మాయనుండి వేరైన తరువాత అసలైన బంధనాల్లో ఇరుక్కుపోవటం జరిగింది. అప్పటి వరకు ఉన్న జ్ఞానం కూడా పోతుంది. పూర్తిగా తల్లితండ్రుల మీద ఆధారపడతారు. అక్కడి నుండి ప్రతిదానికి ఎవరో ఒకరి మీద ఆధార పడక తప్పదు. జ్ఞానసముపార్జన కోసం గురువుల మీద ఆధారపడ వలసి వస్తుంది. ఆహారం కోసం అయితే వడ్డించినవారి మీద, వండినవారి మీద, సంబారాలని ఇంటికి తెచ్చినవారి మీద, పంటలు పండించినవారి మీద – ఇట్లా ఎందరి మీదనో ఆధార పడకుండా నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళవు కదా! ముందుగా అవన్నీ తెచ్చుకోవటానికి కావలసిన డబ్బులు ఉండాలి. అవి ఆకాశంలో నుండి ఊడి పడవు. మనం స్వంతంగా తయారు చేయలేము. మఱి, నేను స్వేచ్ఛాజీవిని. ఎవరి మీదా ఆధారపడను అనటం ఎంత సమంజసం? ఆలోచించాల్సిన విషయమే కదా! ఇది ఇరుకుగా ఉన్న గర్భంలో నుండి బయట పడి స్వేచ్ఛాజీవిని అనుకున్న మానవుడికి తాను ఇరుక్కున్న చుట్టరికపు బంధనాల నుండి విడివడాలని అంతర్గతంగా అంతరంగపు అట్టడుగు పొరల్లో మాటుపడి ఉన్న కోరిక. ఈ బంధనాలనే పురాణాలు ప్రతీకాత్మకంగా వృత్రాసురుడు అని చెప్పాయి. చుట్టుకున్నవే చుట్టరికాలు, బంధించేవే బంధనాలు. నిజమైన స్వేచ్ఛ అంటే దేనినీ పట్టుకొని ఉండక పోవటం. దేనినీ పట్టించుకోక పోవటం అనుకుంటారు. నిజమైన స్వేచ్ఛాజీవి అందరికీ సమంగా అందుబాటులో ఉంటాడు. వీరు నాకు ఇష్టులు, మేలు చేసినవారు, బంధువులు, భవిష్యత్తులో నాకు సహాయ పడతారు, నాకు కీడు చేశారు, ఎందుకూ పనికిరారు మొదలైన భావనలతో ప్రవర్తించటం అభిప్రాయాల ఊబిలో కూరుకుపోవటమే. అది వ్యక్తుల విషయం మాత్రమే కాదు, వస్తువులు, సిద్ధాంతాలు మొదలైనవి కూడా. ఎదుటివారి పట్ల ఎటువంటి అభిప్రాయమూ లేకుండా వారికి మేలు కలిగేట్టు తనకు చేతనైనంత వరకు ప్రవర్తించటం, తరువాత ఎటువంటి ప్రతిఫలం కాని, గుర్తింపు కాని ఆశించకుండా ఉండటం స్వేచ్ఛాజీవి లక్షణం. ఏ మాత్రం ఆశించినా అది బంధమే. ఒకవేళ ఏదైనా ప్రతిఫలం లభిస్తే, దానిని ఎటువంటి వ్యామోహం లేకుండా స్వీకరించాలి. ‘‘వద్దు, అది నన్ను బంధిస్తుంది.’’ అని నిరాకరిస్తే, అదే పెద్ద బంధనం అవుతుంది. ‘‘మానవుడు పుట్టుకతో స్వేచ్ఛాజీవి. తరువాత బంధనాలలో ఇరుక్కుంటాడు’’ అన్న ఆంగ్ల సామెత వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నదో చూడండి. నిజంగానే మనం స్వేచ్ఛని అనుభవిస్తున్నామా? స్వేచ్ఛ ఎవరు ఇచ్చేది కాదు. తనంతట తాను అనుభవించ వలసినది. ఆ విధంగా ఉండటానికి చేసే ప్రయత్నమే సాధన అంతా. స్వ+ ఇచ్ఛ అంటే తన అసలైన ఇచ్ఛ, అంటే కోరిక ఏదైతే ఉన్నదో, బంధనాల నుండి విడివడాలని – అది నెరవేరటానికి తగినట్టుగా ఉండగలగటమే స్వేచ్ఛ. దానిని గుర్తించక పోవటం వల్ల స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు ఉండగలగటం, స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం, ఎవరినీ దేనినీ లెక్కచేయకపోవటం అనే అపోహ వ్యాపించి ఉంది లోకంలో. సర్వసంగపరిత్యాగులని చూస్తే ఈ విషయం బాగా తెలుస్తుంది. వారికి ఇల్లు, బంధువులు మొదలైన బంధాలు ఉండవు. పేరు ప్రఖ్యాతులు వంటి చుట్టలలో (వలయాల్లో) ఇరుక్కోరు. ఈ క్షణాన మోక్షం ఇస్తానంటే ఏవో సద్దుకొని వస్తాను అనకుండా ఉన్నవాళ్ళు ఉన్నట్టే బయలుదేరే వారు ఎంత మంది ఉంటారు? అదీ నిజమైన స్వేచ్ఛ అంటే. – డా. ఎన్. అనంత లక్ష్మి -
డబ్బుతో సంతోషాన్ని కొనొచ్చా?
డబ్బుతో అన్ని కొనగలం గానీ సంతోషాన్ని, ఆరోగ్యాన్ని కొనలేం అని తెలిసిందే. అందుకే పిసినారుల్లా, డబ్బు కోసం పడిగాపులు పడొద్దని పెద్దలు హితవు చెబుతుంటారు. అయితే ఈ విషయంపై పరిశోధకులు ఎన్నో ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నారు కూడా. అందుకు సమాధానం కనుగొన్నారు. ఆ అధ్యయనాల్లో డబ్బుతో సంతోషాన్ని కొనొచ్చు అనిపించేలా ఫలితాలు వచ్చాయి. ఆదాయాలు పెరగడంతో కొందరూ సంతోషంగా ఉన్నామని చెప్పగా, అల్రెడీ ఎక్కువ ఆర్జిస్తున్న వారిలో సంతోషం కనిపించలేదు. ఇక్కడ పెరుగుతున్న ఆదాయాలు సంతోషానికి కారణమవుతాయని తేలింది గానీ చివరిగా అందరూ ఒక్కదానికే ఏకగ్రీవంగా ఓటేశారు. అలా చేస్తేనే చాలా సంతోషంగా అనిపించిందన్నారు. ఇంతకీ అందరూ దేన్నీ హైలెట్ చేసి చెప్పారంటే... వివరాల్లోకెళ్తే..పరిశోధకులు డేనియల్ కాహ్నెమాన్, మాథ్యూ కిల్లింగ్స్‌వర్త్ ద్యయం చేసిన అధ్యయనం నిర్ధిష్ట ఆదాయ పరిమితిని చేరుకున్న తర్వాత సంతోషంగా ఉండగలమా? అనే దాన్ని సవాలు చేసిందన్నారు. ఈ మేరకు పరిశోధకులు స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా సుమారు 33 వేల మందిపై అధ్యయనం చేసి వారి డేటాను సేకరించింది. అయితే వారిలో పెరుగుతున్న ఆదాయాలతో సంతోషం పెరుగుతుందని తేలింది. తక్కువ సంపాదన కలిగిన వ్యక్తులు అధిక సంపాదన కలిగిన వారితో పోలిస్తే పెరిగిన ఆదాయం కారణంగా సంతోషంగా ఉండగలరని వెల్లడయ్యింది. వార్షిక జీతం దాదాపు 74 లక్షలు వరకు ఉంటే మానసిక ఆనందంలో మెరుగుదల కనపించింది. అంతకుమించి ఆదాయం పెరిగితే.. అవి ఆనందానికి, మానసికి సంతోషానికి మధ్య సంబంధాల పరిమితి ఏర్పడుతున్నట్లు గమనించారు. ఇక కిల్లింగ్సవర్త్ 2021 అధ్యయనం ప్రకారం దాదాపు రూ. 4 కోట్ల ఆదాయం ఉన్నప్పుడూ.. ఆనందంపై డబ్బు సానుకూల ప్రభావం కనిపించింది. అదేసమయంలో దాదాపు 83 లక్షలు కంటే ఎక్కువ జీతాలు అందుకున్న వ్యక్తుల్లో సంపద పెరిగినప్పటికీ వారి ఆనందంలో మెరుగుదల కనిపించలేదు. వారు కూడా సంతోషంగా ఉన్నట్లు కనిపించలేదని అన్నారు. ఈ మేరకు హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్ సంతోషాన్ని పొందడంలో అనుబంధాల పాత్ర అత్యంత కీలకమనిపేర్కొంది. మంచి జీవితానికి సంబంధాలు అవసరమని అందుకు సంపద కూడా ఒకింత కారణమని చెప్పారు. భౌతకపరమైన సంపదకంటే అనుభవాలతో ఆర్జించుకున్న సంతోషమే గొప్పదని తేలింది. కొంతమంది సామాజికి సంబంధాలతో సంతోషాన్ని పెంపొందించుకున్నారు. డబ్బుతో పనిలేదని ప్రూవ్ చేశారన్నారు. 2008లో ఎలిజబెత్ డన్ ఆమె సహచరులు నిర్వహించిన అధ్యయనంలో ఒక సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తన అధ్యయనంలో కెనడాలోని వాంకోవర్ వీధిలో నడిచే వ్యక్తులకు కొంత డబ్బు నోటులు ఇచ్చి మీ కోసం లేదా ఇతరుల కోసం ఖర్చే చేయమని చెప్పారు. చివరిగా వారంతా తమ కోస కంటే ఇతరుల కోసం ఖర్చు చేసినప్పుడు ఎక్కువ సంతోషం కలిగినట్లు ముక్తకంఠంతో చెప్పారు. పరోపకారమే ఎక్కువ ఆనందాన్నిస్తుంది అని అన్నారు. అలాగే మిస్సౌరీ-కొలంబియా విశ్వవిద్యాలయంలోని సైకలాజి పరిశోధకుల అధ్యయనంలో ఇతరులను సంతోష పెట్టడం వల్ల ఆనందం అర్థవంతంగా ఉందన్న విషయాన్ని హైలెట్ అయ్యింది. దయతో కూడిన పరోపకార చర్యలే ఎక్కువ సంతోషానికి కారణమవుతాయని ఆ పరిశోధనలో తేలింది కూడా. ఈ అధ్యయనం ఇతరుల ఆనందానికి తోడ్పడటం అనే ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఈ పరిశోధనల సారాంశం అవసరాలకు సరిపడ ఆదాయ పెరుగుదల మన సంతోషానికి కారణమవ్వడం తోపాటు ఇతరులకు సాయం చేయడం వల్ల మనం మరింత మానసిక సంతోషాన్ని పొందగలమని వెల్లడించింది. (చదవండి: చెట్లకే కుర్చీలను పండిస్తున్న రైతు! ధర ఏకంగా..!) -
ఈ కంపెనీల్లో సంతోషంగా ఉద్యోగులు.. టాప్ 20 లిస్ట్!
Top 20 companies with happiest employees: ఏదైనా కంపెనీలో ఉద్యోగులు ఎప్నుడు సంతోషంగా ఉంటారు? పనికి తగిన జీతం, గుర్తింపు, ప్రోత్సాహం, మంచి పని వాతావరణం.. ఇవన్నీ ఉంటే ఆ కంపెనీని మంచి కంపెనీగా ఉద్యోగులు భావిస్తారు. ఇదిగో అమెరికాలో అలాంటి కంపెనీల టాప్ 20 లిస్ట్‌ను ప్రముఖ జాబ్ సెర్చ్ సైట్ ‘ఇన్‌డీడ్’ (Indeed) తాజాగా విడుదల చేసింది. అమెరికాకు చెందిన ట్రక్ స్టాప్, కన్వీనియన్స్ స్టోర్ చైన్ ‘లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్’ ఈ లిస్ట్‌లో నంబర్ 1 కంపెనీగా నిలిచింది. ఉద్యోగులు సంతోషకరంగా భావిస్తున్న టాప్ 20 కంపెనీలను ఎంపిక చేయడానికి 2022 జూలై నుంచి 2023 జులై మధ్య కాలంలో అనేక మంది ఉద్యోగుల రివ్యూలను తీసుకుంది. సంతోషం, ప్రయోజనం, సంతృప్తి, ఒత్తిడి అనే నాలుగు అంశాల్లో ఆయా కంపెనీలపై ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది. (Tech Jobs: టెక్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. ఇక రానున్నవి మంచి రోజులే..!) లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్ ఉద్యోగుల సంతోషం విషయంలో 100కు 80 శాతం రేటింగ్‌ను సాధించి టాప్ 1 కంపెనీగా నిలిచింది. ఇతర అంశాల్లోనూ సగటు స్కోర్ 69 నుంచి 71 కంటే చాలా ఎక్కువగానే సాధించింది. ఈ టాప్ 20 లిస్ట్‌లో అత్యధికంగా ఐటీ కంపెనీలే ఉండటం విశేషం. లిస్ట్‌లో ఇండియన్ కంపెనీలు అమెరికాలో ఉద్యోగులు మెచ్చిన ఇన్‌డీడ్ టాప్ 20 కంపెనీల లిస్ట్‌లో మూడు భారతీయ కంపెనీలు ఉండటం గమనార్హం. అవి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాలుగో స్థానంలో, విప్రో (Wipro) 8వ స్థానంలో, ఇన్ఫోసిస్ (Infosys) 9వ స్థానంలో నిలిచాయి. టాప్ 20 లిస్ట్ ఇదే.. 1. లవ్స్ ట్రావెల్ స్టాప్స్ & కంట్రీ స్టోర్స్ 2. H&R బ్లాక్ 3. డెల్టా ఎయిర్ లైన్స్ 4. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 5. యాక్సెంచర్ 6. IBM 7. L3 హారిస్ 8. విప్రో 9. ఇన్ఫోసిస్ 10. నైక్ 11. వ్యాన్స్ 12. ఇన్-ఎన్-అవుట్ బర్గర్ 13. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ 14. హాల్ మార్క్ 15. మైక్రోసాఫ్ట్ 16. నార్త్రోప్ గ్రుమ్మన్ 17. FedEx ఫ్రైట్ 18. డచ్ బ్రదర్స్ కాఫీ 19. వాల్ట్ డిస్నీ కంపెనీ 20. యాపిల్ Proud to be named one of the Top 20 Companies for Work Wellbeing in the U.S. by @indeed. This award is a true testament to IBMers and our culture of openness, collaboration, and trust. https://t.co/MQfriOfKjq pic.twitter.com/FYN50lLPeo — IBM (@IBM) September 21, 2023 -
ప్రపంచం భారత్ వైపు చూసేలా.. హ్యాపీనెస్ ర్యాంకింగ్‌లో ఇండియన్ ఎంప్లాయిస్..
Global Happiness Ranking: 'ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది' అలనాడు ఎంతోమందిని అలరించిన పాట పనిచేయడంలో భారతీయులకు సరిగ్గా సరిపోతుందని తాజాగా కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఆనందంగా పనిచేయడంలో ఇండియన్స్ ముందు వరుసలో ఉంటారని మరోసారి రుజువైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పని ఎలాంటిదైనా.. ఇష్టంగా పనిచేస్తే కష్టం ఉండదు. ఏ దేశంలోని ఉద్యోగులు సంతోషంగా ఉన్నారనే విషయం మీద ఒక సంస్థ నివేదికను రూపొందించింది. ఇందులో భారతీయులే అగ్రస్థానంలో నిలిచింది.12 దేశాల్లోని మొత్తం 15,600 మంది ఐటీ ఉన్నతాధికారులు, బిజినెస్ లీడర్స్ మీద నిర్వహించిన ఈ సర్వేలో ఇండియా నుంచి 1,300 మంచి పాల్గొన్నారు. సుమారు 50శాతం కంటే ఎక్కువ మంది పనిచేయడంలోనే ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. హెచ్‌పీ వర్క్ రిలేషన్షిప్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 27 శాతం మంది ఉద్యోగం చేయడంలో ఆనందాన్ని పొందుతున్నట్లు సమాచారం. మన దేశంలోని ఉద్యోగులు ఫ్లెక్సిబులిటీ, మానసిక ప్రశాంతత, సమర్థవంతమైన నాయకత్వం వంటి వాటిని కలిగి ఉండటం ద్వారా సంతృప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తగినట్లుగానే యాజమాన్యం కూడా చర్యలు తీసుకుంటోంది. ఇదీ చదవండి: నకిలీ వెబ్సైట్లో రూ.11 లక్షలు మోసపోయిన బెంగళూరు వాసి - ఎలా జరిగిందంటే? వేతనం కంటే సంతోషానికి ప్రాధాన్యం భారతదేశంలోని చాలామంది తక్కువ జీతం పొందే ఉద్యోగాల్లో కూడా ఆనందంగా ఉన్నారని చెబుతున్నారు. దీనికి కారణం వారి ఎక్స్పీరియన్స్ పెంచుకోవడం మాత్రమే కాకుండా.. కమ్యూనికేషన్ వంటి వాటిని పెంచుకోవడానికి కూడా అని తెలుస్తోంది. మొత్తం మీద ఈ సర్వేలో భారత్ అగ్రస్థానంలో నిలిచి ప్రపంచంలోని ఇతర ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచింది. -
మీ ఆనందమే నాకు సంతృప్తి - విజయ్ దేవరకొండ
‘‘నేను చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ అంతా విహార యాత్రకు వెళ్తే నేను ఇంట్లో డబ్బులు అడిగి ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక అలాగే ఉండిపొయేవాడిని. ఆ విహార యాత్రలో నా స్నేహితులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని ఆలోచిస్తూ ఉండేవాడిని. తమ్ముడి (ఆనంద్ దేవరకొండ) ఇంజినీరింగ్ ఫీజు కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరైనా కొంత సహాయం చేస్తే బాగుండును అనిపించేది. కానీ ఎవర్నీ అడగడానికి ఇష్టం ఉండేది కాదు. అవన్నీ దాటుకుని ఈ స్థాయికి చేరుకున్నాను. ఇవాళ మీకు (అభిమానులు) హెల్ప్ చేయగలుగుతున్నాను అంటే అది నా వ్యక్తిగత ఆకాంక్ష. నేను అందించే ఈ లక్ష రూపాయలతో మీకు ఒత్తిడి తగ్గి ఆనందం కలిగితే అది నాకు సంతృప్తిగా ఉంటుంది’’ అన్నారు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 1న విడుదలైంది. ‘ఖుషి’ సినిమా హ్యాపీనెస్‌ను షేర్ చేసేందుకు ఎంపిక చేసిన 100 లక్కీ ఫ్యామిలీస్‌కు రూ. లక్ష చొప్పున చెక్స్ అందించారు విజయ్ దేవరకొండ. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఈ ప్రోగ్రామ్‌ను అనౌన్స్ చేసినప్పటి నుంచి మాకు ఇప్పటివరకూ 50 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ ఏడాది వంద మందికి మాత్రమే సహాయం చేయగలుగుతున్నాం. ప్రతి ఏడాది కొంతమందికి సహాయం చేస్తూనే ఉంటాను. నేను స్ట్రాంగ్‌గా ఉన్నంతవరకూ, సినిమాలు చేస్తున్నంతవరకూ నేను సహాయం చేస్తూనే ఉంటాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, సౌత్ స్టేట్స్ నుంచి సెలెక్ట్ చేశారు. సౌత్‌లో అన్ని ప్లేసెస్ నుంచి మా సినిమాకు మంచి స్పందన లభించింది’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘వంద మందికి సహాయం చేయాలనే ప్రయత్నం మా మూవీతో విజయ్ మొదలుపెట్టినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు నవీన్, రవిశంకర్. -
బతుకు పండుగ
లోకంలో దుఃఖం మాత్రమే ఉందా? లేదు, సంతోషం కూడా ఉంది. శత్రుత్వపు చేదు మాత్రమే ఉందా? లేదు, ఆపదలో ఆదుకునే స్నేహమాధుర్యమూ ఉంది. సమరమే కాదు, శాంతీ; సంఘర్షణే కాదు, సామరస్యమూ; భయబీభత్సాలే కాదు; కరుణారౌద్రాలూ ఉన్నాయి. ఒక్కోసారి ప్రళయ తాండవంతో భయపెట్టే ప్రకృతిలోనే, సేదదీర్చే అందాలూ, ఆహ్లాదాలూ ఉన్నాయి. కానీ ఎంత సేపూ పెద్ద పెద్ద కష్టాలనే ఊహించుకుంటూ చిన్న చిన్న సంతోషాలను విస్మరిస్తాం. జీవితాన్ని ముళ్ళకంపగా భావించుకుంటూ పక్కనే ఉన్న మల్లెపొదల గుబాళింపును గమనించలేకపోతాం. జీవించడం కోసం చేసే ప్రయత్నంలో మనసారా జీవించడాన్ని మరచిపోతాం. మన పక్కనే ఉన్న మంచినీ, మానవత్వాన్నీ గుర్తించడంలో ఎలా విఫలమవుతామో ఒక చక్కని కథలో రావిశాస్త్రి చిత్రిస్తాడు. ఆ కథలో ఇద్దరు మిత్రులుంటారు. ఒకతను ఎప్పుడూ ఏదో కష్టంలో చిక్కుకుని కుంగిపోతూ ఉంటాడు; నిరాశానిస్పృహలకు ప్రతిరూపంగా మారి జీవితంపై విరక్తుడ వుతుంటాడు. రెండో వ్యక్తి ప్రతిసారీ అతనికి చేయందించి సమస్య నుంచి గట్టెక్కిస్తూ ఉంటాడు. అలా అతను తేరుకున్న ఓ రోజున తన ఖర్చుతో సినిమాకు తీసుకెడతాడు. ఆ సినిమాలోని ప్రతి నాయకుడు నాయికానాయకులను పెడుతున్న ముప్పుతిప్పలు చూసి, లోకంలో ఎక్కడా మంచి తనం, మానవత్వమే లేవంటూ అతను భారంగా నిట్టూర్చుతాడు. పక్కనే ఉన్న మిత్రుడు అతని వైపు ఒకసారి వింతగా చూసి మనసులోనే నవ్వుకుంటాడు. ఇప్పుడు కొంత మారి ఉండచ్చు కానీ, నిన్నమొన్నటివరకు పెళ్లి అనగానే కట్నాలు, కయ్యాలు, అలకలు, మాటపట్టింపులు, మనస్పర్థలే గుర్తుకొచ్చేవి. గుండె బరువెక్కించే ఇలాంటి అలవాటు పడిన చిత్రణకు భిన్నంగా అడుగడుగునా ఆహ్లాదం నింపేలా ఎవరైనా పెళ్లి కథను నడిపిస్తే అది మండువేసవిలో హఠాత్తుగా వీచిన మలయానిలంలా అలరిస్తుంది. ‘వసుంధర’ రాసిన ‘పెళ్ళిచేసి చూడు’ అనే నవల అలాంటి ఓ అరుదైన ఆశ్చర్యం. అందులో ముగ్గురు అన్నదమ్ములు, వారి భార్యలు ఆడబడచు పెళ్లిని తలకెత్తుకుంటారు. అన్ని విషయాలూ కలసి చర్చించుకుంటారు, సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు, సమానంగా బరువు బాధ్యతలు పంచుకుంటారు, సంఘ టితంగా అడుగులు వేస్తారు. మగపెళ్ళివారి నుంచి సాధారణంగా ఎదురయ్యే సమస్యలే వస్తాయి. జయప్రదంగా పెళ్లి చేయడం ఒక్కటే లక్ష్యంగా వాటిని తెలివిగా, ఓర్పుగా పరిష్కరించుకుంటారు. ఎలాంటి క్లిష్టపరిస్థితిలోనూ ఆందోళనకు లోనుకారు; ఒకరిపై ఒకరు లోక్తులు విసురుకుంటూ, ఒకరి నొకరు ఆటపట్టించుకుంటూ పరిసరాలను సంతోషభరితం చేసుకుంటారు. కల్యాణాన్నే కాదు, కల్యాణం చేయించిన తీరునూ కమనీయం చేస్తారు. ఈ ‘పెళ్ళిచేసిచూడు’ నమూనా పెళ్లికే కాదు; తమలో తమకున్న అన్ని విభేదాలనూ పక్కన పెట్టి పదిమందీ ఉమ్మడిగా నిర్వర్తించాల్సిన ఏ బాధ్యతకైనా వర్తిస్తుంది. ఉదాహరణకు, దేశాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడమన్న ఉమ్మడి లక్ష్యం దిశగా విజయవంతంగా నడిపించడంలో అధికారపక్షానికీ, ప్రతిపక్షాలకూ కూడా చక్కని ఒరవడి అవుతుంది. గొప్ప తాత్విక గాంభీర్యమూ, బహిరంతర్ఘర్షణా, జీవితం గురించిన చిక్కు ప్రశ్నలూ, ఒడుదొ డుకులూ ఉన్న రచనల్లోనూ, బరువైన పాత్రల సరసనే, వాతావరణాన్ని తేలిక చేసి ఉల్లాసపరిచే పాత్రలూ కనిపిస్తూ ఉంటాయి. అవి జీవితం తాలూకు అన్ని పార్శ్వాలనూ స్పృశించే రచయిత దృష్టివైశాల్యాన్ని పట్టి చూపుతాయి. బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది’ నవలలోని జగన్నాథం అలాంటి పాత్ర. సమస్యలకు అతీతంగా, దేనిమీదా ఎలాంటి ఫిర్యాదూ లేకుండా, సరదాగా, స్నేహంగా, హాస్యంగా ప్రవర్తించే జగన్నాథం చిన్నపాత్రే అయినా నాయకుడు దయానిధితో సమా నంగా గుర్తుండిపోతాడు. గమనించే చూపే ఉండాలి కానీ, అలాంటి వ్యక్తులు మన నిజజీవితంలోనూ మన చుట్టుపక్కల తారసపడుతూనే ఉంటారు. తను రచయితా, గొప్ప చదువరీ కాక పోయినా ప్రతి సాహిత్యసమావేశంలోనూ, రచయితల గోష్ఠుల్లోనూ విలక్షణమైన వాక్చాతుర్యంతో తన ఉనికిని ప్రముఖంగా చాటుకునే సంకు పాపారావు అనే రావిశాస్త్రి మిత్రుని గురించి వైజాగ్ లోనూ, బయటా కూడా సాహితీ ప్రముఖులు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. తమ ఉజ్జ్వల వ్యక్తిత్వంతో శత్రుమిత్రుల తేడా లేకుండా అందరి మధ్యా సమానంగా తళుకులీనే పాత్రలూ ఆ యా విశిష్ట రచనల్లో కనిపిస్తాయి. అమెరికా అంతర్యుద్ధం నేపథ్యంగా మార్గరెట్ మిచెల్ రచించిన ‘గాన్ విత్ ద విండ్’ నవలలోని మెలనీ పాత్ర అలాంటిది. చాలా అర్భకంగా, అమాయకంగా ఉండే మెలనీ, ప్రేమించడమే తప్ప ద్వేషించడం తెలియని తన ఉదాత్త వ్యక్తిత్వంతో ఆ నవలలోని ఇతర ప్రధాన స్త్రీ, పురుషపాత్రలను మించి ఎంతో ఎత్తుకు ఎదిగిపోతుంది. అభద్రత, అల్లకల్లోలం, ఉద్రిక్తత, స్థానభ్రంశం, లేమి నిండిన ఆ యుద్ధ వాతావరణం వజ్రం లాంటి ఆమె వ్యక్తిత్వానికి మరింత సానపట్టి కొత్త కాంతుల్ని ఆవిష్కరింపజేస్తుంది. యుద్ధం వరకే శత్రుత్వమని చెప్పి స్వపక్షంతో ఒంటరి పోరాటం చేసి, శత్రు సైనికుల సమాధుల వద్ద కూడా మెలనీ పుష్ప గుచ్ఛాలు ఉంచి వస్తుంది. ఇలాంటి పాత్రలూ, వ్యక్తులూ ప్రపంచాన్ని మరింత ఆశావహంగానూ, వాసయోగ్యం గానూ రూపిస్తారు. బతుక్కి ఓ అర్థాన్ని, పరమార్థాన్ని సంతరిస్తారు. ప్రేమనూ, స్నేహాన్నీ ఇచ్చి పుచ్చుకుని జీవితాన్ని ఉత్సవభరితం చేసుకోడానికి స్ఫూర్తినిస్తారు. మిట్టపల్లాల చీకటిదారిలో దీపస్తంభాలవుతారు. -
మంచి మాట: సంతోషం సమగ్ర బలం
సంతోషం సగం బలం‘ అన్నది మనకు బాగా తెలిసిన మాటే. నిజానికి మనిషికి సంతోషం సమగ్ర బలం. అంతేకాదు మనిషికి సంతోషం సహజమైన బలం కూడా. ఎంత బలవంతుడికైనా సంతోషం లేనప్పుడు అతడు బలహీనుడిగా అయిపోతాడు. సంతోషం కరువైపోయిన మనుషులు మనోవ్యాధులతో శుష్కించిపోవడమూ, నశించిపోవడమూ మనకు తెలిసిన విషయమే. బావుండాలంటే మనిషికి సంతోషం ఎంతో ముఖ్యం. వర్తమానంలో మనం సంతోషంతో ఉంటే లేదా మనం వర్తమానాన్ని సంతోష భరితంగా చేసుకోగలిగితే మన భవిష్యత్తు సంతోషమయంగా ఉంటుంది. ‘సంతోషానికి మార్గం లేదు, సంతోషమే మార్గం‘ ఇది గౌతమ బుద్ధుడి ఉవాచ. సంతోషం అనేది సంపాదించుకోగలిగేదీ, సాధించుకోగలిగేదీ కాదు. సంతోషం మనలో ప్రవహించే రక్తంలాంటిది. బయటనుంచి వచ్చేది కాదు. మనలోంచి మన కోసం మనమై కలిగేది. ‘మనం మన ఆలోచనలవల్ల నిర్మితం అయ్యాం; మనం మన ఆలోచనలకు అనుగుణంగా రూపొందుతాం; మన మెదడు నిర్మలంగా ఉంటే సంతోషం వీడని నీడలా అనుసరిస్తుంది’ అని చెప్పాడు బుద్ధుడు. మనిషి సంతోషంగా ఉండడం అతడి ఆలోచనావిధానంపై ఆధారపడి ఉంటుంది. ఆలోచన ఆధారంగా కలిగే అనుభూతి సంతోషం. ఒకరికి సంతోషాన్ని ఇచ్చేది మరొకరికి సంతోషాన్ని ఇచ్చేది కాకపోవచ్చు. ‘సూర్యుడి కాంతి మనుషులకు వెలుగును ఇస్తూ ఉంటే గుడ్లగూబలకు చీకటి అవుతోంది. నీటిలో మునిగినప్పుడు మనుషులకు, పశువులకు ఆ నీరు శ్వాసకు ప్రతిబంధకం అవుతోంది. ఆ నీరే చేపల శ్వాసకు ఆటంకం అవడం లేదు. మనుషులు హాయిగా గాలి పీల్చుకునే తీరప్రదేశంలో చేపలు గాలి పీల్చుకోలేవు. అగ్ని అన్నిటినీ దహిస్తుంది. కానీ అత్తిరిపక్షులు అగ్నికణాల్ని తింటాయి. నీళ్లవల్ల నిప్పు నశిస్తుంది. కానీ బడబాగ్ని సముద్రం మధ్యలో జ్వలిస్తూ ఉంటుంది. ఇట్లా జగత్తులో విషయాలన్నీ ద్వైరూప్యంతో ఉన్నాయి అని భారతీయ తత్త్వసాహిత్యంలో అత్యున్నతమైన త్రిపురారహస్యంలో చెప్పబడింది. విషయాలనుబట్టి కాదు మనల్ని బట్టి మనకు తృప్తి కలుగుతూ ఉంటుంది లేదా మన తనివి తీరుతూ ఉంటుంది. కాబట్టి మన సంతోషానికి మనమే మూలంగా ఉన్నాం, ఉంటాం. ‘శరీరాన్ని శుష్కింపజెయ్యడంలో చింత లేదా విచారానికి సమానమైంది లేదు’ అని హితోపదేశం ఎన్నో యేళ్ల క్రితమే మనకు చెప్పింది. ‘చితి, చింత ఈ రెండిటిలో చింత ఎక్కువ దారుణమైంది. చితి నిర్జీవమైన శరీరాన్నే దహిస్తుంది కానీ చింత సజీవంగా ఉన్న శరీరాన్ని దహిస్తూ ఉంటుంది’ అని ఒక సంస్కృత శ్లోకం తెలియజేస్తోంది. నిజానికి చింత అనేది శరీరాన్ని మాత్రమే కాదు ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని, ప్రగతిని, జీవితాన్ని కూడా శుష్కింపజేస్తుంది. కాబట్టి మనకు కలిగిన చింతను వీలైనంత త్వరగా వదిలించుకోవాలి. మనకు కలిగిన చింత నుంచి మనం వీలైనంత త్వరగా విముక్తం అవ్వాలి. ‘మానవజాతిలోని చింత అంతా మనసువల్ల వచ్చిన జబ్బు’ అని తమిళకవి కణ్ణదాసన్ చెప్పారు. ఈ స్థితికి అతీతంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు మనసే కీలకం. మనసువల్ల వచ్చిన చింతను ఆ మనసువల్లే తొలగించుకోవాలి.‘గాలి తనతో తీసుకు వచ్చిన మేఘాలను తానే చెదరగొడుతుంది.’ అని ఒక సంస్కృత శ్లోకం చెబుతోంది. ఆ విధంగా మనసువల్ల వచ్చిన చింతలను మనం మనసువల్లే పోగొట్టుకోవాలి. సంతోషం మనిషిలోనే నిక్షిప్తం అయి ఉంది. దుఃఖాన్ని తొలగించుకునేందుకు తనను తాను చెక్కుకోవడం నేర్చుకుంటే మనిషి సంతోషశిల్పం అవుతాడు; మనిషి ‘సంతోషంగా’ ఉంటాడు. – శ్రీకాంత్ జయంతి -
సంతోషమే ‘పూర్తి’ బలం!
సాక్షి, హైదరాబాద్: ‘సంతోషమే సగం బలం’ అన్న సామెత ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ ప్రస్తుత జీవన పరిస్థితులు, కొత్త అలవాట్లు, కెరీర్ సమస్యల నేపథ్యంలో మనిషికి ‘సంతోషమే పూర్తి బలం’ అన్నట్టుగా మారిపోయింది. సంతోషమనేది మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన సానుకూల భావన అని.. ఆనందంగా ఉండేవారు మంచి మానవ సంబంధాలు కలిగి ఉంటారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సంతోషంగా ఉండేవారు తక్కువగా ఒత్తిళ్లకు గురవుతారని.. ఇతరుల కంటే అధిక సృజనాత్మకత కలిగి ఉండటంతోపాటు ఇతరుల పట్ల దాతృత్వాన్ని, ఉదారతను ప్రదర్శిస్తారని వివరిస్తున్నారు. ఇలాంటి వారు తోటివారి నుంచి సామాజికంగా తోడు పొందుతూ.. మంచి ఆరోగ్యంతో ఎక్కువకాలం జీవిస్తారని చెప్తున్నారు. అసలు తాము సంతోషంగా ఉన్నామనే భావనే.. చాలా మందిని తమ జీవితంలో అనేక ప్రయత్నాలు, చొరవ వైపు నెట్టి, విజయం దిశగా నడిపిస్తుందని విశ్లేషిస్తున్నారు. సమాజంలో లేదా కుటుంబంలో పెద్దల అంచనాలను చేరుకోలేకపోతే అసంతృప్తికి దారితీస్తుందని.. పెద్దగా సమస్యలు లేకపోయినా ఇంకేదో కావాలని కోరుకుంటూ నిరాశ, నిస్పృహలకు గురవుతున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హ్యాపీనెస్‌కు ఓ ఇండెక్స్.. మన పరిస్థితి భిన్నం.. గ్లోబల్ హ్యాపీనెస్ కౌన్సిల్ మొదటగా ప్రపంచ దేశాలకు సంబంధించి హ్యాపీనెస్ ఇండెక్స్‌ను రూపొందించింది. 2012 నుంచి దాదాపు 150 దేశాలకు సంబంధించి పలు అంశాల ప్రాతిపదికన ఏటా ‘వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్’ నివేదికను వెలువరిస్తోంది. తలసరి జీడీపీ, సాంఘిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి స్ధాయిలు, సేవాభావం, దాతృత్వం, ఆరోగ్యకర జీవన అంచనాలు, ఆనందానికి సంబంధించి ఆ దేశ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న అంశాలను ఇందుకు పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ హ్యాపీనెస్ ఇండెక్స్‌లో భారత స్కోర్, ర్యాంక్ ఏమంత గొప్పగా ఉండటం లేదు. హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్–2022లో మొత్తం 146 దేశాలకుగాను భారత్ 136 ర్యాంకు సాధించింది. ఆయా దేశాలకు, ఇండియాకు వర్తించే విషయాల్లో తేడాలు, సారూప్యతలు భిన్నంగా ఉండటం కూడా ఇందుకు ఒక కారణమని నిపుణులు చెప్తున్నారు. అంతేగాకుండా మనదేశంలో సంతోషం–సంపద మధ్య బలహీనమైన సహ సంబంధం (కోరిలేషన్) కొరవడటమూ కారణమని ప్రముఖ ఆర్థికవేత్త, రచయిత్రి జయశ్రీ సేన్‌గుప్తా అభిప్రాయపడ్డారు. దేశంలో అసమానతల పెరుగుదల, ధనికులు తమ ఇళ్లలో ఆర్భాటంగా చేసే పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటివి సామాన్య ప్రజల్లో అసంతృప్తికి కారణం అవుతాయని చెప్పారు. మితిమీరిన పట్టణీకరణ, నగరాలు ఇరుకుగా మారడం, ఆహారభద్రత, ధరల పెరుగుదల వంటివి కూడా దీనిని ప్రభావితం చేస్తాయన్నారు. సమష్టి ఆనందంతోనే ఉన్నత స్థాయికి.. ప్రపంచంలో ఎవరినైనా జీవితంలో ఏది ముఖ్యమని ప్రశ్నిస్తే.. సంతోషంగా ఉండటమేననే సమాధానం వస్తుంది. అందరూ ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు. కానీ సంతోషమైనా, ఆనందమైనా ఎలా వస్తుందనేది ముఖ్యం. వ్యక్తిగత స్థాయి కంటే కూడా సమూహ, సమష్టి ఆనందం ఉన్నతస్థాయిలో నిలుపుతుంది. సంతోషం, సంతృప్తి, ఆనందం అనేవాటిని మనకు మాత్రమే పరిమితం చేసుకోకుండా విశాల సమాజానికి, వర్గానికి కలిగేలా చేయడం ద్వారా ఒక సార్థకత ఏర్పడుతుంది. అయితే అపరిమితమైన ఆశలు, ఆశయాలు, నెరవేర్చుకోలేని కోరికలు సరికాదు. జీవితం–చేస్తున్న పని మధ్య తగిన సమతూకం సాధించడమూ ముఖ్యమే. మనకు నచ్చిన ఆహారం తినడం నుంచి నిర్దేశించుకున్న లక్ష్యాలు, అంచనాలు చేరుకోవడం వరకు సంతోషానికి మార్గాలు ఎన్నో. ఒక్కొక్కరి అలవాట్లు, పద్ధతులు, ఆలోచనా ధోరణులు, పెరిగిన వాతావరణం వంటివాటి ఆధారంగా ఈ మార్గాలు మారుతూ ఉంటాయి. – డాక్టర్ ఎమ్మెస్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, డైరెక్టర్, ఆశా హాస్పిటల్స్ శారీరక, సామాజిక అవసరాల నుంచి.. అమెరికాకు చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ అబ్రహం మాస్లో 1970 దశకంలో చేసిన సిద్ధాంతీకరణల ప్రకారం.. ►మనషి జీవితం ప్రధానంగా ఆహారం, నీరు, శృంగారం, నిద్ర వంటి ప్రాథమిక శారీర అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఇవి సంతోషాన్ని ప్రభావితం చేస్తాయి. ►శారీరక భద్రత, ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం, ఆస్తుల భద్రత, ప్రేమ, తమదనే భావన, లైంగికపరమైన దగ్గరితనం, ఆత్మగౌరవం, విశ్వాసం, ఇతరులను గౌరవించడం, స్వీయ వాస్తవికత, నైతికత ఆనందాన్ని కలిగిస్తాయి. ►సామాజికంగా తెలిసిన వారితో స్నేహానుబంధాలు, ప్రేమ, బంధుత్వాల సాధనతోనూ చాలా మంది సంతోషపడి సంతృప్తి చెందుతారు. -
లేటు వయసులో ఫలించిన నిరుద్యోగి కల
సాక్షి, అనకాపల్లి: ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 1998 డీఎస్సీలో ఎంపికైన వారికి ఉద్యోగావకాశం కల్పిస్తూ ఫైల్‌పై (జీఓ జారీ) సంతకం చేయడంతో రాజవొమ్మంగి మండలంలోని లబ్బర్తి గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగి పంట పండింది. 23 ఏళ్లుగా ఉపాధ్యాయ కొలువు కోసం ఎదురు చూస్తున్న అతని నిరీక్షణ ఫలించింది. గ్రామానికి చెందిన పసగడుగుల బాబూరావు (57)కు పెళ్లయి పిల్లలు కూడా పెద్ద వాళ్లయ్యి పెళ్లీడుకు వచ్చారు. ఈ నేపథ్యంలో 1998 నుంచి నేటి వరకు ఎంతో మంది మంత్రులు, ముఖ్యమంత్రులు మారారు. ప్రభుత్వాలు మారాయి. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దయతో మా వంటి అభాగ్యులకు మంచి చేస్తున్నారు. ఆయన రుణం తీర్చుకోలేనిది అంటూ భార్య, ముగ్గురు పిల్లలతో ఈ సంతోషాన్ని పంచుకున్నాడు. 1998 డీఎస్సీ క్వాలీఫైడ్ అభ్యర్థుల హర్షం.. మాడుగుల రూరల్: సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో 1998 డీఎస్సీ క్వాలీఫైడ్ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాడుగుల, చోడవరం, నర్సీపట్నం, పాడేరు, తదితర నియోజకవర్గాల్లో 1998 డీఎస్సీ క్వాలీఫైడ్ అభ్యర్థులు 500 మందికి పైగా ఉన్నారు. గత పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
'ఆనందం' ఎక్కడ దొరుకుతుంది? ఇదిగో..
జీవితంలో ఆనందంగా ఉండటం నిజంగానే కష్టమైన పనా? అసలు ఆనందాన్ని ఎలా వెతుక్కోవాలి అంటూ మనలో చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే ఆనందం అనేది ఆన్లైన్లో దొరికే వస్తువు కాదు, అది స్వతహాగా మనమే పెంపొందించుకోవాలి ఇలాంటి పాజిటివ్ స్పిరిట్‌తో ఉన్న ట్వీట్‌ను గురువారం ఆనంద్ మహింద్రా షేర్ చేశారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహింద్రా..తాజాగా జీవిత పాఠానికి సంబంధించిన ఓ విలువైన పోస్టును నెటిజన్లతో పంచుకున్నారు. ఇందులో..'ఇది (ఆనందం) నీకు ఎక్కడ దొరికింది? దీని కోసం నేను ప్రతీచోట వెతుకుతూనే ఉన్నాను అని ప్రశ్నించగా, ఎక్కడో లేదు..దీన్ని నేనే సృష్టించుకున్నాను' అంటూ మరొకరు సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించిన సింపుల్ లైన్ డయాగ్రమ్‌ను ఆనంద్ మహింద్రా ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. (వైరల్: ‘పులి’ని చూసి పారిపోయిన జంతువులు! ) ఒక్క ఫోటో వెయ్యి పదాల కన్నా విలువైనది అంటారు కదా..అలాగే ఈ సింపుల్ డ్రాయింగ్ కూడా వెయ్యి చిత్రాలకంటే విలువైనది అంటూ ఓ క్యాప్షన్‌ను జతచేశారు. ఆనంద్ మహింద్రా షేర్ చేసిన ఈ పోస్టుకు కొన్ని గంటల్లోనే వేలల్లో లైకులు, రీట్వీట్లు వచ్చాయి. అవును. మీరు చెప్పింది నిజమే..ఆనందం అనేది స్పూన్ ఫీడింగ్ కాదు..దాన్ని మనమే సృష్టించుకోవాలి అంటూ ఓ యూజర్ పేర్కొనగా, సంతోషంగా ఉండటమన్నది చాలా సులభమైన విషయమే కానీ చాలామంది ఇదేదో కష్టమైన పని అని భావిస్తుంటారు అని మరొకరు రిప్లై ఇచ్చారు. (అతని పేరు చెప్పనందుకు సంతోషంగా ఉంది) They say a picture is worth a thousand words? Yes and a simple line drawing is sometimes worth a thousand pictures. pic.twitter.com/cnlBwZrQNz — anand mahindra (@anandmahindra) November 12, 2020 -
హ్యాపీగా.. జాలీగా!
సాక్షి, హైదరాబాద్: ‘హ్యాపీనెస్’కూ ఒక లెక్కుందట. వినడానికి విచిత్రంగానే ఉన్నా నిజమేనని పరిశోధకులు చెబుతున్నారు. మనుషులుగా సంతోషంగా ఉండడం కంటే జీవిత పరమార్థం మరొకటి ఉండదనేది నిర్వివాదాంశమే. కరోనా కల్లోలంలోనూ సంతోషం తమ కంట్రోల్లోనే ఉందని అత్యధికులు అంటున్నారు. చాలామంది హ్యాపీగా, జాలీగా ఉన్నామంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, కోవిడ్ ఉధృతి నేపథ్యంలో అధిక డబ్బు సంపాదన, దానితో ముడిపడిన భౌతికసుఖాలు, విలాసవంతమైన జీవితం, అతి విలువైన వస్తువులు కలిగి ఉండడమే అంతిమ, జీవిత లక్ష్యం కాదనేది అందరికీ తెలిసొచ్చింది. ‘ట్రాకింగ్ హ్యాపీనెస్’ జీవితంలో ఏమి కావాలని కోరుకుంటున్నారని ఎవరినైనా అడిగితే ‘సంతోషం’అని సమాధానం వచ్చే అవకాశాలే ఎక్కువుంటాయి. అయితే సంతోషం కలగడానికి ఒక్కొక్కరిపై రకరకాల అంశాలు, పరిస్థితులు, మానసికస్థితి, అవగాహన వంటివి ప్రభావితం చేస్తుంటాయి. తాజాగా ‘ట్రాకింగ్ హ్యాపీనెస్’అనే ఆన్లైన్ సంస్థ నిర్వహించిన సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. తాము ఊహించిన దాని కంటే కూడా ఆనందం, సంతోషం వంటివి సంబంధిత వ్యక్తుల నియంత్రణలోనే ఉన్నట్టుగా తేలిందని ఆ సంస్థ తెలిపింది. సంతోషమన్న దాన్ని మీరు కంట్రోల్ చేయగలరా ? మీ గతేడాది జీవితాన్ని ఒకసారి వెనక్కు తిరిగి చూసుకుంటే 1 నుంచి 10 పాయిం ట్లకుగాను ఎన్ని పాయింట్ల మేర సంతో షంగా ఉన్నారని అనుకుంటున్నారు ? అన్న ప్రశ్నలపై ఈ సంస్థ అధ్యయనం నిర్వహించింది. సంతోషాన్ని, ఆనందాన్ని తమ నియంత్రణలోనే ఉంచుకోవచ్చనే భావనను, అభిప్రాయాన్ని 89 శాతం మంది వెలిబుచ్చారు. సంతోషాన్ని కంట్రో ల్ చేయలేమని భావిస్తున్నవారి కంటే కూడా తాము మరింత ఆనందంగా ఉన్నామని 32 శాతం మంది వెల్లడించారు. సంతోషంగా ఉన్నామని, ఆనందాన్ని కంట్రోల్ చేయొచ్చునని చెబుతున్నవారు హ్యాపీనెస్ రేటింగ్‌లో 10 మార్కులకుగాను సగటును 7.39 రేటింగ్‌తో నిలవగా, సంతోషాన్ని నియంత్రించలేమని చెప్పిన వారు సగటున 5.61 రేటింగ్‌ను సాధించారు. జెండర్‌కు అతీతంగా.. ఆనందం/సంతోషానికి ఎలాంటి లింగ భేదాలు లేవు. జెండర్ అనేది సంతోషాన్ని నియంత్రించలేదు. పురుషులా, స్త్రీలా అన్న దానితో సంబంధం లేకుండా సంతోషం అనేది వారి వారి నియంత్రణలోనే ఉన్నట్టుగా ఈ పరిశీలనలో వెల్లడైంది. మగవారు, ఆడవారు ఇద్దరూ కూడా ఈ విషయంలో ఒకే విధంగా సమాధానాలిచ్చారు. వయసుకూ, విద్యకూ పాత్ర వయసు కూడా హ్యాపీనెస్ కంట్రోల్లో పాత్ర పోషిస్తున్నట్టు తేలింది. మధ్య వయసుకు వచ్చేసరికి సంతోషంపై నియంత్రణ తగ్గి, ఆ తర్వాత వయసు పెరిగినకొద్దీ ఇది పెరుగుతోందని ఈ సర్వేలో పలువురు సమాధానాలిచ్చా రు. సర్వే చేసిన వారిలో 16–30 ఏళ్ల మధ్య వయసున్నవారు 91 శాతం మంది, 31–45 ఏళ్ల మధ్యలోనివారు 85 శాతం, 45–60 ఏళ్ల లోనివారు 86 శాతం, 60 ఏళ్లు పైబడిన వారు 89% తాము సంతోషాన్ని కంట్రోల్ చేయగలమని అనుకుంటున్నారు. అయితే డిగ్రీలు, పీజీలు చేసి న వారి కంటే తక్కు వ చదువుకున్న వారు తాము తక్కువగా సంతోషాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నట్టుగా అభిప్రాయపడ్డారు. -
శారీరక దృఢత్వంతోనే లక్ష్య సాధన: తమిళిసై
రాయదుర్గం: శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే అనుకున్నది సాధించగలమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. శుక్రవారం గచ్చిబౌలి శాంతి సరోవర్ లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో బ్రహ్మకుమారీస్ సంస్థ మహిళా విభాగం ఆధ్వర్యంలో వినూత్నంగా చేపట్టిన హోప్–హ్యాపీనెస్–హార్మోనీ ప్రాజెక్టును గవర్నర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ సంస్థ మహిళా విభా గం చైర్పర్సన్ రాజయోగిని బీకే చక్రదారి దీదీ, మహిళ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
సంతోషమే సంపూర్ణ బలం
మార్చి 20 ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సందర్భంగా సంతోషం గురించి కొన్ని విశేషాలు... సంతోషమే సగం బలం అని నానుడి. నిజానికి మనుషులకు సంతోషమే సంపూర్ణ బలం. సంతోషం ఒక మానసిక స్థితి. సంతోషంగా బతకాలని మనుషులంతా కోరుకుంటారు. జీవితం పట్ల సంతృప్తి, అవసరాలకు తగినంత సంపద, ఆరోగ్యం, జీవన భద్రత వం టి చాలా అంశాలు మనుషుల సంతోషానికి దోహదపడతాయి. ‘మనుషులు తమ కోసం తాము కోరుకునే ఒకే ఒక్క అంశం సంతోషం మాత్రమే’ అని అరిస్టాటిల్ వెల్లడించాడు. క్రీస్తుపూర్వం 350 ఏళ్ల నాడే తాను రచించిన ‘నికోమాషెన్ ఎథిక్స్’ గ్రంథంలో సంతోషం గురించి విపులంగా చర్చించాడు. సంతోషభరితమైన జీవితమే ఉత్తమమైన జీవితమని తేల్చి చెప్పాడు. సంతోషం గురించి తత్వవేత్తలు, మత బోధకులు క్రీస్తుపూర్వం నాటి నుంచే రకరకాల సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ప్రపంచంలోని మతాలూ శాస్త్రాలూ కూడా సంతోషం గురించి రకరకాల సిద్ధాంతాలను ప్రతిపాదించాయి. ఆధునికుల్లో పంతొమ్మిదో శతాబ్దికి చెందిన బ్రిటిష్ తత్వవేత్త జాన్ స్టూవర్ట్ మిల్ ‘మానవుల చర్యలకు సంతోషమే పరమావధి’ అని చెప్పాడు. ‘మనిషి అంతిమ లక్ష్యం సంతోషమే’నని పంతొమ్మిదో శతాబ్దికి చెందిన జర్మన్ తత్వవేత్త ఫ్రెడెరిక్ నీషే అభిప్రాయపడ్డాడు. సంతోషం గురించి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, అవేవీ సంతోషానికి స్పష్టమైన నిర్వచనాలు కావు. సంతోషం ఒక భావన. సంతోషం ఒక అనుభూతి. సంతోషం ఒక అనుభవం. ఎవరి సంతోషం వారిదే. ఒకరికి సంతోషం కలిగించేది మరొకరికి సంతోషం కలిగించలేకపోవచ్చు. సంతోషం గురించి శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా రకరకాల పరిశోధనలు సాగిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం మాత్రం ప్రజల సంతోషంపై ఆలస్యంగా దృష్టి సారించింది. ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో సంతోషం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఇరవైఒకటో శతాబ్దిలోని మొదటి దశాబ్ది గడచిన తర్వాత మాత్రమే నడుం బిగించి, చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగానే ఐక్యరాజ్య సమితి 2012 నుంచి ఏటా ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’ విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా 2018లో విడుదల చేసిన నివేదికలోని మొత్తం 156 దేశాల జాబితా ప్రకారం భారత్ 133వ స్థానంలో ఉంది. మన ప్రభుత్వాలు అభివృద్ధి గురించి ఎన్ని ప్రగల్భాలు చెప్పుకుంటే మాత్రం లాభమేముంది? మన దేశ జనాభాలో అత్యధికులు సంతోషంగా లేరనే వాస్తవాన్ని ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’ తేటతెల్లం చేస్తోంది. మానవ జీవితానికి అంతిమ ధ్యేయం సంతోషమేనని అద్వైతం బోధిస్తోంది. భౌతిక సుఖాలేవీ శాశ్వత సంతోషాన్ని ఇవ్వలేవని, ఆత్మ పరమాత్మల మధ్య అభేదాన్ని గుర్తించినప్పుడే శాశ్వత ఆనందం లభిస్తుందనేది అద్వైత సిద్ధాంతం. యోగ సూత్రాలను రచించిన పతంజలి తన గ్రంథంలో సంతోషానికి గల మానసిక, అధిభౌతిక కారణాలను విపులంగా విశ్లేషించాడు. సద్గుణాలు, సత్కార్యాలు, సంగీతం మనిషికి సంతోషాన్ని కలిగిస్తాయని చైనాకు చెందిన కన్ఫ్యూషియస్ మత గురువు మిన్సియస్ అభిప్రాయపడ్డాడు. దైవారాధనలో సంతోషమే కీలకమని, దైవారాధన చేసేటప్పుడు అందరూ సంతోషంగా ఉండాలని, సంతోషభరితమైన గీతాలతో దైవాన్ని ప్రార్థించాలని యూదు మతం బోధిస్తోంది. మానవ జీవితానికి చరమ లక్ష్యం సంతోషమేనని క్రీస్తుశకం నాలుగో శతాబ్దికి చెందిన క్రైస్తవ బోధకులు సెయింట్ అగస్టీన్, సెయింట్ థామస్ అక్వినాస్లు అభిప్రాయపడ్డారు. ఇస్లాం కూడా సంతోషానికి తగిన ప్రాధాన్యమిచ్చింది. క్రీస్తుశకం పదకొండో శతాబ్దికి చెందిన సూఫీ గురువు అల్ ఘజలీ ఏకంగా ‘ఆల్కెమీ ఆఫ్ హ్యాపీనెస్’ అనే గ్రంథాన్నే రచించాడు. ‘యునైటెడ్ స్టేట్స్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్’ ప్రకటనను 1776లో రాసిన థామస్ జెఫర్సన్, సంతోషం కోసం ప్రయత్నించడం మనుషులకు గల విశ్వజనీనమైన హక్కుగా గుర్తించాడు. ఇదిలా ఉంటే, మత విశ్వాసాలు లేని వాళ్లతో పోలిస్తే, మత విశ్వాసాలు ఉన్న వాళ్లే ఎక్కువ సంతోషంగా ఉంటున్నట్లు ‘వరల్డ్ వాల్యూ సర్వే’ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ నిపుణులు 1981 నుంచి 2014 వరకు సుదీర్ఘకాలం నిర్వహించిన అధ్యయనంలో బయటపడిన వాస్తవాలతో రూపొందించిన నివేదిక అది. ఆ నివేదిక ప్రకారం యవ్వనంలో ఆరోగ్యంగా ఉన్నవాళ్లు, పరిమితమైన ఆకాంక్షలు కలిగిన వాళ్లు, పనికి తగిన ప్రతిఫలం పొందుతున్న వాళ్లు, చేస్తున్న పనిలో సంతృప్తి పొందుతున్న వాళ్లు, వైవాహిక బంధంలో ఉన్నవాళ్లు, ఆత్మగౌరవం నిలుపుకొనే వాళ్లు, జీవితం పట్ల ఆశావహ దృక్పథం ఉన్న వాళ్లు సంతోషంగా ఉంటున్నట్లు తేలింది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్–2018 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్–2018లోని మొదటి పది స్థానాల్లో అగ్రరాజ్యాలేవీ చోటు దక్కించుకోకపోవడం గమనార్హం. ఈ జాబితాలో అమెరికా 18వ స్థానంలోను, బ్రిటన్ 19వ స్థానంలోను నిలిచాయి. అత్యధిక జనాభా గల చైనా 86వ స్థానంలో నిలిచింది. మన పొరుగు దేశాల్లో పాకిస్తాన్ 75వ స్థానంలోను, నేపాల్ 101 వ స్థానంలోను, బంగ్లాదేశ్ 115వ స్థానంలోను, శ్రీలంక 116వ స్థానంలోను, మయాన్మార్ 130వ స్థానంలోను నిలిచాయి. ఒకప్పుడు ఈ జాబితాలో టాప్–10లో చోటు దక్కించుకున్న భూటాన్ ఈసారి 97వ స్థానానికి దిగజారింది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్–2018 ప్రకారం మన పొరుగు దేశాలే మన కంటే మెరుగ్గా ఉన్నాయి. సంతోషం అంటేనే హడలు ప్రపంచంలోని మనుషులంతా సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. ఇది నిర్వివాదాంశమే అయినా, అతి అరుదుగా కొందరు ఉంటారు. సంతోషంగా ఉండాలంటేనే వాళ్లు భయంతో హడలిపోతారు. సంతోషం అంటేనే భయపడటం ఒక మానసిక రుగ్మత. దీనినే మనస్తత్వ శాస్త్ర పరిభాషలో ‘కీరో ఫోబియా’ అంటారు. అలాగని కీరోఫోబియాతో సతమతమయ్యే వాళ్లంతా నిత్యం విషాదంలో మునిగి ఉంటారనుకుంటారేమో! అలాంటిదేమీ ఉండదు. వాళ్లు ఇతరత్రా మామూలుగానే ఉంటారు. అయితే, సంతోషాన్ని కలిగించే సందర్భాలను మాత్రం వీలైనంత వరకు నివారిస్తూ ఉంటారు. సంతోషంతో తుళ్లుతూ ఉల్లాసంగా గడిపే మిత్రబృందాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ ఉంటారు. ఆనంద రసాయనాలు మెదడులోని ఒక ప్రాంతం ఆనందానికి కేంద్రం. సంతోషాన్ని కలిగించే ఎండార్ఫిన్ వంటి జీవరసాయనాలు అక్కడి నుంచే ఉత్పత్తవుతూ ఉంటాయి. ఆనందాన్ని కలిగించే ఒక రసాయనాన్ని మెకలమ్ అనే శాస్త్రవేత్త 1992లో కనుగొన్నాడు. దానికి ‘ఆనందమైడ్’ అని పేరు పెట్టారు. సంతోషానికి కారణమయ్యే మరిన్ని రసాయనాలనూ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎన్– ఆరాకిడోనోయల్ డోపమైన్, నలడోయిన్, ఆరాకిడోనోయల్ గ్లిసరాల్, వైరోడమైన్ వంటి రసాయనాలు మెదడులో స్రవిస్తూ ఉంటాయి. ఇతరులకు సాయం చేసినప్పుడు, చేసిన మంచి పనుల వల్ల ప్రశంసలు పొందినప్పుడు, ఏదైనా విజయం సాధించినప్పుడు మెదడులో ఇలాంటి రసాయనాలు స్రవిస్తుంటాయి. ఇవి ఆనందాన్ని కలిగిస్తాయి. ఇవి కలిగించే ప్రభావాలనే కొన్ని రకాల మొక్కల ఉత్పత్తులు, కృత్రిమ రసాయనాల ద్వారా కూడా పొందవచ్చు. వీటి ద్వారా భ్రమాజనిత సంతోషం, చెప్పనలవి కాని ప్రశాంతత కలుగుతాయి. ఇవి ఉత్సాహాన్ని పెంచుతాయి. బాధను తగ్గిస్తాయి. వీటిని ఉపయోగించాక ఆకలి పెరుగుతుంది. మొక్కల ఉత్పత్తులు, రసాయన ఔషధాల ద్వారా పొందే ఆనందానుభూతి తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. మళ్లీ మళ్లీ అదే ఆనందానుభూతిని పొందాలనుకునేవారు గంజాయి, నల్లమందు వంటి మొక్కల ఉత్పత్తులను, ఓపియాయిడ్స్, ఎండార్ఫిన్స్, డైనార్ఫిన్స్ వంటి కృత్రిమ రసాయన ఔషధాలను తరచుగా తీసుకుంటూ ఉంటారు. ఇవి తాత్కాలికంగా ఆనందం కలిగించినా, వీటికి బానిసలై దీర్ఘకాలం వాడుతూ పోతే ఇవి ఆరోగ్యంపై నానా దుష్ప్రభావాలు చూపి, జీవితంలోని ఆనందాన్ని మొత్తంగా హరించేస్తాయి. అకాల మరణానికి దారితీస్తాయి. అందువల్ల తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే కృత్రిమ పద్ధతుల జోలికి పోకుండా సహజసిద్ధంగా సంతోషం పొందడమే మేలు. సంతోషాన్నిచ్చే ముఖ్యాంశాలు ఆధ్యాత్మిక చింతన కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అయిన వారి ఆదరాభిమానాలు ఇతరుల పట్ల సానుకూల ప్రవర్తన ఇతరులకు సాయం చేసే ధోరణి ఇష్ట సంభాషణలు కృతజ్ఞతా భావన మంచి వ్యాపకాలతో కాలక్షేపం సంతోషం వల్ల లాభాలు రోగ నిరోధక శక్తి పెరుగుదల బాధల నుంచి సత్వర ఉపశమనం పనితీరులో మెరుగుదల దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం విజయ సాధనమానసిక స్థైర్యం అవరోధాలను అధిగమించే శక్తి మెరుగైన సామాజిక సంబంధాలు ఆనందం గురించి అవీ ఇవీ... ఆనందం కూడా ఆవులింతల్లాగానే ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది. మూడ్ బాగోలేకుంటే ఆనందంగా కాలక్షేపం చేసే మిత్రుల దగ్గరకు వెళ్లండి. మనసు తేలిక పడుతుంది. వాళ్ల ఆనందం మీకూ అంటుకుంటుంది. మనసంతా సంతోషంతో నిండిపోతుంది. సంతోషం ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా వ్యాపిస్తుందని పదేళ్ల కిందట ‘టైమ్’ మ్యాగజీన్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.చదువు సంధ్యలు లేనివాళ్లతో పోలిస్తే విద్యావంతులే కొంత ఎక్కువ సంతోషంగా ఉంటారు. చదువుకునేటప్పుడు చదువు తక్షణమే సంతోషం కలిగించకపోయినా, ఆ తర్వాత జీవితంలో సంతోషానికి ఇతోధికంగా దోహదపడుతుందని ‘ఫౌండేషన్స్ ఆఫ్ హెడోనిక్ సైకాలజీ’ అధ్యయనంలో తేలింది.డబ్బుతో సంతోషాన్ని కొనలేమని చాలామంది అపోహ పడతారు గాని, సంతోషం పొందటానికి డబ్బు కూడా ఒక ముఖ్య సాధనం. అయితే, డబ్బును ఎలా ఖర్చు చేశామనే దానిపై సంతోషం స్థాయి ఆధారపడి ఉంటుంది. వస్తువులను కొనడానికి డబ్బు వెచ్చించడం కంటే అనుభవాలు పొందటానికి డబ్బు వెచ్చించడం ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన మార్కెటింగ్ సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ లిల్లీ జామ్పోల్ నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది.అన్నీ వేదాల్లోనే ఉన్నాయనేది పాతకాలం అపోహ. అన్నీ జన్యువుల్లోనే ఉన్నాయనేది ఈనాటి వాస్తవం. ఆనందం కూడా అందుకు మినహాయింపు కాదు. యూనివర్సిటీ కాలేజ్ లండన్ సైకాలజీ ప్రొఫెసర్ పీటర్ ఫోనగీ చేపట్టిన పరిశోధనల్లో మనుషుల్లోని సంతోషం స్థాయికి జన్యువులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలింది.ఆనందం ఆయువును పెంచుతుంది. దిగులుగా రోజులు వెళ్లదీసే వారితో పోలిస్తే, సంతృప్తిగా సంతోషంగా ఉండేవారు ఎక్కువకాలం బతుకుతారని కాలిఫోర్నియా అలమెడా కౌంటీలో అమెరికన్ శాస్త్రవేత్తలు దాదాపు మూడు దశాబ్దాల పాటు నిర్వహించిన సుదీర్ఘ పరిశోధనలో వెల్లడైంది. సంతోషంగా ఉండేవాళ్లు సంతోషంగా లేనివారి కంటే దాదాపు ఏడేళ్ల నుంచి పదేళ్ల కాలం ఎక్కువగా బతుకుతారని ఆ పరిశోధనతో వెలుగులోకి వచ్చింది. ఆనందంపై అపోహలు వాస్తవాలు ఆనందంపై చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయి. నిజానికి అవేవీ అంతగా ఆనందాన్ని ఇచ్చేవి కాదు. ఒకవేళ అవి కాస్త ఆనందాన్ని ఇచ్చినా, ఆ ఆనందం చాలా తాత్కాలికమైనదే. అపోహ: నిర్దేశిత లక్ష్యాలను సాధించడం ద్వారా సంతోషం పొందవచ్చు. వాస్తవం: నిర్దేశిత లక్ష్యాలను సాధించినప్పుడు దొరికే సంతోషం చాలా తాత్కాలికమైనది. ఒక లక్ష్యం సాధించిన తర్వాత మరో లక్ష్యం మన ముందుకు వస్తూనే ఉంటుంది. అది మరింత కఠినమైన సవాళ్లతో కూడుకున్న లక్ష్యమైతే ఇదివరకటి లక్ష్య సాధన ద్వారా దొరికిన సంతోషం ఆవిరైపోవడానికి ఎంతోసేపు పట్టదు. లక్ష్య సాధన ద్వారా సంతోషం పొందడం కంటే లక్ష్యాలను సాధించే ప్రక్రియను ఆస్వాదించడాన్ని అలవాటు చేసుకుంటేనే మనుషులు ఎక్కువ సంతోషంగా ఉండగలుగుతారని అమెరికన్ మార్కెటింగ్ సైకాలజీ నిపుణురాలు స్టేసీ కాప్రియో చెబుతున్నారు. అపోహ: వయసు పెరిగే కొద్ది తగ్గే సంతోషం వాస్తవం: వయసు పెరిగే కొద్దీ సంతోషం తగ్గుతుందని అంతా అనుకుంటారు. అమాయకమైన బాల్యంలో నిజంగానే సంతోషం స్థాయి ఎక్కువగానే ఉంటుంది. యవ్వనంలోనూ ఆనందం ఉంటుంది. నడి వయసుకొచ్చే సరికి బాధ్యతల భారం నెత్తిన పడుతుంది. ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటే మొదలవుతాయి. మానసిక ఒత్తడి పెరిగి సంతోషంగా ఉండే సందర్భాలు చాలా వరకు తగ్గిపోతాయి. రిటైరైన తర్వాత కాస్త ఆరోగ్యంగా ఉంటే చాలు, విశ్రాంత జీవితాన్ని ఆనందంగా గడపడం అసాధ్యమేమీ కాదు, నిజానికి విశ్రాంత జీవితంలోనే వృద్ధులు దాదాపు చిన్నపిల్లలంత సంతోషంగా ఉండగలుగుతారని అమెరికన్ మనస్తత్వ నిపుణురాలు డయానే ల్యాంగ్ చెబుతున్నారు. -
మీ పార్టనర్‌తో గొడవ పడ్డారా ?
రిలేషన్షిప్లో ఉన్నపుడు గొడవలు రావడం సర్వసాధారణం. అయితే ఈ చిన్న గొడవలు బంధాన్ని మరింతగా పటిష్టం చేస్తాయని అమెరికాలో చేసిన తాజా సర్వేలో వెల్లడైంది. అదే నిజమట.... నమ్మలేకపోతున్నారా ? గొడవ పడేవారే సంతోషంగా ఉన్నారు... క్రూషియల్ కన్వెర్జేషన్ అనే పుస్తక సహ రచయిత జోసెఫ్ గ్రెన్నీ ఈ విషయాన్ని కనుగొన్నారు. దీనికై రిలేషన్షిప్లో ఉన్న 1000 మందిని ఆయన ఎంచుకొని సర్వే నిర్వహించారు. గొడవ పడే జంటలు ఇతరులతో పోలిస్తే పది రెట్లు ఆనందంగా ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. వీరు తమ పార్ట్నర్లో నచ్చని విషయాలను వెంటనే చెబుతారని అందుకే తరచూ గొడవ పడతారని ఆయన అన్నారు. సెన్సిటివ్ విషయాలను సైతం వారు పంచుకొని చర్చించుకుంటున్నారని, మిగిలిన జంటలు తమ సమస్యలను పార్ట్నర్కు తెలియకూడదు అనుకుంటున్నారని అందుకే సంతోషంగా లేరని సర్వేలో వెల్లడైంది. అలాగే తమ రిలేషన్షిప్ ముగిసి పోకూడదని కొన్ని విషయాలలో మౌనంగా ఉండడం వల్ల సంతోషం దూరమౌతోందని తేలింది. పొరపాటు ఎక్కడ జరుగుతోంది... తమను ఇబ్బందికి గురిచేస్తున్న, తమకు నచ్చని విషయాలను పార్టనర్‌తో పంచుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోందని గ్రెన్నీ అభిప్రాయపడ్డారు. ఏదైనా విషయం సడెన్‌గా చెబితే అది ఎదుటి వారు తట్టుకోలేకపోతే రిలేషన్షిప్ ఎక్కడ దెబ్బ తింటుందో అని మౌనంగా ఉండిపోతున్నారని ఆ సర్వే స్పష్టం చేసింది. కమ్యూనికేషనే అసలు సమస్య... సర్వేలో పాల్గొన్న ప్రతీ అయిదుగురిలో నలుగురు తాము కమ్యూనికేషన్ సరిగా చేయలేకపోతున్నామని అందుకే సంతోషంగా ఉండలేకపోతున్నామని తెలిపారు. తమ భావాలను సరిగా వ్యక్తీకరించడంలో ఎదురయ్యే సమస్యలతోనే జంటలు ఇబ్బంది పడుతున్నారని గ్రెన్నీ అన్నారు. తమ మనోభావాన్ని భయం లేకుండా చెప్పేవారే రిలేషన్‌షిప్‌ను ఎంజాయ్ చేయగలుగుతున్నారు. గొడవలకు కారణమవుతున్న అంశాలు... రిలేషన్షిప్లో ఉన్న వారి మధ్య గొడవలకు కారణమవుతున్న అంశాలను ఈ సర్వేలో తెలుసుకున్నారు. డబ్బు, సెక్స్, చెడు అలవాట్ల గురించి వచ్చే చర్చలే గొడవలకు ప్రధాన కారణాలని ఈ సర్వే తేల్చింది. ఓపెన్‌గా చెప్పడమే మేలు సమస్య ఏదైనా, విషయం ఏదైనా సూటిగా చెప్పి గొడవ పడడమే ఉత్తమమని, అదే రిలేషన్షిప్ విజయానికి దోహదం చేస్తుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. నిజమైన ప్రేమ గొడవలు జరుగుతాయని భయపడదని, నిజం చెప్పడానికే ప్రయత్నిస్తుందని గ్రెన్నీ వివరించారు. -
స్మార్ట్‌ఫోన్.. ఆనందానికి హానికరం!
టొరంటో: ‘ఆధునిక ప్రపంచానికి టెక్నాలజీ అద్భుత వరం..కానీ ఆనందానికి మాత్రం హానికరం!’అని అంటున్నారు పరిశోధకులు. దీనికి వారు చేపట్టిన అధ్యయనాన్నే రుజువుగా చూపుతున్నారు. విపరీతంగా స్మార్ట్‌ఫోన్ వాడకం మనుషుల్ని పక్కదారి పట్టిస్తుందని హెచ్చరిస్తున్నారు. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి రెండు అధ్యయనాలు చేపట్టారు. మొద ట 300 మంది వర్సిటీ విద్యార్థులను ఎంచు కుని రెస్టారెంట్‌కి తీసుకెళ్లారు. స్నేహితులను బృందాలుగా చేసి ఒకే టేబుల్‌పై భోజనం వడ్డించి వారి ఫోన్లను చేతికిచ్చారు. భోజనం అనంతరం వారికి కలిగిన వివిధ అనుభవాలను రికార్డు చేసి విశ్లేషించారు. కాగా, స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల పరధ్యానంలో ఉండటం, ఆందోళన చెందటం వంటి ఆనందం తగ్గించే భావోద్వేగాలను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. రెండో అధ్యయనంలో స్మార్ట్‌ఫోన్ వాడుతున్నప్పుడు తమ అనుభవాలను రాయాలని ఓ ప్రశ్నావళి ఇచ్చి సర్వే చేపట్టారు. తర్వాత వారి సమాధానాలను పరిశీలించగా..స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్ టు ఫేస్ చాట్ వల్ల ఆనందం కలగకపోవడమే కాక, దానిపై విరక్తి పెరుగుతున్నట్లు గుర్తించారు. -
సంతోషం కోసం ఓ పిరియడ్!
న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థుల కోసం ‘హ్యాపీనెస్ కరిక్యులమ్’ (కొత్త తరహా సిలబస్)ను ఢిల్లీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. దీన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆధ్యాత్మిక గురువు దలైలామా సంయుక్తంగా సోమవారం ప్రారంభించారు. ఈ సిలబస్‌పై ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి వరకు ఈ ‘హ్యాపీనెస్’ పిరియడ్ 45 నిమిషాలపాటు ఉండనుంది. ‘ధ్యానంతో పాటు విలువైన విద్య, మానసిక వ్యాయామాలు ఉంటాయి. 40 మంది ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు, విద్యావేత్తలు అధ్యయనం చేసి దీన్ని రూపొందించారు. తీవ్రవాదం, అవినీతి, కాలుష్యంలాంటి అధునిక సమస్యలను ఇలాంటి మానవీయ విద్యను అందించడం ద్వారా పరిష్కరించవచ్చని ఆశిస్తున్నాం’ అని సిసోడియా చెప్పారు. ఆధునిక విద్య, ప్రాచీన జ్ఞానం ఏకం చేయడంతో ప్రతికూల భావాల్ని అధిగమించగల్గుతామని దలైలామా అన్నారు.