'ఐఎస్ఐఎస్ తల నరికేస్తాను'
న్యూయార్క్: 'నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఎస్ఐఎస్ తల నరికేస్తాను. వారి చమురును మన అధీనంలోకి తీసుకుంటాను'.. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ తన మొదటి టీవీ ప్రకటనలో పేర్కొన్న హామీలివి. అంతేకాకుండా ఈ ప్రకటనలో తాను గతంలో చేసిన వివాదాస్పద హామీలను సైతం ట్రంప్ పునరుద్ఘాటించారు. అమెరికాలోకి ముస్లింలు రాకుండా తాత్కాలిక నిషేధం విధించాలని, దేశంలో ఏం జరుగుతున్నదో స్పష్టంగా తెలుసుకొనే వరకు ఇది కొనసాగాలని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్ ఫొటోలతో మొదలయ్యే ఈ ప్రకటనలో యుద్ధరంగంలో అమెరికా క్రూయిజ్ క్షిపణిని పేల్చడం, కాలిఫోర్నియాలో ఉగ్రవాద దాడికి పాల్పడిన నిందితుల ఫొటోలు, అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో వలస దృశ్యాలు, ఇస్లామిక్ స్టేట్ దృశ్యాలు కనిపిస్తాయి.
నేపథ్య వ్యాఖ్యాత గంభీరమైన గొంతుతో ఈ దృశ్యాలకు అనుగుణంగా మాట్లాడుతూ 'అందుకే దేశంలో ఏం జరుగుతున్నదో తెలుసుకునేవరకు అమెరికాలో ముస్లింలు ప్రవేశించకుండా తాత్కాలిక నిషేధం విధించాలని ఆయన కోరుతున్నారు. ఐఎస్ఐస్ తలను ఆయన నరికేస్తారు. వారి చమురును అధీనంలోకి తీసుకుంటారు. మెక్సికోలోని దక్షిణ సరిహద్దుల్లో గోడ నిర్మించడం ద్వారా ఆయన అక్రమ వలసను అడ్డుకుంటారు' అని చెప్తారు. 'అమెరికాను మళ్లీ గొప్పదిగా మేం మారుస్తాం' అంటూ ఎన్నికల ర్యాలీల్లో ట్రంప్ చేసే వ్యాఖ్యలు చివరగా వినిపిస్తాయి.