
దీక్ష విరమించిన ఉక్కుమహిళ
ఏఎఫ్‌ఎస్‌పీఏ రద్దుకు సీఎం కావాలనుకుంటున్నా: ఇరోం షర్మిల
ఇంఫాల్: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల(44) తన 16 ఏళ్ల నిరవధిక నిరాహార దీక్షను మంగళవారం విరమించారు. సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు కోసం తాను మణిపూర్‌కు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నానని ప్రకటించారు. ఏఎఫ్‌ఎస్‌పీఏను వ్యతిరేకిస్తూ.. 2000 నవంబర్ 5న షర్మిల నిరాహార దీక్షను చేపట్టడం తెలిసిందే. ప్రపంచంలో అత్యధిక కాలం కొనసాగిన నిరశన ఇదే. ఇంఫాల్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ ఆస్పత్రికి వెలుపల జైలుగా మార్చిన గదిలోనే షర్మిల దీక్ష విరమించారు. అరచేతిలో తేనెను రుచి చూసి నిరశనకు ముగింపు పలికారు. తీవ్ర ఉద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు.
ముక్కు నుంచి ట్యూబ్‌లు వేలాడుతూ ఉన్న షర్మిల దేశానికంతా సుపరిచితమే. దీక్ష సమయంలో ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ఏర్పాటు చేసిన ట్యూబ్‌లను ఇప్పుడు తొలగించారు. దీక్ష విరమించిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మణిపూర్‌లో సానుకూల మార్పులు తెచ్చేందుకు సీఎంను కావాలనుకుంటున్నా .సీఎం అయితే చేసే మొదటి పని ఏఎఫ్‌ఎస్‌పీఏను తొలగించడమే. ఇందుకు నాకు అధికారం కావాలి. మణిపూర్‌లో రాజకీయం బురదమయంగా మారింది. సీఎం ఇబోబీని ఎదుర్కొనేందుకు.. నాతో చేతులు కలపాలని 20 మంది స్వతంత్ర అభ్యర్థులను ఆహ్వానిస్తున్నాను’ అని అన్నారు.
ప్రధాని మోదీ ఈ వయసులో అహింస కావాలని కోరుతున్నారని, క్రూరమైన ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టం లేకుంటే తమకు చేరువ కాగలరని, గాంధీ అహింసా మార్గాన్ని మోదీ అనుసరించాలని కోరారు. ఏఎఫ్‌ఎస్‌పీఏ రద్దయ్యేంతదాకా ఇంటికి వెళ్లకుండా ఓ ఆశ్రమంలో ఉంటానని, తనకు భద్రత అక్కర్లేదని చెప్పారు.
ఇప్పటికిప్పుడు ఆహారం తీసుకునే ఉద్దేశం లేదన్నారు. దీక్షను విరమించాలన్న నా నిర్ణయంతో కొందరు ఏకీభవించకపోవచ్చన్నారు. తీవ్రవాద సంస్థలు అసంతృప్తిగా ఉన్నాయన్న వార్తలపై స్పందిస్తూ... ‘వారి సందేహాల్ని నా రక్తంతో నివృత్తి చేసుకోవచ్చు. హిందూ వ్యతిరేకి అంటూ గాంధీని చంపిన విధంగానే నన్ను చంపనివ్వండి’ అని అన్నారు. కాగావచ్చే ఏడాది జరగనున్న మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే విషయమై ఆమె త్వరలో ఎన్నికల సంఘాన్ని సంప్రదించే అవకాశం ఉంది.
రొటీన్ నుంచి విముక్తి..
15 రోజులకు ఓసారి ఆంబులెన్స్‌లో షర్మిలను ఆస్పత్రి నుంచి కోర్టుకు తీసుకువెళ్లడం.. జడ్జి ఆమెను దీక్ష విరమిస్తావా అని ప్రశ్నించడం.. అందుకు షర్మిల దీక్ష విరమించేది లేదని చెప్పడం.. గత కొన్నేళ్లుగా ఇదే నిత్యకృత్యం. మంగళవారం దీనికి తెరపడింది. తాను దీక్ష విరమిస్తానని షర్మిల.. జడ్జికి చెప్పారు. దీంతో రూ. 10వేల పూచీకత్తుపై ఇంఫాల్ వెస్ట్ జిల్లా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ బెయిలు మంజూరు చేసి రిలీజ్ ఆర్డర్ జారీ చేశారు.