
16 ఏళ్ల పోరాటానికి తాత్కాలిక విరామం
న్యూఢిల్లీ: ‘నా దృష్టిలో అహింస నైతిక సూత్రం ఎప్పటికీ కాదు. అదొక వ్యూహం మాత్రమే. ప్రభావ రహిత ఆయుధాన్ని ఉపయోగించడంలో మంచి నైతిక ఏమీ ఉండదు’ అని 30 ఏళ్లపాటు దక్షిణాఫ్రికా శ్వేతజాత్యహంకారానికి వ్యతిరేకంగా అహింస పద్ధతిలో సుదీర్ఘంగా పోరాటం జరిపిన నల్ల కలువ నెల్సన్ మండేలా అన్న మాటలు ఇవి. నెల్సన్ మండేలా పుస్తకాలను తెగ చదివిన ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిలాకు ఈ మాటలు గుర్తుండే ఉంటాయి. ఆమె కూడా మండేలా మాటల అంతరార్థాన్ని అర్థం చేసుకునే ఉంటారు. అందుకనే ఆమె మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్లుగా సాగిస్తున్న అహింసాత్మక పోరాటాన్ని మంగళవారం తాత్కాలికంగా విరమించారు. బెయిల్‌పై విడుదలయ్యారు.
16 ఏళ్ల పోరాటాన్ని ఇకముందు కూడా కొనసాగించాల్సిందిగా ‘కాంగ్లీపాక్ యవోల్ కున్నా లూప్’, ‘కాంగ్లీపాక్ కమ్యూనిస్టు పార్టీ’ లాంటి తిరుగుబాటు సంస్థల నుంచి వచ్చిన ఒత్తిళ్లను, బెదిరింపులను పట్టించుకోకుండా షర్మిలా నిరాహార దీక్ష విరమణకే మొగ్గు చూపారు. అయినా ఆమె పోరాటాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించలేదు. వ్యూహం మార్చుకున్నట్లు మాత్రమే చెప్పారు. రాజకీయ రంగంలో ప్రవేశించి ఎన్నికల్లో పోటీ చేస్తానని, రాజకీయ రంగం నుంచే సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతానని మీడియా ముఖంగా ప్రకటించారు.
షర్మిలాలో పోరాట శక్తి నశించిందని భావించరాదు. 16 ఏళ్ల పోరాటానికి స్పందించని కేంద్ర ప్రభుత్వాలు ఆమె మరింత కాలం నిరాహార దీక్షను కొనసాగిస్తే మాత్రం స్పందించే గ్యారెంటీ ఉందా? జస్టిస్ జీవన్ రెడ్డి కమిషన్, రెండవ అడ్మినిస్ట్రేషన్ కమిషన్, జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్లు అత్యంత వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని సమీక్షించి ఎత్తివేయడమే మంచిదని సూచించినా స్పందించని కేంద్ర ప్రభుత్వాలు పోరాటంలో షర్మిలా ప్రాణాలుపోతే స్పందిస్తాయా? ఈ విషయంలో నిర్ణయాన్ని ఆమెకే వదిలేయాలిగానీ, బలవంతంగా ఆమె ప్రాణాలను బలిపెట్టే ప్రయత్నాలను ప్రజాస్వామ్య వాదులుగా మనం చేయకూడదు. పెళ్లి పెటాకులు, తిండీ తిప్పలు లేకుండా 16 ఏళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేసిన షర్మిల స్ఫూర్తికి నీరాజనాలు పలకాలేతప్ప నిందలు వేయడం సరికాదు.
జాతిపిత మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలాలాగా అహింసాత్మక మార్గంలో పోరాటం చేయాలనుకుంటే ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అహింసాత్మక పోరాట మార్గాలు 198 ఉన్నాయని, ఈ అంశంపై ప్రత్యేక అధ్యయనం జరిపిన ‘ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఇనిస్టిట్యూషన్’ వ్యవస్థాపకులు, మసాచుసెట్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ జీన్ షార్ప్ తెలిపారు. ఇప్పుడు షర్మిలా రాజకీయ ఆయుధాన్ని ఎంచుకున్నారు. ఆమెలాంటి స్ఫూర్తి కలిగిన వారు మణిపూర్ మహిళల్లో ఎంతో మంది ఉన్నారు. మణిపూర్ పోరాట చరిత్రలోకి వెళితే మహిళా పోరాట యూధులే ఎక్కువగా కనిపిస్తారు. వారిలాంటి వారు ముందుకొచ్చి షర్మిల పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.