‘ప్రసంగం శక్తివంతమైనది. మంచి ప్రసంగం.. ప్రపంచాన్ని ఒప్పించేది, మార్చేది, ఆచరింపజేసేది’అంటాడు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. మాట ప్రపంచాన్ని నడిపించే వాహకం. దాన్ని అద్భుతంగా ఉపయోగించినవాళ్లు మంచి వక్తలవుతారు. అలా మనసును కదిలించే ప్రసంగాలతో ప్రపంచగతిని మార్చిన వాళ్లున్నారు. నేడు అంతర్జాతీయ ప్రసంగ దినోత్సవం సందర్భంగా దాని ప్రాసంగికత గురించి కొన్ని ముచ్చట్లు...
ప్రసంగం అంటే..
మంచి గొంతు ఉంటే సరిపోదు. మంచి భాష తెలిసినంత మాత్రాన వక్తలైపోరు. ఎందుకంటే కొన్నిసార్లు పదాలు ఉత్తి శబ్దాలు. వాటికి భావోద్వేగాన్ని, ఆలోచనలను జత చేసి వ్యక్తీకరిస్తేనే అద్భుతమైన ప్రసంగం అవుతుంది. అది జనంలో మార్పు తీసుకురాగలిగితే చరిత్రలో నిల్చిపోతుంది.
రకరకాల ప్రసంగాలు..
ప్రసంగాల్లో చాలా రకాలుంటాయి. కొన్ని వినోదాన్ని పంచితే, మరికొన్ని విజ్ఞానాన్ని అందజేస్తాయి. కొందరి ప్రసంగాలు ఆలోచనల్లో పడేస్తాయి. ఇంకొన్ని మనకు తిరుగులేదన్న ఆత్మవిశ్వాసాన్నిస్తాయి. అంశమేదైనా దాన్ని ముందు వక్త నమ్మితే.. అది విన్నవాళ్లను సైతం ఒప్పించగలుగతారు. అలా తమ ప్రసంగాలతో ప్రపంచగతిని మార్చేసిన కొందరు నేతలున్నారు. కొందరి ప్రసంగాలు స్ఫూర్తిని రగిలిస్తే... విద్వేషాలను రెచ్చగొట్టిన మరికొన్ని ప్రసంగాలూ ఉన్నాయి.
చదవండి: ముప్పు ముంగిట అమెజాన్.. కథ మారకపోతే కష్టాలకు తలుపులు బార్లా తెరిచినట్టే!
నాకో కల ఉంది : మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్)
‘ఏదో ఒక రోజున నా నలుగురు పిల్లలు వారి వర్ణాన్ని బట్టి కాకుండా, వ్యక్తిత్వాలను బట్టి గుర్తించే దేశంలో నివసిస్తారని నాకో కల ఉంది’అంటూ 1963లో అమెరికా పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్(జూనియర్) చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని కదిలించింది. అమెరికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని మలుపు తిప్పిన ప్రసంగమది.
స్వేచ్ఛ కోసం
మానవ హక్కుల కోసం, స్వేచ్ఛ, సమానత్వం కోసం తన జాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు నెల్సన్‌మండేలా. రివోనియా ట్రయల్ దగ్గర 1964లో సౌత్ ఆఫ్రికా సుప్రీంకోర్టు ముందు నిలబడి ఆయన చేసిన ప్రసంగం చిరస్మరణీయం. ‘నా జీవితకాలం లో ఆఫ్రికన్ ప్రజల కోసం నన్ను నేను అంకితం చేసుకున్నా ను. నేను తెల్లజాతి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాను, నల్లజాతి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాను. ప్రజలందరూ సామరస్యంగా, సమాన అవకాశాలతో కలిసి జీవించే ప్రజాస్వామ్య, స్వేచ్ఛా సమాజం కోసం అవసరమైతే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నీ హక్కుల కోసం నువ్వు పోరాడు, నీ స్వేచ్ఛకోసం నువ్వు పోరాడు. ఇతరుల హక్కులపై ఆధిపత్యం కోసం పోరాడకూడదు’ ఆయన చేసిన ప్రసంగం ఆయనను చెరసాల నుంచి కాపాడలేకపోయింది కానీ... దక్షిణాఫ్రికా ప్రజల గుండెలను పిండేసింది. స్వేచ్ఛ కోసం ఆఫ్రికన్లను కార్యోన్ముఖులను చేసింది.
స్వామి వివేకానందకు స్టాండింగ్ ఒవేషన్
స్వామి వివేకానంద.. 1893 సెప్టెంబర్ 11న చికాగోలో ప్రపంచ మతాల పార్లమెంట్ సందర్భంగా ‘అమెరికా సోదర, సోదరీమణులకు’అంటూ ఆయన మొదలుపెట్టిన ప్రసంగం రెండు నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ అందుకుంది. సమయం తక్కువగా ఉందని చెప్పిన నిర్వాహకులు... ఆయన ప్రసంగం మొదలుపెట్టాక మైమరచిపోయి విన్నారు.
మహాత్ముని మాట..
అత్యంత ప్రభావితం చేయగలిగిన వక్తల్లో ఒకరు మన జాతిపిత మహాత్మాగాంధీ. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ఆయన చేసిన ప్రసంగాలు భారత జాతిని మేల్కొల్పాయి. ‘మనం ద్వేష భావం వీడాలి, స్నేహభావం అలవరుచుకోవాలి. బ్రిటిష్ వారిప్పుడు ప్రమాదపుటంచుల్లో ఉన్నారు. వారి సహాయం కోసం నేను చేయి అందిస్తాను... దాన్ని కత్తిరించడానికి వారు సిద్ధంగా ఉన్నా సరే. వారికి సాయపడేందుకే నేను ముందుంటాను’అంటూ గాంధీ చేసిన ప్రసంగాలు బ్రిటిష్‌వారిని సైతం ఆలోచింపజేశాయి.
బంగ్లాదేశ్ విముక్తి కోసం
1971లో మార్చి 7న ఢాకాలోని రేస్ కోర్స్ మైదానంలో షేక్ ముజీబుర్ రెహ్మాన్ చరిత్రాత్మక ప్రసంగం చరిత్రలో నిలిచిపోయింది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం కావాలంటూ ముజీబుర్ రహ్మాన్ ప్రసంగం వినేందుకు దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. పాక్ సైన్యం నుంచి ర క్షణ కోసం కాకుండా ప్రతిఘటనకు ప్రతీకగా వెదురు క ర్రలు చేతబూని ప్రజలు బహిరంగసభకు వచ్చారు. ఈ సందర్భంగా ముజీబుర్ చేసిన ప్రసంగం భారత ఉప ఖండంలో రాజకీయ ప్రసంగాలలోకెల్లా అత్యున్నతమైనదిగా నిలిచింది. ఈ ప్రసంగాన్ని ప్రపంచ వారసత్వ డాక్యుమెంటరీగా యునెస్కో 2017లో గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment