నవయువం : విజేతలు వద్దంటున్నారు..!
‘ఆశావాదాన్ని అస్త్రంగా చేసుకో... నిరాశ దరిచేరినా భయపడకు...
నీకు అసాధ్యం అనేది ఉండదు...’
ఆనందం, బాధ... జీవితాన్ని చెరో చెయ్యి పట్టుకొని నడిపిస్తుంటాయట. ఆనందానికి అప్పుడప్పుడన్నా అలసట ఉంటుంది కానీ, బాధ మాత్రం తరచూ పలకరిస్తుంటుంది. బాధలు, కష్టాలు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో స్థాయిలో ఉండొచ్చు. కానీ ఈ స్థాయితో సంబంధం లేకుండా చాలామంది తమ చిన్న చిన్న బాధలను మాత్రమే తలుచుకొని తమను ఆనందం కూడా ఒక చేయిపట్టుకొని నడిపిస్తోందన్న విషయాన్ని మరిచిపోతున్నారు! అమూల్యమైన జీవితానికి విషాదభరితమైన ముగింపు ఇస్తున్నారు. తాము కష్టాలుగా భావిస్తున్నవాటిని ఎదుర్కొని బతకాలంటే స్ఫూర్తి కావాలి. అలాంటి స్ఫూర్తిని చాలామంది పెద్దవాళ్లు తమ మాటలతో, జీవితాలతో పంచారు. ఆ మాటల్లో కొన్ని...
‘‘నీకు భవిష్యత్తు మీద ఆశను ఇచ్చాను,
ఆరోగ్యాన్ని, మేధస్సును, ఎన్నో అవకాశాలను ఇచ్చాను.
కానీ నువ్వు నాకు తిరిగి ఇచ్చిందేమిటి? నిరాశా!
ఒక్కసారి ఆలోచించు, అంతర్మథనం చేసుకో,
అప్పుడు దమ్ముంటే చావడానికి ప్రయత్నించు...’’
అంటూ ‘ప్రకృతి’ చేత చెప్పిస్తాడు ‘ది సూసైడ్ ఆర్గ్యుమెంట్’ అనే కవితలో ఆంగ్ల కవి కాల్‌రిడ్జ్. అందమైన జీవితానికి ఆత్మహత్య అనే పరిష్కారం ఇచ్చిన వారిని నిరసిస్తూ, ఇవ్వాలనుకొనే వారిని నిందిస్తాడు కాల్‌రిడ్జ్.
ఎడిసన్ పంచిన కాంతి..
‘‘విఫలం అయ్యామని బాధపడే వారి విషయంలో విషాదం ఏమిటంటే.. వారికి తెలీదు... తాము విజయానికి ఎంత దగ్గరగా వచ్చామో. విజయతీరాల వద్దకు వెళ్లి కూడా, వైఫల్యం చెందామనుకుని తొందరపడి వారు పట్టు వదిలేస్తుంటారు... ’’ అంటాడు థామస్ ఆల్వా ఎడిసన్. సక్సెస్ సీక్రెట్‌ను వివరిస్తూ ఎడిసన్ ఈ మాటలు చెప్పాడు. సహనం ఉంటే అద్భుతమైన తీరాలకు చేరే అవకాశం ఉన్నప్పటీ అర్ధాంతరంగా తనువులను చాలించే వారి జీవితాలకు కూడా ఈ మాటలను అన్వయించవచ్చు. బల్బ్‌ను ఆవిష్కరించి ప్రపంచానికి దీపాన్ని బహుమతిగా వచ్చి ఎడిసన్ మాటల్లో కాంతి కనిపిస్తుంది.
నిరాశను లెక్కచేయకండి...
‘‘ఓడిపోకుండా, నిరాశ లేకుండా బతకడం గొప్ప కాదు, అలాంటి పరిస్థితుల్లోంచి కూడా కొత్త ఆశతో పైకి ఎదగడమే నిజమైన గొప్పదనం...’’ అంటాడు నెల్సన్ మండేలా. వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడి 27 సంవత్సరాల పాటు కారాగారంలోనే బతికిన మండేలా ఏనాడూ తనకు ఆత్మహత్య ఆలోచన రాలేదని గర్వంగా చెప్పాడు. విడుదల ఎప్పుడో తెలీదు, బయట ప్రపంచాన్ని చూసే అవకాశం ఉందో లేదో కూడా తెలీదు. అయినా తన దీనస్థితికి కుమిలిపోలేదు.
‘‘ఆశావాదాన్ని అస్త్రంగా చేసుకో... నిరాశ దరిచేరినా భయపడకు... నీకు అసాధ్యం అనేది ఉండదు...’’ అంటాడు ప్రసిద్ధ హాలీవుడ్ నటుడు క్రిస్టఫర్‌రీవ్. ‘సూపర్‌మ్యాన్’ సినిమాతో ప్రపంచానికి పరిచయం ఉన్న రీవ్ ఒక ప్రమాదంలో వికలాంగుడయ్యాడు. ఆ వెంటనే ఆయనకు వచ్చిన ఆలోచన ఆత్మహత్యేనట. అయితే తన ఆలోచన తీరును తనే మార్చుకొని, నిస్పృహ నుంచి బయటకు వచ్చి ఎన్నో జీవితాలకు స్ఫూర్తిని పంచాడు రీవ్. జీవితం గొప్పది, బంధాలు పెనవేసుకొన్న బతుకు ఉన్నతమైనది... ఎంతోమంది విజేతలు తమ జీవితాలతో ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఇది. విధిని ఎదుర్కొని సాగించాల్సిన విజయ ప్రస్థానానికి స్ఫూర్తి ఇది.
- జీవన్