15న మండేలా అంత్యక్రియలు... హాజరుకానున్న ఒబామా
దక్షిణాఫ్రికా జాతిపిత, నల్లజాతి సూర్యడు నెల్సన్ మండేలా అంత్యక్రియలు ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ దేశాధ్యక్షుడు జాకోబ్ జూమా ఇక్కడ వెల్లడించారు. ఈస్టరన్ కేప్లోని క్యూనులో మండేలా స్వగృహం వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం ఆయన జోహెన్స్బర్గ్లోని మండేలా కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మండేలా అంత్యక్రియలు వచ్చే ఆదివారం నిర్వహించాలని తెలిపారని ఆయన చెప్పారు.
ఆ మహానియుడి మృతికి 10 రోజులు సంతాపదినాలుగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. మండేలా ఆత్మశాంతికి దేశవ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మండేలా మృతితో ఆయన కుటుంబానికి దక్షిణాఫ్రికా వాసులతోపాటు ప్రపంచ ప్రజలు మద్దతుగా నిలవడం పట్ల జూమా సంతోషం వ్యక్తం చేశారు. వారందరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
నెల్సన్ మండేలా అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు ప్రపంచనేతలు హాజరుకానున్నారు. గత కొన్ని ఏళ్లుగా నెల్సన్ మండేలా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ఏడాది మధ్యలో మండేలా తీవ్ర అనారోగ్యం పాలైయ్యారు. దాంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆయన కోలుకుని, సెప్టెంబర్1న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. జోహెన్స్బర్గ్లో స్వగృహంలో మండేలా గురువారం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.