ఆధిక్యంలో హిల్లరీ క్లింటన్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ అగ్రపీఠాన్ని వరించబోయేది ఎవరా.. అని ఓటర్లలో తెగ ఉత్కంఠ నెలకొంటోంది. జాతీయ పోల్ సర్వేల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటనే ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు వెల్లడవుతోంది. తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై స్వల్పంగా 4 పాయింట్ల ఆధిక్యంలో హిల్లరీ కొనసాగుతున్నారని తాజా ప్యూ రీసెర్చ్ సెంటర్ పోల్ పేర్కొంది. తగ్గాపోరుగా ఈ ఇద్దరి నేతలు అభ్యర్థిత్వ రేసులో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ముందస్తు జాతీయ పోల్స్ అన్నింటిలో కూడా హిల్లరీ క్లింటనే ఆధిక్యంలో ఉన్నట్టు వెల్లడైంది. తాజా పోల్ సర్వేలో ఆధిక్య పాయింట్లను హిల్లరీ కోల్పోయినప్పటికీ, 4 పాయింట్లతో ముందంజలోనే ఉన్నారని ప్యూ సర్వే తెలిపింది.
ఒకవేళ అమెరికాకు నేడే ఎన్నికలు జరిగితే 41 శాతం మంది రిజిస్ట్రర్ ఓటర్లు హిల్లరీకే మద్దతు పలుకుతారని ప్యూ సర్వేలో వెల్లడైంది. 37 శాతం ట్రంప్కు మొగ్గుచూపుతున్నట్టు సర్వే తెలిపింది. ఈ ఏడాది మొదటి వరకు చాలామంది ఓటర్లు అమెరికా అభ్యర్థిత్వానికి క్లింటన్ లేదా ట్రంప్ల్లో ఎవరు సరియైన వారో పోల్చుకోవడంలో సందిగ్థతలో ఉండేవారని.. ప్రస్తుతం క్లారిటీతో ఓటర్ల అభిప్రాయాలు వెల్లడవుతున్నట్టు సర్వే వివరించింది. కేవలం 27 శాతం మందే ట్రంప్ను అమెరికాకు గ్రేట్ ప్రెసిడెంట్గా అభివర్ణిస్తుంటే.. దానికి డబుల్ శాతం మంది అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా ట్రంప్ను పోల్చుతున్నారని సర్వే తెలిపింది. 15 శాతం మంది ట్రంప్..యావరేజ్ ప్రెసిడెంటని చెబుతున్నట్టు పేర్కొంది. ట్రంప్ కంటే ఆధిక్యంలో గ్రేట్ ప్రెసిడెంట్గా హిల్లరీనే ఓటర్ల మన్ననలను పొందుతున్నారని.. 31 శాతం మంది హిల్లరీ గ్రేట్ ప్రెసిడెంట్ అంటూ తెగ పొగిడేస్తున్నారట. ప్యూ రీసెర్చ్ సెంటర్ ఆగస్టు 9-16 మద్యలో 2,010 మందితో(1,567 రిజిస్ట్రర్ ఓటర్లు కలిపి) ప్యూ రీసెర్చ్ ఈ తాజా సర్వే నిర్వహించింది. .