పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న సుష్మ
పీటర్‌మారిట్జ్‌బర్గ్: గొప్ప నాయకుల్ని అందించినందుకు భారత్, దక్షిణాఫ్రికాల్ని ప్రపంచం గౌరవిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. దక్షిణాఫ్రికాలోని పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో గాంధీజీని రైల్లోంచి తోసేసిన సంఘటనకు 125 ఏళ్లు పూర్తైన సందర్భంగా గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్యాయానికి, వివక్షకు గురైన ప్రజల్లో నమ్మకం నింపేందుకు గాంధీజీ, నెల్సన్ మండేలాలు పోషించిన పాత్రను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ‘మన నుంచి ప్రపంచం ఎంతో లాభపడింది. గొప్ప నాయకుల్ని అందించినందుకు ప్రపంచం గౌరవిస్తోంది.
బానిస ప్రజల్లో గాంధీజీ, మండేలా ఆశను ఉదయింపచేశారు. వలస బానిసత్వం నుంచి విముక్తి కల్పించడం ద్వారా భారత్, ఆఫ్రికా దేశాలకు నమ్మకం కలిగించారు’ అని సుష్మా స్వరాజ్ చెప్పారు. 25 ఏళ్ల క్రితం పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో మహాత్మాగాంధీ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా మండేలా మాట్లాడిన అంశాల్ని ఆమె ప్రస్తావించారు. అలాగే వర్ణవివక్షకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికా జరిపిన పోరుకు భారత్ అందించిన మద్దతును గుర్తుచేశారు. అంతకుముందు పెంట్రిక్ నుంచి పీటర్‌మారిట్జ్‌బర్గ్‌కు రైలులో ప్రయాణించారు. ఐదురోజుల పర్యటన నిమిత్తం దక్షిణాఫ్రికాలో ఉన్న సుష్మా స్వరాజ్ మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే మహాత్మాగాంధీ డిజిటల్ మ్యూజియంను ప్రారంభిచారు. ‘ద బర్త్ ఆఫ్ సత్యాగ్రహ’ అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించడంతో పాటు.. దక్షిణాఫ్రికా డిప్యూటీ విదేశాంగ మంత్రి లాండర్స్‌తో కలిసి పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ, వర్ణవివక్షతపై పోరాడిన ప్రముఖ నేత ఒలివర్ టాంబోల పోస్టల్ స్టాంపుల్ని విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment