ట్రంప్‌తో తేల్చుకోవాల్సినవి... | Sakshi Editorial On Donald Trumph | Sakshi
Sakshi News home page

ట్రంప్‌తో తేల్చుకోవాల్సినవి...

Published Tue, Feb 25 2020 1:34 AM | Last Updated on Tue, Feb 25 2020 8:23 AM

Sakshi Editorial On Donald Trumph

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం ఉదయం మన గడ్డపై అడుగుపెట్టారు. తనకు స్వాగతమవ్వడానికి వచ్చే ప్రజానీకం సంఖ్యను 60 లక్షల నుంచి కోటి వరకూ పెంచుకుంటూ వెళ్లిన ట్రంప్‌... మొత్తానికి రహదారి పొడవునా ఇరుపక్కలా తన కోసం వచ్చిన జనాన్ని చూసి, మోతేరా స్టేడియంలో తన గౌరవార్థం ఏర్పాటు చేసిన సత్కారసభకు హాజరైనవారిని చూసి సంతృప్తిచెందారనే చెప్పాలి. లక్షమందికిపైగా కూర్చోవడానికి వీలయ్యే ఆ స్టేడియం మొత్తం నిండిపోవడం ట్రంప్‌కు సంతృప్తినిచ్చేవుంటుంది. అందుకే ఈ స్వాగత సత్కారాలు అసాధారణమైనవని ఆయన కొనియా   డారు. ఈ ఏడాది ఆఖరుకు అమెరికాలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థిగా తల పడే అవకాశమున్న బెర్నీ శాండర్స్‌ను ఓడించాలంటే అమెరికాలో స్థిరపడిన భారతీయుల ఓట్లు కీలకమని, అందుకు అహ్మదాబాద్‌ స్వాగత సత్కారాలు దోహదపడతాయని ట్రంప్‌ గట్టిగా నమ్ముతున్నారు.

అది నెరవేరిందన్న భావన ఆయన మాటల్లో ప్రస్ఫుటంగా కనబడింది. ఎన్నారైలు, వ్యాపారవేత్తలు, ఎన్నారైల బంధుగణం, పాఠశాలల విద్యార్థులు హాజరై, చాయ్‌వాలా వంటి పదాలు ఆయన పలకడానికి ప్రయత్నించినప్పుడూ, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీల కృషి ని స్మరించినప్పుడు మోతేరా స్టేడియాన్ని మార్మోగించారు. నేతలిద్దరూ పరస్పరం ప్రశంసించుకోవడం, ఉగ్రవాదం గురించి, పాక్‌ గురించి ట్రంప్‌ ప్రస్తావించడం వంటివన్నీ అక్కడున్నవారిలో ఉత్సాహాన్ని నింపాయి. ట్రంప్‌ ప్రసంగం ఆద్యంతమూ గమనిస్తే  ఇక్కడి జనం ఏం కోరుకుంటారో, ఏయే అంశాలను ప్రస్తావిస్తే వారికి సంతోషం కలుగుతుందో ఆయన ప్రసంగాన్ని రూపొందించిన అధికారులకు పూర్తి అవగాహన ఉన్నదని అర్థమవుతుంది. పేదరిక నిర్మూలన, ఆర్థిక వృద్ధి, సామాజిక పథకాలు వంటి అంశాల్లో భారత్‌ ప్రగతి అత్యద్భుతమైనదని, వీటన్నిటినీ ఒక స్వేచ్ఛాయుత సమా జంగా, ఒక ప్రజాతంత్ర దేశంగా ఎవరినీ వేధించకుండా, బాధించకుండా సాధించడానికి ప్రయత్ని స్తుండటం గమనార్హమైనదని కొనియాడారు. ఒక అగ్రరాజ్యాధినేత నోటివెంబడి ఇలాంటి ప్రశంసలు రావడం కన్నా ఏం కావాలి? 

ఈ పర్యటనలో మరో కీలకమైన ఘట్టం మంగళవారం చోటుచేసుకోబోతోంది. ఇరుదేశాల అధి నేతల మధ్యా వ్యూహాత్మక అంశాలపై చర్చలు జరగడంతోపాటు, రెండు దేశాల అధికారులు ఇప్పటికే అవగాహనకొచ్చిన రక్షణ, ఆంతరంగిక భద్రత ఒప్పందాలపై మంగళవారం లాంఛనంగా సంతకాల వుతాయి. రక్షణ ఒప్పందం విలువ 300 కోట్ల డాలర్లపైమాటేనంటున్నారు. ముందనుకున్నట్టే వాణిజ్య ఒప్పందం మాత్రం అనంతరకాలానికి వాయిదా పడింది. ఇద్దరు నేతలూ ముఖాముఖి సంభాషించుకునే సమయంలో ట్రంప్‌ మత విద్వేషాలు, సీఏఏ గురించిన ప్రస్తావన తీసుకొస్తారని కొందరు ఆశిస్తున్నారు. అదెంతవరకూ సాధ్యమో చూడాలి. ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్యా వ్యూహాత్మక సంబంధాలు మరింత మెరుగ్గా ఉండాలని అమెరికా ఆశిస్తోంది. ఇంతకుముందు అమెరికాను ఏలిన అయిదుగురు అధ్యక్షులు మన దేశంలో పర్యటించినా... పాకి    స్తాన్‌తోసహా మరే దేశ పర్యటనతోనూ ముడిపెట్టకుండా నేరుగా మన దేశ సందర్శనార్ధం మాత్రమే వచ్చిన తొలి అధ్యక్షుడు ట్రంప్‌. దీన్నిబట్టే ఈ పర్యటనకు ట్రంప్‌ ఇస్తున్న ప్రాముఖ్యతను అర్ధం చేసుకోవచ్చు. 

అహ్మదాబాద్‌ ప్రసంగంలో ట్రంప్‌ పరోక్షంగా తాలిబాన్‌లతో అమెరికాకు కుదరబోయే ఒప్పం దాన్ని ప్రస్తావించారు. ఉగ్రవాదంపై పాకిస్తా¯Œ  కఠినంగా వ్యవహరించేలా ఆ దేశంతో తమ అధికా రులు చర్చిస్తున్నారని, త్వరలో అది సాకారం కాబోతోందని ఆయన ప్రకటించారు. ఆయన ప్రస్తావిం చింది ఈనెల 29న తాలిబన్‌లతో  కుదిరే ఒప్పందమని సులభంగానే చెప్పొచ్చు. కానీ అది ఒక దుస్సాహసంగా మిగిలే ప్రమాదం ఉంది. అధికారంలోకొచ్చాక మొదటి రెండేళ్లూ ఆయన పాకిస్తా న్‌ను తీవ్రంగా విమర్శించేవారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షిస్తే కఠినంగా ఉంటామని హెచ్చరించేవారు. కానీ అహ్మదాబాద్‌ ప్రసంగాన్ని గమనిస్తే అదేమీ కనబడదు. సరిగదా... పాక్‌పై ఆయనకు ఎక్కడలేని నమ్మకమూ ఏర్పడిందనిపిస్తుంది. ఆయన నమ్మకాల మాటెలావున్నా పాక్‌తో మనకున్న గతానుభవా లను గుర్తుకుతెచ్చుకుంటే తాలిబన్‌లతో కుదరబోయే ఒప్పందం పర్యవసానాలెలావుంటాయో సుల భంగానే గ్రహించవచ్చు.

అఫ్ఘానిస్తాన్‌ గడ్డపై ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో ఆనాటి సోవియెట్‌ యూని యన్‌తో లెక్కలు తేల్చుకోవడానికి ఛాందసవాద శక్తులకు తాలిబన్‌ ముద్ర తగిలించి, వారికి  నిపుణు లతో ఆయుధ శిక్షణనిప్పించి రంగంలోకి దించింది అమెరికాయే. ఆ తర్వాత వారు సృష్టికర్తనే ధిక్క రించి చెలరేగడం వేరే కథ. చివరకు తాలిబన్‌లు ప్రభుత్వాన్ని చేజిక్కించుకుని సాగించిన అరాచకం అంతా ఇంతా కాదు. అప్పుడే పాకిస్తాన్‌ ప్రాపకంతో తాలిబన్‌లు చొరబాటుదార్లను ప్రవేశపెట్టి కశ్మీర్‌ను రక్తసిక్తం చేశారు. ఆ సమయంలోనే మన భద్రతా బలగాలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఉగ్రవాద దాడులు పెరిగాయి. అఫ్ఘాన్‌లో మళ్లీ తాలిబన్‌లతో పాతకథే నడిపించాలని పాక్‌ కలలు గంటోంది. ఇప్పుడు తాలిబన్‌ల సత్ప్రవర్తనకు పూచీపడి, ట్రంప్‌ను ఒప్పించడంలో పాక్‌ పాత్ర కీలకం. ఈ ఒప్పందం గురించిన కథనాలు వచ్చినప్పటినుంచి ‘హింస తగ్గింపు’ పదే పదే ప్రస్తావన కొస్తోంది.

తాలిబన్‌లు హింస ‘తగ్గిస్తారని’ అమెరికా చెబుతోంది. పండగలకు దుకాణదారులు ప్రక టించే డిస్కౌంట్‌ తరహాలో దీన్ని ప్రచారం చేస్తోంది. హింసామార్గాన్ని వదిలేస్తామని ప్రకటించడానికి సిద్ధపడనివారితో ఒప్పందం చివరకు దేనికి దారితీస్తుందో తెలియనట్టు అమాయకత్వం నటిస్తోంది. ఈ విషయంలో మోదీ దృఢమైన వైఖరి తీసుకోవాలి. అలాగే ఎన్నారైలను ఇబ్బందుల్లో పడేసే కఠిన మైన వలస నిబంధనలు రూపొందించడాన్ని మానుకోవాలని హితవు చెప్పాలి. ఈ రెండూ సాధిస్తేనే ట్రంప్‌ పర్యటన వల్ల మనకు కొద్దో గొప్పో మేలు కలిగినట్టు లెక్క. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement