నా జీవితంపై వాళ్లిద్దరి ప్రభావం ఎక్కువ: ప్రియాంక
తన జీవితంపై మహాత్మా గాంధీ, దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలాల ప్రభావం ఎక్కువగా ఉందని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తెలిపారు. చిన్నారులపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా యూనిసెఫ్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి ప్రియాంక ముఖ్య అతిథిగా హాజరై 6 లక్షల ర్యాండ్‌ల విరాళాన్ని సేకరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. మహాత్ముడు, మండేలా ఇద్దరూ చిన్నారుల హక్కుల కోసం పోరాడారన్నారు. 18 ఏళ్ల లోపు వయసున్న పిల్లల్లో దక్షిణాఫ్రికాలో ప్రతి అయిదుగురు ఒకరు, జింబాంబ్వేలో ప్రతి ముగ్గురు లైంగిక దాడికి గురయ్యారని ప్రియాంక తెలిపారు.
తాను ఎలాంటి దుస్తులు వేసుకున్నానో అని కాకుండా మీడియా ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టాలని చురకలంటించారు. యూనిసెఫ్ చేపట్టే కార్యక్రమాలకు తనవైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ప్రియాంక హామీనిచ్చారు. చిన్నారులపై జరిగే హింసకు వ్యతిరేకంగా సినిమాలు ఎలాంటి ప్రచారం నిర్వహించకపోవడంపై ఆమె స్పందించారు. ఏ కళాత్మక రంగానికైనా ఈ విషయమై ఎటువంటి నైతిక బాధ్యత ఉండబోదని, సృజనాత్మకత దెబ్బతింటుందని వారు భావించడమే అందుకు కారణమని వివరించారు. ప్రియాంక ప్రస్తుతం యూనిసెఫ్ సౌహార్ద్ర రాయబారిగా ఉన్నారు.