అనని సూక్తిని గాంధీకి ఆపాదించిన ట్రంప్ | Trump does a Trump again, uses wrong Gandhi quote during poll campaign | Sakshi
Sakshi News home page

అనని సూక్తిని గాంధీకి ఆపాదించిన ట్రంప్

Published Tue, Mar 1 2016 8:58 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

అనని సూక్తిని గాంధీకి ఆపాదించిన ట్రంప్ - Sakshi

అనని సూక్తిని గాంధీకి ఆపాదించిన ట్రంప్

వాషింగ్టన్: విచ్ఛిన్నకరమైన ప్రచారం చేస్తూ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ ఈసారి మహాత్మాగాంధీ అనని వ్యాఖ్యలను ఆయనకు ఆపాదించే ప్రయత్నం చేశారు. 'మొదట వాళ్లు నిన్ను విస్మరిస్తారు. ఆ తర్వాత నిన్ను చూసి నవ్వుతారు. ఆపై నీతో పోరాడుతారు. అనంతరమే నువ్వు గెలుస్తావు' అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ కు అలబామాలో తన ర్యాలీ ఫొటోను పెట్టి.. ఇది మహాత్మా గాంధీ అన్నట్టు ఆపాదించారు.

నిజానికి ఈ మాట గాంధీ చెప్పింది కాకపోయినప్పటికీ, చాలా సందర్భాల్లో ఆయనకు ఆపాదిస్తూ వస్తున్నారని అమెరికా మీడియా స్పష్టం చేసింది. 2011లో క్రిస్టియన్ సైన్స్ మానిటర్ మ్యాగజీన్ 'పొలిటికల్ మిస్‌ కోట్స్' పేరిట తప్పుగా ఆపాదించబడిన ప్రముఖమైన పది సూక్తులను వెల్లడించింది. ఇందులో గాంధీ అన్నట్టు ప్రచారంలో ఉన్న ఈ వ్యాఖ్యను కూడా ప్రస్తావించింది. 'గాంధీజీ తాత్వికత అయిన సత్యాగ్రహానికి సారాంశంగా ఈ సూక్తి పేరొందింది. కానీ నిజానికి ఈ మాట మహాత్ముడు అన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవు' అని పేర్కొంది. ఇలాంటి సూక్తినే ఒకదానిని అమెరికా కార్మిక హక్కుల నాయకుడు నికోలస్ క్లీన్‌కు కూడా ఆపాదించారని ఆ మ్యాగజీన్ స్పష్టం చేసింది.

గాంధీజీని ట్రంప్ వాడుకోవడం ఇదే మొదటిసారి కాదు. ట్రంప్ మద్దతుదారు, అలస్కా మాజీ గవర్నర్ సారా పాలిన్ కూడా గతంలో ఇదే సూక్తిని గాంధీజీకి తప్పుగా ఆపాదిస్తూ వాడారు. ఇటలీ ఫాసిస్టు నేత బెనిటో ముస్సోలిని సూక్తిని ట్రంప్ రీ ట్వీట్‌ చేయడం తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో ట్రంప్ గాంధీ సూక్తులను ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. అయితే గాంధీజీ అనని మాటను ఆయనకు ఆపాదించడంపై ట్విట్టర్‌లో ట్రంప్‌పై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ముస్సోలిని సూక్తులను ప్రస్తావించిన ట్రంప్‌ త్వరలోనే హిట్లర్‌ సూక్తులను  కూడా వాడుకొని లబ్ధి పొందేలా కనిపిస్తున్నాడని ఆయన తీరుపై ధ్వజమెత్తుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement