అమెరికా బీద దేశం: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి పోటీకి రిపబ్లికన్ పార్టీ తరపున ముందు వరుసలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం సాల్ట్ లేక్ సిటీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. అమెరికా ఇప్పుడు తృతీయ దేశాల వరుసలో చేరిపోయిందన్నారు. చైనా, దుబాయ్లలో ఉన్నటువంటి రైలు, రోడ్డు సదుపాయాలు చూస్తే అమెరికా వెనుకబడినట్లు స్పష్టంగా తెలుస్తోందని, ఆ దేశాల్లోని బుల్లెట్ రైళ్లు గంటకు వందల మైళ్ల వేగంతో దూసుకుపోతుంటే.. న్యూయార్క్లో మాత్రం ప్రజలు వంద ఏళ్ల క్రితం వారిలా వెనుకబడిపోయారన్నారు.
అమెరికా పేద దేశం కాబట్టి వ్యాపారం విషయంలో తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ట్రంప్ పేర్కొన్నాడు. అమెరికా పరిస్థితి ఇప్పుడు ఏమంత గొప్పగా లేదని, దానికి మరోసారి పూర్వ వైభవం తీసుకురావాలని ట్రంప్ అన్నారు. అగ్రరాజ్యం ఇప్పుడు లోటులో ఉందని, అయితే ఈ విషయాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు. వేగవంతంగా, తెలివిగా వ్యవహరించే వ్యక్తులు ఇప్పుడు అమెరికాకు నాయకులు కావాలన్న ట్రంప్.. ఇప్పుడున్న వారు అలాంటి వారు కాదని విమర్శించారు.