nelson mandela
-
Zoleka: క్యాన్సర్‌తో మండేలా మనవరాలి కన్నుమూత
జొహన్నెస్‌బర్గ్: నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మనవరాలు జొలేకా మండేలా(43) కన్నుమూశారు. జొలేకా.. రచయిత, ఉద్యమకారిణి కూడా. చాలా కాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ కోసం ఈ నెల 18న ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఆమె కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. చిన్నవయసులోనే ఆమె కన్నుమూయడంతో మండేలా అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ కారణంగా.. జొలేకా ఊపిరితిత్తులతోపాటు శరీరంలోని ప్రధాన భాగాలకు క్యాన్సర్ కణాలు వ్యాపించినట్టు వైద్యులు తెలిపారు. జొలేకా తొలిసారిగా 32 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ బారినపడిన ఆమె చికిత్సతో కోలుకున్నారు. 2016లో మరోమారు అది బయటపడింది. కానీ, ఈసారి మాత్రం అది చికిత్సకు లొంగలేదు. నెల్సన్ మండేలా కూతురు జింద్జీకి జొలేకా 1980లో జన్మించింది. మండేలా సుదీర్ఘ జైలు జీవితం నుంచి విడుదలయ్యే సమయానికి జొలేకాకు వయసు 10 ఏళ్లు. రచయితగా, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తగా, న్యాయం కోసం పోరాడే ఉద్యమకారిణిగా జొలేకా పనిచేశారు. ఆమెకు నలుగురు పిల్లులు ఉన్నారు. 2010లో ఆమె 13 ఏళ్ల కుమార్తె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అప్పటి నుంచి రోడ్ సేఫ్టీ క్యాంపెయినర్‌గానూ అవగాహన కల్పిస్తున్నారు. లైంగిక వేధింపులు, డ్రగ్స్ అలవాటు వంటి విషయాలను ఆమె ఇటీవలే ఓ డాక్యుమెంట్లో సైతం వెల్లడించారు. జొలేకా మృతికి నెల్సన్ మండేలా ఫౌండేషన్ సంతాపం ప్రకటించింది. -
భారీ ధరకు అమ్ముడైన నెల్సన్ మండేలా అరెస్టు వారెంట్ ఎన్ఎఫ్టీ..!
నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా దక్షిణాఫ్రికా జాతిపిత & మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు మండే. అధ్యక్షుడు కాకముందు ఇతను జాతి వివక్ష వ్యతిరేఖ ఉద్యమ కారుడు, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌కు దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఒక మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు "రోబెన్" అనే ద్వీపంలో జైలు శిక్షననుభవించారు. అరెస్టు వారెంట్‌కు సంబంధించిన ఒక డాక్యుమెంట్‌ను ఎన్ఎఫ్టీ(నాన్-ఫంగిబుల్ టోకెన్) రూపంలో వేలం వేస్తే అనూహ్య స్పందన లభించింది. ఈ నెల్సన్ మండేలా ఎన్ఎఫ్టీని ఒక వ్యక్తి 1,30,000(రూ.99 లక్షలు) డాలర్లకు విక్రయించారు. ఎన్ఎఫ్టీ విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును దక్షిణాఫ్రికా స్వాతంత్ర్య సమరానికి సంబంధించిన విశేషాలను సంరక్షించే లిల్లీస్ లీఫ్ మ్యూజియం హెరిటేజ్'కు అందజేయనున్నారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా, బ్రిటిష్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించినందుకు 1962లో అతన్ని అరెస్టు చేశారు. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఇతను ఒకరు. నల్లజాతి సూరీడు అని పలు తెలుగు వ్యాసాలలో ఈయన గురించి వర్ణించారు. జాతి వివక్షతకు వ్యతిరేకంగా జరిపే పొరాటాలకు, వర్ణ సమానతకు నెల్సన్ మండేలా సంకేతంగా నిలిచారు. 2004లో మండేలా ఒరిజినల్ అరెస్టు వారెంట్ డాక్యుమెంట్‌ను దాతలు విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం డాక్యుమెంట్ ఎన్ఎఫ్టీని సొంతం చేసుకున్న వ్యక్తి దీని ఒరిజినల్ డాక్యుమెంట్‌ను చూసేందుకు అనుమతి ఉంటుంది. గత సంవత్సరం తోటి స్వాతంత్ర్య సమరయోధుడు ఒలివర్ టాంబోకు చెందిన ఓ 'పెన్ గన్' ఎన్ఎఫ్టీ(నాన్-ఫంగిబుల్ టోకెన్) రూపంలో వేలం వేయడం వల్ల మ్యూజియంకు సుమారు 50,000 డాలర్లు వచ్చాయి. కోవిడ్ కారణంగా పర్యాటకం పరిశ్రమ వల్ల భారీగా ఆదాయం పడిపోయింది. దీంతో గొప్ప కట్టడాలు, మ్యూజియం నిర్వహణ కష్టసాద్యం అవుతుంది. అయితే, ఎన్ఎఫ్టీ వేలం ద్వారా వచ్చిన డబ్బు వల్ల వీటి నిర్వహణ భారం కొద్దిగా తగ్గుతుంది. (చదవండి: నిరుద్యోగులు ఇక సిద్ధంగా ఉండండి.. ఈ రంగాల్లో భారీగా ఉద్యోగాలు!) -
World Speech Day: మంచి గొంతు, భాష ఉంటే సరిపోదు.. భావోద్వేగాన్ని జత చేస్తేనే
‘ప్రసంగం శక్తివంతమైనది. మంచి ప్రసంగం.. ప్రపంచాన్ని ఒప్పించేది, మార్చేది, ఆచరింపజేసేది’అంటాడు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. మాట ప్రపంచాన్ని నడిపించే వాహకం. దాన్ని అద్భుతంగా ఉపయోగించినవాళ్లు మంచి వక్తలవుతారు. అలా మనసును కదిలించే ప్రసంగాలతో ప్రపంచగతిని మార్చిన వాళ్లున్నారు. నేడు అంతర్జాతీయ ప్రసంగ దినోత్సవం సందర్భంగా దాని ప్రాసంగికత గురించి కొన్ని ముచ్చట్లు... ప్రసంగం అంటే.. మంచి గొంతు ఉంటే సరిపోదు. మంచి భాష తెలిసినంత మాత్రాన వక్తలైపోరు. ఎందుకంటే కొన్నిసార్లు పదాలు ఉత్తి శబ్దాలు. వాటికి భావోద్వేగాన్ని, ఆలోచనలను జత చేసి వ్యక్తీకరిస్తేనే అద్భుతమైన ప్రసంగం అవుతుంది. అది జనంలో మార్పు తీసుకురాగలిగితే చరిత్రలో నిల్చిపోతుంది. రకరకాల ప్రసంగాలు.. ప్రసంగాల్లో చాలా రకాలుంటాయి. కొన్ని వినోదాన్ని పంచితే, మరికొన్ని విజ్ఞానాన్ని అందజేస్తాయి. కొందరి ప్రసంగాలు ఆలోచనల్లో పడేస్తాయి. ఇంకొన్ని మనకు తిరుగులేదన్న ఆత్మవిశ్వాసాన్నిస్తాయి. అంశమేదైనా దాన్ని ముందు వక్త నమ్మితే.. అది విన్నవాళ్లను సైతం ఒప్పించగలుగతారు. అలా తమ ప్రసంగాలతో ప్రపంచగతిని మార్చేసిన కొందరు నేతలున్నారు. కొందరి ప్రసంగాలు స్ఫూర్తిని రగిలిస్తే... విద్వేషాలను రెచ్చగొట్టిన మరికొన్ని ప్రసంగాలూ ఉన్నాయి. చదవండి: ముప్పు ముంగిట అమెజాన్.. కథ మారకపోతే కష్టాలకు తలుపులు బార్లా తెరిచినట్టే! నాకో కల ఉంది : మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్) ‘ఏదో ఒక రోజున నా నలుగురు పిల్లలు వారి వర్ణాన్ని బట్టి కాకుండా, వ్యక్తిత్వాలను బట్టి గుర్తించే దేశంలో నివసిస్తారని నాకో కల ఉంది’అంటూ 1963లో అమెరికా పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్(జూనియర్) చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని కదిలించింది. అమెరికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని మలుపు తిప్పిన ప్రసంగమది. స్వేచ్ఛ కోసం మానవ హక్కుల కోసం, స్వేచ్ఛ, సమానత్వం కోసం తన జాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు నెల్సన్మండేలా. రివోనియా ట్రయల్ దగ్గర 1964లో సౌత్ ఆఫ్రికా సుప్రీంకోర్టు ముందు నిలబడి ఆయన చేసిన ప్రసంగం చిరస్మరణీయం. ‘నా జీవితకాలం లో ఆఫ్రికన్ ప్రజల కోసం నన్ను నేను అంకితం చేసుకున్నా ను. నేను తెల్లజాతి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాను, నల్లజాతి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాను. ప్రజలందరూ సామరస్యంగా, సమాన అవకాశాలతో కలిసి జీవించే ప్రజాస్వామ్య, స్వేచ్ఛా సమాజం కోసం అవసరమైతే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నీ హక్కుల కోసం నువ్వు పోరాడు, నీ స్వేచ్ఛకోసం నువ్వు పోరాడు. ఇతరుల హక్కులపై ఆధిపత్యం కోసం పోరాడకూడదు’ ఆయన చేసిన ప్రసంగం ఆయనను చెరసాల నుంచి కాపాడలేకపోయింది కానీ... దక్షిణాఫ్రికా ప్రజల గుండెలను పిండేసింది. స్వేచ్ఛ కోసం ఆఫ్రికన్లను కార్యోన్ముఖులను చేసింది. స్వామి వివేకానందకు స్టాండింగ్ ఒవేషన్ స్వామి వివేకానంద.. 1893 సెప్టెంబర్ 11న చికాగోలో ప్రపంచ మతాల పార్లమెంట్ సందర్భంగా ‘అమెరికా సోదర, సోదరీమణులకు’అంటూ ఆయన మొదలుపెట్టిన ప్రసంగం రెండు నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ అందుకుంది. సమయం తక్కువగా ఉందని చెప్పిన నిర్వాహకులు... ఆయన ప్రసంగం మొదలుపెట్టాక మైమరచిపోయి విన్నారు. మహాత్ముని మాట.. అత్యంత ప్రభావితం చేయగలిగిన వక్తల్లో ఒకరు మన జాతిపిత మహాత్మాగాంధీ. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ఆయన చేసిన ప్రసంగాలు భారత జాతిని మేల్కొల్పాయి. ‘మనం ద్వేష భావం వీడాలి, స్నేహభావం అలవరుచుకోవాలి. బ్రిటిష్ వారిప్పుడు ప్రమాదపుటంచుల్లో ఉన్నారు. వారి సహాయం కోసం నేను చేయి అందిస్తాను... దాన్ని కత్తిరించడానికి వారు సిద్ధంగా ఉన్నా సరే. వారికి సాయపడేందుకే నేను ముందుంటాను’అంటూ గాంధీ చేసిన ప్రసంగాలు బ్రిటిష్‌వారిని సైతం ఆలోచింపజేశాయి. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో మార్చి 7న ఢాకాలోని రేస్ కోర్స్ మైదానంలో షేక్ ముజీబుర్ రెహ్మాన్ చరిత్రాత్మక ప్రసంగం చరిత్రలో నిలిచిపోయింది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం కావాలంటూ ముజీబుర్ రహ్మాన్ ప్రసంగం వినేందుకు దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. పాక్ సైన్యం నుంచి ర క్షణ కోసం కాకుండా ప్రతిఘటనకు ప్రతీకగా వెదురు క ర్రలు చేతబూని ప్రజలు బహిరంగసభకు వచ్చారు. ఈ సందర్భంగా ముజీబుర్ చేసిన ప్రసంగం భారత ఉప ఖండంలో రాజకీయ ప్రసంగాలలోకెల్లా అత్యున్నతమైనదిగా నిలిచింది. ఈ ప్రసంగాన్ని ప్రపంచ వారసత్వ డాక్యుమెంటరీగా యునెస్కో 2017లో గుర్తించింది. -
‘మండేలా’ తాళం చెవి వేలం ఆపండి
జొహన్నస్‌బర్గ్: జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ నాయకుడు నెల్సన్ మండేలా 18 ఏళ్లపాటు కారాగార శిక్ష అనుభవించిన జైలు గది తాళం చెవిని వేలం వేయడాన్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది. నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్య బద్ధంగా అధ్యక్షుడైన తొలి నాయకుడు జైలు జీవితం గడిపిన గది తాలూకూ వస్తువులన్నీ జాతి సంపదలని దక్షిణాఫ్రికా ప్రకటించింది. అమెరికాలో జనవరి 28న జరగనున్న ఓ ప్రైవేట్ వేలంపాటలో ఆ తాళం చెవికి ధర కట్టడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేసింది. అసలు తమ ప్రభుత్వాన్ని సంప్రదించకుం డా వేలంవేయడ మేంటని దక్షిణాఫ్రికా క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి నాథి ఎంతెత్వా ప్రశ్నించారు. మండేలాకు చెందిన కళ్లద్దాలు, పెన్నులు, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్, ఐక్యరాజ్యసమితి నుంచి అందుకున్న జ్ఞాపికలూ వేలానికి పెట్టారు. ఈ మొత్తం ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. వేలానికి పెట్టిన మండేలా వస్తువులను తిరిగి దేశానికి తెస్తామన్నారు. మండేలాకు విధించిన 27 ఏళ్ల కారాగార శిక్షలో 18 ఏళ్లు రాబిన్ ద్వీపంలోని జైలులో ఒకే గదిలో గడిపారు. ఆ కాలంలో ఆ జైలుకు జైలర్‌గా క్రిస్టో బ్రాండ్ ఉన్నాడు. మండేలాకు, క్రిస్టోకు మంచి స్నేహం కుదిరింది. ఆ తర్వాత క్రిస్టో .. రాబిన్ ద్వీపానికి టూర్ గైడ్‌గా మారాడు. ప్రస్తుతం ఆ జైలును పురావస్తుశాలగా మార్చారు. అయితే, మండేలా ఉన్న గది తాళం చెవి డూప్లికేట్ ఒకటి క్రిస్టో చెంతకు చేరింది. ఆ డూప్లికేట్ కీను అమెరికాకు చెందిన గెన్సీస్ ఆక్షన్స్ అనే వేలం సంస్థకు విక్రయించాడు. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, మహోన్నతమైన మండేలా గడిపిన గది తాలూకు కీ కావడంతో అది రూ.10 కోట్లకుపైగా ధర పలకవచ్చని ప్రాథమిక అంచనాలున్నాయి. గది మాస్టర్ కీ(అసలైన తాళం చెవి) జైలులోనే ఉందని, డూప్లికేట్‌కు ఒడిగట్టిన అధికారులు ఎవరనేది తేలుస్తామని మంత్రి చెప్పారు. -
ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచించి ఉంటేనా..
World Suicide Prevention Day 2021: మనిషికి జంతువుతో పోలిస్తే ఉన్న అడ్వాంటేజ్.. మనుగడ పోరాటంలో తెలివితేటల్ని, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకోగలగడం. నోరు లేని మూగజీవాలు ఎలాగోలా తమ బతుకుల్ని నెట్టుకొస్తుంటే.. అన్నీ ఉన్నా సంఘజీవి మనిషి మాత్రం పిరికితనంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నాడు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలెన్నో బతుకుల్ని బుగ్గిపాలు చేస్తుంటే.. అందులో ఒకటైన ఆత్మహత్య మనిషిని మానసికంగా కుంగదీసి మరీ చంపేస్తోంది. ఒకవేళ ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే.. నెగెటివ్ అంశాలెన్నో పాజిటివ్‌గా మారిపోవడమే కాదు.. మరో మలుపు తిరిగి జీవితంలో అద్భుతాలు జరగొచ్చేమో కదా! ► సమస్యలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, ప్రాణం పోతే తిరిగి రాదు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు. ►ఆత్మహత్యలను నివారించేందుకు, అది ఎంత పెద్ద నేరమో అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏటా ఒక దినం నిర్వహిస్తున్నారు. ►ప్రతీ ఏటా ఆత్మహత్యా నివారణ దినోత్సవం సెప్టెంబర్ 10న జరుపుతున్నారు. ►ఈ ఏడాది థీమ్ ఏంటో తెలుసా? ‘బతకాలనే ఆశను అవతలివాళ్లలో సృష్టించడం.. అదీ చేతల ద్వారా’. ►కరోనా వల్ల మనిషిలో మానసికంగా కుంగుబాటు ఎక్కువ అయిపోయింది. ►ఉద్యోగాలు కోల్పోవడం, ఉపాధి అవకాశాలు పోగొట్టుకోవడం, అయినవాళ్లను దూరం చేసుకోవడం, సోషల్ గ్యాదరింగ్‌లు లేకపోవడం వల్ల మనిషి.. నిరాశానిస్పృహలోకి నెట్టేస్తున్నాయి. క్షణికావేశంలో అయినవాళ్లకు, అభిమానించేవాళ్లకు దూరంగా వెళ్లిపోతున్నారు. ►కిందటి ఏడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హఠాన్మరణం తర్వాత దేశవ్యాప్తంగా డిప్రెషన్-సూసైడ్‌ల గురించి విస్తృత చర్చ నడిచింది. అంతకు ముందు ఆత్మహత్యలు చేసుకున్న సెలబ్రిటీలతో పాటు యువత మానసిక స్థితి గతులపై సమీక్ష నిర్వహించేందుకు మేధావులకు, మానసిక నిపుణులకు అవకాశం ఇచ్చింది. ►అందుకే ఈ ఏడాది “Creating Hope Through Action” థీమ్ తెచ్చారు ►వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. ది ఇంటర్నేషనల్ అసోషియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్(IASP), వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్(WFMH) సంయుక్తంగా ఈ రోజును నిర్వహిస్తారు. ►2003లో తొలిసారి ఈ దినోత్సవాన్ని నిర్వహించారు ►వందల్లో 60 మంది ఆత్మహత్యలకు పాల్పడడానికి కారణం.. ఒంటరిమనే భావన. కష్టకాలంలో సరైన ఓదార్పు లేకపోవడం. ►ఆర్థిక కారణాలు, బంధాలు, అయినవాళ్లతో గొడవలు కూడా మనిషిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయి. ►కాలు విరిగినా, చెయ్యి విరిగినా ఎలా విశ్రాంతి తీసుకుంటామో.. అలాగే మనసుకు విశ్రాంతి ఇవ్వాలి. ►సపోర్ట్‌గా నిలవాల్సింది సొసైటీనే. అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టుపక్కల ఉండే ఎవరైనా కావొచ్చు. ►సెన్సిటివ్ బిహేవియర్.. అంటే అప్పటిదాకా ధైర్యంగా ఉన్న మనిషి, చిన్న సంఘటనతోనూ కుంగుబాటుకు గురై ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి, వరుస దెబ్బలతో నిరాశనిస్పృహల్లోకి కూరుకుపోయిన వాళ్లే ఆత్మహత్యలకు పాల్పడతారనే అభిప్రాయం సరైంది కాదు. ►ఆత్మహత్యకు పాల్పడటం, ఆత్మహత్యకు యత్నించడం, పుసిగొల్పడం-ప్రేరేపించడం.. ఇవన్నీ నేరాలే. ఐపీసీ సెక్షన్-309 ప్రకారం.. జైలుశిక్ష జరిమానా తప్పవు. రాజీ కుదుర్చుకోవడానికి వీల్లేదు. అలాగే వీళ్ల తరపున ఏ లాయర్ వాదించడు. ►ప్రపంచంలో ప్రతీ నలభై సెకన్లకు ఒక ఆత్మహత్య నమోదు అవుతోంది. అందులో భారత్ టాప్ టెన్‌లో ఉండడం గమనార్హం. ►ఎందుకు బతకాలి? బతికి ఏం సాధించాలి? అనే పిరికి ప్రశ్నల కంటే.. బతికి సాధించుకోవాలి అనే ధైర్యం మనిషిని మహర్షిగా మారుస్తుంది. క్షణికావేశ నిర్ణయం ఒక జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తుంది. ఆ క్షణాన్ని గనుక అధిగమిస్తే అంతా వెలుగే నిండుతుంది - జాకీ చాన్ ఓడిన ప్రతీసారి రెట్టింపు ఉత్సామంతో పైకి లేవడమే మనిషి తన జీవితంలో సాధించే గొప్ప కీర్తి - నెల్సన్ మండేలా - సాక్షి, వెబ్‌డెస్క్ స్పెషల్ -
జస్టిస్ చంద్రయ్యకు ‘నెల్సన్ మండేలా అవార్డ్’
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హెచ్చార్సీ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య ప్రతిష్టాత్మక ‘నెల్సన్ మండేలా అవార్డ్’అందుకున్నారు. జాతీయ సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా ఢిల్లీ నేషనల్ కో–ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఈ అవార్డును ఆయనకు అందించారు. పేదలు, మహిళలు, దివ్యాంగులు, చిన్న పిల్లల హక్కుల పరిరక్షణకు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ హోదాలో జస్టిస్ చంద్రయ్య చేస్తున్న కృషికి గుర్తింపుగా ఎన్‌సీయూఐ, ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ లిమిటెడ్ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశాయి. -
నెల్సన్ మండేలా చిన్న కుమార్తె మృతి
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా చిన్న కుమార్తె జిండ్జీ(59) మృతి చెందినట్లు స్థానిక మీడియా సోమవారం వెల్లడించింది. ఈ రోజు ఉదయం జోహన్నెస్‌బర్గ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు పేర్కొంది. అయితే ఆమె మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుతం జిండ్జీ డెన్మార్క్ రాయబారిగా పనిచేస్తున్నారు. కాగా నెల్సన్ మండేలా- రెండో భార్య విన్నీ మడికిజెలాకు పుట్టిన సంతానం జిండ్జీ. (క్యాన్సర్‌తో మరో నటి కన్నుమూత) అయితే వీరు 1992లో విడాకులు తీసుకోగా విన్నీ మడికిజెలా 2018 ఏప్రిల్ నెలలో మృతి చెందారు. 1998లో తన పుట్టిన రోజు సందర్భంగా మండేలా మూడో భార్య గ్రాచా మాచెల్స్ను వివాహం చేసుకున్నారు. నెల్సన్ మండేలాకు మొత్తం ముగ్గురు భార్యలు ఆరుగురు సంతానం. 20 మంది మనువలు, మనవరాళ్లు ఉన్నారు. కాగా మండేలా తీవ్ర శ్వాసకోశ సంబంధ అస్వస్థతతో బాధపడుతూ 2013 డిసెంబర్ 5 న జోహన్నెస్‌బర్గ్‌లో మరణించారు. -
క్షమాపణా ద్వారానికి గుడ్ ఫ్రైడే
యేసుప్రభువు మరణించిన ‘గుడ్ ఫ్రైడే’ని లోకం చివరి అధ్యాయం అనుకుంది. కాని రెండు రోజులకేఆదివారం నాటి ‘ఈస్టర్ పునరుత్థానం’తో మానవ చరిత్రలో ఒక నవ కృపాశకంఆరంభమయింది. అత్యంత ఆహ్లాదకరమైన, శాంతిభరితమైన వాతావరణానికి ‘క్షమాపణ’ మన జీవితంలో ద్వారం తెరుస్తుంది. యేసుప్రభువు ప్రబోధాల నిండా ఆయన ప్రేమ, క్షమాపణే నిండి ఉన్నా, సిలువ వేయబడేందుకు ముందు రాత్రి జరిగిన పస్కా విందులోనే ప్రభువు క్షమాపణా ఉద్యమం ఆచరణలో ఆరంభమైంది. ఆయన తన ద్రాక్షారసం గిన్నెలో రొట్టె ముక్కలు ముంచి తనకు ద్రోహం చేసిన ఇస్కరియోతు యూదాతో సహా శిష్యులందరికీ ఇచ్చాడు. ఇది యూదుల సామాజిక ఆచారం. ఒక వ్యక్తిని క్షమించినపుడు ఆ వ్యక్తి, అవతలి వ్యక్తిని తాను క్షమించానని తెలియ జేస్తూ ద్రాక్షారసంలో ముంచిన రొట్టెముక్కను అందరి సమక్షంలో అతనికిస్తాడు. ఆ క్షణం నుండి వారి మధ్య వైరానికి తెర పడుతుంది. మేడగదిలో జరిగిన పస్కా విందులో అదే జరిగింది అదే. లోకానికంతటికీ క్షమాపణను ప్రసాదించిన సిలువ యాగానికి ముందు యేసుప్రభువు ఆ ఉద్యమాన్ని తన శిష్యులతో ఆరంభించాడు. ఎందుకంటే కొద్దిగంటల్లోనే వాళ్లంతా తనను వదిలేసి పిరికిపందల్లాగా పారిపోనున్నారు. ఇక ఇస్కరియోతు యూదా అనే శిష్యుడైతే ముప్పై వెండినాణేలకు అమ్మేసి ప్రభువుకు ద్రోహం చేసేందుకు అప్పటికే యూదు మతాధికారులతో ఒప్పందం చేసుకున్నాడు. ఎంతైనా ఇస్కరియోతు యూదా యెరికోలోని ఒక వ్యాపారస్థుని కొడుకు కదా, తన వ్యాపార లక్షణం పోనిచ్చుకోలేదు. వస్తువులమ్ముకొని లాభం గడించినట్టే యేసుప్రభువును కూడా అమ్మేస్తే తప్పేమిటి? అన్నది అతని ‘లాజిక్’!! యూదా కుట్రమేరకు అర్ధరాత్రిపూట గెత్సేమేనే తోటలో యేసుప్రభువును నిర్బంధించిన రోమా సైనికులు ఆయన్ను మొదట ప్రధాన యాజకుడైన కయప ఇంటికి, ఆ తర్వాత తెల్లవారిన తర్వాత తీర్పు కోసం పిలాతు మందిరానికి తీసుకెళ్తున్నప్పుడు ఒకరిద్దరు మినహా శిష్యులంతా పారిపోయారు. అయితే యేసుప్రభువు మాత్రం ఒంటరివాడు కాలేదు. అంతటి శ్రమల్లోనూ ఆయన తన పరలోకపు తండ్రితో నిరంతర సహవాసంలోనే ఉన్నాడు. అందుకే తనను హింసిస్తున్న వారినందరినీ క్షమించమంటూ సిలువలో వేలాడుతూ కూడా పరలోకపు తండ్రికి ప్రార్థన చేశాడు. తనతోపాటు సిలువ వేసిన గజదొంగల్లో ఒకతను తనను క్షమించమని కోరగా అతనికి పరలోక భాగ్యాన్ని కూడా ప్రభువు ప్రసాదించాడు. యేసుప్రభువును అమ్ముకొని కూడా డబ్బు సంపాదించాలనుకున్న యూదా ఇస్కరియోతు మాత్రం ఆ రోజే ఉరివేసుకొని చనిపోయి నరకానికెళ్లాడు అందువల్ల ఆనాటి గుడ్ ఫ్రైడే ఇస్కరియోతుకు ఒక ‘బ్యాడ్ ఫ్రైడే’.. కాని చివరి నిముషంలో మారుమనస్సు పొంది ప్రభువును ఆశ్రయించి ఆయన కృపతో పరలోకానికెళ్లిన ఆ గజదొంగకు మాత్రం అది నిజంగా గుడ్ ఫ్రైడే, ప్రభువు శిష్యుడు, గొప్ప మేధావి అయి ఉండి కూడా యూదా నరకానికెళ్లడమే నాటి గుడ్ ఫ్రైడే లో నిజమైన ట్రాజెడీ,ఆనాటి యూదు మతాధికారులు, రోమా పాలకులు కసికొద్దీ యేసుప్రభువును శారీరకంగా, మానసికంగా హింసించినా, అంతటి శ్రమలో కూడా శరీరం, మనసు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ఆయన్ను చంపానని లోకం విర్రవీగింది. కానీ వాస్తవానికి ఆయనే తన ఆత్మను తండ్రికి అప్పగించడం ద్వారా స్వచ్ఛందంగా ప్రాణత్యాగం చేశాడు, యేసుప్రభువు జీవితానికి లోకం ‘గుడ్ ఫ్రైడే’ చివరి అధ్యాయం అనుకుంది.. కాని రెండు రోజులకే ఆదివారం నాటి ‘ఈస్టర్ పునరుత్థానం’ తో ఒక మానవ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం, నవ కృపాశకం ఆరంభమయింది. ఒక చెంపను కొట్టిన వ్యక్తి దవడ పళ్ళన్నీ రాలగొట్టాలనే ఈ లోకపు ప్రతీకార సిద్ధాంతం ఎంత బలహీనమైనదో సాత్వికత్వం, సరళత్వం, శాంతిపథం ఎంతటి శక్తివంతమైన ఆయుధాలో యేసుప్రభువు తన బోధలు, జీవితం, సిలువత్యాగం, పునరుత్థానం ద్వారా రుజువు చేశాడు. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడైన తర్వాత తన సిబ్బందితో కలిసి ఒక రెస్టారెంట్ కు వెళ్ళాడు. అక్కడ ఒక మూలన కూర్చున్న ఒక అనామక వ్యక్తిని తీసుకొచ్చి తనతోపాటు కూర్చోబెట్టమని సిబ్బందికి చెప్పాడాయన. ఆ వ్యక్తి ఎంతో భయం తో వచ్చి నెల్సన్ మండేలా కూర్చున్న టేబుల్ వద్దే కూర్చున్నాడు. తెప్పించిన ఆహారపదార్థాలన్నీ భయంతో వణికిపోతూనే మౌనంగా తిన్నాడు. ఆ తర్వాత అలా భయపడుతూనే వెళ్ళిపోయాడు. దేశాధ్యక్షుడితో కలిసి కూర్చుంటే భయపడక తప్పదు కదా అనుకున్నారంతా. కాని తాను సుదీర్ఘకాలం పాటు జైలులో ఉన్నపుడు తనను అత్యంత క్రూరంగా హింసించిన జైలు గార్డు అతనని, తనను యథేచ్ఛగా హింసించిన తర్వాత కూడా కసి తీరక కొన్నిసార్లు అతను తన మొహం మీద మూత్రం కూడా పోసేవాడని మండేలా తన సిబ్బందికి తెలియజేశాడు. తాను తనను గుర్తించానని అతనికి తెలిసింది కాబట్టి ప్రతీకారం తీర్చుకుంటానని అతను భయపడుతున్నాడని, అయితే అతనెక్కడుంటాడో, అతని కష్టాలేంటో తెలుసుకొని అతనికి తగిన సాయం చెయ్యమని, అదే తన ప్రతీకార విధానమని మండేలా ఆదేశించాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
పోరాటయోధుడు నెల్సన్ మండేలా
వనపర్తిటౌన్ : జాతి అహంకార దోపిడీని ధిక్కరించి, సమాన హక్కుల సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన పోరాటయోధుడు నెల్సన్ మండేలా అని తెలంగాణ న నిర్మాణ వేదిక రాష్ట్ర గౌరవా«ధ్యక్షుడు మురళీధర్‌గుప్తా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మండేలా 100వ జయంతి వేడుకలను టీజేఏసీ, నవ నిర్మాణ వేదిక సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19 18లో యూరోప్ నుంచి వలస వచ్చిన వర్తకులు, పెట్టుబడిదారులు దక్షిణాఫ్రికాలోని ప్రజలను బానిసలుగా మార్చారని తెలిపారు. నల్ల జాతీయి ల హక్కులను కాలరాసి వెట్టిచాకిరీ చేయిస్తున్నా రన్నారు. ఆ బానిస సంకెళ్లను విడిపించేందుకు మండేలా శాంతియుత మార్గంలో పోరాడారని తెలిపారు. ఆయన పోరాట స్ఫూర్తి ప్ర పంచానికి మార్గదర్శనంలా మారిందని చెప్పారు. బాలుర కళాశాల ప్రిన్సిపాల్ మద్దిలేటి, టీజేఏసీ కన్వీనర్ రాజారాంప్రకాశ్, డీటీఎప్ జిల్లా అధ్యక్షుడు యోసేపు లెక్చలర్ రంగస్వామి, ఖాదర్‌పాష, కళాకారుడు డప్పు నాగరాజు పాల్గొన్నారు. -
చీకట్లు తొలగించిన నల్లసూరీడు
కొత్త కోణం వలస విధానాలకు ఎదురు తిరిగినందుకు తెగ పెద్దగా ఉంటున్న మండేలా తండ్రిని బ్రిటిష్ వలస పాలకులు పదవినుంచి తొలగించి, భూముల్నీ లాక్కున్నారు. లొంగని తండ్రి ఊరు వదిలిపెట్టారు. ఇది కేవలం మండేలా కుటుంబ కథ మాత్రమే కాదు. ప్రతి నల్లజాతి కుటుంబానిదీ ఇదే వేదన. ‘‘నల్లజాతి ప్రజలకు భూమి జీవనాధారం. అంతేగాక భూమి మీద నల్లజాతి ప్రజలందరికీ సమష్టి హక్కులుండేవి. వ్యక్తిగత ఆస్తి అనేదే ఆనాడు లేదు,’’ అంటూ మండేలా నాటి నల్లజాతి ప్రజల ప్రజాస్వామ్య జీవన విధానాన్ని వివరించారు. అయితే బ్రిటిష్ వారి రాకతో ఈ సమానత్వ భావన కనుమరుగైపోయింది. ‘‘హోసా తెగ, మొత్తం దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజ లందరం పరాజితులం. పుట్టిన గడ్డమీదనే మనం కట్టుబానిసలం. సొంత భూమిలో కౌలుదారులం. మనం తెల్లజాతి పెట్టుబడి దారుల గని పనిమనుషులం. శ్వేత జాతి ధనవం తులు అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతున్నారు. మనం కటిక దారిద్య్రంలో బతుకులీడుస్తున్నాం.’’ నెల్సన్ మండేలా జన్మించిన ఆదివాసీ తెగ అధిపతి మెలిగ్కిలి తన జాతి విముక్తి కోసం పలికిన మాట లివి. సరిగ్గా ఇవే మాటలు నల్లజాతీయులపై శ్వేత జాత్యహంకార దోపిడీనీ, అణచివేతనీ ధిక్కరించిన మండేలా గుండెను రగిల్చాయి. తనను విప్లవ యోధుడిగా తీర్చిదిద్దడానికి ఈ మాటలే స్ఫూర్తినిచ్చాయి. నెల్సన్ మండేలా 1918 జూలై 18న దక్షిణా ఫ్రికాలోని తెంబు ప్రాంతంలోని ఖును జిల్లా వెజో గ్రామంలో జన్మించారు. మండేలా తండ్రి గాడ్లా హెన్రీ. తల్లి నోసెకెని ఫ్యానీ. ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం ఒకప్పుడు సర్వ స్వతంత్ర దేశంగా ఉండేది. ఎప్పుడైతే యూరప్ నుంచి వలస వర్తకులు, పెట్టు బడిదారులు దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టారో అప్పటి నుంచి అక్కడి నల్లజాతి ప్రజలు కట్టు బానిసల య్యారు. మండేలా పుట్టే నాటికే దక్షిణాఫ్రికా బానిస దేశంగా మారిపోయింది. స్థానిక నల్లజాతుల వారి అన్ని హక్కులూ హరించి, ఆధిపత్యం చెలాయిస్తోన్న శ్వేత జాతీయులు సహజ వనరులను సొంతం చేసు కున్నారు. ఇక నల్లజాతి మహిళల పరిస్థితి వర్ణనా తీతం. వారిపై సర్వాధికారాలూ చెలాయిస్తూ గొడ్డు చాకిరీ చేయించుకునేవారు. మహిళలను తమ దగ్గరే ఉంచి, మగాళ్లను మాత్రం సుదూర తీరాలకు తర లించి అక్కడి బంగారు గనుల్లో కార్మికులుగా వాడుకు న్నారు. అయితే మండేలాది ఆదివాసీ రాచరిక ప్రతిని ధిగా ఉన్న కుటుంబం కావడం వల్ల కార్మికుల కుటుం బాలతో కలిసి జీవించే అవకాశం రాలేదు. సామాజిక పరిస్థితులు నెల్సన్ మండేలాను నిరంతరం ఆలో చింపజేసేవి. తెల్లజాతి పాలకులు మండేలా కుటుం బాన్ని అన్ని రకాలుగా వేధించారు. వారిని ఆర్థికంగా దెబ్బతీసేందుకు భూమి మీద హక్కు లేకుండా చేశారు. దక్షిణాఫ్రికాలో మండేలా జన్మించిన హోసా తెగతో పాటు, జూలూ, స్వాన, సొతో తెగల ప్రజలు అనాదిగా నివాసముంటున్నారు. డచ్ వర్తకులు ప్రవే శపెట్టిన బానిస విధానం, బ్రిటిష్ వారి రాకతో మరింత పాతుకుపోయింది. వలసపాలనపై మండేలా తండ్రి ధిక్కారం బ్రిటిష్ వలస విధానాలపై ఎదురు తిరిగినందుకు హోసా తెగ పెద్దగా వ్యవహరిస్తోన్న మండేలా తండ్రిని ఆ పదవి నుంచి తొలగించారు. ఆయన భూములన్నింటినీ బ్రిటిష్ పాలకులు స్వాధీనం చేసుకున్నారు. బతుకుదెరువు కోసం పుట్టిన ఊరు విడిచి నెల్సన్ మండేలా కుటుంబం పట్టణానికి చేరింది. ప్రతి నల్లజాతి కుటుంబానిదీ ఇదే వేదన. ‘నల్లజాతి ప్రజలకు భూమి జీవనాధారం. అంతేగాక భూమి మీద నల్లజాతి ప్రజలందరికీ సమష్టి హక్కు లుండేవి. వ్యక్తిగత ఆస్తి అనేదే ఆనాడు లేదు’ అంటూ మండేలా నాటి నల్లజాతి ప్రజల ప్రజాస్వామ్య జీవన విధానాన్ని వివరించారు. అయితే బ్రిటిష్‌వారి రాకతో ఈ సమానత్వ భావన కనుమరుగైపోయింది. నల్ల జాతి ప్రజలను విభజించి, కొంత మంది తెగల పెద్ద లకు కొంత భూమి అప్పజెప్పారు. అప్పటివరకూ లేని పేద, ధనిక అంతరాలు దక్షిణాఫ్రికా ప్రజల జీవితాల్లోకి ప్రవేశించాయి. కుటుంబంలో మండేలానే తొలి తరం అక్షరాస్యుడు. బ్రిటిష్ విధానాల ప్రకారం నడిచే పాఠశాల కావడంతో ఆయన పేరుకు ముందు ఆయన ఉపాధ్యాయుడు నెల్సన్ అనే ఇంగ్లిష్ పేరు చేర్చారు. మండేలా తొమ్మిదేళ్ల వయస్సులో ఉన్న ప్పుడే ఆయన తండ్రి మరణించారు. దానితో ఆయన జీవితం కీలక మలుపు తిరిగింది. తండ్రి లేని మండే లాను హోసా తెగ నాయకుడు జోగింతాబా దత్తత తీసుకున్నారు. ఆయన సొంత ఊరు వదిలి తెంబూ లాండ్ రాజధానికి వెళ్లాల్సి వచ్చింది. అప్పటి వరకూ స్వేచ్ఛా విహంగంలా గడిపిన మండేలా ఒక్కసారిగా కట్టుబాట్లలో బందీ అయ్యారు. అయితే తెగ అధిపతి పిల్లలతో పాటు, మండేలాకు కూడా ఆ కుటుంబంలో తగిన ప్రేమ లభించింది. రాజభవనం సమీపంలో నడిచే పాఠశాలలో ఇంగ్లిష్ , హోసా తెగ చరిత్ర, భూగోళ శాస్త్రం లాంటి విషయాలు నేర్చుకున్నారు. ఆ సమయంలోనే నల్లజాతి ప్రజల ఘనమైన చరిత్ర చదివే సందర్భం మండేలాకు ఎదురైంది. విద్యార్థిగా రాజకీయాల్లోకి! మండేలా హోసా పెద్ద సహకారంతో విద్యాభ్యాసం కొనసాగించారు. ఆయన చదువుతో పాటు బాక్సిం గ్లో ప్రావీణ్యం సంపాదించారు. ఎలాంటి తారత మ్యాలు లేకుండా, బరిలో ఇద్దరు మాత్రమే కలబడే ఆటగా ఆయన బాక్సింగ్‌ను అభివర్ణించారు. ఒక్క నల్లజాతివారే చదువుకునే అవకాశం ఉన్న ఫోర్ట్ హరే విశ్వవిద్యాలయంలో మండేలా 1939లో చేరారు. చదువుతో పాటు విద్యార్థి సంఘ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. వర్సిటీలో రెండో సంవత్సరం లోనే విద్యార్థి ప్రాతినిధ్య సమితి సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ సమితి విద్యార్థుల సమస్యలను పరిష్క రించడంలో విఫలమైందని భావించి రాజీనామా చేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు తరగతులకు హాజరుకావద్దని నిర్ణయించిన విద్యార్థులకు నాయకత్వం వహించడంతో విశ్వవిద్యాలయం యాజమాన్యం ఏడాదిపాటు మండేలాను బహిష్కరించింది. అక్కడి నుంచి నెల్సన్ మండేలా చదువు కొనసాగలేదు. ఇంటికి తిరిగివచ్చిన మండేలాకు పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఇది ఇష్టంలేని మండేలా జోహానిస్‌బర్గ్ పారిపోయారు. అక్కడ చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తూనే, కరస్పాండెన్స్ ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత విట్ వాటర్స్ రాండ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర కోర్సులో చేరారు. ఆ సమయంలో సాగుతున్న జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమంలోకి దూకి 1942 నుంచి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ)లో భాగస్వామి అయ్యారు. ఉద్యమస్ఫూర్తితో ఏఎన్సీ ముందుకు పోవడం లేదని గ్రహించిన మండేలా యువతను కూడగట్టారు. 1949 నుంచి ఏఎన్సీ ఉద్యమ స్వరూపం మారిపోయింది. దీనికి ప్రధాన బాధ్యత మండేలా నాయకత్వం వహిస్తున్న యూత్లీగ్దే. సమ్మెలు, సహాయ నిరాకరణలు, బహిష్కరణల వంటి ప్రజా పోరాటాలను మండేలా ప్రారంభించారు. ఇదే సమయంలో నల్లజాతి ప్రజలకు న్యాయ సహాయం అందించడానికి మరో ఉద్యమకారుడు ఆలివర్ టాంబోతో కలిసి ఒక న్యాయకేంద్రం స్థాపిం చారు. అయితే మండేలాకు అహింసా ఉద్యమం మీద నమ్మకం పోయింది. మిలిటెంట్ పోరాటాలకు ప్రజలు సన్నద్ధం కావాలని ఆయన కోరారు. 1961లో మూడు రోజుల జాతీయ సమ్మెకు మండేలా పిలుపునిచ్చారు. దీనితో బెదిరిపోయిన శ్వేత జాతి ప్రభుత్వం మండేలాను అరెస్టు చేసి అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. 1963లో రెండోసారి విచారణ జరిపి ఆయనతో పాటు మరో పది మంది ఏఎన్సీ నాయ కులకు యావజ్జీవ శిక్ష విధించింది. అప్పటి నుంచి 27 సంవత్సరాలు మండేలా జైలు జీవితం గడిపారు. పోరాట పంథా విరమణకు ససేమిరా! అయితే 1985లో అప్పటి శ్వేత జాతి ప్రభుత్వ అధ్య క్షుడు పి.డబ్ల్యూ. బోథా ఒక రాజకీయ ఎత్తుగడతో ముందుకు వచ్చారు. సాయుధ పోరాట పంథాకు స్వస్తి చెబితే, జైలు నుంచి విడుదల చేస్తామని మండే లాకు సందేశం పంపారు. దానికి అంగీకరించిన మండేలా ఖైదీలతో చర్చలు జరపడం చట్ట వ్యతిరేక మనీ, విడుదల చేసి మాట్లాడితే అది ప్రజాస్వామిక విధానమవుతుందని తేల్చిచెప్పారు. మండేలా విడు దలకు అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. దేశాలు, ప్రజలు, ప్రభుత్వాలు ఖండాంతరాల నుంచి ఆయన విడుదల కోసం డిమాండ్ చేశారు. కానీ బోథాను పదవి నుంచి తొలగించి, మండేలా విడుదలకు మార్గం సుగమం చేయాల్సివచ్చింది. 1990లో బోథా స్థానంలో అధ్యక్ష పదవిని చేపట్టిన ఫ్రెడరిక్ విలియం క్లార్క్ మండేలా విడుదల విషయం ప్రకటించారు. ఏఎన్‌సీపై నిషేధం ఎత్తివేయడంతో పాటు, రాజ కీయ సంస్థలపై ఆంక్షలు తొలగించారు. రాజకీయ ఖైదీల ఉరిశిక్షలు రద్దు చేశారు. నల్లజాతి వారందరికీ ఓటు హక్కు లభించే దాకా సాయుధ పోరాటం సాగుతుందని మండేలా తేల్చి చెప్పారు. విడుదల య్యాక 1991లో మండేలా ఏఎన్సీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో జాత్యహం కార విధానాన్ని నిర్మూలించి, ప్రజాస్వామ్యాన్ని నెల కొల్పడానికి, నల్లజాతి ప్రజలకు సర్వాధికారాలు లభించడానికి క్లార్క్‌తో మండేలా విస్తృతంగా చర్చిం చారు. 1994 మే 10న నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా నల్లజాతి తొలి అధ్యక్షుడిగా ఎన్నిక య్యారు. అప్పటి నుంచి 1999 వరకు పదవిలో కొనసాగారు. 1996లో దక్షిణాఫ్రికా నూతన రాజ్యాంగం ఆమోదించారు. నల్లజాతి ప్రజలకు విద్యను చేరువ చేయడానికి ఎన్నో పథకాలు ప్రారంభించారు. ఎన్నో అవరోధాలు, నిర్బంధాలు, ఆంక్షలు ఎదుర్కొని దేశాన్ని తెల్ల జాతి పాలన నుంచి విముక్తి చేసిన నెల్సన్ మండేలా 2013 డిసెంబర్ 5న శాశ్వతంగా కన్నుమూశారు. (నెల్సన్ మండేలా శత జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా) వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మల్లెపల్లి లక్ష్మయ్య మొబైల్ : 97055 66213 -
మహా పోరాటయోధుడు
‘ఒక వ్యక్తికి ఉన్న జీవించే హక్కును హరిస్తే అతడు తిరుగుబాటుదారుడు కాక తప్పదు’ అంటారు నెల్సన్ మండేలా. నిజమే. అణచివేత కలకాలం సాగదు. అణచివేత పెరిగే కొలదీ నియంతల అహంకారం పతనమయ్యే క్షణాలు సమీపిస్తున్నట్టే. ఇదే ప్రపంచ దేశాల చరిత్రలో కనిపిస్తుంది. అయితే అందుకు సాగిన ఉద్యమాల స్వరూపాలు వేరు. పోరాటాల స్వభావాలు వేరు. వాటికి నాయకత్వం వహించిన నేతల పంథాలు వేరు. నెల్సన్ మండేలా అనే మహా పోరాటయోధుడు కూడా అందులో ఒకరు. తన జాతి స్వేచ్ఛ కోసం 27 ఏళ్లు ఆయన తన స్వేచ్ఛను జైలు గోడలకు బలిచేసుకున్నాడు. దక్షిణాఫ్రికా ఆధునిక ప్రపంచ చరిత్రలో వివక్షకూ, నిరంకుశత్వానికీ చిరునామాగా కనిపిస్తుంది. ఈ దేశం పేరుతో భారతీయులకు కూడా చిరపరిచయమే ఉంది. ఆ దేశంతో, భారతీయులు జాతిపితగా పిలుచుకునే మహాత్మా గాం«ధీ అక్కడ జరిపిన హక్కుల పోరాట చరిత్రతో భారతీయుల పరిచయం ఉద్వేగ భరితమైనది. నల్లజాతీయులు (అక్కడి శ్వేతజాతి ప్రభుత్వం దృష్టిలో నల్లవారే కాదు, భారతీయుల కూడా నల్లవారి కిందే లెక్క) జుట్టు పెంచినా పన్ను కట్టించుకున్న దేశమది. పెళ్లి కూడా ఒక మత సంప్రదాయం మేరకే జరగాలన్న వ్యవస్థ అది. ఫస్ట్‌క్లాస్ టిక్కెట్‌తో రైలు ఎక్కినా నల్లజాతీయుడు కాబట్టి గాంధీజీని రైలు బోగీ నుంచి కిందకు నెట్టివేసిన అధికార మదం ఆనాటి ఆ దేశ ప్రభుత్వానిది. అలాంటి చోట జాతి వివక్ష ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న శ్వేతజాతిని నెల్సన్ మండేలా తల వంచేటట్టు చేయగలిగారు. నెల్సన్ మండేలా (జూలై 18,1918– డిసెంబర్ 5,2013)కూ, గాంధీజీకీ కొన్ని విషయాలలో సామ్యాలు కనిపిస్తాయి. అహింసా పద్ధతులతో నిరంకుశత్వాన్ని మెట్టు దిగేటట్టు చేయవచ్చునని గాంధీజీ విశ్వాసం. శాసనోల్లంఘన ద్వారా ఎలాంటి ప్రభుత్వాలనైనా కదిలించవచ్చునని ఆయన అనుభవం. నెల్సన్ మండేలా ఉద్యమ తొలి దశ కూడా అలాగే మొదలైంది. అహింస ద్వారా, శాసనోల్లంఘన ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల ముందు తలొగ్గేటట్టు చేయవచ్చునని ఆయన అనుకున్నారు. కానీ ఆయన శాంతియుత పంథాను విడిచిపెట్టి సాయుథ పథం వైపు నడవక తప్పని పరిస్థితులు తలెత్తాయి. మహాత్ముడి ఉద్యమానికీ, మండేలా ఉద్యమానికి మధ్య కాలం తన లక్షణాన్ని అంతగా మార్చుకుందేమోమరి! మండేలా రాజకీయాలు, ఉద్యమం, ప్రస్థానం గురించి చెప్పుకునే ముందు ఆయన గత చరిత్రను స్మరించుకోవాలి. ఆయనను ఉద్యమకారునిగా మారడం వెనుక వాస్తవాలు అందులోనే ఉన్నాయి. అదొక దేశ చరిత్ర. ఒక జాతి బాధల గాథ. అందులో ఆగ్రహం, ఆవేశాల కథ. ఇలాంటి వారి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం లాంఛనం అని చెప్పలేం కూడా. అదొక చారిత్రక అవసరం. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిపోతున్న కాలమది. కానీ ఆ యుద్ధం తెచ్చిన విపత్తులతో, కరువు కాటకాలతో ప్రపంచం కొత్త యుద్ధం ప్రారంభిస్తున్న కాలం. కానీ ఆ యుద్ధం కొన్ని గణనీయ మార్పులు తెచ్చింది. నాలుగు నియంతృత్వాలు కుప్పకూలాయి. జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, రష్యా నియంతలు పతనమయ్యారు. కొత్త రాజకీయ తాత్వికతలు బలం పుంజుకున్నాయి. రాజకీయాలు వేడెక్కాయి. రాడికల్ భావాలు పదునెక్కాయి. కానీ శ్వేతజాతి అధీనంలో, లేదా శ్వేతజాతి నల్లబంటుల చేతిలో ఉన్న దక్షిణాఫ్రికా మాత్రం మార్పునకు నోచుకోలేదు. బహుశా మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్ విజయం అందుకు అవకాశం ఇచ్చి ఉండవచ్చు. కానీ యుద్ధం ఆరంభం కావడానికి ముందే గాంధీజీ ఆ దేశంలో రాజకీయ చైతన్యానికీ, హక్కుల స్పృహకూ అంకురార్పణ చేశారు. ఇదంతా జరిగిన దాదాపు రెండు దశాబ్దాల తరువాత దక్షిణాఫ్రికా రాజకీయ వాతావరణం మీద ఉన్న అసంతృప్తి కొత్త మలుపు తీసుకుంది. ఆగ్రహంగా, ఆవేశంగా ఆ అసంతృప్తి రూపు దాలుస్తున్న సమయంలో మండేలా జన్మించారు. నెల్సన్ మండేలా అసలు పేరు నెల్సన్ రోలిలాహ్లా మండేలా. మాడిబా ఆయన ముద్దుపేరు. థెంబు తెగ. కేప్ పరిధిలోని ఉటాటా అనే ప్రాంతంలో మెజో అనే ఊళ్లో ఆయన జన్మించారు. మాట్లాడే భాష హోసా. కానీ చదువుకు సుదూరంగా ఉండిపోయిన తెగలలో అదొకటి. తండ్రి గాడ్లా హెన్రీ. బహుభార్యాత్వం ఉన్న ఆ తెగలో గాడ్లా నాలుగు వివాహాలు చేసుకున్నాడు. వారిలో మూడవ భార్య కుమారుడు నెల్సన్. గాడ్లా థెంబు తెగకు అధిపతి. ఆ తెగ నుంచి మొదటిసారి పాఠశాలలో చేరిన వాడు నెల్సన్ మండేలాయే. అక్కడే క్రైస్తవ ఉపాధ్యాయురాలు ‘నెల్సన్’ అన్న అక్షరాలను అతడి తెగ ఇచ్చిన పేరులో చేర్చింది. అలా ఎందుకు జరిగిందో తనకు మాత్రం తెలియదని మండేలా ‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’ పుస్తకంలో చెప్పుకున్నారు. తరువాత ఉన్నత చదువుల కోసం ఆయన పెద్ద త్యాగం, సాహసం చేయవలసి వచ్చింది. వారి ఆచారం మేరకు తెగ ఆధిపత్యాన్ని త్యజించిన తరువాత మాత్రమే నెల్సన్‌కు ఉన్నత చదువులకు వెళ్లడానికి అవకాశం చిక్కింది. విట్వాటర్సాండ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివారు నెల్సన్. విద్యార్థి దశలోనే ఆయన రాజకీయాలు మొదలయ్యాయి. నల్లజాతీయుల విముక్తికోసం అప్పటికే ఉద్యమిస్తున్న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో మండేలా సభ్యుడయ్యారు. ఆ వెంటనే, అంటే 1944లో ఆ సంస్థ యువజన శాఖకు నాయకుడయ్యారు. చదువు పూర్తి చేసి న్యాయవాదిగా నల్లజాతీయుల కోసం సలహాలు ఇచ్చేందుకు మొదట ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు (నిజానికి గాంధీజీ చేసిన పని కూడా ఇదే. దక్షిణాఫ్రికా ప్రభుత్వం నుంచి హక్కులు సాధించేందుకు నల్లజాతీయులను, భారతీయులను ఏకం చేయడానికి ముందు గాంధీజీ అక్కడ న్యాయసలహాదారుగానే పనిచేశారు). తన మండేలా బాల్యమిత్రుడు, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యుడు అలీవర్ టాంబో సంఘం ఏర్పాటులో సహకరించారు. 1948 తరువాత జాతి వివక్ష ప్రభుత్వం రుద్దిన చట్టాలతో సర్వం కోల్పోయిన వారికి న్యాయ సహాయం చేయడమే వీరి ఉద్దేశం. దీనితో పాటు ఇలాంటి చట్టాల గురించి నల్లజాతీయులలో అవగాహన కల్పించడానికి దేశమంతా తిరుగుతూ ఉండేవారు. 1948లో జరిగిన ఎన్నికలు నల్లజాతీయుల ఆగ్రహాన్ని మరింత పెంచాయి. అప్పుడు అధికారంలోకి వచ్చిన నేషనల్‌పార్టీ ప్రభుత్వం నల్లజాతీయుల హక్కులకు మరింతగా ఆటంకాలు కల్పించడం ఆరంభించింది. అప్పటిదాకా జరిగిన పోరాటాలు వ్యర్థమైపోయే సూచనలు కనిపించాయి. అల్పసంఖ్యాక శ్వేత జాతి ప్రభుత్వం మరింత బలపడే విధంగా చర్యలు మొదలయినాయి. పైగా నల్లజాతీయులకు పూర్తి స్థాయి పౌరసత్వం కల్పించాలంటూ అఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమం కూడా ఊపందుకుంటున్న కాలం. అందుకోసం అహింసా పద్ధతులలో సమ్మెలు, బాయ్కాట్లు, శాసనోల్లంఘన జరుగుతోంది. అప్పుడే మండేలా ప్రభుత్వం దృష్టిలో పడ్డారు. నిజానికి నల్లజాతీయుల స్వేచ్ఛ కోసం 1955లో అక్షరబద్ధమైన ‘ఫ్రీడమ్ చార్టర్’ రచనలో కూడా మండేలాదే కీలక పాత్ర. ఆ హక్కుల పత్రాన్ని అప్పటి ప్రభుత్వం నిషేధించింది. అందుకే ప్రభుత్వం ఆయన మీద మరింతగా దృష్టి కేంద్రీకరించింది. మండేలాను వెంటాడడం మొదలయింది. నిఘా విస్తరించింది. డిసెంబర్ 5,1956న మండేలా సహా, 155 మంది ఉద్యమకారులను శ్వేతజాతి ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆరోపణ – దేశద్రోహం. ఈ కేసును 1961లో న్యాయస్థానం కొట్టివేసింది. కానీ ఒక దశలో మండేలా సహా పలువురికి మరణశిక్ష పడవచ్చునని అంతా భయపడ్డారు. ఇది జరగడానికి ముందే మరో దారుణం జరిగింది. దానిపేరే షార్ప్‌విల్లే హత్యాకాండ. మార్చి 21, 1960న ఆ దుర్ఘటన జరిగింది. నల్లజాతి యువకులను మరింత వేధించడానికీ, వారి జీవించే హక్కును మరింత పరిమితం చేయడానికీ జాత్యహంకార ప్రభుత్వం అంతకు ముందే ఒక చట్టం తెచ్చింది. దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం పట్టణాలకు వచ్చే నల్లజాతీయులు వారి వివరాలను తెలిపే పత్రాలను తప్పనిసరిగా ఉంచుకోవాలి. 16 సంవత్సరాలు దాటిన ప్రతి నల్లవానికి ఇది అనివార్యం. తరువాత నల్లజాతి మహిళలకు కూడా ఈ చట్టాన్ని వర్తింపచేశారు. అంటే పట్టణాలకు వారి వలసను నిరోధించడమే ఈ చట్టం ఉద్దేశం. ఇలాంటి పత్రాలు లేవంటూ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సంస్థ సభ్యులని, పాన్ ఆఫ్రికన్ ఆఫ్రికనిస్టు కాంగ్రెస్ సభ్యులను వేధించేవారు (పాన్ ఆఫ్రికనిస్టు కాంగ్రెస్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో చీలిక వర్గం). అప్పటి నేషనల్‌పార్టీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అధినేత డాక్టర్ హెన్రిక్ వెర్వోర్డ్ ఇందుకు బాధ్యులు. ఈ చర్యకు నిరసనగా శాంతియుతంగా ఉద్యమం చేయాలని ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. నిజానికి ఆ మార్చి 31న నిరసనలు చేపట్టాలని ఆ సంస్థ ఉద్దేశం. కానీ పాన్ ఆఫ్రికనిస్టులు మార్చి 21న నిరసన జరపాలని నిర్ణయించారు. దేశమంతా ఉద్యమం జరిగినా, షార్ప్‌విల్లే దురాగతం మాత్రం (ట్రాన్స్‌వాల్ దగ్గరలోనిది. ఇది కూడా ఆనాటి గాంధీజీ ఉద్యమ క్షేత్రాలలో ఒకటి) ఘోరమైనది. ఏడు నుంచి పదివేల మంది వరకు ఉద్యమకారులు షార్ప్‌విల్లే పోలీసు స్టేషన్‌ను ముట్టడించాలని వచ్చారు. వారి నినాదం ఒక్కటే– ‘మా దగ్గర ఎలాంటి పత్రాలు లేవు. మమ్మల్ని వెంటనే అరెస్టు చేయండి!’ ఉద్యమం శాంతియుతంగా జరుగుతూ ఉండగా పోలీసులే రెచ్చగొట్టి కాల్పులు జరిపారని ఉద్యమకారుల ఆరోపణ. ఉద్యమకారులే హింసకు దిగారని పోలీసుల వాదన. ఏమైనా కాల్పులలో 69 మంది చనిపోయారు. 29 మంది చిన్నారులు సహా 260 మంది వరకు గాయపడ్డారు. ఈ ఉదంతమే చాలామంది నల్లజాతీయులకు శాంతియుత పంథా మీద నమ్మకం పోయేలా చేసింది. ఈ దుర్ఘటన దక్షిణాఫ్రికా నల్లజాతీయుల మనసులను ఎంతగా గాయపరిచిందంటే, ఆ రక్తపంకిల చరిత్రను నేటికీ మార్చి 21న దేశమంతా స్మరించుకుంటుంది. ప్రభుత్వం సెలవు ప్రకటిస్తుంది. షార్ప్‌విల్లే హింసాకాండతో మండేలా కూడా తన అహింసా సిద్ధాంతాన్ని పక్కన పెట్టారు. 1961లో ఏర్పడిన ఉఖంటో వి సిజ్వే (జాతి చేతిలోని బల్లెం) లేదా ‘ఎమ్ కె’ అనే సంస్థలో ఆయన సభ్యుడయ్యారు. నిజానికి ఇది ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌తో ఎడబాటు కాదు. ఎమ్ కె కూడా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌కు అనుబంధంగా పనిచేసే సాయుధ పోరాట సంస్థ. గెరిల్లా పోరాట పంథాలో జాత్యహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం దీని ఉద్దేశం. ఇందుకోసమే ఆయన అల్జీరియా వెళ్లి కొద్దికాలం గెరిల్లా యుద్ధతంత్రంలో శిక్షణ పొంది వచ్చారు. కానీ అక్కడ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆగస్ట్ 5, 1962న మండేలాను జాత్యహంకార ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ రోజే బయటి ప్రపంచంతో ఆయన బంధం తెగిపోయింది. మళ్లీ ఆయన వెలుగు చూడడానికి 27 ఏళ్లు పట్టింది. విచారణ తరువాత మండేలాను జూన్ 12, 1964న కేప్‌టౌన్‌కు సమీపంలోని రూబెన్స్ ఐలెండ్ జైలుకు తరలించారు. ఇందులో ఆయన ఏకాంత ఖైదీ. భార్య విన్నీ మండేలాను తప్ప వేరెవరినీ ఆయనను కలుసుకోవడానికి అనుమతించలేదు. ఖైదీ నం. 46664 ముద్రతో రాళ్లు కొట్టారు. కానీ ఆ రాళ్లతో పాటు జాత్యహంకార ప్రభుత్వ ఆధిపత్యం కూడా చితికిపోతూ వచ్చిందన్నది వాస్తవం. మండేలా స్వస్థలం ట్రాన్స్కెయికి పరిమితమైతే విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదన పంపించింది. అందుకు మండేలా సమాధానం, ‘జాతి వివక్ష ఎన్ని రూపాల్లో ఉన్నప్పటికీ దాని అన్ని రూపాలను కూడా నేను తీవ్రంగా ద్వేషిస్తున్నాను. దీని మీద తుది వరకు పోరాడతాను.’ 1973 నుంచి 1988 వరకు కూడా ఇలాంటి ప్రతిపాదనను అంగీకరించమని ప్రభుత్వం మండేలాను బలవంత పెడుతూనే ఉండేది. మధ్యలో మాట మార్చి హింసను వీడితే విడుదల గురించి ఆలోచిస్తామని కూడా 1985లో మరో ప్రతిపాదన పంపించింది. దీనిని కూడా ఆయన అంగీకరించలేదు. ఆయన రూపం మారిపోయింది. ఆరోగ్యం క్షీణించింది. అవేమీ బయట ప్రపంచానికి తెలియకుండానే 18 ఏళ్లు గడచిపోయాయి. 1988లో క్షయ వ్యాధి సోకింది. అప్పెడు విక్టర్ వెర్సటర్ జైలుకు తరలించారు. మధ్యలో మళ్లీ పోల్స్మూర్ జైలులో కొన్నాళ్లు ఉంచారు. 1980 నాటికి ప్రపంచంలో మండేలా విడుదలకు ఉద్యమం ప్రారంభమైంది. కానీ జాత్యహంకార ప్రభుత్వం వాటిని చెవిన పెట్టలేదు. కానీ 1990 నాటికి అధ్యక్షుడు బోథా అధ్యాయం ముగిసింది. జాత్యహంకార ప్రభుత్వం వాస్తవాలను గుర్తించక తప్పని వాతావరణంలో బోథాకు ఎఫ్ డబ్లు్య డీక్లార్క్ వారసునిగా అధ్యక్ష స్థానంలోకి వచ్చాడు. ఇతడు కొన్ని వాస్తవాలను గమనించాడని చెప్పక తప్పదు. అంతర్జాతీయ ఒత్తిడి ఎక్కువయింది. అంతర్యుద్ధ భయం పెరిగింది. దీనితో చర్చలు జరిపి మొత్తానికి మండేలాను విడుదల చేయడమే కాకుండా నల్లజాతీయులకు అధికారం అప్పగించడానికి కూడా అంగీకరించాడు డీక్లార్క్. అలా ప్రపంచం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మండేలా విడుదల సాధ్యమైంది. ఫిబ్రవరి 11, 1990 ఆయన జైలు నుంచి విముక్తి పొందారు. అంతకాలం దాదాపు రెండు దశాబ్దాల పాటు మండేలా అంటే ఒక్క ఫొటోను బట్టే తెలిసేది. కానీ ఆయన బయటకు వచ్చే సమయానికి ఆ రూపమే వేరు. పుట్టుకతోనే మనిషిలో ద్వేషించే గుణం ఉండదని అంటారు మండేలా. అది ఆయన ఔన్నత్యానికి నిదర్శనం. అందుకే రంగు ఏదైనా అందరికీ స్వేచ్ఛ స్వాతంత్య్రాలు ఉండాలన్నదే నా ఆకాంక్ష అన్నారాయన. ఇది ఆయన దక్షిణాఫ్రికాకు అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత అన్న మాట అనుకుంటే పొరపాటు. ఆయన జైలులో మగ్గుతున్నప్పటికీ కూడా అలాంటి మాట ఆయన హృదయం పలకగలిగింది. అందుకే మండేలా మహోన్నతుడయ్యాడు. అమెరికా ఆయన మీద ఉగ్రవాది ముద్ర వేసింది. కానీ ప్రపంచం ఆ ముద్రను పట్టించుకోలేదు. ఒక పోరాట యోధునిగా, హక్కుల ఉద్యమానికి నిలువెత్తు ఆదర్శంగా గౌరవించింది. మండేలా 1994–1999 మధ్య దక్షిణాఫ్రికా అధ్యక్షునిగా పనిచేశారు. దేశంలోని నలుపు తెలుపు వర్ణాల మధ్య అంతరాలను నిర్మూలించడానికి ఆ కొద్దికాలంలోనే ఆయన కృషి చేశారు. వారి మనసుల మధ్య ఇంద్రచాపం వంటి వారథి నిర్మించడానికి తపన పడ్డారు. రగ్బీ తెల్లజాతి క్రీడ కాబట్టి దానిని దూరంగా ఉంచాలని ఉద్యమకాలంలో కొందరు గట్టిగా అభిప్రాయపడ్డారు. దానిని చాలాకాలం అమలు చేశారు. కానీ ఆ క్రీడను తిరిగి ఆడమని అందరినీ ఆయన ప్రోత్సహించాడు. సయోధ్యకు మండేలా అనుసరించిన వ్యూహం ఇంత సున్నితంగా ఉంది. దక్షిణాఫ్రికాకు ఆయన అధ్యక్షుడైన తరువాతే తాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వెనుకబాటు తెచ్చిన అనారోగ్యంతో బాధపడుతున్న తన వారి కోసం 500 ఆస్పత్రులు నిర్మించాడాయన. 15 లక్షల మంది బాలలను బడికి పంపించాడు. చిరకాలం బానిసత్వంతో మగ్గిన ఒక జాతిని పునరుజ్జీవింప చేయడానికి ఆయన చేసిన కృషి మండేలాలోని పరిపాలకుడిని, ద్రష్టనే కాకుండా ఆయనలోని నిజమైన రాజనీతిజ్ఞుడిని ఆధునిక ప్రపంచం ఎదుట ఆవిష్కరించింది. పదవి నుంచి దిగిపోయిన తరువాత మండేలా సేవారంగాన్ని ఎంచుకున్నారు. ఆయన కుమారుడు ఎయిడ్స్ వ్యాధితో మరణించాడు. అతడి జ్ఞాపకార్థం ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన పనిని చేపట్టారు మండేలా. భార్య విన్నీ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆమెతో విడిపోయారు. తాను ఒక జాతి స్వేచ్ఛ కోసం జీవితాంతం పోరాడిన మాట నిజమే అయినా, తనకూ కొన్ని బలహీనతలు ఉన్నాయని, కాబట్టి తనను మనిషిగానే చూడాలని ఆయన సవినయంగా మనవి చేశారు. జీవితాన్ని తెరచిన పుస్తకంలా ప్రపంచం ఎదుట ఇలా ఉంచిన నేతలు నిజంగానే అరుదు. - డా. గోపరాజు నారాయణరావు -
ఆ నేతల్ని అందించిన ఘనత మనది
పీటర్‌మారిట్జ్‌బర్గ్: గొప్ప నాయకుల్ని అందించినందుకు భారత్, దక్షిణాఫ్రికాల్ని ప్రపంచం గౌరవిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. దక్షిణాఫ్రికాలోని పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో గాంధీజీని రైల్లోంచి తోసేసిన సంఘటనకు 125 ఏళ్లు పూర్తైన సందర్భంగా గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్యాయానికి, వివక్షకు గురైన ప్రజల్లో నమ్మకం నింపేందుకు గాంధీజీ, నెల్సన్ మండేలాలు పోషించిన పాత్రను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ‘మన నుంచి ప్రపంచం ఎంతో లాభపడింది. గొప్ప నాయకుల్ని అందించినందుకు ప్రపంచం గౌరవిస్తోంది. బానిస ప్రజల్లో గాంధీజీ, మండేలా ఆశను ఉదయింపచేశారు. వలస బానిసత్వం నుంచి విముక్తి కల్పించడం ద్వారా భారత్, ఆఫ్రికా దేశాలకు నమ్మకం కలిగించారు’ అని సుష్మా స్వరాజ్ చెప్పారు. 25 ఏళ్ల క్రితం పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో మహాత్మాగాంధీ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా మండేలా మాట్లాడిన అంశాల్ని ఆమె ప్రస్తావించారు. అలాగే వర్ణవివక్షకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికా జరిపిన పోరుకు భారత్ అందించిన మద్దతును గుర్తుచేశారు. అంతకుముందు పెంట్రిక్ నుంచి పీటర్‌మారిట్జ్‌బర్గ్‌కు రైలులో ప్రయాణించారు. ఐదురోజుల పర్యటన నిమిత్తం దక్షిణాఫ్రికాలో ఉన్న సుష్మా స్వరాజ్ మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే మహాత్మాగాంధీ డిజిటల్ మ్యూజియంను ప్రారంభిచారు. ‘ద బర్త్ ఆఫ్ సత్యాగ్రహ’ అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించడంతో పాటు.. దక్షిణాఫ్రికా డిప్యూటీ విదేశాంగ మంత్రి లాండర్స్‌తో కలిసి పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ, వర్ణవివక్షతపై పోరాడిన ప్రముఖ నేత ఒలివర్ టాంబోల పోస్టల్ స్టాంపుల్ని విడుదల చేశారు. -
మండేలా మాజీ భార్య విన్నీ కన్నుమూత
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా పోరాటయోధుడు నెల్సన్ మండేలా మాజీ భార్య విన్నీ మడికిజెల మండేలా(81) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న విన్నీ ఇక్కడి నెట్‌కేర్ మిల్‌పార్క్ ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. నెల్సన్ మండేలా, విన్నీ 1958, జూన్ 14న పెళ్లిచేసుకున్నారు. శ్వేతజాతీయులపై పోరాటంలో వీరిద్దరూ కలసి పాల్గొన్నారు. మండేలాకు 27 ఏళ్ల జైలుశిక్ష పడ్డప్పుడు ఇద్దరు కుమార్తెల బాధ్యతల్ని భుజాలపై వేసుకున్న విన్నీ ఉద్యమాన్ని నడపడంలో కీలకంగా వ్యవహరించారు. ఆమె దక్షిణాఫ్రికా కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రిగా పనిచేశారు. 1996లో మండేలా, విన్నీలు విడాకులు తీసుకున్నారు -
నెల్సన్ మండేలా మాజీ భార్య కన్నుమూత
జోహన్స్‌బర్గ్ : జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమకారిణి విన్నీ మండేలా ఇకలేరు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో సోమవారం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. విన్నీ.. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మాజీ భార్య అన్న విషయం తెలిసిందే. జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమంలో మండేలా 27 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపినప్పుడు, అతని విడుదల కోసం ఉద్యమించటంతో పాటు, నల్ల జాతీయుల హక్కుల కోసం విన్నీ పోరాడారు. మండేలాని పెళ్లి చేసుకోకముందే సామాజిక కార్యకర్త అయిన విన్నీ, తన వైవాహిక జీవితంలో మండేలాకు ఎంతగానో తోడ్పాటు అందించారు. 38 ఏళ్లు మండేలాతో వివాహా బంధం కొనసాగించిన విన్నీ 1996లో విడాకులు తీసుకున్నారు. -
శత్రువు చెడ్డవాడు కాదు
‘‘ప్రత్యర్థిని అగౌరవపరచకుండానే నేనతడిని ఓడించగలనని అర్థమైంది’’ అని తన ఆటోబయోగ్రఫీ ‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’ లో ఒకచోట రాసుకున్నారు నెల్సన్ మండేలా. విధానాలకు వ్యక్తులు ఎలాగైతే బాధ్యులు కారో, జాతి వివక్షకు తెల్లజాతి అధికారులు అలా బాధ్యులు కారని ఆయన విశ్వాసం. మండేలా ఏనాడూ నేరుగా తెల్ల అధికారులతో తలపడలేదు. జాతి విచక్షణ వ్యవస్థతోనే ఆయన పోరాటం. నల్లవాళ్లందరూ తక్షణం జోహన్నెస్‌బర్గ్‌ను వదిలి తమ సొంత ఊళ్లకు వెళ్లిపోవాలని హుకుం జారీ అయినప్పుడు ఒక వ్యక్తి మండేలా దగ్గరికి వచ్చాడు. ‘‘మమ్మల్ని కాపాడండి. నేను, నా భార్యాపిల్లలు ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నాం. నా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. కానీ ఇప్పుడు మమ్మల్ని వెళ్లిపొమ్మంటున్నారు. నా ఉద్యోగం తీసేశారు. చావడం తప్ప వేరే దారిలేదు. ఏదో ఒకటి చెయ్యండి. నా కుటుంబం కూలిపోకుండా చేతులు అడ్డుపెట్టండి’’ అని మండేలాను వేడుకున్నాడు. వెంటనే అధికారి దగ్గరికి వెళ్లాడు మండేలా. ‘‘చూడండి, కార్యకర్తగా కాదు... ఒక మనిషిగా నేను మీ దగ్గరకు వచ్చాను. నేను మీ ముందుకు తేబోతున్న సమస్య పరిష్కారానికి పూర్తిగా మీ మీదే ఆధారపడి వచ్చాను’’ అన్నాడు. మండేలా మాటతీరులో తనపై కనిపించిన గౌరవభావం ఆ తెల్ల అధికారిని కదిలించింది. ‘‘ఏదైనా ఉద్యోగం చూసుకుని ఇక్కడే ఉండిపొమ్మని చెప్పండి’’ అని నిరభ్యంతర పత్రం రాసిచ్చాడు! లోకంలో ఎక్కడైనా మనుషులు మాత్రమే ఉంటారు. చెడ్డ మనుషులు ఉండరు. వ్యవస్థలు, విధానాలు మనుషుల్ని చెడ్డవాళ్లుగా, శత్రువులుగా చిత్రీకరిస్తాయి. జాతి వివక్ష అమాయక ప్రజల్ని బలి తీసుకుంటుందనీ, వివక్షను పాటించేవారు కూడా తమ సొంత మనుషులను కోల్పోవలసి వస్తుందని తెల్ల అధికారులకు అర్థమయ్యేలా చెప్పగలిగారు మండేలా. ఇంత గొప్ప వ్యక్తిని ఏ దేశం మాత్రం గౌరవించదు? మండేలాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. మన ‘భారత రత్న’నూ ఇచ్చుకున్నాం. మండేలా 2013 డిసెంబర్ 5న కన్నుమూశారు. -
అంతరిక్షం నుంచి కనిపించేలా ‘మండేలా’
జొహాన్నెస్‌బర్గ్: జాతివివక్ష వ్యతిరేకోద్యమ నేత నెల్సన్ మండేలా శతజయంతి సందర్భంగా దక్షిణాఫ్రికా జైళ్లలోని వందలాది ఖైదీలు ప్రపంచంలోనే అతిపెద్ద ముఖచిత్ర దుప్పటితో(4,500 చదరపు మీటర్లు) నివాళి అర్పించనున్నారు. ఈ చిత్రాన్ని ఊలు దారాలతో అల్లుతారు. వచ్చే ఏడాది జూలై 18(మండేలా శతజయంతి) కోసం చిన్నచిన్న ఊలు దుప్పట్లను కలిపికుట్టి ఈ భారీ దుప్పటిని తయారుచేస్తారు. దీన్ని అంతరిక్షం నుంచి కూడా చూడొచ్చు. బ్లాంకెట్స్ ఫర్ మండేలా అనే సంస్థ ‘మాసివ్ మండేలా మాస్టర్‌పీస్’ పేరుతో ఈ ప్రాజెక్టును శనివారం జోండర్‌వాటర్ జైల్లో ప్రారంభించింది. దుప్పట్లకు అవసరమయ్యే ఊలు ఖర్చు రూ. 6.6 కోట్లను ఓ అజ్ఞాత వ్యాపారి భరిస్తున్నారు. -
నల్లయోధుడు
-
నా జీవితంపై వాళ్లిద్దరి ప్రభావం ఎక్కువ: ప్రియాంక
తన జీవితంపై మహాత్మా గాంధీ, దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలాల ప్రభావం ఎక్కువగా ఉందని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తెలిపారు. చిన్నారులపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా యూనిసెఫ్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి ప్రియాంక ముఖ్య అతిథిగా హాజరై 6 లక్షల ర్యాండ్ల విరాళాన్ని సేకరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. మహాత్ముడు, మండేలా ఇద్దరూ చిన్నారుల హక్కుల కోసం పోరాడారన్నారు. 18 ఏళ్ల లోపు వయసున్న పిల్లల్లో దక్షిణాఫ్రికాలో ప్రతి అయిదుగురు ఒకరు, జింబాంబ్వేలో ప్రతి ముగ్గురు లైంగిక దాడికి గురయ్యారని ప్రియాంక తెలిపారు. తాను ఎలాంటి దుస్తులు వేసుకున్నానో అని కాకుండా మీడియా ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టాలని చురకలంటించారు. యూనిసెఫ్ చేపట్టే కార్యక్రమాలకు తనవైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ప్రియాంక హామీనిచ్చారు. చిన్నారులపై జరిగే హింసకు వ్యతిరేకంగా సినిమాలు ఎలాంటి ప్రచారం నిర్వహించకపోవడంపై ఆమె స్పందించారు. ఏ కళాత్మక రంగానికైనా ఈ విషయమై ఎటువంటి నైతిక బాధ్యత ఉండబోదని, సృజనాత్మకత దెబ్బతింటుందని వారు భావించడమే అందుకు కారణమని వివరించారు. ప్రియాంక ప్రస్తుతం యూనిసెఫ్ సౌహార్ద్ర రాయబారిగా ఉన్నారు. -
నెల్సన్ మండేలాపై వికృతమైన పెయింటింగ్
జోహన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాపై ఓ చిత్రకారుడు వేసిన అసభ్యకర పెయింటింగ్ పెను దుమారం రేపింది. ‘ దేశ ఆర్థిక వ్యవస్థ అత్యాచారానికి గురైంది’ అనే ఇతివృత్తంతో మండేలాతో దక్షిణాఫ్రికా ప్రస్తుత అధ్యక్షుడు జాకబ్ జూమా అసభ్యకర రీతిలో ఉన్నట్లుగా వివాదాస్పద చిత్రకారుడు అయందా మబులు పెయింటింగ్ వేశాడు. దీన్ని ‘వికృతమైన’దిగా దక్షిణాఫ్రికాలోని అధికార పార్టీ అభివర్ణించింది. ఆఫ్రికన్ జాతీయ కాంగ్రెస్ (ఏఎన్సీ), నెల్సన్ మండేలా ఫౌండేషన్ ఈ పెయింటింగ్ ఘటనను తీవ్రంగా ఖండించాయి. మబులు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను తాము గౌరవిస్తామని, అయితే ఈ పెయింటింగ్ మాత్రం చాలా వికృతమైందని ఏఎన్సీ మండిపడింది. ప్రజలు ఈ పెయింటింగ్‌ను పట్టించుకోవద్దని సూచించింది. జాకబ్జూమాను అసభ్యంగా చిత్రీకరిస్తూ మబులు గతంలో కూడా అనేక వివాదాస్పద పెయింటింగ్‌లు వేశాడు. అయితే మండేలాపై వేసిన అసభ్యకర పెయింటింగ్‌ను మబులు సమర్థించుకున్నాడు. ఈ చిత్రం జుమా నాయకత్వంలోని దేశ పరిస్థితిని చూపించిందని వివరణ ఇచ్చుకున్నాడు. వివాదాస్పద చిత్రకారుడు అయందా మబులు -
నింగికెగిసిన మరో దిగ్గజం
- మండేలా సన్నిహితుడి కన్నుమూత జొహన్నెస్‌బర్గ్: నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా సన్నిహితుడు, వర్ణవివక్షపై పోరాడిన భారతీయ ఆఫ్రికన్ అహద్ కత్రాడా(87) కన్నుమూశారు. ఆయన జొహన్నెస్‌బర్గ్‌లోని డొనాల్డ్‌గోర్డాన్ ఆస్పత్రిలో సోమవారం కన్నుమూశారని సన్నిహితులు తెలిపారు. దక్షిణాఫ్రికా శ్వేత జాతీయుల పాలనకు వ్యతిరేకంగా పోరాడినందుకు గాను నెల్సన్ మండేలాతోపాటు మరో ముగ్గురిపై 1964లో జరిగిన చారిత్రక రివోనియా విచారణలో కత్రాడాపై జీవిత ఖైదు విధించారు. ఆ ముగ్గురిలో కత్రాడా ఒకరు కాగా అండ్రూ మ్లాంగెనీ, డెనిస్ గోల్డ్బెర్గ్ అనే వారున్నారు. వీరంతా రోడెన్‌దీవిలో కఠిన కారాగార శిక్ష అనుభవించారు. వీరు అక్కడే 18 ఏళ్లు జైలు జీవితం గడిపారు. దీంతో కలిపి మొత్తం ఆయన 26 సంవత్సరాల మూడు నెలలు కారాగార వాసం చేశారు. జైలులో ఉండగానే ఆయన నాలుగు డిగ్రీలు పొందారు. నెల్సన్ మండేలాకు ఎంతో సన్నిహితుడిగా కత్రాడాను చెప్పుకుంటారు. కత్రాడాను తన పెద్ద సోదరునిగా మండేలా చెబుతుండేవారు. కత్రాడా మృతి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ)కు తీరని లోటని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అపార్థీడ్(వర్ణవివక్ష) అనంతరం దక్షిణాఫ్రికాకు మొదటి అధ్యక్షుడుగా నెల్సన్మండేలా బాధ్యతలు చేపట్టే క్రమంలో కత్రాడా కృషి కూడా ఉంది. ప్రవాస భారతీయ కుటుంబంలో 1929లో దక్షిణాఫ్రికాలో జన్మించిన కత్రాడా చిన్న వయస్సు నుంచే వర్ణవివక్షపై పోరాటాల్లో పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలోని భారతీయులను తక్కువ చూడటంపై జరిగిన పోరాటంలో ఆయన జైలు జీవితం కూడా అనుభవించారు. ఆయన భార్య బార్బరా హొగన్ కూడా ఏఎన్సీలో చురుగ్గా పనిచేశారు. తన రాజకీయ పోరాట అనుభవాలపై కత్రాడా 6 పుస్తకాలు రాశారు. భారత ప్రభుత్వం 2005లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డుతో కత్రాడాను గౌరవించింది. -
దీక్ష విరమించిన ఉక్కుమహిళ
-
దీక్ష విరమించిన ఉక్కుమహిళ
ఏఎఫ్ఎస్పీఏ రద్దుకు సీఎం కావాలనుకుంటున్నా: ఇరోం షర్మిల ఇంఫాల్: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల(44) తన 16 ఏళ్ల నిరవధిక నిరాహార దీక్షను మంగళవారం విరమించారు. సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్ఎస్పీఏ) రద్దు కోసం తాను మణిపూర్‌కు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నానని ప్రకటించారు. ఏఎఫ్ఎస్పీఏను వ్యతిరేకిస్తూ.. 2000 నవంబర్ 5న షర్మిల నిరాహార దీక్షను చేపట్టడం తెలిసిందే. ప్రపంచంలో అత్యధిక కాలం కొనసాగిన నిరశన ఇదే. ఇంఫాల్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ ఆస్పత్రికి వెలుపల జైలుగా మార్చిన గదిలోనే షర్మిల దీక్ష విరమించారు. అరచేతిలో తేనెను రుచి చూసి నిరశనకు ముగింపు పలికారు. తీవ్ర ఉద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ముక్కు నుంచి ట్యూబ్‌లు వేలాడుతూ ఉన్న షర్మిల దేశానికంతా సుపరిచితమే. దీక్ష సమయంలో ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ఏర్పాటు చేసిన ట్యూబ్‌లను ఇప్పుడు తొలగించారు. దీక్ష విరమించిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మణిపూర్‌లో సానుకూల మార్పులు తెచ్చేందుకు సీఎంను కావాలనుకుంటున్నా .సీఎం అయితే చేసే మొదటి పని ఏఎఫ్ఎస్పీఏను తొలగించడమే. ఇందుకు నాకు అధికారం కావాలి. మణిపూర్‌లో రాజకీయం బురదమయంగా మారింది. సీఎం ఇబోబీని ఎదుర్కొనేందుకు.. నాతో చేతులు కలపాలని 20 మంది స్వతంత్ర అభ్యర్థులను ఆహ్వానిస్తున్నాను’ అని అన్నారు. ప్రధాని మోదీ ఈ వయసులో అహింస కావాలని కోరుతున్నారని, క్రూరమైన ఏఎఫ్ఎస్పీఏ చట్టం లేకుంటే తమకు చేరువ కాగలరని, గాంధీ అహింసా మార్గాన్ని మోదీ అనుసరించాలని కోరారు. ఏఎఫ్ఎస్పీఏ రద్దయ్యేంతదాకా ఇంటికి వెళ్లకుండా ఓ ఆశ్రమంలో ఉంటానని, తనకు భద్రత అక్కర్లేదని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఆహారం తీసుకునే ఉద్దేశం లేదన్నారు. దీక్షను విరమించాలన్న నా నిర్ణయంతో కొందరు ఏకీభవించకపోవచ్చన్నారు. తీవ్రవాద సంస్థలు అసంతృప్తిగా ఉన్నాయన్న వార్తలపై స్పందిస్తూ... ‘వారి సందేహాల్ని నా రక్తంతో నివృత్తి చేసుకోవచ్చు. హిందూ వ్యతిరేకి అంటూ గాంధీని చంపిన విధంగానే నన్ను చంపనివ్వండి’ అని అన్నారు. కాగావచ్చే ఏడాది జరగనున్న మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే విషయమై ఆమె త్వరలో ఎన్నికల సంఘాన్ని సంప్రదించే అవకాశం ఉంది. రొటీన్ నుంచి విముక్తి.. 15 రోజులకు ఓసారి ఆంబులెన్స్‌లో షర్మిలను ఆస్పత్రి నుంచి కోర్టుకు తీసుకువెళ్లడం.. జడ్జి ఆమెను దీక్ష విరమిస్తావా అని ప్రశ్నించడం.. అందుకు షర్మిల దీక్ష విరమించేది లేదని చెప్పడం.. గత కొన్నేళ్లుగా ఇదే నిత్యకృత్యం. మంగళవారం దీనికి తెరపడింది. తాను దీక్ష విరమిస్తానని షర్మిల.. జడ్జికి చెప్పారు. దీంతో రూ. 10వేల పూచీకత్తుపై ఇంఫాల్ వెస్ట్ జిల్లా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ బెయిలు మంజూరు చేసి రిలీజ్ ఆర్డర్ జారీ చేశారు. -
16 ఏళ్ల పోరాటానికి తాత్కాలిక విరామం
-
16 ఏళ్ల పోరాటానికి తాత్కాలిక విరామం
న్యూఢిల్లీ: ‘నా దృష్టిలో అహింస నైతిక సూత్రం ఎప్పటికీ కాదు. అదొక వ్యూహం మాత్రమే. ప్రభావ రహిత ఆయుధాన్ని ఉపయోగించడంలో మంచి నైతిక ఏమీ ఉండదు’ అని 30 ఏళ్లపాటు దక్షిణాఫ్రికా శ్వేతజాత్యహంకారానికి వ్యతిరేకంగా అహింస పద్ధతిలో సుదీర్ఘంగా పోరాటం జరిపిన నల్ల కలువ నెల్సన్ మండేలా అన్న మాటలు ఇవి. నెల్సన్ మండేలా పుస్తకాలను తెగ చదివిన ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిలాకు ఈ మాటలు గుర్తుండే ఉంటాయి. ఆమె కూడా మండేలా మాటల అంతరార్థాన్ని అర్థం చేసుకునే ఉంటారు. అందుకనే ఆమె మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్లుగా సాగిస్తున్న అహింసాత్మక పోరాటాన్ని మంగళవారం తాత్కాలికంగా విరమించారు. బెయిల్‌పై విడుదలయ్యారు. 16 ఏళ్ల పోరాటాన్ని ఇకముందు కూడా కొనసాగించాల్సిందిగా ‘కాంగ్లీపాక్ యవోల్ కున్నా లూప్’, ‘కాంగ్లీపాక్ కమ్యూనిస్టు పార్టీ’ లాంటి తిరుగుబాటు సంస్థల నుంచి వచ్చిన ఒత్తిళ్లను, బెదిరింపులను పట్టించుకోకుండా షర్మిలా నిరాహార దీక్ష విరమణకే మొగ్గు చూపారు. అయినా ఆమె పోరాటాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించలేదు. వ్యూహం మార్చుకున్నట్లు మాత్రమే చెప్పారు. రాజకీయ రంగంలో ప్రవేశించి ఎన్నికల్లో పోటీ చేస్తానని, రాజకీయ రంగం నుంచే సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతానని మీడియా ముఖంగా ప్రకటించారు. షర్మిలాలో పోరాట శక్తి నశించిందని భావించరాదు. 16 ఏళ్ల పోరాటానికి స్పందించని కేంద్ర ప్రభుత్వాలు ఆమె మరింత కాలం నిరాహార దీక్షను కొనసాగిస్తే మాత్రం స్పందించే గ్యారెంటీ ఉందా? జస్టిస్ జీవన్ రెడ్డి కమిషన్, రెండవ అడ్మినిస్ట్రేషన్ కమిషన్, జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్లు అత్యంత వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని సమీక్షించి ఎత్తివేయడమే మంచిదని సూచించినా స్పందించని కేంద్ర ప్రభుత్వాలు పోరాటంలో షర్మిలా ప్రాణాలుపోతే స్పందిస్తాయా? ఈ విషయంలో నిర్ణయాన్ని ఆమెకే వదిలేయాలిగానీ, బలవంతంగా ఆమె ప్రాణాలను బలిపెట్టే ప్రయత్నాలను ప్రజాస్వామ్య వాదులుగా మనం చేయకూడదు. పెళ్లి పెటాకులు, తిండీ తిప్పలు లేకుండా 16 ఏళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేసిన షర్మిల స్ఫూర్తికి నీరాజనాలు పలకాలేతప్ప నిందలు వేయడం సరికాదు. జాతిపిత మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలాలాగా అహింసాత్మక మార్గంలో పోరాటం చేయాలనుకుంటే ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అహింసాత్మక పోరాట మార్గాలు 198 ఉన్నాయని, ఈ అంశంపై ప్రత్యేక అధ్యయనం జరిపిన ‘ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఇనిస్టిట్యూషన్’ వ్యవస్థాపకులు, మసాచుసెట్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ జీన్ షార్ప్ తెలిపారు. ఇప్పుడు షర్మిలా రాజకీయ ఆయుధాన్ని ఎంచుకున్నారు. ఆమెలాంటి స్ఫూర్తి కలిగిన వారు మణిపూర్ మహిళల్లో ఎంతో మంది ఉన్నారు. మణిపూర్ పోరాట చరిత్రలోకి వెళితే మహిళా పోరాట యూధులే ఎక్కువగా కనిపిస్తారు. వారిలాంటి వారు ముందుకొచ్చి షర్మిల పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. -
నల్లసూరీడు
-
మండే'గాంధీ'లా
కవర్ స్టోరీ : జూలై 18 ఇంటర్నేషనల్ మండేలా డే ‘నల్లసూర్యుడు’ నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా ప్రజల సామూహిక స్వాతంత్య్ర ఆకాంక్షకు ప్రతీక. తర తరాల జాతి వివక్ష నుంచి దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజలను విముక్తం చేసిన విజయ పతాక. తొంభయ్యేళ్లకు పైబడిన నిండు జీవితం గడిపిన మండేలా జాత్యహంకారానికి వ్యతిరేకంగా సాగించిన పోరాటం చిరస్మరణీయమైనది. జీవితంలో దాదాపు మూడోవంతు జైలు గోడల వెనుక మగ్గిపోయినా, ఏనాడూ తన ఆశయ సాధన మార్గాన్ని విడిచిపెట్టలేదాయన. దక్షిణాఫ్రికా నుంచి జాతి వివక్ష పోరాటాన్ని ప్రారంభించిన మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గమే తనకు స్ఫూర్తిదాయకమని చెప్పుకున్న మండేలాను జనం ‘దక్షిణాఫ్రికా గాంధీ’గా ప్రస్తుతిస్తారు. ఇద్దరికీ నడుమ కొన్ని వ్యత్యాసాలు ఉన్నా, పోరాట పథంలో ఇద్దరికీ చాలా సారూప్యాలూ ఉన్నాయి. అందుకే ‘మండే’గాంధీలా తెల్లవాళ్ల దురాగతాలపై ఉద్యమం సాగించారు. అసలు పేరు ‘గడుగ్గాయి’ నెల్సన్ మండేలాకు తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు హోలిషాషా. ఖోసా భాషలో హోలిషాషా అంటే గడుగ్గాయి అని అర్థం. బడిలో చేరినప్పుడు మింగానే అనే టీచర్ ‘నీ పేరేమిటి?’ అని అడిగింది. ‘హోలిషాషా’ అని అమాయకంగా చెప్పారు మండేలా. ‘ఈ పేరేమీ బాగాలేదు. ఇక నుంచి నీ పేరు నెల్సన్’ అని ఖరారు చేసింది ఆ టీచర్. అప్పటి నుంచి నెల్సన్ మండేలాగా స్థిరపడ్డ ఆ పేరు తర్వాతి కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. స్వేచ్ఛా పిపాసకు పర్యాయపదంగా మారింది. దక్షిణాఫ్రికా కేప్ ప్రావిన్స్‌లోని వెజో గ్రామంలో ఖోషా భాష మాట్లాడే థెంబు తెగకు చెందిన రాచ కుటుంబంలో 1918 జూలై 18న పుట్టారు మండేలా. తండ్రి గాడ్లా హెన్రీ ఫాకన్యిస్వా థెంబు తెగకు నాయకుడు. అయితే, మండేలాకు తొమ్మిదేళ్ల వయసులోనే ఆయన చనిపోయారు. దాంతో జోంగింతాబా డాలింద్యెబో అనే రాచప్రతినిధి మండేలాను దత్తత తీసుకున్నాడు. తెగ నాయకుడిగా మండేలాను తీర్చిదిద్దేందుకు ఆయన అహరహం శ్రద్ధ తీసుకున్నాడు. ఆయన శ్రద్ధ ఫలితంగానే మండేలా బడిలో అడుగుపెట్టారు. థెంబు తెగలో నియత విద్య అభ్యసించిన తొలి వ్యక్తి మండేలానే. బడిలో చదువులోను, ఆటల్లోను చురుగ్గా ఉండేవారు. చదువుకునే రోజుల్లో బాక్సింగ్‌పై విపరీతమైన ఆసక్తి చూపేవారు. చిన్నప్పటి బాక్సింగ్ సాధనే కాబోలు, తర్వాతి కాలంలో అన్యాయాలపై పిడికిలెత్తేలా చేసింది. మహాత్ముడే రాజకీయ గురువు విద్యార్థి దశలో మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్‌కింగ్, అబ్రహాం లింకన్ల సిద్ధాంతాలు, వారి ఉద్యమ కార్యాచరణ మండేలాను విపరీతంగా ప్రభావితం చేశాయి. అయితే, మహాత్ముడే తన రాజకీయ గురువు అని, తాను పుట్టిన నేలలోనే మహాత్మాగాంధీ అహింసా ఉద్యమాన్ని ప్రారంభించడం తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చిందని మండేలా స్వయంగా చెప్పుకున్నారు. మహాత్ముడి సిద్ధాంతాలతో తాను స్ఫూర్తి పొందినా, జీవితంలో తాను ఆయన నైతిక స్థాయిని, నిరాడంబరతను అందుకోలేకపోయానని కూడా వినమ్రంగా ఒప్పుకున్నారు. ‘గాంధీజీ ఎలాంటి బలహీనతలు లేని ఉదాత్త మానవుడైతే, నేను చాలా బలహీనతలు గల మామూలు మనిషిని’ అని మండేలా చెప్పిన మాటలు ఆయన నిజాయతీకి నిదర్శనంగా నిలుస్తాయి. మహాత్ముడిని అమితంగా ఆరాధించే మండేలా భారత్‌ను పవిత్రస్థలంగా భావించేవారు. అందుకే, ఇరవై ఏడేళ్ల జైలు శిక్ష నుంచి విడుదలయ్యాక తన తొలి విదేశీ పర్యటన కోసం ఆయన భారత్‌ను ఎంచుకున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక భారత్-దక్షిణాఫ్రికాల బంధం బలోపేతానికి కృషి చేశారు. దక్షిణాఫ్రికా మిత్రదేశాలలో భారత్‌ది అగ్రస్థానమని ప్రకటించారు. మహాత్ముడి అడుగుజాడలలో నడిచిన మండేలాను భారత్ కూడా అక్కున చేర్చుకుని, 1990లో దేశంలోని అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’తో సత్కరించింది. ‘భారతరత్న’ అందుకున్న తొలి విదేశీయుడు మండేలానే కావడం విశేషం. ‘భారతరత్న’ అందుకున్న మూడేళ్ల తర్వాత మండేలాకు ప్రపంచంలోనే అత్యున్నతమైన నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో మండేలాను అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతితో సత్కరించింది. విద్యార్థి దశలోనే ఉద్యమమార్గం మండేలా పుట్టే నాటికే దక్షిణాఫ్రికా బ్రిటిష్ వలస రాజ్యంగా ఉండేది. స్థానిక నల్లజాతి వారిపై వలస వచ్చిన తెల్ల పాలకవర్గాలు అడుగడుగునా వివక్ష చూపేవారు. సహజంగానే పోరాట స్ఫూర్తిగల మండేలాకు ఇది నచ్చేది కాదు. ఎవరి ఆధిక్యతా లేని సమ సమాజం రావాలని ఆయన ఆకాంక్షించారు. హైస్కూలు చదువు పూర్తయ్యాక మండేలాకు పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించుకున్నారు. పెళ్లి తర్వాత ఆయనకు తెగ నాయకత్వ బాధ్యతలను అప్పగించాలనేది వారి కోరిక. పెద్దల ఆలోచన పసిగట్టిన మండేలా ఇంటి నుంచి పారిపోయి జోహాన్నెస్‌బర్గ్ చేరుకున్నారు. అక్కడ నైట్ వాచ్‌మన్‌గా, లా ఫర్మ్‌లో గుమస్తాగా రకరకాల పనులు చేస్తూ, కరస్పాండెన్స్ కోర్సు ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత విట్వాటర్స్రాండ్ వర్సిటీలో చేరి లా చదువుకున్నారు. లా కోర్సు చదువుకుంటున్న కాలంలోనే మండేలా ఉద్యమబాట పట్టారు. తన సహాధ్యాయి ఆలివర్ టాంబోతో కలసి 1944లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరి, పార్టీలో యువజన విభాగాన్ని ప్రారంభించారు. మండేలా నాయకత్వంలో పెద్దసంఖ్యలో యువకులు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. ఆఫ్రికాలో జాతివివక్ష కొనసాగిస్తున్న నేషనల్ పార్టీ 1948 ఎన్నికల్లో గెలుపొందడంతో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. దక్షిణాఫ్రికా ప్రజలందరికీ సంపూర్ణ పౌరసత్వం డిమాండ్‌తో అహింసామార్గంలో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించింది. దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలంటూ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ రూపొందించిన ‘ఫ్రీడమ్ చార్టర్’ను కాంగ్రెస్ ఆఫ్ పీపుల్ 1955లో ఆమోదించింది. ఈ పరిణామాలు మింగుడుపడని వలస ప్రభుత్వం అదే ఏడాది మండేలాతో పాటు 155 మందిని ‘దేశద్రోహం’ కింద అరెస్టు చేసింది. ఆరేళ్ల తర్వాత వారంతా 1961లో నిర్దోషులుగా విడుదలయ్యారు. అయితే, ఈలోగానే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నేతల్లో పొరపొచ్చాలు తలెత్తాయి. ఉద్యమంలో అహింసా పద్ధతులు నచ్చని వారంతా మిలిటెంట్ పద్ధతులపై మొగ్గుతూ పార్టీ నుంచి చీలిపోయి, 1959లో పాన్ ఆఫ్రికనిస్ట్ కాంగ్రెస్ పేరిట వేరు కుంపటి పెట్టుకున్నారు. ఆ మరుసటి ఏడాదే షార్ప్విల్లో శాంతియుతంగా నిరసన కొనసాగిస్తున్న ఆఫ్రికన్ ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో 69 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ మారణహోమం తర్వాత దక్షిణాఫ్రికా అల్లర్లు, ఆందోళనలతో అట్టుడికింది. అరెస్టుల పరంపర మొదలు కావడంతో మండేలాతో పాటు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, పాన్ ఆఫ్రికనిస్ట్ కాంగ్రెస్ నేతల్లో చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక అహింసామార్గంలో కొనసాగడం వల్ల ఉపయోగం లేదని, పంథా మార్చుకోవాలని మండేలా అప్పుడే నిశ్చయించుకున్నారు. సాయుధ పోరాటబాట షార్ప్విల్ కాల్పుల దరిమిలా తలెత్తిన పరిణామాలతో సాయుధ పోరాటం వైపు మళ్లిన మండేలా, వలస ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆఫ్రికన్ జాతీయవాదుల సమావేశంలో పాల్గొనేందుకు 1962 జనవరిలో రహస్యంగా దక్షిణాఫ్రికాను వీడి ఇథియోపియా వెళ్లారు. అక్కడి నుంచి లండన్ వెళ్లి, ప్రవాసంలో ఉన్న ఉద్యమ సహచరుడు ఆలివర్ టాంబోను కలుసుకున్నారు. అల్జీరియా వెళ్లి గెరిల్లా పోరాట శిక్షణ పొందారు. అక్కడి నుంచి 1962 ఆగస్టులో స్వదేశానికి చేరుకుని, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే, మండేలా తలదాచుకున్న స్థావరం ఆచూకీపై అమెరికన్ గూఢచర్య సంస్థ సీఐఏ దక్షిణాఫ్రికా వలస ప్రభుత్వానికి ఉప్పందించడంతో కొద్ది రోజుల్లోనే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిస్తే, కార్మికుల సమ్మెను రెచ్చగొట్టి, అక్రమంగా దేశాన్ని వీడి వెళ్లినందుకు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. ఖైదీ నంబర్ 46664 కొద్దినెలల్లోనే జోహాన్నెస్‌బర్గ్‌లోని ఉద్యమకారుల స్థావరంపై దాడులు జరిపిన పోలీసులకు సాయుధ పోరాటానికి సంబంధించిన ఆధారాలు లభించాయి. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌పై నిషేధం విధించిన దక్షిణాఫ్రికా వలస ప్రభుత్వం మండేలా తదితర ఏడుగురు నేతలపై దేశద్రోహం, కుట్ర తదితర అభియోగాలు మోపింది. కోర్టు మండేలాతో పాటు ఏడుగురికీ 1964లో యావజ్జీవ శిక్ష విధించింది. ఆ శిక్ష ఫలితంగా మండేలా 27 ఏళ్లు జైలులోనే మగ్గిపోయారు. శిక్షా కాలంలోని మొదటి పద్దెనిమిదేళ్లు రాబెన్ ఐలాండ్ జైలులోని చీకటి గదిలో ఒంటరిగా కాలం వెళ్లదీశారు. జైలులో మండేలాకు ఇచ్చిన నంబర్ 46664. అంటే, 1964 సంవత్సరంలో అక్కడకు చేరుకున్న 466వ ఖైదీ. అక్కడ ఉన్నంత కాలం ఆయన భార్య విన్నీని మాత్రమే ఆరునెలలకోసారి వచ్చి చూసేందుకు అనుమతించేవారు. నరకానికి నకలులాంటి ఆ జైలులో అన్ని సంవత్సరాలు ఉన్నా, మండేలా ఏనాడూ తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. మండేలా విడుదల కోరుతూ ఒత్తిడి అంతకంతకూ పెరుగుతూ రావడంతో దక్షిణాఫ్రికా వలస ప్రభుత్వం కాస్త తగ్గక తప్పలేదు. మండేలాను రాబెన్ ఐలాండ్ జైలు నుంచి 1982లో ప్రధాన భూభాగంలో ఉన్న పోల్స్మూర్ జైలుకు తరలించారు. జైలులో భద్రత తక్కువగా ఉందనే సాకుతో 1988 నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు. ఆ తర్వాతి సంవత్సరమే జరిగిన ఎన్నికల్లో ఉదారవాద నాయకుడు ఫ్రెడెరిక్ డబ్ల్యూ డీ క్లార్క్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌పై నిషేధాన్ని ఎత్తివేశారు. పార్టీలోని సంప్రదాయవాదులు వ్యతిరేకించినా లెక్క చేయకుండా 1990 ఫిబ్రవరి 11న మండేలా విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. నల్లసూర్యుడి ఉదయం విడుదలైన తర్వాత మండేలా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలను స్వీకరించారు. జాతి వివక్షను అంతం చేసి, అన్ని జాతులతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో డీ క్లార్క్ నేతృత్వంలోని నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఇదివరకటి ప్రభుత్వాల్లా అణచివేత చర్యలకు దిగకుండా, డీ క్లార్క్ సానుకూలంగా స్పందించారు. జాతి వివక్ష సమస్య సామరస్యంగా పరిష్కారం కావడంతో 1993 డిసెంబర్లో మండేలా, డీ క్లార్క్ ఇద్దరూ నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. తర్వాత 1994 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మండేలా నేతృత్వంలో పోటీ చేసి, ఘన విజయం సాధించింది. అదే ఏడాది మే 10న మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి నల్లజాతీయుడిగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన రెండేళ్లలోనే జాతివివక్షకు తావులేని కొత్త రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చారు. ఐదేళ్లు అధ్యక్షుడిగా కొనసాగి, పదవి నుంచి తప్పుకున్న తర్వాత పలు స్వచ్ఛంద సంస్థలు స్థాపించి, సేవా కార్యక్రమాలను కొనసాగించారు. దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్యం కోసం అలుపెరగని కృషి సాగించిన మండేలా వార్ధక్యంతో అనారోగ్యం బారినపడి, 2013 డిసెంబర్ 5న తుదిశ్వాస విడిచారు. అయితే, మండేలా జీవించి ఉండగానే, ఆయన గౌరవార్థం ఐక్యరాజ్య సమితి 2009లో ఆయన పుట్టినరోజు జూలై 18వ తేదీని ‘అంతర్జాతీయ మండేలా దినోత్సవం’గా ప్రకటించింది. ఇది మండేలాకు మాత్రమే దక్కిన అత్యంత అరుదైన గౌరవం. స్ఫూర్తినిచ్చిన కవిత జైలులో మగ్గిపోయిన కాలంలో మండేలా నిరాశను దరిచేరనివ్వకుండా ఉండటానికి విలియమ్ ఎర్నెస్ట్ హేన్లీ రాసిన ‘ఇన్విక్టస్’ కవితను పదేపదే వల్లె వేసేవారు. తోటి ఖైదీలకు తరచు ఈ కవితను వినిపించేవారు. ‘ఐయామ్ ది మాస్టర్ ఆఫ్ మై ఫేట్... ఐయామ్ ది కెప్టెన్ ఆఫ్ మై సోల్’ అంటూ ఈ కవితను నిరంతరం మననం చేసుకుంటూ స్ఫూర్తి పొందేవారు. సంసారంలో మండేలా మండేలా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. నర్సుగా పనిచేసే ఎవెలిన్ మేస్‌ను 1944లో పెళ్లాడారు. మండేలా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండటంతో ఇద్దరికీ విభేదాలు తలెత్తాయి. మత నియమాల ప్రకారం రాజకీయంగా తటస్థంగా ఉండాలన్న ఎవెలిన్ మాటలను పట్టించుకోకుండా, మండేలా ఉద్యమాల్లో కొనసాగారు. దీంతో 1958లో ఇద్దరూ విడిపోయారు. తర్వాత మండేలా విన్నీని పెళ్లాడారు. విన్నీనే ఎక్కువకాలం మండేలాకు బాసటగా ఉన్నారు. మండేలా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దక్షిణాఫ్రికా ప్రథమ మహిళ హోదాలో కూడా కొనసాగారు. అయితే, జీవిత చరమాంకంలో ఇద్దరికీ మధ్య తలెత్తిన విభేదాలు పరిష్కారం కాకపోవడంతో 1996లో విడాకులు తీసుకున్నారు. విన్నీ నుంచి విడిపోయిన తర్వాత మండేలా మానసికంగా ఒంటరైపోయారు. తర్వాత రెండేళ్లకు 1998లో మొజాంబిక్ అధ్యక్షుడి మాజీ భార్య గ్రాసా మాషెల్ను పెళ్లాడారు. పెద్ద కొడుకు మగతో ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతూ 2005లో మరణించడం మండేలాను బాగా కుంగదీసింది. చదువుకునే రోజుల్లో బాక్సింగ్‌పై విపరీతమైన ఆసక్తి చూపేవారు. చిన్నప్పటి బాక్సింగ్ సాధనే కాబోలు, తర్వాతి కాలంలో అన్యాయాలపై పిడికిలెత్తేలా చేసింది. వెండితెరపై మండేలా జైలు నుంచి విడుదలైన తర్వాత మండేలా వెండితెరపై కూడా మెరిశారు. అమెరికాలో ఆఫ్రికన్ సంతతికి చెందిన హక్కుల ఉద్యమకారుడు మాల్కమ్ ఎక్స్ జీవితం ఆధారంగా అదేపేరుతో స్పైక్ లీ 1992లో రూపొందించిన చిత్రంలో మండేలా ఒక టీచర్ పాత్రలో కనిపిస్తారు. సినిమా చివర్లో కొద్దిసేపే కనిపించే ఈ పాత్రలో మండేలా తరగతి గదిలో విద్యార్థులను ఉద్దేశించి మాల్కమ్ ఎక్స్ ప్రసంగాన్ని ఉటంకిస్తారు. అరుదైన గౌరవాలు మండేలాకు లభించిన బిరుదులు, పురస్కా రాల సంగతి సరేసరి! అంతకు మించిన అరుదైన గౌరవాలు కూడా ఆయనకు దక్కాయి. కేప్‌టౌన్ నుంచి కాలిఫోర్నియా వరకు చాలా దేశాల్లోని చాలా నగరాల్లో మండేలా పేరిట నామకరణం చేసిన వీధులు కనిపిస్తాయి. మండేలా జైలులో ఉండగానే, 1973లో లీడ్స్ వర్సిటీ భౌతిక శాస్త్రవేత్తలు కనుగొన్న న్యూక్లియర్ పార్టికల్కు ‘మండేలా పార్టికల్’ అనే పేరు పెట్టారు. మండేలా మరణానికి ఏడాది ముందు పురాతత్వ శాస్త్రవేత్తలు చరిత్ర పూర్వయుగం నాటి వడ్రంగి పిట్ట జాతి పక్షి శిలాజాలను కనుగొన్నారు. ఆ పక్షికి ఆయన గౌరవార్థం ‘ఆస్ట్రాలోపికస్ నెల్సన్ మండేలాయ్’ అనే పేరు పెట్టారు. ప్రపంచంలో మండేలా తృతీయ ప్రపంచ దేశాలకు మండేలా ఒక ఆరాధ్యదైవం. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆయన విశ్వసనీయమైన మిత్రుడు. అగ్రరాజ్యాల దురహంకారాన్ని ధిక్కరించి మరీ తమ తమ దేశాలను ప్రగతిమార్గం పట్టించిన ఫిడెల్ క్యాస్ట్రో (క్యూబా), గడాఫీ (లిబియా) వంటి దేశాధినేతలకు ఆయన అనుంగు చెలికాడు. మొదట్లో మండేలాపై నిస్సిగ్గుగా వివక్ష ప్రదర్శించిన పాశ్చాత్యదేశాలు ఆయన దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ద్వంద్వప్రవృత్తిని ప్రదర్శించాయి. మండేలా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో ‘మన కాలంలో స్వేచ్ఛా సమానత్వాల కోసం పాటుపడిన గొప్ప శక్తుల్లో మండేలా ఒకరు’ అంటూ అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ గొప్ప సానుకూల వ్యాఖ్యలు చేశారు. అయితే, మండేలా పట్ల అమెరికా తన ధోరణిని మార్చుకుందనుకుంటే పొరపాటే. మండేలాను, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌ను అమెరికా 2008 వరకు ‘టై వాచ్‌లిస్ట్’లో ఉంచింది. అంటే, మండేలాకు నోబెల్ బహుమతి దక్కిన ఐదేళ్లకుగాని అమెరికా ఆయన పట్ల తన వైఖరిని మార్చుకోలేదు. ఆత్మకథకు సీక్వెల్! మండేలా జైలు నుంచి విడుదలయ్యాక తన జీవితానుభవాలన్నింటినీ గుదిగుచ్చి రాసిన ఆత్మకథ ‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’ 1994లో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా పాఠకాదరణ పొందింది. ఆఫ్రికన్ భాషలు సహా ప్రపంచంలోని పలు భాషల్లోకి ఇది అనువాదం పొందింది. అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగిన కాలంలోను, ఆ తర్వాతి కాలంలోను తన అనుభవాలను కూడా మండేలా వివరంగా రాసుకున్నారు. అవి ఇంతవరకు ప్రచురణకు నోచుకోలేదు. ఆత్మకథ విడుదల తర్వాత మండేలా రాసుకున్న ఈ రాతల ఆధారంగా ‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’ సీక్వెల్‌ను ప్రచురించేందుకు అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ‘పాన్ మ్యాక్మిలన్’ గత ఏడాది సన్నాహాలు ప్రారంభించింది. త్వరలోనే దీనిని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. -
ఎవరు మనకు ఆదర్శం?
విద్య - విలువలు ఒక వ్యక్తి గొప్పవాడవడం, సంస్కారవంతుడవడం అనేది మరొకరి బోధనల వల్ల ఉండదు. మీ అంతట మీరు కమిట్ (కట్టుబడి ఉండడం) కావడం మీద ఉంటుంది. నేను ఫలానావాడిని ఆదర్శవంతంగా తీసుకున్నానని అంటూంటారు. ఎందుకంటే నిర్భయత్వం, అధైర్యం ఈ రెండు మాటల మధ్య ఉన్న సున్నితమైన సరళరేఖను పట్టుకోవడం దగ్గర వారి అవసరం ఉంటుంది. మీరు ఆదర్శంగా ఎవరిని తీసుకుంటారో, వారి ప్రభావం వల్ల మాత్రమే చెక్కుచెదరని మనస్తత్వంతో మీరు నిలబడగలుగుతారు. నెల్సన్ మండేలా గురించి వినే ఉంటారు. జోహాన్నెస్ బర్గ్ దగ్గర మూడు శిఖరాలున్నాయి. వాటికి దూరంగా రాబిన్దీవి ఉంటుంది. మాజీ రాష్ట్రపతి కలాం గారు కూడా వెళ్లివచ్చారు ఒకసారి. అక్కడ నిర్మానుష్యం. చుట్టూ సముద్రం... దాని ఘోష తప్ప మరేమీ కనబడని, వినబడని చోట మీతో మాట్లాడడానికి మరో వ్యక్తి ఉండడు. ప్రపంచం ఏమైపోతున్నదో తెలిసే అవకాశం లేదు. అక్కడ ఆరడుగుల నెల్సన్ మండేలాను ఐదడుగుల గదిలో బంధించారు. కాళ్లు కూడా పూర్తిగా చాపుకోవడానికి అవకాశం లేని ఆ గదిలో మలమూత్ర విసర్జనకు ఏ సదుపాయం లేదు. మరునాడు ఒక వ్యక్తి వచ్చి తీస్తాడు. అప్పటిదాకా అంతే! అలా ఎన్ని రోజులు... 26 సంవత్సరాలున్నాడు. మా దేశానికి స్వాతంత్య్రం తీసుకురావాలన్న దీక్షతో పెద్దలు కన్న కలలు నెరవేరాలని ఉన్నాడు. చిన్న చిన్న కాగితాల్లో ఏదో రాసుకుంటున్నాడని బయట విపరీతమైన ఎండ ఉన్నప్పుడు వెలుగులోకి, బాగా వెలుతురులోంచి చీకటిలోకి తీసుకెళ్లేవారు. దానితో ఆయన కంటి దృష్టిపోయింది. అయినా నా అన్న వారిని చూడకుండా, జీవితంలో ఏ సుఖాన్ని అనుభవించకుండా, అలా 26 ఏళ్లున్నాడు. ఏనాడూ నన్ను విడిచిపెట్టమని అడగలేదు. నా పోరాటం ఆపేస్తానని అనలేదు, జాతి వివక్షకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని అపలేదు. అలాగే గడిపాడు. 26 ఏళ్ల తర్వాత వారికి స్వాతంత్య్రం వచ్చింది. ఆయన రాష్ట్రపతి పదవిలోకి రాగానే ఆయన బాధపెట్టినవారి మీద కక్ష పెట్టుకోలేదు. అధికారంలో వాళ్లను కూడా భాగస్వాములను చేశాడు. కమిట్మెంట్ అంటే అది. ఆదర్శంగా తీసుకోవాల్సింది అటువంటి వాటిని. సంస్కారం, ఆరోగ్యవంతమైన భయం, ఆదర్శం అనేవి ఏదో పద్యం బట్టీ కొట్టినట్లు ఉచ్చరిస్తే రావు. నాకు విశాఖపట్నంలో ఒక వ్యక్తి తారసపడ్డాడు. అతను ప్రతిరోజూ రాత్రి ఒంటిగంటకు నిద్రలేస్తాడు. స్నానం చేసి ఆవుపాలు తెచ్చి మరగబెడతాడు. అందులో సుగంధ ద్రవ్యాలు వేస్తాడు. అది పట్టుకుని ఎంత జోరుగా వాన కురుస్తున్నా, చలి కోసేస్తున్నా, ఒక స్నేహితుడి మోటార్‌సైకిల్ మీద తాటిచర్లపాలెం నుంచి సింహాచలం కొండమీదికెళ్తాడు. తెల్లవారుఝామున నాలుగు గంటలకు సుప్రభాతం చదివే సమయానికి గోరువెచ్చటిపాలు సింహాద్రీశుడికిస్తాడు. ఎందుకిలా చేస్తున్నావని అతన్నడిగా. ‘‘సార్ ! ఎప్పుడో మీ ఉపన్యాసం విన్నాను. ఒకప్పుడు 30 లీటర్ల పాలు సింహాద్రి అప్పన్నకు నైవేద్యం పెట్టేవారనీ, ఇప్పుడు శేరుపాలు కూడా పెట్టడం లేదని మీరు చెప్పిన విషయం విని నాకు బాధేసింది. అప్పటినుంచి కొన్ని సంవత్సరాలుగా రోజూ శేరు ఆవుపాలు కొని ఇదిగో ఇలా పట్టుకెడుతున్నానన్నాడు. మరి దీనికి డబ్బులెలా అంటే పనిచేస్తే నాకు రు.3 వేలు వస్తుంది. దానితో నా జీవితం నడిచిపోతుంది. మా స్నేహితుల నుంచి ఆరువేల రూపాయలు పోగు చేస్తా. వాటితో ఇలా నా జీవితానికి ఒక ప్రయోజనం కల్పించుకున్నా’ అన్నాడు. ఒక్కమాట విన్నాడు. తన జీవితాన్ని ఎలా మలిచేసుకున్నాడో చూడండి. ఇన్ని ఎకరాలున్న స్వామివారు పొద్దున తాగడానికి ఆవుపాలు లేవన్న దరిద్రం లేకుండా వాటిని తను స్వయంగా ఎన్ని ప్రతికూల పరిస్థితులెదురైనా వెరవకుండా పట్టుకెడుతున్నాడు. కమిట్మెంట్ అంటే అది. ఆదర్శంగా తీసుకోవాల్సింది ఇటువంటి వాటిని. మీరు విద్యార్థికానీయండి, అన్న, తండ్రి, పౌరుడు... ఇలా ఏదయినా కానీయండి. మీకు గొప్ప వికసనాన్ని తీకువచ్చేది, మీకూ, దేశానికీకూడా గౌరవం తీసుకువచ్చేది సంస్కార వైభవం. అందుకే చదువుతో పాటు సంస్కారమూ నేర్చుకోండి. చెప్పడం సులభం. ఆచరించడం చాలా కష్టం. అలా ఆచరించడానికి అవసరమైన నైతికబలం ఎక్కడ లభిస్తుందో తెలుసా...పెద్దలు చెప్పిన మాటమీద గౌరవం చూపడంతో వస్తుంది. ఒక ఐఏఎస్ అధికారి ఉండేవారు. ఒకప్పుడు ఆయన నేను పనిచేస్తున్న సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేశారు. ఆయన ప్రతిరోజూ లంచ్ బ్రేక్‌లో భోజనం చేసిన వెంటనే ఓ పది నిముషాలు ఎవ్వరితో మాట్లాడకుండా భగవద్గీతలో ఏదో ఒక శ్లోకాన్ని తీసుకుని చదివి వ్యాఖ్యానం చేసేవారు. అలా ఎందుకని అడిగితే ఓ మారు ఆయనేమన్నారంటే - ‘‘నేను ఒక ఫైలుమీద సంతకం చేస్తే అది కొన్ని వందలమంది భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. వారి కష్టసుఖాలు నిర్ణయిస్తుంది. ఆ పదవిలో కూర్చున్న నేను దానికి తగిన యోగ్యత పొందుతున్నానా లేదా అన్నది జ్ఞాపకం చేసుకోవడానికి అన్నంతోపాటు భగవద్గీత కూడా పుచ్చుకుంటాను. ఆరోగ్యవంతమైన భయాన్ని, కుర్చీలో ఉన్న నా అధికారాన్ని నిలుపుతాను’’ అన్నారు. ఆయన పనిచేసిన కాలం మా సంస్థకు స్వర్ణయుగం. అదీ సంస్కారం. చదువు పక్కన అది అలా ఉండాలి. -
ప్రపంచ ఆరాధ్యుల్లో గాంధీ, మోదీ
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరాధ్యులైన వారి జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పదో స్థానం దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికా దివంగత నేత నెల్సన్ మండేలా అగ్రస్థానంలో, భారత జాతిపిత మహాత్మాగాంధీ నాలుగో స్థానంలో నిలిచారు. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) 125 దేశాల్లోని 285 నగరాలకు చెందిన వెయ్యిమందికిపైగా యువత అభిప్రాయాలతో గ్లోబల్ షేపర్స్ వార్షిక సర్వే-2015 పేరుతో ఈ జాబితా రూపొందించింది. సర్వేలో పాల్గొన్నవారు డ బ్ల్యూఈఎఫ్ గ్లోబల్ షేపర్స్ కమ్యూనిటీ సభ్యులు. జాబితాలో రెండో స్థానంలో పోప్ ఫ్రాన్సిస్, మూడో స్థానంలో టెల్సా మోటార్స్ సీఈఓ ఎలన్ మస్క్ ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్(5), అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తదితరులున్నారు. సర్వేలో పాల్గొన్న మొత్తం 1,084 మందిలో మోదీకి 3 శాతం మంది మండేలాకు 20.1 శాతం, గాంధీకి 12.4 శాతం మంది ఓటేశారు. -
ఆ నేడు ఆగస్ట్ 29, 2007
వీరుడా... నిను తలచీ! నెల్సన్ మండేలా అంటే వ్యక్తి కాదు... నిలువెత్తు ఉద్యమ సంతకం. ఈ నల్లసూర్యుడిని తలుచుకుంటే చాలు.. తెలియని ఉత్తేజమేదో దరి చేరుతుంది. ఇక ఈ వీరుడి రూపాన్ని కళ్లారా చూస్తే... క్షణక్షణం మనసు తేజోమయం అవుతుంది. లండన్‌లోని పార్లమెంట్ స్క్వేర్‌లో మండేలా విగ్రహ ఆవిష్కరణ జరిగిన రోజు ఇది. ప్రముఖ శిల్పి ఇయాన్ వాల్టర్స్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. తొమ్మిది అడుగుల ఈ కాంస్య విగ్రహాన్ని చూస్తే... కేవలం విగ్రహాన్ని చూసినట్లుగా అనిపించదు. గతం వర్తమానంలోకి వచ్చినట్లు ఉంటుంది... తెలియకుండానే నిప్పు నినాదంతో పిడికిలి బిగుసుకుంటుంది. -
రేప్ కేసులో నెల్సన్ మండేలా మనవడి అరెస్టు
జాతి దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు నెల్సన్ మండేలా. కానీ ఆయన మనవడు మాత్రం 15 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టయ్యాడు. ఈ విషయాన్ని దక్షణాఫ్రికా పోలీసులు తెలిపారు. ఎంబుసో మండేలా (24) ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. అతడు పెట్టుకున్న బెయిల్ దరఖాస్తుపై శుక్రవారం నాడు జొహాన్నెస్‌బర్గ్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతుంది. జొహాన్నెస్‌బర్గ్ శివారల్లలోని గ్రీన్సైడ్ రెస్టారెంటులో 15 ఏళ్ల అమ్మాయిపై ఆగస్టు 7వ తేదీన ఎంబుసో అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. ఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఫిర్యాదు అందగా.. గత శనివారం నాడు ఎంబుసో మండేలాను పోలీసులు అరెస్టు చేశారు. నెల్సన్ మండేలాకు మొత్తం 17 మంది మనవలుండగా, వాళ్లలో ఒకడే ఈ ఎంబుసో. నెల్సన్ మండేలా 95 ఏళ్ల వయసులో 2013 సంవత్సరంలో మరణించిన విషయం తెలిసిందే. -
నెల్సన్ మండేలా విగ్రహానికి నగ్నకౌగిలి!
జోహెన్నెస్‌బర్గ్: జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, దక్షిణాఫ్రికా దివంగత నేత నెల్సన్ మండేలా విగ్రహాన్ని ఓ మహిళ కౌలిగించుకుని కలకలం రేపింది. ఇందులో వింతేముందని అప్పుడే నిర్ణయానికి వచ్చేయకండి. నల్లసూరీడు ప్రతిమను నగ్నంగా హత్తుకుని అందరినీ ఆమె ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వింతను చూసి అక్కడున్నవారంతా నోరెళ్ల బెట్టారు. దక్షిణాఫ్రికా వాణిజ్య రాజధాని జోహెన్నెస్‌బర్గ్ లోని అప్ మార్కెట్ ఏరియాలో సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుందని స్టార్ న్యూస్‌పేపర్ తెలిపింది. అమ్మడు అక్కడితో ఊరుకోకుండా నెల్సన్ మండేలా విగ్రహాన్ని కౌగిలించుకున్న ఫోటోను ట్విటర్ లో పోస్ట్ చేసింది. ఒంటిమీద ఆచ్ఛాదన లేకుండా తన తలను మండేలా విగ్రహం మోకాలికి ఆన్చినట్టు ఫోటోలో కనబడుతోంది. 'అందాల ప్రదర్శనతో ఒక ప్రైవేటు వ్యక్తి తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకునేందుకు చేసిన అనధికార చర్య'గా దీన్ని నెల్సన్ మండేలా స్క్వార్ మార్కెటింగ్ మేనేజర్ మెగాన్ మియాస్ వర్ణించారు. అక్కడున్న సెక్యూరిటీ బతిమాలడంతో ఆమె బట్టలు వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. ఎటువంటి ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేదు. వెర్రి వెయ్యి విధాలంటే ఇదేనేమో! -
మండేలా నా సొంత హీరో: ఒబామా
వాషింగ్టంన్: జాతి వివ క్ష వ్యతిరేక పోరాట యోధుడు, దక్షిణాఫ్రికా దివంగతనేత నె ల్సన్ మండేలా తనకు వ్యక్తిగత హీరో అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొనియాడారు. నెల్సన్ మండేలా, ఈ భూమిపై జన్మించిన అత్యంత ప్రభావశీలి, సాహసి అయిన విశిష్టవ్యక్తి అని, న్యాయం, సమానత్వంకోసం కృషిచేసిన పోరాటయోధుడని అని ఒబామా ప్రశంసించారు. తనకేకాక, మరెంతో మందికి వ్యక్తిగత హీరోగా మండేలా నిలిచారన్నారు. మండేలా జయంతి సందర్భంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా జరిగిన మండేలా అంతర్జాతీయ దినోత్సవంలో ఒబామా పాల్గొన్నారు. మండేలా గత ఏడాది కన్నుమూసిన తర్వాత తొలిసారిగా ఆయన జయంతిని జరుపుకుంటున్నామని, మన జీవితాలపై ఆయన వేసిన ముద్ర మనకెంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఒబామా అన్నారు. -
బరాక్ ఒబామా హీరో ఎవరు?
వాషింగ్టంన్: జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, దక్షిణాఫ్రికా దివంగత నేత నెల్సన్ మండేలా తనకు వ్యక్తిగత హీరో అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొనియాడారు. నెల్సన్ మండేలా, ఈ భూమిపై జన్మించిన అత్యంత ప్రభావశీలి, సాహసి అయిన విశిష్టవ్యక్తి అని, న్యాయం, సమానత్వం కోసం కషిచేసిన పోరాటయోధుడని అని ఒబామా ప్రశంసించారు. తనకేకాక, మరెంతో మందికి వ్యక్తిగత హీరోగా మండేలా నిలిచారన్నారు. మండేలా జయంతి సందర్భంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా జరిగిన మండేలా అంతర్జాతీయ దినోత్సవంలో ఒబామా పాల్గొన్నారు. మండేలా గత ఏడాది కన్నుమూసిన తర్వాత తొలిసారిగా ఆయన జయంతిని జరుపుకుంటున్నామని, మన జీవితాలపై ఆయన వేసిన ముద్ర మనకెంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఒబామా అన్నారు. ప్రజలు మడీబా అని ఆప్యాయంగా పిలుచుకునే మండేలా1918 జూలై 18న జన్మించారు. 2013 డిసెంబర్ 5న తన 95వయేట కన్నుమూశారు. తన జన్మదినం సెలవు దినం కాకూడదని, సేవకు అంకితమయ్యే రోజుగా ఉండాలని మడీబా కోరుకున్నట్టు ఒబామా చెప్పారు. ప్రజలు తమ సమయాన్ని, శక్తిని మానవాళి స్థితిగతులను మెరుగుపరచడానికి వినియోగించాలన్నదే మండేలా ఆశయమని ఒబామా చెప్పారు. మడీబా వంటి మరో వ్యక్తిని మనం మళ్లీ చూడలేకపోవచ్చని, ప్రతిరోజూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆయన్ను తగినరీతిలో గౌరవించుకోవచ్చని ఒబామా ప్రజలకు సూచించారు. -
వీరుడు, సూరీడు..!
(నేడు నెల్సన్ మండేలా జయంతి) ‘‘ప్రత్యర్థిని అగౌరవపరచకుండానే నేనతడిని ఓడించగలనని అర్థమైంది’’ అని తన ఆటోబయోగ్రఫీ ‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’ లో ఒకచోట రాసుకున్నారు నెల్సన్ మండేలా. విధానాలకు వ్యక్తులు ఎలాగైతే బాధ్యులు కారో, జాతి విచక్షణకు తెల్లజాతి అధికారులు అలా బాధ్యులు కారని ఆయన విశ్వాసం. మండేలా ఏనాడూ తెల్ల అధికారులతో నేరుగా తలపడలేదు. జాతి వివక్ష వ్యవస్థతోనే ఆయన పోరాటం. నల్లవాళ్లందరూ తక్షణం జోహాన్నెస్బర్గ్ను వదిలి తమ సొంత ఊళ్లకు వెళ్లిపోవాలని హుకూం జారీ అయినప్పుడు ఒక వ్యక్తి మండేలా దగ్గరికి వచ్చాడు. ‘‘మమ్మల్ని కాపాడండి. నేను, నా భార్యాపిల్లలు ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నాం. నా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. కానీ ఇప్పుడు మమ్మల్ని వెళ్లిపొమ్మంటున్నారు. నా ఉద్యోగం తీసేశారు. చావడం తప్ప వేరే దారిలేదు. ఏదో ఒకటి చెయ్యండి. నా కుటుంబం కూలిపోకుండా చేతులు అడ్డుపెట్టండి’’ అని మండేలాను వేడుకున్నాడు. వెంటనే అధికారి దగ్గరికి వెళ్లాడు మండేలా. ‘‘చూడండి, కార్యకర్తగా కాదు... ఒక మనిషిగా నేను మీ దగ్గరకు వచ్చాను. నేను మీ ముందుకు తేబోతున్న సమస్య తాలూకు పరిష్కారానికి పూర్తిగా మీ మీదే ఆధారపడి వచ్చాను’’ అన్నాడు. మండేలా మాటతీరులో తనపై కనిపించిన గౌరవభావం ఆ అధికారిని కదిలించింది. ‘‘ఏదైనా ఉద్యోగం చూసుకుని ఇక్కడే ఉండిపొమ్మని చెప్పండి’’ అని నిరభ్యంతర పత్రం రాసిచ్చాడు! లోకంలో ఎక్కడైనా మనుషులు మాత్రమే ఉంటారు. చెడ్డ మనుషులు ఉండరు. వ్యవస్థలు, విధానాలు మనుషుల్ని చెడ్డవాళ్లుగా, శత్రువులుగా చిత్రీకరిస్తాయి. జాతి వివక్ష అమాయక ప్రజల్ని బలి తీసుకుంటుందనీ, వివక్షను పాటించేవారు కూడా తమ సొంత మనుషులను కోల్పోవలసి వస్తుందని తెల్ల అధికారులకు అర్థమయ్యేలా చెప్పగలిగారు మండేలా. మండేలాను విడుదల చెయ్యాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వంపై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతున్నప్పుడు ఆ దేశ అధ్యక్షుడు పి.డబ్ల్యూ.బోతా ఆయనకొక రాయబారం పంపారు. దేశం వదిలి వెళ్తానంటే వెంటనే విడుదల చేస్తామన్నది సారాంశం! మండేలా అంగీకరించలేదు. ‘‘పోనీ, మీ మనుషుల్ని హింస మానేయమని చెప్పండి. మిమ్మల్ని వదిలిపెడతాం’’ అని రెండో రాయబారం పంపాడు. మండేలా విన్లేదు. నల్లజాతి ప్రజలను ఉద్దేశించి జైలునుంచే ఒక లేఖను రాసి బయటికి విడుదల చేశాడు. ‘‘జీవితాన్ని మీరెంతగా ప్రేమించారో నేనూ అంతే ప్రేమించాను. స్వేచ్ఛగా జీవించాలన్న మీ హక్కు, నా హక్కు వేర్వేరు కాదు. మన హక్కుల్ని విక్రయించేందుకు తెల్లజాతి ప్రభుత్వానికి నేనెలాంటి వాగ్దానం చెయ్యలేను’’ అని తన జాతికి నమ్మకాన్ని, ధీమాను ఇచ్చారు. దక్షిణాఫ్రికాకు రెండు జీవిత చరిత్రలు. ఒకటి ఆ దేశానిది. రెండు మండేలాది. కానీ ఈ మాటను ఆ దేశ ప్రజలు అంగీకరించరు. మండేలా లేకపోతే దక్షిణాఫ్రికా లేదంటారు. మండేలా జీవిత చరిత్రే దక్షిణాఫ్రికా జీవిత చరిత్ర అంటారు. మావో, లెనిన్, గాంధీలా మండేలా తన జాతి ప్రజలకు విముక్తి ప్రదాత. ప్రపంచ దేశాల ప్రియతమ నేత. ఎంవెజూలో జన్మించాడు. సామ్రాజ్యవాదులు వచ్చి తిష్ట వేయకముందు ఆఫ్రికాలో ఎంత స్వేచ్ఛ ఉండేదో రాత్రి వేళల్లో కథలు కథలుగా విన్నాడు. నల్లజాతి పోరాట వీరుల త్యాగాలతో స్ఫూర్తి పొందాడు. నల్లవారి హక్కుల కోసం ఆవిర్భవించిన ‘ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్’లో చేరాడు. క్రియాశీలక కార్యకర్తగా పని చేశాడు. తెల్లవారి ఆగ్రహానికి గురయ్యాడు. ఇరవై ఏడేళ్ల పాటు దుర్భరమైన జైలు జీవితం గడిపాడు. విడుదలయ్యాక - దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేశారు. దక్షిణాఫ్రికాలో ఎన్నికైన తొలి అధ్యక్షుడు. స్వేచ్ఛ... అతడు సాధించి పెట్టిన తేనెపట్టు. ఆత్మగౌరవం... నల్లజాతికి అతడు రాసిపెట్టిన రాజ్యాంగం. -
అంతర్జాతీయం
హతాఫ్ -3 క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్ అణుసామర్థ్యం ఉన్న క్షిపణి హతాఫ్-3ని పాకిస్థాన్ ఏప్రిల్ 22న విజయవంతంగా ప్రయోగించింది. 200 కిలోమీటర్ల పరిధి ఉన్న ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. సైన్యంలోని వ్యూహాత్మక దళాల కమాండ్ శిక్షణలో భాగంగా ఈ పరీక్ష నిర్వహించింది. భారత్‌లోని పలు ప్రాంతాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయి. కొత్త ఖనిజాన్ని గుర్తించిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పశ్చిమ ఆస్ట్రేలియాలో కొత్త ఖనిజాన్ని శాస్త్రవేత్తలు గుర్తించినట్లు అడిలైడ్‌కు చెందిన మినరలాజికల్ మ్యాగజీన్ ఏప్రిల్ 21న తెలిపింది. నిర్మాణం, కూర్పులో ప్రత్యేకత కలిగిన ఆ ఖనిజానికి పుట్నిసైట్ అని పేరుపెట్టారు. ఈ పుట్నిసైట్లో స్టోంటియం, కాల్షియం, క్రోమియం, సల్ఫర్, కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ మూలకాలు ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు 400 ఖనిజ రకాలను గుర్తించారు. బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా సిద్దార్థ్ హిందీ చిత్రం సిద్దార్థ్ బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ చిత్రానికి ఇండియన్ కెనడియన్ రిచీ మెహతా దర్శకత్వం వహించారు. తప్పిపోయిన కొడుకు కోసం తండ్రి వెతకడం అనే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 88 దేశాల నుంచి వచ్చిన 837 చిత్రాలతో పోటీ పడిన సిద్దార్థ్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. దక్షిణ కొరియా ప్రధాని చుంగ్ హాంగ్ వాన్ రాజీనామా ప్రయాణికుల నౌక మునిగిపోయిన దుర్ఘటనతో కలత చెందిన దక్షిణ కొరియా ప్రధానమంత్రి చుంగ్ హాంగ్ వాన్ ఏప్రిల్ 27న పదవికి రాజీనామా చేశారు. ప్రయాణికులను రక్షించడంలో ప్రభుత్వం సరిగా స్పందించలేదని ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. సహాయ చర్యలు సమర్థంగా నిర్వహించలేకపోయామని ప్రధాని అంగీకరించారు. దక్షిణకొరియా దక్షిణ తీరంలో ఏప్రిల్ 16న నౌక మునిగిపోయి 300 మంది గల్లంతయ్యారు. మొత్తం 459 మంది నౌకలో ప్రయాణిస్తున్నారు. అందులోని వారంతా విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు. ప్రభావితం చేయగల వ్యక్తుల్లో మోడీ, కేజ్రీవాల్, అరుంధతి రాయ్‌కి స్థానం 2014 సంవత్సరానికి ప్రపంచంలో అత్యంత ప్రభావితం చేయగల 100 మంది జాబితాను టైమ్ మ్యాగజీన్ ఏప్రిల్ 25వ సంచికలో ప్రచురించింది. ఈ 100 మందిలో భారత్ నుంచి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్, నవలాకారిణి అరుంధతీ రాయ్‌లకు చోటు దక్కింది. వీరితో పాటు కొయంబత్తూర్‌కు చెందిన ఆరోగ్య ప్రచారకర్త అరుణాచలమ్ మురుగనాథమ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. టైమ్ మ్యాగజీన్ జాబితాలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ముఖచిత్రంగా ప్రచురితమైన గాయకురాలు బియోన్స, అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, పాకిస్తాన్ బాలికల విద్య ప్రచార కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్, విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ స్నోడన్, జపాన్ ప్రధానమంత్రి షింజో అబె ఉన్నారు. దక్షిణ ఆఫ్రికాలో బహుళ జాతి ప్రజాస్వామ్యానికి 20 ఏళ్లు దక్షిణ ఆఫ్రికాలో బహుళ జాతి ప్రజాస్వామ్యానికి ఏప్రిల్ 27 నాటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. 27న ఫ్రీడమ్ డే ని జరుపుకున్నారు. మండేలా లేకుండా తొలిసారి ఫ్రీడమ్ డే జరిగింది. జాత్యహంకార వ్యతిరేక పోరాట యోధుడు మండేలా 95 ఏళ్ల వయసులో 2013 డిసెంబర్లో మరణించారు. 20 ఏళ్ల క్రితం దేశంలో అన్ని జాతులు తొలిసారి ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో పాల్గొన్నాయి. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) అధికారంలోకి వచ్చింది. నెల్సన్ దేశ తొలి నల్లజాతి అధ్యక్షుడిగా అధికారం చేపట్టారు. -
ఆరిపోయిన ఆఫ్రికన్ సెర్చ్‌లైట్...
2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో డ్యూమర్ హడావుడి అంతా ఇంతా కాదు. జర్నలిస్ట్‌గా ఇతడు ఆఖరిసారి కవరేజ్ చేసిన అతి పెద్ద కార్యక్రమం నెల్సన్మండేలా అంత్యక్రియలు. చీకటి ఖండంలోని పరిస్థితుల పరిశోధనకై వెలిగిన సెర్చ్‌లైట్ లాంటి వ్యక్తి కొమ్లా డ్యూమర్. ఆఫ్రికన్ దేశాలకు సంబంధించిన రాజకీయ, ఆర్థిక, సామాజిక, క్రీడా విశేషాలను ప్రపంచానికి వివరించే కార్యక్రమం ‘ఫోకస్ ఆన్ ఆఫ్రికా’. బీబీసీ వరల్డ్ న్యూస్‌లో ప్రైమ్‌టైమ్‌లో ప్రసారం అవుతూ వచ్చిన ఈ కార్యక్రమపు ప్రెజెంటర్‌గా పేరు పొందిన వ్యక్తి డ్యూమర్. ఇటీవలే డ్యూమర్ అనే ఆ వెలుగు ఆరిపోయింది. 41 యేళ్ల వయసులోనే డ్యూమర్ గుండెపోటుతో లండన్‌లోని తన నివాసంలో మరణించాడు. ఈ సందర్భంగా ఆయన ప్రస్థానం గురించి... అట్లాంటిక్ తీర ప్రాంతంలో ఉంటుంది ఘనాదేశం. ఈ దేశం ఆఫ్రికా తరపు వాయిస్ వినిపించడానికి గొప్ప బహుమతులనే ఇచ్చింది. అలాంటి బహుమతుల్లో డ్యూమర్ ముఖ్యుడు. ఇంతకుముందు ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడిగా ఉన్న కోఫీ అన్నన్ కూడా ఘనా దేశానికి చెందినవాడే. ఆ తర్వాత ఆ దేశంలో మంచి గుర్తింపు సంపాదించుకొన్న వ్యక్తి డ్యూమర్. ఘనా దేశంలో ఒక విద్యాధికుల కుటుంబంలో జన్మించాడు డ్యూమర్. ఇతడి తండ్రి సోషియాలజీలో ప్రొఫెసర్, తల్లి మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్స డిగ్రీ చేశారు. అంతకన్నా ముందు వారిని పరిశీలిస్తే ఘనాదేశపు జాతీయగీతాన్ని రచించిన ఫిలిప్ బె హో డ్యూమర్ వాళ్ల తాతగారే. ఈ విధంగా డ్యూమర్ కుటుంబ నేపథ్యం ఆయన జర్నలిస్టు కావడానికి కారణం అయ్యింది. మొదట ఘనా తర్వాత నైజీరియాలలో చదువుకొన్న డ్యూమర్ ఆ తర్వాత అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. అక్కడ ఎమ్ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశాడు. భిన్నమైన రంగంలోకి: చదివింది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్.. ప్రవేశించింది కమ్యూనికేషన్ రంగం, గుర్తింపు తెచ్చుకొంది న్యూస్ ప్రెజెంటర్‌గా. ఇలా భిన్నమైన రీతిలో జరిగింది డ్యూమర్ పయనం. ఘనాలోని తన సొంతూరిలో ‘జాయ్ ఎఫ్ఎమ్’లో మార్నింగ్ షోకి హోస్ట్ చేయడంతో డ్యూమర్‌కు గుర్తింపు దక్కింది. ఘనా జర్నలిస్ట్ అసోసియేషన్ అప్పట్లోనే డ్యూమర్‌కు ఉత్తమ ప్రెజెంటర్ అవార్డును కూడా ఇచ్చింది. ఆ గుర్తింపుతో బీబీసీ వారి ఆఫ్రికా విభాగంలో ప్రవేశం దక్కింది. బీబీసీ రేడియోతో మొదలైన డ్యూమర్ ప్రస్థానం బీబీసీ వరల్డ్ న్యూస్ చానల్లో కీలక స్థానం వరకూ సాగింది. కీలక సంఘటనలకు వ్యాఖ్యాత: బీబీసీలో ఆఫ్రికా అనగానే... డ్యూమర్ పేరు ప్రస్తావించే దశకు ఆయన ఎదిగారు. వచ్చింది. కోఫీ అన్నన్, బిల్‌గేట్స్ వంటి ప్రముఖులతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు చేశాడు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆఫ్రికాలో పర్యటించినప్పుడు ఆయన వెంట ఉన్నవారిలో డ్యూమర్ కూడా ఒకరు. 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో డ్యూమర్ హడావిడి అంతా ఇంతా కాదు. జర్నలిస్ట్‌గా ఇతడు ఆఖరిసారి కవరేజ్ ఇచ్చిన ప్రముఖ కార్యక్రమం నెల్సన్మండేలా అంత్యక్రియలు. ప్రభావవంతమైన ఆఫ్రికన్: ఆఫ్రికా పరిస్థితుల గురించి అవగాహనతో, ఆఫ్రికా అంటే అభిమానంతో ఆ ప్రాంతంలోని వార్తలను పాశ్చాత్య ప్రపంచానికి ప్రెజెంట్ చేసే డ్యూమర్ అంటే ఆఫ్రికన్లకు ప్రత్యేక అభిమానం. యూరప్‌లోని ఆఫ్రికన్లలో డ్యూమర్ కు ఫ్యాన్‌ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో 2013లో ఎంపిక చేసిన ‘అత్యంత ప్రభావాత్మక ఆఫ్రికన్లు-100’ జాబితాలో డ్యూమర్‌కు స్థానం దక్కింది. అంతలోనే డ్యూమర్ మరణించడం విషాదం. -
నవయువం : విజేతలు వద్దంటున్నారు..!
‘ఆశావాదాన్ని అస్త్రంగా చేసుకో... నిరాశ దరిచేరినా భయపడకు... నీకు అసాధ్యం అనేది ఉండదు...’ ఆనందం, బాధ... జీవితాన్ని చెరో చెయ్యి పట్టుకొని నడిపిస్తుంటాయట. ఆనందానికి అప్పుడప్పుడన్నా అలసట ఉంటుంది కానీ, బాధ మాత్రం తరచూ పలకరిస్తుంటుంది. బాధలు, కష్టాలు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో స్థాయిలో ఉండొచ్చు. కానీ ఈ స్థాయితో సంబంధం లేకుండా చాలామంది తమ చిన్న చిన్న బాధలను మాత్రమే తలుచుకొని తమను ఆనందం కూడా ఒక చేయిపట్టుకొని నడిపిస్తోందన్న విషయాన్ని మరిచిపోతున్నారు! అమూల్యమైన జీవితానికి విషాదభరితమైన ముగింపు ఇస్తున్నారు. తాము కష్టాలుగా భావిస్తున్నవాటిని ఎదుర్కొని బతకాలంటే స్ఫూర్తి కావాలి. అలాంటి స్ఫూర్తిని చాలామంది పెద్దవాళ్లు తమ మాటలతో, జీవితాలతో పంచారు. ఆ మాటల్లో కొన్ని... ‘‘నీకు భవిష్యత్తు మీద ఆశను ఇచ్చాను, ఆరోగ్యాన్ని, మేధస్సును, ఎన్నో అవకాశాలను ఇచ్చాను. కానీ నువ్వు నాకు తిరిగి ఇచ్చిందేమిటి? నిరాశా! ఒక్కసారి ఆలోచించు, అంతర్మథనం చేసుకో, అప్పుడు దమ్ముంటే చావడానికి ప్రయత్నించు...’’ అంటూ ‘ప్రకృతి’ చేత చెప్పిస్తాడు ‘ది సూసైడ్ ఆర్గ్యుమెంట్’ అనే కవితలో ఆంగ్ల కవి కాల్రిడ్జ్. అందమైన జీవితానికి ఆత్మహత్య అనే పరిష్కారం ఇచ్చిన వారిని నిరసిస్తూ, ఇవ్వాలనుకొనే వారిని నిందిస్తాడు కాల్రిడ్జ్. ఎడిసన్ పంచిన కాంతి.. ‘‘విఫలం అయ్యామని బాధపడే వారి విషయంలో విషాదం ఏమిటంటే.. వారికి తెలీదు... తాము విజయానికి ఎంత దగ్గరగా వచ్చామో. విజయతీరాల వద్దకు వెళ్లి కూడా, వైఫల్యం చెందామనుకుని తొందరపడి వారు పట్టు వదిలేస్తుంటారు... ’’ అంటాడు థామస్ ఆల్వా ఎడిసన్. సక్సెస్ సీక్రెట్‌ను వివరిస్తూ ఎడిసన్ ఈ మాటలు చెప్పాడు. సహనం ఉంటే అద్భుతమైన తీరాలకు చేరే అవకాశం ఉన్నప్పటీ అర్ధాంతరంగా తనువులను చాలించే వారి జీవితాలకు కూడా ఈ మాటలను అన్వయించవచ్చు. బల్బ్‌ను ఆవిష్కరించి ప్రపంచానికి దీపాన్ని బహుమతిగా వచ్చి ఎడిసన్ మాటల్లో కాంతి కనిపిస్తుంది. నిరాశను లెక్కచేయకండి... ‘‘ఓడిపోకుండా, నిరాశ లేకుండా బతకడం గొప్ప కాదు, అలాంటి పరిస్థితుల్లోంచి కూడా కొత్త ఆశతో పైకి ఎదగడమే నిజమైన గొప్పదనం...’’ అంటాడు నెల్సన్ మండేలా. వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడి 27 సంవత్సరాల పాటు కారాగారంలోనే బతికిన మండేలా ఏనాడూ తనకు ఆత్మహత్య ఆలోచన రాలేదని గర్వంగా చెప్పాడు. విడుదల ఎప్పుడో తెలీదు, బయట ప్రపంచాన్ని చూసే అవకాశం ఉందో లేదో కూడా తెలీదు. అయినా తన దీనస్థితికి కుమిలిపోలేదు. ‘‘ఆశావాదాన్ని అస్త్రంగా చేసుకో... నిరాశ దరిచేరినా భయపడకు... నీకు అసాధ్యం అనేది ఉండదు...’’ అంటాడు ప్రసిద్ధ హాలీవుడ్ నటుడు క్రిస్టఫర్రీవ్. ‘సూపర్‌మ్యాన్’ సినిమాతో ప్రపంచానికి పరిచయం ఉన్న రీవ్ ఒక ప్రమాదంలో వికలాంగుడయ్యాడు. ఆ వెంటనే ఆయనకు వచ్చిన ఆలోచన ఆత్మహత్యేనట. అయితే తన ఆలోచన తీరును తనే మార్చుకొని, నిస్పృహ నుంచి బయటకు వచ్చి ఎన్నో జీవితాలకు స్ఫూర్తిని పంచాడు రీవ్. జీవితం గొప్పది, బంధాలు పెనవేసుకొన్న బతుకు ఉన్నతమైనది... ఎంతోమంది విజేతలు తమ జీవితాలతో ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఇది. విధిని ఎదుర్కొని సాగించాల్సిన విజయ ప్రస్థానానికి స్ఫూర్తి ఇది. - జీవన్ -
శాల్యూట్ టు మండేలా
నెల్సన్ మండేలా చనిపోయిన తరువాత... ఆయన పోరాటాన్ని, తెగువను గుర్తుతెచ్చుకుంటూ కవులు కవితలు రాశారు. గాయకులు గొంతెత్తి పాడారు. తమదైన కోణంలో నుంచి కళాకారులు ఆ పోరాటయోధునికి నివాళులు అర్పించారు. చైనీస్ ఆర్టిస్ట్ ల్యు జియాంగ్మింగ్ కూడా తన స్పందనకు చిత్రరూపం ఇచ్చాడు. ఆయిల్ పెయింటింగ్‌లతో తన ఆరాధన భావాన్ని చాటుకున్నాడు. తాను గీసిన మూడు చిత్రాలకు ‘శాల్యూట్ టు మండేలా’ ‘చైనా అండ్ మండేలా’ ‘వరల్డ్ అండ్ మండేలా’ అని పేరు పెట్టుకున్నాడు. ‘శాల్యూట్ టు మండేలా’ ఆయిల్ పెయింటింగ్‌లో మండేలా పెదవులపై వినిపించే నవ్వు, చేతి వేళ్లు.. ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రియాశీలతను సూచిస్తాయి. అందులో ఉపయోగించిన ప్రతి వర్ణం స్వాతంత్య్రం, సమానత్వం, శాంతి భావాలను ప్రతిఫలిస్తాయి. మండేలా చుట్టూ ఉన్న ఐదు చేతివేళ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రజాభిమానానికి ప్రతీకగా నిలుస్తాయి. ‘వరల్డ్ అండ్ మండేలా’లో చైల్డ్ హ్యాండ్ప్రింట్స్ కనిపిస్తాయి. చేతిలో వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది. నిష్కల్మషమైన, పవిత్రమైన, అందమైన ప్రపంచాన్ని అది సూచిస్తుంది. ఫైన్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో పని చేసే జియాంగ్మింగ్కు మండేలా అన్నా, అతని భావజాలమన్నా చాలా ఇష్టం. ‘లాంగ్ మార్చ్’లో పాల్గొన్న సైనికుల పోర్ట్రెయిట్లను చిత్రించడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాడు. హార్లోడ్ రిలే గురించి కొంత... ఆర్టిస్ట్ హార్లోడ్ రిలే తాను గీసిన డజను మండేలా చిత్రాలతో న్యూయార్క్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. ఇంతకుముందు ఎవరూ చూడని ఆ చిత్రాలను ‘వెరీ పర్సనల్’ అంటున్నాడు. ఒక పెయింటింగ్ అమ్మగా వచ్చిన మొత్తాన్ని ‘సౌత్ ఆఫ్రికన్ చిల్డ్రన్స్ చారిటీ’కి విరాళంగా ఇచ్చాడు. జియాంగ్మింగ్లాగే హార్లోడ్ పెయింటింగ్లలోను అనేక ప్రతీకలు కనిపిస్తాయి. మండేలా అమితంగా అభిమానించే పుస్తకాలు, వార్తపత్రికలను ప్రతీకాత్మకంగా చూపాడు. కేవలం ప్రతీకలు మాత్రమే కాకుండా దక్షిణాఫ్రికా భౌగోళిక అందాలు కూడా ఆ పెయింటింగ్‌లతో కనువిందుచేస్తాయి. చిత్రాలలో రంగులు మాత్రమే కాదు... మండేలా వ్యక్తిత్వం కనిపిస్తుంది. శాంతి పట్ల ఆయన ప్రేమ, ఈతరం పట్ల అభిమానం, ఆటల మీద ప్రేమ కనిపిస్తాయి. కొన్ని డ్రాయింగ్లలో మండేలా సంతకం కనిపిస్తుంది. -
యూపీఏకు ఇక గడ్డు రోజులే..
కలెక్టరేట్, న్యూస్‌లైన్: యూపీఏ ప్రభుత్వం ఓ వైపు సంపన్నులకు రాయితీలు కల్పిస్తూ.. మరోవైపు అన్ని రకాల ధరలు పెంచుతూ పేద ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. యూపీఏ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలనుందని ఆయన జోస్యం చెప్పారు. సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేవల్ కిషన్ స్మారక రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం సంగారెడ్డిలో ‘వర్తమాన రాజకీయాలు, వామపక్షాల పాత్ర’ అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా బీవీ రాఘవులు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ విధానాల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చా రు. వర్ణ వ్యవస్థ, సామాజిక మార్పు కోసం నెల్సన్ మండేలా పోరాట పటిమ ప్రజా ఉద్యమాలకు ప్రేరణ కావాలన్నారు. ఆర్థిక సంక్షోభం దేశంలోని పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ప్రైవేటు కంపెనీలకు రుణాలిచ్చేందుకు మొగ్గు చూపుతున్న ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రయత్నిం చడం లేదని విమర్శించారు. రూ.9,320 కోట్ల విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. విభజన, సమైక్య ఉద్యమాల పేరుతో ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రాబోయే కాలంలో ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి చుక్కా రాములు మాట్లాడుతూ కేవల్ కిషన్ వర్ధంతిని గురువారం జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. సెమినార్లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.మల్లేశం, రాాజయ్య, జయరాజ్, జిల్లా కమిటీ సభ్యులు అడివయ్య, మాణిక్యం, ప్రవీణ్, నాగేశ్వర్, గణేశ్, రేవంత్, సాయిలు, నర్సింలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నెల్సన్ మండేలా అంత్యక్రియలు
-
మండేలా.. మాలోనే ఉన్నావు
స్వగ్రామం కునులో మండేలాకు అంత్యక్రియలు అశ్రునయనాలతో మహాత్ముడికి తుది వీడ్కోలు తరలివచ్చిన 4,500 మంది ప్రముఖులు మండేలా కలగన్న ఆశయాలను సాధిస్తాం: జాకబ్‌జుమా కును: బాల్యంలో ఆటలాడి, అల్లరిచేసి, స్నేహితులతో మధుర క్షణాలను పంచుకున్న నల్లజాతీయుల దేవుడు.. అదే నేలపై అంతిమ వీడ్కోలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆత్మీయుల అశ్రునయనాల మధ్య.. సైనిక దళాల గౌరవ వందనాల నడుమ అధికారిక లాంఛనాలతో దక్షిణాఫ్రికాలోని కును గ్రామంలో నెల్సన్ మండేలాకు ఆదివారం అంత్యక్రియలు జరిగాయి. మండేలా భౌతికకాయాన్ని ఉంచిన శవపేటికను కుటుంబ సభ్యులు, అతిథులు వెంటరాగా.. ఇంటి నుంచి సమాధి చేసే స్థలం వరకూ తీసుకెళ్లారు. థెంబు తెగ ప్రజల మత సంప్రదాయాలను అనుసరించి సమాధి చేశారు. భౌతికంగా దక్షిణాఫ్రికన్లను వీడినా.. వారి మనసుల్లో తాను మిగిల్చి వెళ్లిన స్ఫూర్తి రూపేణా మండేలా సజీవులై ఉన్నారు. మండేలా అనారోగ్యంతో ఈ నెల 5న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కొండ ప్రాంతం కునులో అంత్యక్రియలు జరిగే స్థలం వరకూ దారికి ఇరువైపులా సైనికులు గౌరవ వందనాలు సమర్పిస్తుండగా.. మండేలా అంతిమ యాత్రలో గిరిజన నేతలు, దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులు పాల్గొన్నారు. మండేలా 95 ఏళ్ల వయసుకు గుర్తుగా ఒక్కో ఏడాదికి ఒక్కో కొవ్వొత్తి చొప్పున 95 కొవ్వొత్తులను వెలిగించి నివాళులర్పించారు. మారుమూల కొండ ప్రాంతం కావడంతో కేవలం 4,500 మందిని మాత్రమే మండేలా అంత్యక్రియలకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం అనుమతించింది. మండేలా చివరి భార్య గ్రెకామాచెల్, మాజీ భార్య విన్నీ, ఇతర కుటుంబ సభ్యులు సహా మొత్తం మీద 450 మందినే సమాధి స్థలం వరకు అనుమతించారు. మీ అడుగుజాడల్లో నడుస్తాం.. స్మారక కార్యక్రమంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా మాట్లాడుతూ.. మండేలా ఆశయాలైన పేదరిక నిర్మూలన, నిరుద్యోగ-నేరరహిత దక్షిణాఫ్రికా సాధన కోసం కృషి చేస్తామని ప్రకటించారు. మీ(మండేలా) తుది అడుగుజాడల్లో దక్షిణాఫ్రికా ముందుకు వెళుతుందని హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. భారత సంతతికి చెందిన దక్షిణాఫ్రికా పౌరుడు, ఉద్యమకారుడు, రాబెన్ ఐలాండ్ కారాగారంలో మండేలాతో కలిసి కారాగారవాసం చేసిన అహ్మద్కత్రదా మాట్లాడుతూ.. మండేలా దక్షిణాఫ్రికా ప్రజలతోపాటు ప్రపంచమంతటినీ చరిత్రలో అంతకుముందెన్నడూ లేని విధంగా ఐక్యంగా నిలిపారని ప్రస్తుతించారు. బ్రిటన్ యువరాజు చార్లెస్, ఇరాన్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ షారియత్మదారి, పలు ఆఫ్రికా దేశాల అధ్యక్షులతోపాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అగ్రనేతల తరఫున ప్రతినిధులు, టాక్ షో వ్యాఖ్యాత ఓఫ్రా విన్ఫ్రే కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. -
మండేలా అంత్యక్రియలకు 450 మంది!
-
మండేలా అంత్యక్రియలకు 450 మంది!
కేప్ టౌన్: జాతివివక్ష వ్యతిరేకోద్యమ నాయకుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా అంత్యక్రియలకు సుమారు 450 మంది అతిథులు హాజరవుతారని ప్రభుత్వం ప్రకటించింది. మండేలా కుటుంబ సభ్యులతో సహా అతిథులను అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి అనుమతిస్తామని తెలిపింది. సాధారణ ప్రజలను అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి అనుమతించబోమని వెల్లడించింది. నెల్సన్ మండేలా అంత్యక్రియలను దక్షిణాఫ్రికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మండేలా అంత్యక్రియలు ఆయన తెగ హోసాకు చెందిన శ్మశానంలో జరుగుతాయి. -
నేడు నెల్సన్ మండేలా అంత్యక్రియలు
జాతివివక్ష వ్యతిరేకోద్యమ నాయకుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా భౌతికకాయాన్ని శనివారం ప్రిటోరియా నుంచి ఆయన చిన్నప్పుడు గడిపిన కును గ్రామానికి తరలించారు. అంతకుముందు ప్రిటోరియాలో దేశాధ్యక్షుడు జాకబ్ జుమా, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో థాథా పట్టణానికి తీసుకెళ్లి, అక్కడి నుంచి అధికార లాంఛనాలతో కును వరకు అంతిమయాత్ర నిర్వహించారు. 31 కి.మీ సాగిన యాత్ర జనసంద్రాన్ని తలపించింది. అభిమానులు తమ ప్రియతమ నేతను తలచుకుంటూ పాటలు పాడారు. మండేలా అంత్యక్రియలు ఆదివారం ఆయన తెగ హోసాకు చెందిన శ్మశానంలో జరుగుతాయి. -
నల్లసూర్యునికి ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: దక్షి ణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు శాసనసభ గురువారం ఘనంగా నివాళులర్పించింది. నల్లజాతీయుల స్వేచ్ఛ కోసం దాదాపు మూడు దశాబ్దాల జైలు జీవితం గడిపిన మండేలా శ్వేత జాతీయులపై ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచన ఏనాడూ రానీయలేదని, ఆయన క్షమా గుణం ఎవరెస్ట్ శిఖరం కంటే గొప్పదని సభ్యులు కొనియాడారు. సభ్య సమాజంలో మండేలా మహా శిఖరమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొనియాడగా.. ఆయన యుగపురుషుడని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అన్నారు. మండేలా జీవితమే ఓ సందేశం అని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష నేత విజయమ్మ శ్లాఘించారు. సభలో తొలుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి... మండేలా మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతి వివక్షకు వ్యతిరేకంగా, మానవ హక్కుల సాధన కోసం విశేషంగా కృషి చేసిన మండేలా మరణం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో మండేలా పోరాడారని తెలిపారు. ఆయనకు భారతదేశం ‘భారతరత్న’ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించిందని, 1993లో నోబెల్ శాంతి బహుమతి, యాభైకిపైగా అంతర్జాతీయ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల తరపున ఆ దేశ ప్రజలకు, మండేలా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాట్లాడుతూ.. సొంత గడ్డపై కనీసం ఓటు హక్కు కూడా లేని నల్లజాతీయుల తరఫున అలుపెరుగని పోరాటం చేసిన మండేలా ‘యుగపురుషుడు’ అని అభివర్ణించారు. అహింస, క్షమాభిక్ష ఆయన సుగుణాలని వ్యాఖ్యానించారు. అహింస, సహాయ నిరాకరణతో ఆయన అనుకున్నది సాధించారని పేర్కొన్నారు. అఫ్రికా స్థితిగతులు మెరుగుపర్చడానికి ఆయన కృషి అమోఘం అని అన్నారు. క్షమాభిక్షలో ఎవరెస్ట్: మండేలా జీవితమే ఒక సందేశమని వైఎస్సార్సీపీ శాసనసభా పక్షనేత వైఎస్ విజయమ్మ అన్నారు. స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, రంగు, కులం, మతం లాంటి సంకుచిత భావాలకు దూరంగా ఆయన జీవనం కొనసాగిందని కొనియాడారు. నల్లజాతీయుల స్వేచ్ఛ కోసం ఆయన దాదాపు మూడు దశాబ్దాల కాలం కారాగారంలో ఉన్నా.. ఎన్ని చిత్రహింసలకు గురిచేసినా వెరవకుండా తన పంథాలో సాగారని చెప్పారు. ఆయన జీవితంలో పగ, ప్రతీకారానికి తావు లేదని, క్షమాభిక్షలో ఎవరెస్ట్ కంటే ఎత్తై వారని అన్నారు. అసమాన వ్యక్తత్వమే ఆయనకు ఈ గుర్తింపు తెచ్చిందని, మానవుల మధ్య అడ్డుగోడలు కూల్చడానికి మండేలా పోరాటమే స్ఫూర్తి అని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. మండేలా ఇచ్చిన సందేశం ప్రకారం ‘నీ హక్కుల కోసం పోరాడు.. ఇతరులపై హక్కు కోసం పోరాడ వద్దు’ అని చేసిన సూచనను అందరూ గుర్తుంచుకోవాలన్నారు. అందరూ స్వేచ్ఛగా ఉండాలని కోరారని, అణగారిన వర్గాల కోసం చేసిన ఆయన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. మరణాన్ని కూడా లెక్కచేయని చరితార్థుడు మండేలా అని కీర్తించారు. సీపీఐ నేత మల్లేశ్, సీపీఎం నాయకుడు జూలకంటి రంగారెడ్డి, బీజేపీ నాయకుడు యెండల లక్ష్మీనారాయణ, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్‌లు మండేలా మృతిపై సంతాపం ప్రకటించారు. అనంతరం మండేలా ఆత్మశాంతికోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది. మండేలా ఆదర్శనీయుడు: చక్రపాణి మండేలాకు శాసన మండలి ఘనంగా నివాళులర్పించింది. ఉదయం మండలి ప్రారంభం కాగానే మంత్రి సి.రామచంద్రయ్య ప్రభుత్వ పక్షాన సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ప్రసంగించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన సభ్యులు మండేలాకు నివాళులర్పించారు. ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలు, మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకున్న తీరు గురించి వివరించారు. చివరగా మండలి చైర్మన్ చక్రపాణి మండేలాను అంతా ఆదర్శంగా తీసుకుని నవసమాజ నిర్మాణానికి కృషి చేయాలని తన సందేశంలో పేర్కొన్నారు. తర్వాత సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం వాయిదాపడింది. అన్ని పార్టీలూ సహకరించాలి: శోభ ఉద్యమాన్ని కిరణ్ నీరుగారుస్తున్నారంటూ ధ్వజం సమైక్య తీర్మానం కోసం స్పీకర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ నోటీసిచ్చిందని పార్టీ శాసనసభా పక్ష ఉప నేత భూమా శోభానాగిరెడ్డి తెలిపారు. ప్రైవేట్ బిల్లు కింద ఇచ్చిన ఈ తీర్మానానికి విభజనతో నష్టపోయే ప్రాంతాలకు చెందిన అన్ని పార్టీల సభ్యులూ మద్దతివ్వాలని కోరారు. గురువారం అసెంబ్లీ వాయిదా పడ్డాక పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్య ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారంటూ దుయ్యబట్టారు. వారానికోసారి పత్రికల్లో ప్రకటనలు తప్పితే సమైక్యం కోసం ఆయన ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. సభలో విభజన బిల్లును ఓడిస్తామంటూ ప్రజలను మభ్యపెట్టేలా కిరణ్ ప్రకటనలు చేస్తున్నారంటూ శోభ దుమ్మెత్తిపోశారు. ‘‘బిల్లు వచ్చినప్పుడు కేవలం అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటారు. ఓటింగ్ ఉండదు. అదే తీర్మానం విషయంలో అయితే ఓటింగ్ ఉంటుంది. కాబట్టి సభ సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపితే పార్లమెంటులో అదొక ఆయుధంలా పని చేస్తుంది’’ అని శోభ వివరించారు. కానీ కిరణ్ మాత్రం కాంగ్రెస్ అధిష్టానం డెరైక్షన్‌లో విభజన దిశగా ముందుకెళ్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబుకు తానేం మాట్లాడుతున్నదీ తనకైనా అర్థమవుతోందా అని ప్రశ్నించారు. సమైక్యానికి మద్దతివ్వకపోతే బాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. -
మండేలా జీవితం ఓ సందేశం:విజయమ్మ
-
మండేలా జీవితం ఓ సందేశం: వైఎస్ విజయమ్మ
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా జీవితం ఓ సందేశమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి. మండేలా సంతాప తీర్మానాన్ని సీఎం కిరణ్ శాసనసభలో ప్రవేశ పెట్టారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ...మండేలా ప్రతి ఒక్కరికి మార్గదర్శి అని పేర్కొన్నారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ, లూధర్ కింగ్, నెల్సన్ మండేలాలు మహాపురుషులని వైఎస్ విజయమ్మ ప్రశంసించారు.ఆ మహాపురుషుల జీవితాలకు ఎల్లలు లేవన్నారు. మానవాళిని మాటలు, చేతల ద్వారా నడిపిన మహానీయుల్లో మండేలా ఒకరిని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. అలాగే వివిధ పార్టీల శాసనసభ పక్ష నేతలు ఈ సందర్బంగా మండేలా దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని ఈ సందర్బంగా కొనియాడారు. -
మానవ జాతి చరిత్రలో మండేలా మహా శిఖరం: కిరణ్
నల్లజాతి సురీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా జాతీ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహాయోధుడని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కీర్తించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి. ఈ సందర్బంగా మండేలా మృతికి సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆ సందర్బంగా సీఎం కిరణ్ మాట్లాడుతూ...మానవ జాతి చరిత్రలో మండేలా మహా శిఖరమని కిరణ్ అభివర్ణించారు.మండేలా మృతి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం పోరాడే ప్రతి ఒక్కరికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. నెల్సన్ మండేలా జీవితంలో ఎన్నో ఆటుపోట్లును ఎదుర్కొన్నారని తెలిపారు. నెల్సన్ మండేలాకు వచ్చిన పురస్కారాలకు లెక్కలేదని చెప్పారు. అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ... మండేలా మృతితో ఓ యుగపురుషుడిని కోల్పోయామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో మండేలా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారని ఆయన గుర్తు చేశారు. వర్ణ వివక్షపై పోరాడే క్రమంలో మండేలా మరణానికి వెరవకుండా పోరాటం సాగించారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. బతుకంతా పోరాటానికి ఆంకితం చేసిన మహానుభావుడు అని మండేలా పోరాటాన్ని కేటీఆర్ కొనియాడారు. -
చరిత్రలో మండేలా మహా శిఖరం: కిరణ్
-
నల్ల సూరీడుకి ఘన నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: భారత సంస్కృతిక సహకార స్నేహ సంఘం(ఐఎస్‌సీయూఎఫ్) జాతీయ సమితి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని గాంధీపీస్ పౌండేషన్ హాలులో నెల్సన్ మండేలాకి ఘనంగా నివాళులర్పించారు. భానుదేవదత్త అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సంతాప సభలో సంఘానికి చెందిన 13 రాష్ట్రాల ముఖ్య నాయకులు పాల్గొన్నట్టు జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎల్ఏకె.సుబ్బరాజు తెలిపారు. మండేలా సంతాప దినాలను సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లో సంతాపసభలు నిర్వహిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.జాతి వివిక్షత,అస్పృశ్యత, అణచివేతలకు వ్యతిరేకంగా మండేలా చేసిన పోరు అందరికీ స్పూర్తిదాయకమని వక్తలు అన్నారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. సంతాప సభలో మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, ప్రొఫెసర్ దేవేంద్ర కౌషిక్, విజయ్ కుమార్ పడిహారి, రాధాకృష్ణన్,నారాయణన్, సుకుమారన్ తదితరులు పాల్గొన్నారు. -
మండేలాకు యావత్ ప్రపంచం ఘన నివాళి
జోహాన్నెస్‌బర్గ్: జాతి వివక్షపై అలుపెరగని పోరాటం చేసిన నాటి తరం చివరి ధ్రువతార, నల్ల వజ్రం, దక్షిణాఫ్రికా ప్రథమ నల్లజాతి అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు మంగళవారం యావత్ప్రపంచం ఘనంగా నివాళి అర్పించింది. మునుపెన్నడూ కనీ, వినీ ఎరగని రీతిలో 100 మంది ప్రపంచస్థాయి నాయకులు, దేశాధినేతలు ఒక్కటిగా డిసెంబర్ 5న మరణించిన ఆ మహా నాయకుడికి శ్రద్ధాంజలి ఘటించారు. చరిత్రలోనే మహోన్నత నాయకుడిగా ఆయనను కొనియాడారు. శ్వేతజాతి ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా మండేలా చేసిన పోరాటంలో కీలకంగా నిలిచిన సొవెటోలోని ఎఫ్ఎన్బీ స్టేడియంలో మండేలా సంస్మరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అదే స్టేడియంలో కొన్నేళ్లక్రితం జరిగిన సభలోనే ఆయన చివరిసారిగా ప్రజలకు కనిపించారు. తమ ప్రియతమ నాయకుడికి నివాళులర్పించేందుకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. కార్యక్రమంలో భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలను పఠించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమం జరుగుతుండగా భారీ వర్షం పడడంతో ఒక నేత ‘వర్షం ద్వారా దేవుడు మండేలాను స్వర్గంలోకి స్వాగతం పలుకుతున్నాడ’ంటూ వ్యాఖ్యానించారు. స్ఫూర్తిదాయక నేత: సంస్మరణ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాట్లాడుతూ.. ‘ఒక జాతిని న్యాయం దిశగా నడిపించి, ఆ ప్రస్థానంలో విశ్వవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు స్ఫూర్తినిచ్చిన మహానాయకుడికి నివాళులర్పిస్తూ ప్రశంసించాల్సి రావడం చాలా కష్టమైన విషయం’ అన్నారు. అమెరికా, దక్షిణాఫ్రికాల్లో జరిగిన జాతి వివక్ష వ్యతిరేక పోరాటాలను ప్రస్తావిస్తూ చేసిన 20 నిమిషాల ప్రసంగంలో ఒబామా పలుమార్లు భారత జాతిపిత మహాత్మాగాంధీని గుర్తు చేశారు. ‘విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మొదట్లో అందరూ భావించిన ప్రజా ఉద్యమాన్ని గాంధీజీ వలెనే మండేలా కూడా విజయవంతంగా నడిపించారు’ అని పేర్కొన్నారు. ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, బ్రిటన్ ప్రధాని కేమరాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండె, జింబాబ్వే అధ్యక్షుడు ముగాబే, అఫ్ఘాన్ అధ్యక్షుడు కర్జాయ్ తదితరులు మండేలాకు నివాళులర్పించారు. కాగా, మండేలా భార్య గ్రేషా మేచీల్, మాజీ భార్య విన్నీ మండేలా, ఇతర కుటుంబ సభ్యులు కార్యక్రమానికి హాజరయ్యారు. మండేలా అంత్యక్రియలను ఆయన స్వగ్రామం కునులో 15న ప్రైవేటు కార్యక్రమంగా నిర్వహించనున్నారు. మండేలా పూజ్యనీయుడు: ప్రణబ్ భారత్ తరఫున రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ సహా ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం మండేలా సంస్మరణ సభలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం లభించిన కొద్దిమంది నాయకుల్లో ప్రణబ్ ఒకరు కావడం విశేషం. స్టేడియంలోకి భారత రాష్ట్రపతి ప్రవేశించగానే సభికులంతా లేచి నిల్చొని హర్షధ్వానాలతో ఆహ్వానం పలికారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకొబ్ జుమా పక్కనే ప్రణబ్ ఆసీనులయ్యారు. ‘క్షమ, ప్రేమల నిజమైన అర్థాన్ని ప్రపంచానికి నేర్పిన అద్భుత వ్యక్తిత్వం కలిగిన పూజ్యనీయుడు మండేలా. ఆయన వారసత్వం ప్రపంచానికి లభించిన అమూల్యమైన సంపద. తనదైన సత్యాగ్రహ పంథాలో అన్యాయానికి, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి అభివృద్ధిదాయక సామాజిక, ఆర్థిక మార్పుకు కారణమైన మహనీయుడు. ఈ శతాబ్దపు అత్యంత స్ఫూర్తిమంతమైన నేతల్లో ఆయన ఒకరు. భారతీయులం ఆయనను ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటాం. మా దేశంతో ఆయనకున్న ప్రేమ, స్నేహానుబంధం మేమెన్నటికీ మరచిపోం. మండేలా ఆత్మకు శాంతి కలగాలి’ అని ప్రణబ్ తన సందేశంలో పేర్కొన్నారు. దారుణమైన పీడన మధ్య అహింసాయుతంగా తన ఉద్యమాన్ని మండేలా గొప్పగా కొనసాగించారని ప్రణబ్ ప్రశంసించారు. దక్షిణాఫ్రికా, భారత్‌ల మధ్య ఉన్న బలమైన బంధాలను ఈ సందర్భంగా ప్రణబ్ ప్రస్తావించారు. ‘మహాత్మాగాంధీ తన రాజకీయ ఉద్యమ ప్రస్థానాన్ని ఇక్కడే ప్రారంభించార’ని గుర్తుచేశారు. ‘మండేలా పట్టుదల, ఓర్పు, అహింసాయుత పోరాటం, అసమాన వ్యక్తిత్వం మాకు గాంధీజీని గుర్తుకు తెస్తాయి. అందుకే భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఆయనకు అందించి మమ్మల్ని మేము గౌరవించుకున్నాం’ అన్నారు. 1995లో భారత పర్యటనకు వచ్చినప్పుడు మండేలా సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారని, అప్పుడు సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉందని వ్యాఖ్యానించారని ప్రణబ్ గుర్తుచేశారు. -
మండేలాకు ప్రణబ్ నివాళి
-
నెల్సన్ మండేలా సంస్మరణ సభ
-
మండేలా సంస్మరణలో ఏకమైన దక్షిణాఫ్రికా
జొహాన్నెస్‌బర్గ్: జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు నివాళులర్పించడంలో దేశ ప్రజలం తా ఏకమయ్యారు. ‘మదీబా’ సంస్మరణ కోసం ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన జాతీయ ప్రార్థనా దినం సందర్భంగా ప్రజలంతా కులమతాలు, జాతివర్ణాలకు అతీతంగా ఆదివారం చర్చ్‌లు, ఇతర ప్రార్థనా స్థలాలకు భారీగా తరలివచ్చారు. జొహాన్నెస్‌బర్గ్‌లోని బ్రయన్స్టన్ మెథడిస్ట్ చర్చ్‌లో జరిగిన మండేలా సంస్మరణ కార్యక్రమంలో దేశాధ్యక్షుడు జాకబ్ జుమాతోపాటు మండేలా మాజీ భార్య విన్నీ మండేలా, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 15న మండేలా స్వగ్రామం కునులో ప్రభుత్వ లాంఛనాలతో జరిగే ఈ అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులతోపాటు ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తదితరులు హాజరుకానున్నారు. -
మండేలా అంత్యక్రియలకు ఏర్పాట్లు
జొహాన్నెస్‌బర్గ్: జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ నేత, మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా అంత్యక్రియల కోసం దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. జొహాన్నెస్బర్గ్గ్లోని ఎఫ్ఎన్బీ స్టేడియంలో మంగళవారం జరగనున్న మండేలా స్మారక కార్యక్రమానికి ప్రపంచ నేతలు పెద్దసంఖ్యలో హాజరు కానున్నందున, వారి కోసం తగిన ఏర్పాట్లు చేస్తోంది. చాలాకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న నల్లసూర్యుడు మండేలా (95) శుక్రవారం అస్తమించిన సంగతి తెలిసిందే. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ప్రిటోరియాలోని యూనియన్ బిల్డింగ్స్ వద్ద మూడు రోజులు ఉంచనున్నారు. అనంతరం డిసెంబర్ 15న ఆయన స్వగ్రామమైన కునులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మండేలా మరణ వార్తతో విషాదసాగరంలో మునిగిపోయిన కును గ్రామం, ఆయన భౌతికకాయం రాక కోసం ఎదురు చూస్తోంది. మండేలా అంత్యక్రియలు ముగిసేంత వరకు సంతాప దినాలుగా ప్రకటించిన దక్షిణాఫ్రికా ప్రభుత్వం, ఆదివారం జాతీయ ప్రార్థనా దినంగా ప్రకటించింది. అలాగే, దేశవ్యాప్తంగా డిసెంబర్ 11 నుంచి 13 వరకు సంతాప కార్యక్రమాలు ఏర్పాటు కానున్నాయి. ‘మా దేశం ముద్దుబిడ్డ, మా జాతిపిత అంత్యక్రియలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు మనమంతా కలసికట్టుగా కృషిచేయాలి’ అని దక్షిణాఫ్రికా అధ్యక్ష కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా చర్చ్‌లు, మసీదులు, ఆలయాలు తదితర ప్రార్థనా స్థలాల్లో మండేలా స్మారకార్థం జరిగే ప్రార్థనల్లో ప్రజలు పాల్గొనాలని కోరింది. హాజరు కానున్న ప్రముఖులు: మండేలా అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా, మాజీ అధ్యక్షుడు జార్జి బుష్, ఆయన భార్య లారా బుష్, మరో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన భార్య, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ హాజరు కానున్నారు. భారత్ తరఫున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మండేలా అంత్యక్రియలకు హాజరు కానుంది. కాగా, దక్షిణాఫ్రికాలో శనివారం సైతం ప్రజలు పెద్దసంఖ్యలో వీధుల్లో గుమిగూడి సంతాప కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జోహాన్నెస్‌బర్గ్ శివార్లలోని హఫ్టన్లో మండేలా నివాసం వద్దకు వేలాది మంది జనం చేరుకుని, ఆయన జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. అంత్యక్రియల సన్నాహాల కోసం దక్షిణాఫ్రికా ఆర్మీ తన సిబ్బందికి సెలవులను రద్దుచేసి, బలగాలన్నింటినీ విధుల్లోకి రప్పించింది. ఉత్తర కొరియా, జింబాబ్వే సహా వివిధ దేశాల నుంచి శనివారం సైతం మండేలాకు నివాళులర్పిస్తూ సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. -
ఆకాశమెత్తు ఆదర్శం అవసరం
బైలైన్ ఎం.జె.అక్బర్, సీనియర్ సంపాదకులు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ఏ సిగ్గూలేని నయవంచకుడా లేక మరో మితవాద రాజకీయవేత్త మాత్రమేనా? లండన్‌లోని సుప్రసిద్ధమైన ‘10 డ్రౌనింగ్ స్ట్రీట్’ విలాసంలో కెమెరాల ముందు నిలిచి ఆయన మండేలాకు అర్ఫించిన నివాళి ఘనమైనదే. కానీ ఆయన ఒక విషయం చెప్పడం మరచారు. విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉండగా ఆయన గది గోడకు ‘మండేలాను ఉరి తీయండి’ అనే పోస్టరు ఉండేది. కామెరాన్, ఆయన మితవాద టోరీ సహచర బృందాలు మార్గరేట్ థాచర్‌ను ఆరాధించేవారు. దక్షిణాఫ్రికాలోని జాత్యహం కార వ్యవస్థను, దాని జాతి దురహంకార క్రూరత్వాన్ని ఇక ఏవిధంగానూ సమర్థించజాలమనీ, ఆ పాశవిక దురన్యాయాన్ని సమర్థిస్తూ కూడా తాము అత్యుత్తమ నాగరికతకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని ప్రజాస్వామిక దేశాలు చెప్పుకోడం కుదరదనీ అమెరికాతో పాటు అత్యధికభాగం పాశ్చాత్య దేశాలు బ్రిటన్ కంటే ముందే గుర్తించాయి. అయినా ఆ తర్వాత కూడా చాలా కాలంపాటు అవి అక్కడి జాత్యహంకార వ్యవస్థను నిలబెట్టే ఆసరా అయ్యాయి. అందుకు కారణం మార్గరేట్ థాచర్. బ్రిటన్ మితవాదం పెంచి పోషించిన చరిత్రకారులు దాని మితవాద భావజాల స్రవింతిలో భాగమే. వారు దక్షిణాఫ్రికాలోని జాత్యహంకార పాలనకు సమర్థకులుగా, చిట్టచివరి ప్రతిఘటనా కేంద్రంగా నిలి చారు. వలస పాలనా, దాని వివిధ దుష్ట రూపాలు ‘స్థానికుల’ మంచికేనని వారు చెప్పేవారు. తమ ఏలుబడిలోని దేశాల ప్రజలు... తమ చరిత్ర గతిలో ఐరోపా దేశాలు జోక్యం చేసుకోవడమనే ‘వరం పొందినవారు’ అని ప్రచారం చేసేవారు. దక్షిణాఫ్రికా జాత్యహంకార పాలన కంటే భారత్‌లోని బ్రిటిష్‌రాజ్ తక్కువ దుర్మార్గమైనదేనని ఒప్పుకోవాల్సిందే. అయితే అందుకు సరితూగేట్టుగా లక్షలాది మంది భారతీయులు కరువు కాటకాలలో రాలిపోవడాన్ని, చైనీ యులు నల్లమందు బానిసలు కావడాన్ని చెప్పుకోవచ్చు. దక్షిణాఫ్రికాలోని అత్యంత బీభత్సకరమైన, జుగుప్సాకరమైన పరిస్థితుల నుంచే 20వ శతాబ్దపు ముగ్గురు అతి గొప్ప దార్శనికులు... గాంధీ, మండేలా, లూథర్కింగ్లు ఆవిర్భవించడం పూర్తిగా సమంజసం. వారిలో ఒకరైన మార్టిన్ లూథర్‌కింగ్ అమెరికాలో సుదీర్ఘంగా కమ్ముకున్న బానిసత్వపు నీలినీడల నుం చి వచ్చినవారు. మండేలా లేదా గాంధీలోని అద్భుత మేధో ప్రతిభ కు ప్రేరణను కలిగించినది బహుశా వారనుభవించిన అత్యథమస్థాయి అవమానమే కావొ చ్చు. ప్రతీకారం ప్రత్యామ్నాయం కాజాలదని అర్థం కావాలంటే నరకాన్ని అనుభవించి ఉండాలి. ప్రతీకారం మరో నరకాన్ని సృష్టించడం మాత్రమే చేస్తుంది. కాకపోతే దాని అధికార వ్యవస్థ భిన్నమైనదై ఉంటుంది. గాంధీ తరచుగా చెబుతుండినట్టు కంటికి కన్ను తీసుకోవడమే జరిగితే త్వరలోనే ప్రపంచమంతటా అంధులే మిగులుతారు. మండేలా లేదా గాంధీలు సవాలు చేసిన వ్యవస్థలు ఆనాటి విజ్ఞతను బట్టి శతాబ్దాల పాటు మనగలిగినవి. ఆ వ్యవస్థలను సవాలు చేసిన వారిద్దరూ వాటిపట్ల ఎంతగా ఆగ్రహం చెందారనేదాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అయితే పీడన మర్మం యజమాని బలంలో కంటే బానిస బలహీనతలోనే ఎక్కువగా ఉన్నద ని వారు అర్థం చేసుకున్నారు. వారు విసిరిన సవాలు కూడా దానికి అనుగుణమైనదే. తమ దేశాలను చెరబట్టిన నియంతృత్వాన్ని ధ్వంసించడానికి ముందు వారు ప్రజలను భయం నుంచి విముక్తులను చేయాల్సివ చ్చింది. వారిరువురి జీవితాలు, ఆదర్శప్రాయమైన ధైర్యసాహసాలు, అసమాన త్యాగాలు... నిస్సహాయమైన, నిరాశమయమైన పలు తరాలకు నిరంకుశత్వ విషవలయం నుంచి కాపాడే కరదీపికలయ్యాయి. ఒక ద్వీపం మీది చెరసాలలో 27 ఏళ్ల యవ్వన జీవితాన్ని కోల్పోయిన పిదప పదవీ స్వీకారం చేస్తూ మండేలా... పాశవికమైన బానిసత్వం దక్షిణాఫ్రికాలో తిరిగి మళ్లీ తలెత్తడం ఎన్నటికీ జరగదు గాక జరగదు, జరగదని అన్నారు, 1947లో గాంధీ భారతదేశపు సంకెళ్లను తెంచడంతోనే ‘ఆప్రికా, ఆసియా ఖండాల వలసీకరణ’ అనే బృహత్తర యూరోపియన్ సౌధం ఇసుక మేడలా కుప్పకూలిపోయింది. అయితే నిజంగా ఆశ్చర్యం గొలిపే విషయం ఒక్కటే. ఉన్మాదపుటానందంతో జారిస్టులను హతమార్చిన కమ్యూనిస్టులకు భిన్నంగా గాంధీ, మండేలాలు... అంతర్యుద్ధం లేదా మరేదైనా యుద్ధానికి బదులు అందరినీ కలుపుకుపోవడం ద్వారానే అత్యుత్తమ భవిత సాధ్యమని గ్రహించారు. గొప్ప వ్యక్తులను మన జీవితాలకు దూరం చేసి, ఊకదంపుడు పుస్తకాలలోని నిస్సారమైన వాక్యాలకు అతికించేయడం చాలా సులువైన పని. మనలాంటి సామాన్యులం గాంధీ, మండేలాలను అనుసరించలేం. గాంధీ అతి నిరాడంబరమైన ఆశ్రమ సంస్కృతిని ఎంచుకుంటే, మండేలా లొంగుబాటుతో జీవిత సౌఖ్యాలను తిరిగి అందుకోగలిగినా కాదని జైల్లో ఒంటరితనాన్నే ఎంచుకున్నారు. అలాంటి బాధలను అనుభవించగలిగిన వ్యక్తిత్వం మనకు లేదు. గాంధీ తన ఆత్మకథలో బహిర్గతం చేసినట్టుగా మనలో దాగివున్న బలహీనతను, దుర్బలతను, పరస్పర విరుద్ధతల అంతర్గత కల్లోలాన్ని వెల్లడి చే సే మనోస్థైర్యం మనకు లేదు. కానీ అసాధారణమైన కారుణ్య తాత్విక చింతన నుంచి మనం కొంత నేర్చుకోగలం. గాంధీ, మండేలా తమ లోలోతుల్లోని విశ్వాసానికి శిష్యులు. అందుకే రెండో చెంపను చూపారు... అది కూడా తాము క్రైస్తవులమని చెప్పుకోడానికి సైతం వెరవని దుస్సాహసికులైన క్రూర శత్రువులకు చూపారు. ఈ ప్రపంచం సాత్వికులదేనని వారు విశ్వసించారు. వారు తమ పొగుగువారిని వారెవరో వారిగానే ప్రేమించారు, ప్రత్యేకించి తాము హిందువులుకాగా పొరుగువారు ముస్లింలైనప్పుడు లేదా తాము నల్లవారుకాగా పొరుగువారు తెల్లవారైనప్పుడు వారు అదే ప్రేమను చూపగలిగారు. వారు లోపరిహ తులైన పరిపూర్ణ మూర్తులేమీ కారు. అలాంటి అర్థరహితమైన విషయాలను వారివద్ద ప్రస్తావిస్తే నవ్వేసేవారు. నిజమైన హీరోలకు భజనపరుల అవసరం లేదు. చిల్లర మల్లర సాహసికులే పొగడ్తలను కోరుకుం టారు. వారు పుణ్యపురుషులు కారు. ఆదర్శప్రాయమైనది ప్రతిదీ ఆచరణ సాధ్యమైనదే అవుతుందని విశ్వసించేటంతటి అమాయకులు కారు. వారు తాము పనిచేసిన కాలం నాటి రాజకీయ వాతావరణంలో పలువురితో కలిసి పనిచేసారు, కాపాడారు, వారు వృద్ధి చెందడానికి తోడ్పడ్డారు. అలాంటి వారిలో కూడా అహంకారం, భజనపరత్వం చెల్లాచెదురుగా పడి ఉండేవి. అయినా వారు వారిని ఇముడ్చుకోడానికి ప్రయత్నించారు. అయితే ఆదర్శవాదం కనుచూపు మేరలో కనిపిస్తూ ఉండకపోతే ఏ సమాజంలోనైనా లేదా ఏ దేశంలోనైనా రాజకీయాలు బయటపడలేని చిట్టడవిలో చిక్కుకుపోతాయని, త్వరత్వరగా దుర్గంధభరితమైన మస్తిష్కపు జైలుగా దిగజారిపోతాయని వారు గుర్తించారు. వారిరువురూ దేవుణ్ణి విశ్వసించారు. ఇహలోకంలో వారిద్దరూ కలుసుకునే అవకాశం చిక్కలేదు. బహుశా వారి అంతరాత్మలు స్వర్గంలో కలుసుకుంటాయనుకుంటాను. వాళ్లు కిందకు చూసినప్పుడు తమ వారసులను, వారి పెడదోవలను, అవినీతిని చూసి సంతుష్టి చెందలేరు. కానీ వారిద్దరూ కామెరాన్ హృదయపూర్వకంగా అర్పించిన నిజాయితీతో కూడిన నివాళులకు సంతోషిస్తారని కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆ నివాళి వారి అంతిమ విజయానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అర్ధనగ్న ఫకీరు, నల్ల యువకుడు శాంతిని విశ్వసించినందు వల్లనే సుదీర్ఘ యుద్ధంలో విజయం సాధించగలిగారని విన్స్టన్ చర్చిల్, మార్గరెట్ థాచర్‌ల వారసునికి తెలుసు. -
15న మండేలా అంత్యక్రియలు... హాజరుకానున్న ఒబామా
దక్షిణాఫ్రికా జాతిపిత, నల్లజాతి సూర్యడు నెల్సన్ మండేలా అంత్యక్రియలు ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ దేశాధ్యక్షుడు జాకోబ్ జూమా ఇక్కడ వెల్లడించారు. ఈస్టరన్ కేప్‌లోని క్యూనులో మండేలా స్వగృహం వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం ఆయన జోహెన్స్‌బర్గ్‌లోని మండేలా కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మండేలా అంత్యక్రియలు వచ్చే ఆదివారం నిర్వహించాలని తెలిపారని ఆయన చెప్పారు. ఆ మహానియుడి మృతికి 10 రోజులు సంతాపదినాలుగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. మండేలా ఆత్మశాంతికి దేశవ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మండేలా మృతితో ఆయన కుటుంబానికి దక్షిణాఫ్రికా వాసులతోపాటు ప్రపంచ ప్రజలు మద్దతుగా నిలవడం పట్ల జూమా సంతోషం వ్యక్తం చేశారు. వారందరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నెల్సన్ మండేలా అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు ప్రపంచనేతలు హాజరుకానున్నారు. గత కొన్ని ఏళ్లుగా నెల్సన్ మండేలా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ఏడాది మధ్యలో మండేలా తీవ్ర అనారోగ్యం పాలైయ్యారు. దాంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆయన కోలుకుని, సెప్టెంబర్1న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. జోహెన్స్‌బర్గ్‌లో స్వగృహంలో మండేలా గురువారం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. -
మహా మనీషి మండేలా!
సంపాదకీయం: ప్రపంచంలో దోపిడీ, పీడన ఉన్నంతవరకూ పోరాట యోధులు పుట్టుకొస్తూనే ఉంటారు. వారు తమ తరాన్ని మాత్రమే కాదు... తరతరాలను ప్రభావితం చేస్తూనే ఉంటారు. శుక్రవారం వేకువజామున అస్తమించిన నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా అలాంటి ప్రజా పోరాటయోధుడు. దక్షిణాఫ్రికా దేశాన్ని దశాబ్దాలపాటు పట్టిపీడించిన శ్వేతజాత్యహంకారంపై మడమ తిప్పని పోరాటం చేసిన సేనాని ఆయన. నేలతల్లి ఒడిలో సకల సంపదలూ ఉన్నా వలసపాలకుల దోపిడీలో చిక్కిశల్యమైన దక్షిణాఫ్రికాలో తోటి ప్రజలకోసం ఏమైనా చేయాలన్న తపనతో యుద్ధరంగంలోకురికిన మండేలా... తన శత్రువెవరో, తాను చేయాల్సిన పోరాటం ఎలాంటిదో సంపూర్ణంగా తెలుసుకుని ఉద్యమించాడు. స్వేచ్ఛా సమరమంటే సభలు పెట్టడం, ప్రసంగించడం, తీర్మానాలు చేయడం కాదని... శ్రద్ధగా సంస్థను నిర్మించడం, ప్రజలను సమరశీల ఉద్యమాల్లో సమీకరించడం... అన్నిటికీ మించి బాధలకూ, త్యాగాలకు సిద్ధపడటమని ఆయన విశ్వసించాడు. మహాత్ముడి సత్యాగ్రహ సమరంతో ప్రభావితుడైనా, శ్వేతజాత్య హంకారంపై ఎన్ని విధాల వీలైతే అన్నివిధాలా పోరాడాలని సంకల్పించుకున్నాడు. అందుకు అనుగుణంగా నల్లజాతీయు లందరినీ కదిలించాడు. మృత్యువు ఎప్పుడూ తనకు వెంట్రుకవాసి దూరంలోనే ఉన్నదని గ్రహించినా ఆయన భయపడలేదు. దక్షిణా ఫ్రికాలో ప్రజాస్వామ్య స్థాపన అనే ఆదర్శం కోసం మరణానికైనా సిద్ధమేనని 1963-64 సమయంలో నిండు న్యాయస్థానంలో ప్రకటించాడు. ఆ విచారణ తర్వాతే ఆయన 27ఏళ్ల సుదీర్ఘకాలం దుర్భరమైన జైలు జీవితం గడిపాడు. చెరసాలను సైతం ఉద్యమ ఖిల్లాగా మార్చాడు. జైల్లో ఉన్నవారికి కనీస సౌకర్యాలకోసం, చదువుకునే స్వేచ్ఛకోసం అలుపెరగని పోరాటం చేశాడు. అలా చదువుకునే లండన్ యూనివర్సిటీనుంచి న్యాయశాస్త్ర పట్టాను పొందాడు. ‘హింసను విడనాడుతున్నట్టు హామీ ఇస్తే విడుదలచేస్తాం’ అంటూ శ్వేతజాతి ప్రభుత్వం 1985లో షరతు విధించినప్పుడు ‘ఖైదీ కాదు... స్వేచ్ఛాజీవి మాత్రమే సంప్రదింపులు జరపగలడు. ఒప్పందానికి రాగలడు. ఖైదీగా మీతో మాట్లాడే ప్రశ్నేలేదు’ అని బదులిచ్చాడు. ‘స్వేచ్ఛ కోసం పరితపించే నా ప్రజల జన్మహక్కును తాకట్టుపెట్టి జైలునుంచి విడుదలకావడానికి ససేమిరా అంగీకరించను’అని మండేలా స్పష్టం చేశాడు. ఆయననూ, ఆయన నాయకత్వంలోని ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ)ని ఒప్పించడానికి అనేక విధాలుగా ప్రయత్నించి విఫలుడైన అప్పటి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఎఫ్‌డబ్ల్యు డీక్లార్క్ చివరకు తన శ్వేత జాతి సహచరులకే నచ్చజెప్పాడు. కళ్లు తెరిచి వాస్తవాలను గ్రహించి జాత్యహంకారానికి స్వస్తి చెప్పకపోతే వినాశనం తప్పదని హెచ్చరించాడు. మరో నాలుగేళ్లకు మండేలాను విడుదలచేయక తప్పలేదు. నెల్సన్ మండేలా ఉద్యమనాయకుడిగా మాత్రమే కాదు...వ్యక్తిగా కూడా శిఖరసమానుడు. ‘సాధారణంగా సమాజంలో తామేమి సాధించామన్నదాన్నిబట్టి ప్రజలు తమను తాము అంచనావేసుకుంటారు. కానీ, జైల్లో అలా కాదు. అక్కడివారు తమలోకి తాము చూసుకోవాలి. నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరత, నమ్రత, ఔదార్యంవంటివి తమకు ఏమేరకు ఉన్నాయో అంచనా వేసుకోవాలి. దాన్నిబట్టి తాము ఎలాంటివారమన్న నిర్ణయానికి రావాలి’ అని ఒక సందర్భంలో మండేలా అంటాడు. దేశాధ్యక్షుడిగా పదవీవిరమణ చేశాక 2004లో ప్రారంభించి ఆదిలోనే విరమించుకున్న ‘ప్రెసిడెన్షియల్ యియర్స్’ అనే గ్రంథంలో తనను గురించి తాను దాపరికం లేకుండా రాసుకున్నాడు. తన పుస్తకం నుంచి నేర్చుకోదగినదేమీ ఉండబోదని చెప్పాడు. ‘యువకుడిగా ఉన్నప్పుడు నేనూ అందరిలానే పొరపాట్లు చేశాను. బలహీనతలను కప్పిపుచ్చుకునేందుకు అహంకారంతో మెలిగాను. పెద్దవాడినయ్యాక నా సహచరులు నాకు లేని గొప్పతనాన్ని అంటగట్టారు’ అని రాయాలంటే ఎంత నిజాయితీ, ఎంత నిబద్ధత కావాలి? ఆయన అనారోగ్యం బారిన పడకపోతే, తానే స్వయంగా రాయాలని పట్టుబట్టకపోతే ఈ గ్రంథం పూర్తయ్యేది. పెనుసంచలనమే కలిగించేది. స్వపరిపాలన ప్రారంభంలో తాము దేశ ప్రజలకు వాగ్దానం చేసిన ‘నవీన ఆఫ్రికా’ చెదిరిన స్వప్నమయిందని చివరిరోజుల్లో మండేలా ఆవేదన చెందారు. చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ నల్లవారికి అవకాశాలు పెరిగినా ఆర్ధిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న పరిశ్రమలు, వాణిజ్యం, సర్వీసు రంగం వంటివన్నీ శ్వేత జాతీయుల అధీనంలోనే ఉన్నాయని వేర్వేరు సందర్భాల్లో ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి జాత్యహంకార వ్యవస్థపై పోరాడిన నాయకులు సైతం అధికారంలోకొచ్చాక అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడంపై ఆయన తల్లడిల్లారు. ఇంతటి గొప్ప యోధుణ్ణి, నిలువెత్తు మానవత్వంగా వెలిగిన మనిషిని ‘ఉగ్రవాది’గా ముద్రేయడానికి అమెరికా వెనకాడలేదు. అజ్ఞాతవాసం గడుపుతున్న మండేలా గురించి దక్షిణాఫ్రికా శ్వేతజాత్యహంకార పాలకులకు ఉప్పందించి అరెస్టు చేయించడమే కాదు... అటుతర్వాత దశాబ్దాలపాటు ఆయనను ఉగ్రవాదుల జాబితాలోనే ఉంచింది. మండేలా దేశాధ్యక్షుడిగా పనిచేసినా ఆ ముద్ర తప్పలేదు. 2008 జూలై 1న మండేలాపై ‘ఉగ్ర ముద్ర’ తొలగించే డిక్రీపై అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు. బుష్ సంతకం చేశారు. మండేలా, ఆయనలాంటి వేలాదిమంది యోధులు దక్షిణాఫ్రికాను దట్టంగా ఆవరించి ఉన్న జాత్యహంకా రాన్ని పారదోలే పెను తుపానుల్లా విరుచుకు పడబట్టే నల్లజాతీయులకు విముక్తి లభించింది. అణచివేతకూ, వివక్షకూ, భయానికీ తావులేని ప్రదేశంగా... అందరికీ అవకాశాలు కల్పించే సప్తవర్ణ మిశ్రమంగా తమ దేశం ఉండాలని మండేలా ఆకాంక్షించారు. ఆ ఆకాంక్షను అక్కడ మాత్రమే కాదు... దేశ దేశాల్లోనూ నెరవేర్చడమే ఆ మహా మనీషికి అర్పించే నిజమైన నివాళి అవుతుంది. -
భారత్‌లో 5 రోజుల సంతాప దినాలు
* మండేలా మృతికి నివాళిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతికి నివాళిగా కేంద్ర ప్రభుత్వం ఐదు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర కేబినెట్.. మండేలా మృతికి సంతాప తీర్మానం ఆమోదించినట్టు సమాచార శాఖ మంత్రి మనీష్ తివారీ తెలిపారు. మండేలా ఓ గొప్ప నాయకుడని, ఈ విషాద సమయంలో భారతజాతి మొత్తం దక్షిణాఫ్రికా ప్రజల వెన్నంటే ఉంటుందన్నారు. మరోవైపు భారత పార్లమెంటు మండేలాకు ఘనంగా నివాళులు అర్పించింది. శుక్రవారం ఉభయసభలూ ప్రారంభం కాగానే మండేలాకు నివాళులు అర్పించిన అనంతరం వాయిదా పడ్డాయి. గొప్ప రాజనీతిజ్ఞుడు: ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్రపతి మండేలా ఓ గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రపంచ నేత. మానవజాతికి స్ఫూర్తి చిహ్నం. భారత్‌కు చాలా మంచి స్నేహితుడు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. మండేలా కుటుంబ సభ్యులకు భారత్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. పురుషుల్లో పుణ్యపురుషుడు: మన్మోహన్సింగ్, ప్రధాని ఇక్కడ, అక్కడ.. ఇప్పుడు, అప్పుడు.. దేవుడు పురుషుల్లో పుణ్యపురుషులను సృష్టించాడు. మండేలా అలాంటి పుణ్యపురుషుడు. అంతేకాదు.. అణగారిన, అన్యాయానికి గురవుతున్న ప్రజలకు ఓ ఆశాకిరణం. జాతివివక్షకు వ్యతిరేకంగా అంకితభావంతో పోరాడిన గొప్ప నాయకుడు. ఆయన మృతి దక్షిణాఫ్రికాకే కాదు.. భారత్‌కు, ప్రపంచానికి కూడా తీరని లోటు. ధైర్యానికి, త్యాగానికి ప్రతీక: సోనియాగాంధీ, యూపీఏ అధ్యక్షురాలు ధైర్యానికి, త్యాగానికి, క్షమాగుణానికి మండేలా ప్రతీక. దక్షిణాఫ్రికా మహాత్మాగాంధీ వంటి ఆయన.. మొత్తం మానవజాతికి చెందిన మహా నాయకుడు. దక్షిణాఫ్రికా ప్రజలు ఆయన్ను అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుకున్నా.. స్వచ్ఛందంగా పదవి వీడిన త్యాగశీలి. మండేలా మరణం ప్రియమైన తండ్రిని కోల్పోవడంలాంటిది. మండేలా అడుగుజాడలు శాశ్వతం: సుష్మాస్వరాజ్, లోక్‌సభలో విపక్షనేత మండేలా అడుగుజాడలు కాలగర్భంలో ఎన్నటికీ కలిసిపోవు. ఈ ప్రపంచంలోకి ఎందరో వ్యక్తులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ మండేలా మాత్రం శాశ్వతంగా నిలిచే ఉంటారు. కలచి వేసింది: చంద్రబాబు నాయుడు, టీడీపీ అధ్యక్షుడు మండేలా మరణం తీవ్రంగా కలచి వేసింది. మండేలా నుంచి స్ఫూర్తి పొందిన వారిలో నేనూ ఒకడిని. ప్రపంచవ్యాప్తంగా పీడనకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో పాల్గొనే వారికి ఆయన ధైర్యసాహసాలు, త్యాగాలు నిరంతరం స్ఫూర్తినిస్తాయి. మహోన్నత మానవుడు: వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు 21వ శతాబ్దంలో మానవాళికి ప్రత్యక్షంగా తెలిసిన మహోన్నత మానవుడు నెల్సన్ మండేలా. జాతుల మధ్య వైరానికి స్వస్తి పలికి దక్షిణాఫ్రికా చరిత్రలో మాత్రమే కాకుండా మొత్తం మానవజాతిలోనే నలుపు-తెలుపు అన్న వర్ణ వివక్షను రూపుమాపి మానవులంతా ఒకటేనని మండేలా చాటారు. -
ముగించేశారు
బెల్గాంలో అసెంబ్లీ సమావేశాలు పూర్తి = గురువారమే సొంత నియోజకవర్గాలకు పలువురు ఎమ్మెల్యేలు = ఆట విడుపుగా మరికొందరు గోవాకు = శుక్రవారం సభలో దాదాపు సీట్లు ఖాళీ = మండేలాకు నివాళులర్పించి.. సభలు వాయిదా = సమావేశాలు అర్థవంతంగా జరిగాయని స్పీకర్, చైర్మన్ సంతృప్తి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెల్గాంలో పది రోజుల పాటు సాగిన శాసన సభ శీతాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. అనంతరం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. గురువారమే చాలా మంది శాసన సభ్యులు తట్టా బుట్టా సర్దుకుని సొంత నియోజక వర్గాలకు వెళ్లిపోయారు. కొందరు ఆట విడుపుగా సమీపంలో ఉన్న గోవాకు వెళ్లారు. వారాంతాన్ని అక్కడే గడిపి సోమవారం సొంత ఊర్లకు తిరిగి వెళ్లనున్నారు. శుక్రవారం ఉభయ సభలు కొద్ది సేపు సమావేశమై దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు ఘన నివాళులు అర్పించాయి. అనంతరం స్పీకర్ కాగోడు తిమ్మప్ప, శాసన మండలి చైర్మన్ డీహెచ్. శంకరమూర్తిలు సభలను వాయిదా వేశారు. 2006లో బెల్గాంలో తొలిసారి శాసన సభ సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం నాలుగో సారి నిర్వహించారు. నల్ల సూరీడు జోహన్నెస్‌బర్గ్‌లో గురువారం రాత్రి తుది శ్వాస విడిచిన నెల్సన్ మండేలాను ఉభయ సభలు నల్ల సూరీడుగా అభివర్ణించాయి. జాత్యహంకారంపై అవిశ్రాంత పోరాటం చేశారని శ్లాఘించాయి. శాసన సభలో కాగోడు తిమ్మప్ప, మండలిలో శంకరమూర్తిలు సంతాప తీర్మానాలను ప్రవేశ పెట్టారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, శాంతి రంగాలతో పాటు అస్పృశ్యతను నిర్మూలించడానికి ఆయన అందించిన సేవలను స్పీకర్ గుర్తు చేశారు. శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి టీబీ. జయచంద్ర మాట్లాడుతూ దక్షిణాఫ్రికా రాజ్యాంగ నిర్మాణం, భూసంస్కరణలు, దారిద్య్ర నిర్మూలన పథకాలను ఆయన అమలు చేశారని శ్లాఘించారు. 27 ఏళ్ల పాటు జైలులో మగ్గి బయటకు వచ్చిన అనంతరం జాత్యహంకార ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపారని తెలిపారు. ఉభయ సభల్లో ప్రతిపక్ష నాయకులు హెచ్డీ. కుమారస్వామి, డీవీ. సదానందగౌడలు మాట్లాడుతూ వంశ పారంపర్య పాలనను అంతమొందించినందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆయన మన్ననలు అందుకున్నారని కొనియాడారు. మంత్రులు వీ. శ్రీనివాస ప్రసాద్, హెచ్‌సీ. మహదేవప్ప, దినేశ్ గుండూరావులతో పాటు ప్రతిపక్షాలకు చెందిన యడ్యూరప్ప, జగదీశ్ శెట్టర్, సీటీ. రవి, కేఎస్. పుట్టనయ్య, అశోక్ ఖేణి, వైఎస్వీ. దత్తా, కే. శివమూర్తిలు వివిధ రంగాలకు మండేలా అందించిన సేవలను స్మరించుకున్నారు. తీపి-చేదుల మిశ్రమం బెల్గాం కర్ణాటకలో అంతర్భాగమని చాటి చెప్పడానికి ఏటా ఒక సారి అక్కడ శాసన సభ సమావేశాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దఫా జరిగిన సమావేశాలు ప్రభుత్వానికి తీపి-చేదు మిశ్రమంగా నిలిచాయి. తొలి రెండు రోజులు చెరకు రైతుల సమస్యలు, షాదీ భాగ్యలపై ఉభయ సభలు అట్టుడికాయి. అనంతరం ప్రధాన సమస్యలపై చర్చలు జరిగాయి. కృష్ణా జలాల పంపకంపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు, ఏనుగులు, పులి సమస్య, శాంతి భద్రతలు, యువతుల అదృశ్యం తదితర అంశాలపై ఆసక్తికరమైన చర్చలు సాగాయి. స్పీకర్ కాగోడు తిమ్మప్ప, ఇంకా పలు పాలక, ప్రతిపక్ష సభ్యుల నిరసన ధ్వనుల మధ్య ఎస్మాకు సభామోదం లభించింది. ఇంకా పదికి పైగా బిల్లులను కూడా ఉభయ సభలు ఆమోదించాయి. కాగా ఈసారి సమావేశాలు అర్థవంతంగా జరిగాయని స్పీకర్, చైర్మన్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
నల్ల సూర్యుని అస్తమయం
* దక్షిణాఫ్రికాకు వెలుగునిచ్చిన నెల్సన్ మండేలా కన్నుమూత * సుదీర్ఘ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన శాంతిదూత * ప్రపంచమంతటా సంతాపాలు... 15న అంత్యక్రియలు * జాతి వివక్షపై సుదీర్ఘ పోరు.. గాంధీ బాటలో ఉద్యమం * 27 ఏళ్లు జైలు జీవితం.. విడుదలయ్యాకా ఉద్యమ సారథ్యం * దక్షిణాఫ్రికాలో శ్వేత జాత్యహంకార పాలనకు చరమగీతం * ఆ దేశ తొలి నల్లజాతి అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించిన నేత * భారతరత్న... నోబెల్ బహుమతి గ్రహీత... నల్ల వజ్రం జాతివివక్షపై తిరుగుబాటు చేసిన విప్లవ శిఖరం నేలకొరిగింది. అన్యాయాన్ని ధిక్కరిస్తూ నినదించిన స్వరం మూగబోయింది. దశాబ్దాల నిర్బంధంలోనూ చెక్కుచెదరని ఉక్కు గుండె ఆగిపోయింది. ఏళ్ల తరబడి శ్వేతజాత్యహంకార పాలనలో మగ్గిపోయిన నల్లజాతికి వెలుగునిచ్చిన నల్లసూరీడు అస్తమించాడు. దక్షిణాఫ్రికాకు స్వేచ్ఛాహక్కులను సంపాదించి.. మానవతా విలువల కోసం పరిశ్రమించి.. శాంతిసౌభాగ్యాల కోసం పరితపించి.. ప్రజలకు పోరాట స్ఫూర్తిని అందించి.. ప్రపంచానికి తన జ్ఞాపకాలను మిగిల్చి.. నెల్సన్ మండేలా కన్నుమూశారు. దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి అధ్యక్షుడు, భారతరత్న మండేలా శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న మండేలా 95 ఏళ్ల వయసులో జోహాన్నెస్‌బర్గ్‌లోని తన నివాసంలో మరణించారు. జోహాన్నెస్‌బర్గ్: నల్ల సూరీడు నెల్సన్ మండేలా అస్తమించారు. జాతివివక్షపై అలుపెరుగని పోరాటంతో.. అన్యాయంపై తిరుగుబాటుకు మారుపేరుగా నిలిచిన మండేలా 95 సంవత్సరాల వయసులో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాత్యహంకార పాలనపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి.. తొలి నల్లజాతి అధ్యక్షుడిగా చరిత్ర లిఖించిన మండేలా మరణంతో ప్రపంచ దేశాల్లో విషాదం అలముకుంది. దక్షిణాఫ్రికా ప్రజలు మండేలా మరణం పట్ల తీవ్ర విచారంలో ఉన్నప్పటికీ.. ఆయన జీవితం ఇచ్చిన స్ఫూర్తిని స్మరించుకుంటూ గానాలు, నృత్యాలు చేయటం కనిపించింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన మండేలా ఈ ఏడాది ఆరంభం నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. సెప్టెంబర్‌లో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రిటోరియా ఆస్పత్రిలో మూడు నెలల చికిత్స అనంతరం జోహాన్నెస్‌బర్గ్‌లోని హోటన్ ప్రాంతంలోగల మండేలా నివాసంలోనే ఆయనకు ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తూ వచ్చింది. ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ‘‘మన ప్రియతమ నేత, మన ప్రజాస్వామ్య దేశ వ్యవస్థాపక అధ్యక్షుడు నెల్సన్ రోలిహాహ్లా మండేలా మనల్ని విడిచి వెళ్లిపోయారు’’ అని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌జుమా శుక్రవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో వెల్లడించారు. ‘‘మన దేశం తన గొప్ప కుమారుడిని కోల్పోయింది. మన ప్రజలు తమ గొప్ప తండ్రిని కోల్పోయారు’’ అంటూ సంతాపం తెలిపారు. దక్షిణాఫ్రికాలో పది రోజులు అధికారిక సంతాప దినాలుగా ప్రకటించారు. మండేలాను 1990 లోనే భారతరత్న బిరుదు ఇచ్చి గౌరవం ప్రకటించిన భారతదేశం కూడా అధికారిక సంతాపం ప్రకటించింది. ఆయన మృతికి సంతాప సూచికగా భారత్‌తో పాటు, అమెరికా కూడా జాతీయ పతకాలను అవనతం చేశాయి. మండేలా భౌతికకాయాన్ని ప్రిటోరియాలోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు. మండేలా భౌతిక కాయాన్ని ఉంచిన శవపేటికపై దక్షిణాఫ్రికా జాతీయజెండాను కప్పి.. దానిని నలుపురంగు ఎస్యూవీ వాహనంపై ఉంచారు. వాహనానికి ఇరువైపులా సైనిక మోటార్‌సైకిల్ కాన్వాయ్‌తో సైనిక లాంఛనాలతో తీసుకెళ్లారు. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం రాజధాని నగరంలోని ప్రభుత్వ భవనంలో ఉంచుతారు. ఈ నెల 15వ తేదీన ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. దక్షిణాఫ్రికాలో శుక్రవారం ఉదయం నుంచే వందలాది మంది ప్రజలు ఎక్కడికక్కడ గుమిగూడి మండేలా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు. గాంధీ ఉద్యమ ప్రభావంతో... నెల్సన్ మండేలా అసలు పేరు రోలిహాహ్లా మండేలా. 1918 జూలై 18న దక్షిణాఫ్రికాలోని మవెజో అనే గ్రామంలో జన్మించారు. దక్షిణాఫ్రికాలో మైనారిటీలైన శ్వేతజాతీయుల పాలనలో తీవ్ర వివక్షకు గురైన నల్లజాతి ప్రజల విముక్తి కోసం.. చదువుకునే రోజుల్లోనే మండేలా పోరుబాట పట్టారు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షపై మహాత్మా గాంధీ నడిపిన మహత్తర అహింసోద్యమం.. అప్పుడు యువకుడిగా ఉన్న మండేలాపై తీవ్ర ప్రభావం చూపింది. మండేలా కూడా అహింసా మార్గంలో పోరాటం మొదలుపెట్టినప్పటికీ.. ఆ తర్వాత కొంత కాలం సాయుధ పోరాటమూ సల్పారు. 1962లో మండేలాను అరెస్ట్ చేసిన దక్షిణాఫ్రికా శ్వేతజాతి ప్రభుత్వం.. 1964లో ఆయనకు యావజ్జీవ జైలుశిక్ష విధించింది. అప్పటి నుంచి 27 సంవత్సరాల పాటు మండేలా జైలులోనే గడిపారు. ఆయన విడుదల కోసం 1980 నుంచి దశాబ్ద కాలం పాటు ఉవ్వెత్తున ప్రజా ఉద్యమం సాగింది. ఉద్యమం జోలికి వెళ్లబోనని ఒప్పుకుంటే విడిచిపెడతామని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను మండేలా తిరస్కరించారు. చివరికి దిగివచ్చిన సర్కారు 1990లో ఆయనను జైలు నుంచి విడుదల చేసింది. మండేలా మళ్లీ ఉద్యమ సారథ్యం అందుకున్నారు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. వర్ణ వివక్షను అంతం చేయాలని, నల్లజాతి వారికీ సమాన హక్కులు కల్పించాలని పోరాటం పునరుద్ధరించారు. ఆ ఉద్యమం ఫలించింది. 1994లో దక్షిణాఫ్రికాలో పూర్తిస్థాయి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ విజయదుందుభి మోగించగా.. దేశాధ్యక్షుడిగా మండేలా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాతుల సమైక్యం కోసం కృషి దక్షిణాఫ్రికాకు తొలి నల్లజాతి అధ్యక్షుడిగా 1999 వరకూ మండేలా సేవలందించారు. గిరిజన జాతుల రాజకీయాలతో వర్గాలుగా విడిపోయి ఉన్న దక్షిణాఫ్రికా ప్రజలను ఐక్యం చేయటానికి మండేలా అవిరళ కృషి సల్పారు. నల్లజాతి ప్రజల్లో ఉన్న ద్వేషాన్ని చల్లార్చి.. ప్రతీకారదాడుల భయంతో ఉన్న శ్వేతజాతి ప్రజలకు అభయమిచ్చేందుకు శక్తినంతా ధారపోశారు. ఒక్క దక్షిణాఫ్రికాలోనే కాదు.. ఎక్కడ అన్యాయం ఉన్నా దానిని నిరసించటానికి మండేలా ముందు వరుసలో ఉండేవారు. అందుకే.. ఆయనను మానవ హక్కుల ఉద్యమ ప్రతీకలైన అబ్రహాం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్‌లతో సమానంగా ప్రపంచం గౌరవిస్తోంది. దక్షిణాఫ్రికా గాంధీ అని, నల్ల వజ్రం అని కూడా ఆయనను పిలుస్తుంటారు. మండేలా మూడు పర్యాయాలు వివాహం చేసుకున్నారు. మొదటి భార్య ఎవలిన్మేస్. వారికి నలుగురు సంతానం ఉన్నారు. రెండో భార్య విన్నీ. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమెతో విడిపోయారు. మూడో భార్య గ్రామాచెల్. ఆమె అంతకుముందు మొజాంబికన్ అధ్యక్షుడు సమోరామాచెల్ భార్య. సమోరా మరణం తర్వాత గ్రామాచెల్ను మండేలా వివాహమాడారు. రెండేళ్లుగా అనారోగ్యం పాలవటంతో మండేలా బయటకు కనిపించటం తగ్గిపోయింది. అయినప్పటికీ దక్షిణాఫ్రికా ప్రజలు, ప్రపంచ ప్రజల హృదయంలో ఆయనకు ప్రత్యేక స్థానం కొనసాగుతూనే ఉంది. మండేలా మృతి పట్ల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, భారత్, అమెరికా, బ్రిటన్, చైనా తదితర ప్రపంచ దేశాలు సంతాపం తెలిపాయి. ఆశయాలను కొనసాగిస్తాం: మండేలా సహచరుడు జోహాన్నెస్‌బర్గ్: మండేలా మృతిపై ఆయన దీర్ఘకాల సహచరుడు, జాతివివక్ష వ్యతిరేక కార్యకర్త అహ్మద్ కత్రాదా(85) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మండేలా నిజాయితీ, ధైర్యసాహసాలు తనకు స్ఫూర్తినిచ్చాయని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఓ ప్రకటనలో నివాళి అర్పించారు. భారత సంతతికి చెందిన కత్రాదా 26 ఏళ్లు మండేలాతో కలసి జైలు శిక్ష అనుభవించారు. వీరిద్దరిది 67 ఏళ్ల స్నేహం. ఒకరినొకరు మదాలా(పెద్దాయన) అని పిలుచుకునేవారు. భారత్‌తో అనుబంధం * జోహాన్నెస్‌బర్గ్: మహాత్మాగాంధీ బాటలో నడిచిన మండేలాకు భారత్‌తో బలమైన అనుబంధముంది. గాంధీతో ఎన్నో పోలికలూ ఉన్నాయి. ఇద్దరూ జాతివివక్షను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నో ఏళ్లు జైలుశిక్ష అనుభవించారు. అహింసాయుత రాజకీయ వ్యూహాలతో ఉద్యమాలను నడిపించారు. * గాంధీ ప్రవచించిన సత్యం, అహింస బోధనలను మండేలా కొనియాడేవారు. మహాత్ముడే తన రాజకీయ గురువు అని, ఆయన శత్రువును సంస్కారపూరితంగా ఎదుర్కోవడం, దక్షిణాఫ్రికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాలు తనకు స్ఫూర్తినిచ్చాయని అనేవారు. * మండేలా పోరాటానికి, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌కు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు మద్దతిచ్చారు. ఢిల్లీలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కార్యాలయం ఏర్పాటులో ఇందిర కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికాలో జాతివివక్షను నిర్మూలించేంతవరకు ఆ దేశాన్ని బహిష్కరిస్తామని జవహర్లాల్ నెహ్రూ 1946లోనే ప్రకటించారు. * మండేలా 27 ఏళ్ల జైలు శిక్ష అనంతరం 1990లో విడుదలయ్యాక తొలిసారి పర్యటించిన విదేశం భారతే. 1995 నాటి పర్యటనలో ఆయన సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. * మండేలాకు నోబెల్ శాంతి బహుమతి రాకముందే 1990లోనే భారత్‌కు ఆయనకు అత్యున్నత పౌరపురస్కారమైన ‘భారతరత్న’ను ప్రకటించింది. 2001లో గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతిని ప్రదానం చేసింది. * మండేలా హయాంలో దక్షిణాఫ్రికా, భారత్ సంబంధాలు బలపడ్డాయి. ఫలితంగా తర్వాత కాలంలో ఇరు దేశాలు ‘బ్రిక్స్’(బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా), ‘ఇబ్సా’(భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా) వంటి అంతర్జాతీయ కూటముల ఏర్పాటులో కీలక పాత్ర పోషించాయి. -
మండేలామృతికి షీలా సంతాపం
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా నేత నెల్సన్ మండేలా అస్తమయంపట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మండే లా జీవితం ప్రపంచ వ్యాప్తంగా హక్కుల పోరాట కార్యకర్తలకు స్ఫూర్తిదాయకంగా నిలి చిందన్నారు. నిజమైన గాంధేయవాది,ప్రపంచ విశిష్ట నాయకుల్లో ఒకడైన నెల్సన్ మండేలాను యావత్తు భారత జాతి గౌరవిస్తుందని, వివక్షకు వ్యతిరేకంగా ఆయన సాగించిన రాజీలేని పోరాటం భారత జాతి చిరకాలం గుర్తుంచుకుంటుందన్నారు. మండేలా సాగించిన పోరాటమే ఆయనను దక్షిణాఫ్రికా నేతగా నిలబెట్టిందని, సమానత్వం, స్వేచ్ఛల కోసం ఆయన సాగించిన పోరాటం ఆదర్శనీయమన్నారు. మండేల భార త జాతికి విశ్వసనీయ నేస్తమని తన సంతాప సందేశంలో పేర్కొంది. మండేలా అస్తమయం పట్ల ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా సంతా పం ప్రకటించింది. ప్రపంచం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని, వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా ఎడతెగని పోరాటం సల్పి ఆఫ్రికా ప్రజల కు జీవితాన్ని, గౌరవాన్ని ఇచ్చిందని, ప్రపంచ వ్యాప్త అభ్యుదయ వాదులకు ఆయన జీవితం ఆదర్శమని ఆ పార్టీ కార్యదర్శి జీ దేవరాజన్ పేర్కొన్నారు. -
‘మార్గదర్శకుడు మండేలా’
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతిపై బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విచారం వ్యక్తం చేశాడు. ఆయన ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలిచారని కొనియాడాడు. ‘నేను మండేలాను తొలిసారి కలుసుకున్న సందర్భం నా జీవితంలో అత్యంత చిరస్మరణీయ జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచిపోయింది. నిజంగా ఆయన ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ప్రేరణగా నిలిచిన మహనీయుడు. నా హృదయంలో మండేలా ఎప్పటికీ నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. అలాగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్, హెవీవెయిట్ బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ అలీ, ఫిఫా చీఫ్ సెప్ బ్లాటర్, టైగర్ వుడ్స్, దక్షిణాఫ్రికా గోల్ఫ్ గ్రేట్ గ్యారీ ప్లేయర్, కివీస్ రగ్బీ ఆటగాళ్లు ఈ నల్ల సూరీడుకి శ్రద్ధాంజలి ఘటించారు. డునెడిన్‌లో తొలి టెస్టు ఆడుతోన్న వెస్టిండీస్, న్యూజిలాండ్ క్రికెటర్లు తమ మ్యాచ్ ప్రారంభానికి ముందు నిమిషం పాటు మౌనం పాటించారు. మరోవైపు ఐసీసీ అధ్యక్షుడు అలన్ ఐజాక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ మండేలాకు ఘనంగా నివాళి అర్పించారు. ‘ఓ నాయకుడిగా, పోరాట యోధుడిగా, కార్యకర్తగా పేరు తెచ్చుకోవడమే కాకుండా ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చిన మహా మనిషి మండేలా’ అని ఐజాక్ అన్నారు. మండేలా మరణం తమ సొంత దేశ ప్రజలకే కాకుండా మొత్తం ప్రపంచానికే విషాద వార్తగా దక్షిణాఫ్రికాకే చెందిన రిచర్డ్సన్ తెలిపారు. -
మండేలా ఇక లేరు
-
మండేలా మృతిపై వైయస్ జగన్ సంతాపం
-
మండేలాకు పార్లమెంట్ నివాళి
ఢిల్లీ : నల్లజాతి సూర్యుడు, ఆఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు పార్లమెంట్ ఉభయ సభలు ఘనంగా నివాళులు అర్పించాయి. ఈ సందర్భంగా లోక్‌సభలో మండేలా సేవలను సభ్యులు గుర్తు చేసుకున్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ జాతి వివక్షపై జైలు నుంచే మండేలా పోరాడారని పేర్కొన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1990లో భారతరత్నతో గౌరవించిందని షిండే గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ తరపును ఆపార్టీ నేత సుష్మా స్వరాజ్ మండేలాకు నివాళులు అర్పించారు. 28 ఏళ్లు జైలులో గడపటం చిన్న విషయం కాదని, మహాత్మాగాంధీ ప్రేరణతో మండేలా పోరాటం చేశారని ఆమె అన్నారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ చూపిన మార్గంలో మండేలా పయనించి జాతి వివక్షపై పోరాటం చేశారన్నారు. రాజ్యసభ కూడా మండేలాకు ఘనంగా నివాళులు అర్పించింది. అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది. నెల్సన్ మండేలా గురువారం అర్థరాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. -
మండేలాకు నివాళులు, రాజ్యసభ సోమవారానికి వాయిదా
-
అక్షరాలు రావట్లేదు.. అశ్రువులే వస్తున్నాయి: వైఎస్ జగన్
తెల్లవారి గుండెల్లో ప్రచండాగ్నులు రగిలించిన నల్లసూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. ''21వ శతాబ్ది మానవాళికి ప్రత్యక్షంగా తెలిసిన మహోన్నత మానవుడు నెల్సన్ మండేలా. జాతుల మధ్య వైరానికి స్వస్తి పలికి దక్షిణాఫ్రికా చరిత్రలో మాత్రమే కాకుండా మొత్తం మావన జాతి చరిత్రలోనే నలుపు-తెలుపు అన్న వర్ణ వివక్షణను రూపుమాపి మానవులంతా ఒకటేనని చాటారు మండేలా. ఒక గాంధీ, ఒక మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఒక మండేలా.... వీరి శరీరాలకు మరణం ఉంది తప్ప వారి మానవతా విలువలకు లేదు. భారత జాతి పిత మహాత్మ గాంధీ గురించి ఐన్ స్టీన్ చేసిన వ్యాఖ్యలు నాకు గుర్తుకు వస్తున్నాయి. ఇంతటి మహోన్నతమైన మానవతామూర్తి రక్తమాంసాలతో ఒక మనిషిగా జన్మించి మన మధ్యే నడయాడాడంటే నమ్మటం బహుశా భవిష్యత్ తరాలకు అసాధ్యం కావచ్చు'' అని ఐన్ స్టీన్ ఆరోజు చేసిన వ్యాఖ్య ఈ రోజున మండేలాకు కూడా వర్తిస్తుంది. కులం, మతం, ప్రాంతం, వర్ణం, వర్గంలాంటి సంకుచిత భావాలతో నిత్యం దహించుకుపోతున్న మనుషులకు మండేలా అనే ఆ మూడు అక్షరాలు మానవత్వాన్ని నింపే మార్గదర్శకాలని నమ్ముతున్నాను. అంతటి మహోన్నత వ్యక్తికి నివాళులర్పించడానికి ఎవరికైనా అక్షరాలు రావు.... అశ్రువులు మాత్రమే వస్తాయి... అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. -
నెల్సన్ మండేలా కన్నుమూత
-
నెల్సన్ మండేలా కన్నుమూత
జోహన్నస్బర్గ్: తెల్లవారి గుండెల్లో ప్రచండాగ్నులు రగిలించిన నల్లసూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా(95) కన్నుమూశారు. జోహన్నస్బర్గ్లోని స్వగృహంలో గురువారం రాత్రి 8.50 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) ఆయన తుదిశ్వాస విడిచారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా ప్రకటించారు. దేశం గొప్ప నాయకున్ని కోల్పోయిందని పేర్కొన్నారు. దేశ ప్రజలు జాతిపితను పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. అధికార లాంఛనాలతో మండేలా అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు. జాతీయ పతాకాన్ని సగం అవనతం చేయాలని జుమా ఆదేశించారని బీబీసీ తెలిపింది. భారత జాతి పిత మహాత్మ గాంధీ బోధించిన అహింస, శాంతియుత విధానాలు తనకు స్ఫూర్తినిచ్చాయని తరచు చెప్పే మండేలా ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్నారు. కేప్ ప్రాంతంలోని తెంబు వంశానికి చెందిన కుటుంబంలో ఆయన 1918 జూలై 18న జన్మించారు. విద్యార్ధిదశలోనే వర్ణవివక్ష వ్యతిరేక పోరాటాలకు ఆకర్షితుడై తన జాతి విముక్తి కోసం అంకితమయ్యాడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించి, రాబెన్ దీవిలో 27 సంవత్సరాల సుదీర్ఘ కారాగార వాసం అనుభవించిన తర్వాత, ఆ దేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా నిలిచారు. నోబెల్ శాంతి బహుమతి సహా పలు అవార్డులు, రివార్డులు పొందారు. భారత ప్రభుత్వం కూడా ఆయనను నెహ్రూ శాంతి బహుమతితో సత్కరించింది. నెల్సన్ మండేలాకు ఆరుగురు సంతానం. ఆయన మూడు సార్లు వివాహం చేసుకున్నాడు. మండేలా మొదటి వివాహం దక్షిణాఫ్రికాలో నల్లజాతి వారు ఎక్కువగా నివసించే ట్రాన్స్కీ అనే ప్రదేశం నుంచి వచ్చిన ఎంటోకో మేస్ అనే మహిళతో జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. వీరు వివాహమైన 13 సంవత్సరాల తరువాత 1957లో అభిప్రాయ భేదాలతో విడిపోయారు. మండేలా రెండవ భార్య విన్నీ మడికిజెలా మండేలా. వీరికి ఇద్దరు కుమార్తెలు. 1992లో వారు విడాకులు తీసుకొన్నారు. 1998లో తన 80వ జన్మదినం సందర్భంగా నెల్సన్ మండేలా మూడవసారి గ్రాచా మాచెల్‌ను పెళ్లి చేసుకొన్నారు. నెల్సన్ మండేలా మరణం పట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపం ప్రకటించారు. మండేలా నుంచి స్ఫూర్తి పొందిన వారిలో తాను ఒకడినని తెలిపారు. మండేలా లాంటి నాయకున్ని ప్రపంచం మళ్లీ చూడబోదని సంతాప సందేశంలో ఒబామా పేర్కొన్నారు. -
లాలూను మండేలాతో పోల్చిన జార్ఖండ్ మంత్రి
మెదినినగర్: దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలాతో పోల్చారు జార్ఖండ్ రాష్ట్ర మంత్రి అన్నపూర్ణా దేవి. ప్రధాని పదవికి భవిష్యత్‌లో లాలూ గట్టి పోటీదారు అవుతారని జోస్యం చెప్పారు. వివక్ష వ్యతిరేక పోరాటయోధుడు నెల్సన్ మండేలా 27 ఏళ్లు జైలు జీవితం గడిపిన తర్వాత బయటకు వచ్చి దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవిని అధిష్టించారని గుర్తుచేశారు. అలాగే తమ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ప్రధాని పదవికి గట్టి పోటీదారు అవుతారని ఆర్జేడీ నాయకురాలు కూడా అయిన అన్నపూర్ణా దేవి వ్యాఖ్యానించారు. ఆర్జేడీ పాలమావ్ విభాగం కార్యకర్తల సమావేశంలో ఆమె వ్యాఖ్యలు చేశారు. -
ఆస్పత్రి నుంచి మండేలా డిశ్చార్జి
జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా (95)ను ఆదివారం ప్రిటోరియా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. తీవ్రమైన ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయనకు మూడు నెలలుగా ఆస్పత్రిలో వైద్యం అందిస్తూ వచ్చారు. ఇకపై జొహాన్నెస్‌బర్గ్‌లోని ఆయన ఇంట్లోనే ఐసీయూ తరహా చికిత్స అందించనున్నారు. ఈ విషయాన్ని దేశాధ్యక్షుడు జాకబ్ జుమా ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందని జుమా ప్రతినిధి మెక్ మహారాజ్ వివరించారు. -
ఆస్పత్రి నుంచి మండేలా డిశ్చార్జి
కేప్‌టౌన్(ఐఎఎన్ఎస్): జాతి వివక్ష వ్యతిరేకతకు చిహ్నంగా నిలిచిన నెల్సన్ మండేలా ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మూడు నెలలుగా ఆయన ప్రిటోరియాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 95 సంవత్సరాల మండేలాకు ఇంటి వద్దనే చికిత్స కొనసాగుతుంది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడైన మండేలా ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగానే ఉంది. ప్రిటోరియా ఆస్పత్రిలో తీసుకున్న జాగ్రత్తలనే డాక్లర్ల బృందం ఆయన ఇంటి వద్ద కూడా తీసుకుంటుంది. వర్ణ వివక్ష సమయంలో మండేలా 27 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. ఆ సమయంలో ఆయనకు క్షయ వ్యాధి తీవ్రమైంది. దాని ఫలితంగా ఇప్పుడు ఆయన లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. -
విషమంగానే నెల్సన్ మండేలా ఆరోగ్యం!
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని అధ్యక్ష భవన ప్రతినిది మాక్ మహారాజ్ మీడియాకు వెల్లడించారు. అయితే మండేలా ఆరోగ్యం స్థిరంగానే ఉందని తెలిపారు. ఆగస్టు 11 తేదిన వెల్లడించిన నివేదికకు ప్రస్తుత పరిస్థితిలో మార్పు ఏమి లేదన్నాడు. ఊపిరితిత్తుల వ్యాధితో జూన్ 8 తేదిన ప్రిటోరియాలోని ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మండేలా గత 77 రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నారు. మా నాన్న ప్రస్తుతం కూర్చోగలిగే స్థితిలో ఉన్నాడని మండేలా కూతరు జిండ్జి అన్నారు. -
మండేలా కోలుకుంటున్నారు: విన్నీ మండేలా
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నల్ల సూరీడు నెల్సన్ మండేలా కోలుకున్నారు. దాదాపు రెండు నెలల పాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ చికిత్స పొందిన ఆయన ఇప్పుడు మామూలుగా ఊపిరి తీసుకోగలుగుతున్నారని ఆయన మాజీ భార్య విన్నీ మాడికిజెలా మండేలా తెలిపారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, దాదాపు అంత్యదశలో ఉన్నారంటూ వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. వాస్తవాలను దాచాల్సిన అవసరం తమకు లేదన్నారు. పిల్లలు ఆయన్ను చూడటానికి వెళ్లినప్పుడు ఆయన కళ్లలో మెరుపు కనిపించిందని బ్రిటిష్ స్కై న్యూస్ చానల్ వర్గాలకు ఆమె చెప్పారు. ప్రస్తుతానికి ఆయనింకా మాట్లాడటం లేదని, సైగల ద్వారానే అన్నీ చెబుతున్నారని అన్నారు. ప్రిటోరియా ఆస్పత్రి వైద్యులు అద్భుతంగా చికిత్సలు అందించారని, వారి సేవల వల్లే ఆయన కోలుకున్నారని అన్నారు. మండేలా ఆరోగ్యం గురించి ఒక వర్గం మీడియాలో వచ్చిన వార్తలు మాత్రం తమ కుటుంబ సభ్యులను తీవ్రంగా బాధించాయని విన్నీ తెలిపారు. ఇది చాలా క్రూరమైన విషయమని, మండేలా అంత్యక్రియలకు కూడా కొంతమంది ఏర్పాట్లు చేసేశారని.. తమ మనోభావాలను కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయరా అని ఆమె ఆక్రోశించారు. -
మండేలా పరిస్థితి మరింత విషమం