JS Verma
-
దీక్ష విరమించిన ఉక్కుమహిళ
-
దీక్ష విరమించిన ఉక్కుమహిళ
ఏఎఫ్ఎస్పీఏ రద్దుకు సీఎం కావాలనుకుంటున్నా: ఇరోం షర్మిల ఇంఫాల్: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల(44) తన 16 ఏళ్ల నిరవధిక నిరాహార దీక్షను మంగళవారం విరమించారు. సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్ఎస్పీఏ) రద్దు కోసం తాను మణిపూర్‌కు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నానని ప్రకటించారు. ఏఎఫ్ఎస్పీఏను వ్యతిరేకిస్తూ.. 2000 నవంబర్ 5న షర్మిల నిరాహార దీక్షను చేపట్టడం తెలిసిందే. ప్రపంచంలో అత్యధిక కాలం కొనసాగిన నిరశన ఇదే. ఇంఫాల్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ ఆస్పత్రికి వెలుపల జైలుగా మార్చిన గదిలోనే షర్మిల దీక్ష విరమించారు. అరచేతిలో తేనెను రుచి చూసి నిరశనకు ముగింపు పలికారు. తీవ్ర ఉద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ముక్కు నుంచి ట్యూబ్‌లు వేలాడుతూ ఉన్న షర్మిల దేశానికంతా సుపరిచితమే. దీక్ష సమయంలో ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ఏర్పాటు చేసిన ట్యూబ్‌లను ఇప్పుడు తొలగించారు. దీక్ష విరమించిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మణిపూర్‌లో సానుకూల మార్పులు తెచ్చేందుకు సీఎంను కావాలనుకుంటున్నా .సీఎం అయితే చేసే మొదటి పని ఏఎఫ్ఎస్పీఏను తొలగించడమే. ఇందుకు నాకు అధికారం కావాలి. మణిపూర్‌లో రాజకీయం బురదమయంగా మారింది. సీఎం ఇబోబీని ఎదుర్కొనేందుకు.. నాతో చేతులు కలపాలని 20 మంది స్వతంత్ర అభ్యర్థులను ఆహ్వానిస్తున్నాను’ అని అన్నారు. ప్రధాని మోదీ ఈ వయసులో అహింస కావాలని కోరుతున్నారని, క్రూరమైన ఏఎఫ్ఎస్పీఏ చట్టం లేకుంటే తమకు చేరువ కాగలరని, గాంధీ అహింసా మార్గాన్ని మోదీ అనుసరించాలని కోరారు. ఏఎఫ్ఎస్పీఏ రద్దయ్యేంతదాకా ఇంటికి వెళ్లకుండా ఓ ఆశ్రమంలో ఉంటానని, తనకు భద్రత అక్కర్లేదని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఆహారం తీసుకునే ఉద్దేశం లేదన్నారు. దీక్షను విరమించాలన్న నా నిర్ణయంతో కొందరు ఏకీభవించకపోవచ్చన్నారు. తీవ్రవాద సంస్థలు అసంతృప్తిగా ఉన్నాయన్న వార్తలపై స్పందిస్తూ... ‘వారి సందేహాల్ని నా రక్తంతో నివృత్తి చేసుకోవచ్చు. హిందూ వ్యతిరేకి అంటూ గాంధీని చంపిన విధంగానే నన్ను చంపనివ్వండి’ అని అన్నారు. కాగావచ్చే ఏడాది జరగనున్న మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే విషయమై ఆమె త్వరలో ఎన్నికల సంఘాన్ని సంప్రదించే అవకాశం ఉంది. రొటీన్ నుంచి విముక్తి.. 15 రోజులకు ఓసారి ఆంబులెన్స్‌లో షర్మిలను ఆస్పత్రి నుంచి కోర్టుకు తీసుకువెళ్లడం.. జడ్జి ఆమెను దీక్ష విరమిస్తావా అని ప్రశ్నించడం.. అందుకు షర్మిల దీక్ష విరమించేది లేదని చెప్పడం.. గత కొన్నేళ్లుగా ఇదే నిత్యకృత్యం. మంగళవారం దీనికి తెరపడింది. తాను దీక్ష విరమిస్తానని షర్మిల.. జడ్జికి చెప్పారు. దీంతో రూ. 10వేల పూచీకత్తుపై ఇంఫాల్ వెస్ట్ జిల్లా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ బెయిలు మంజూరు చేసి రిలీజ్ ఆర్డర్ జారీ చేశారు. -
16 ఏళ్ల పోరాటానికి తాత్కాలిక విరామం
-
16 ఏళ్ల పోరాటానికి తాత్కాలిక విరామం
న్యూఢిల్లీ: ‘నా దృష్టిలో అహింస నైతిక సూత్రం ఎప్పటికీ కాదు. అదొక వ్యూహం మాత్రమే. ప్రభావ రహిత ఆయుధాన్ని ఉపయోగించడంలో మంచి నైతిక ఏమీ ఉండదు’ అని 30 ఏళ్లపాటు దక్షిణాఫ్రికా శ్వేతజాత్యహంకారానికి వ్యతిరేకంగా అహింస పద్ధతిలో సుదీర్ఘంగా పోరాటం జరిపిన నల్ల కలువ నెల్సన్ మండేలా అన్న మాటలు ఇవి. నెల్సన్ మండేలా పుస్తకాలను తెగ చదివిన ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిలాకు ఈ మాటలు గుర్తుండే ఉంటాయి. ఆమె కూడా మండేలా మాటల అంతరార్థాన్ని అర్థం చేసుకునే ఉంటారు. అందుకనే ఆమె మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్లుగా సాగిస్తున్న అహింసాత్మక పోరాటాన్ని మంగళవారం తాత్కాలికంగా విరమించారు. బెయిల్‌పై విడుదలయ్యారు. 16 ఏళ్ల పోరాటాన్ని ఇకముందు కూడా కొనసాగించాల్సిందిగా ‘కాంగ్లీపాక్ యవోల్ కున్నా లూప్’, ‘కాంగ్లీపాక్ కమ్యూనిస్టు పార్టీ’ లాంటి తిరుగుబాటు సంస్థల నుంచి వచ్చిన ఒత్తిళ్లను, బెదిరింపులను పట్టించుకోకుండా షర్మిలా నిరాహార దీక్ష విరమణకే మొగ్గు చూపారు. అయినా ఆమె పోరాటాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించలేదు. వ్యూహం మార్చుకున్నట్లు మాత్రమే చెప్పారు. రాజకీయ రంగంలో ప్రవేశించి ఎన్నికల్లో పోటీ చేస్తానని, రాజకీయ రంగం నుంచే సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతానని మీడియా ముఖంగా ప్రకటించారు. షర్మిలాలో పోరాట శక్తి నశించిందని భావించరాదు. 16 ఏళ్ల పోరాటానికి స్పందించని కేంద్ర ప్రభుత్వాలు ఆమె మరింత కాలం నిరాహార దీక్షను కొనసాగిస్తే మాత్రం స్పందించే గ్యారెంటీ ఉందా? జస్టిస్ జీవన్ రెడ్డి కమిషన్, రెండవ అడ్మినిస్ట్రేషన్ కమిషన్, జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్లు అత్యంత వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని సమీక్షించి ఎత్తివేయడమే మంచిదని సూచించినా స్పందించని కేంద్ర ప్రభుత్వాలు పోరాటంలో షర్మిలా ప్రాణాలుపోతే స్పందిస్తాయా? ఈ విషయంలో నిర్ణయాన్ని ఆమెకే వదిలేయాలిగానీ, బలవంతంగా ఆమె ప్రాణాలను బలిపెట్టే ప్రయత్నాలను ప్రజాస్వామ్య వాదులుగా మనం చేయకూడదు. పెళ్లి పెటాకులు, తిండీ తిప్పలు లేకుండా 16 ఏళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేసిన షర్మిల స్ఫూర్తికి నీరాజనాలు పలకాలేతప్ప నిందలు వేయడం సరికాదు. జాతిపిత మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలాలాగా అహింసాత్మక మార్గంలో పోరాటం చేయాలనుకుంటే ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అహింసాత్మక పోరాట మార్గాలు 198 ఉన్నాయని, ఈ అంశంపై ప్రత్యేక అధ్యయనం జరిపిన ‘ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఇనిస్టిట్యూషన్’ వ్యవస్థాపకులు, మసాచుసెట్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ జీన్ షార్ప్ తెలిపారు. ఇప్పుడు షర్మిలా రాజకీయ ఆయుధాన్ని ఎంచుకున్నారు. ఆమెలాంటి స్ఫూర్తి కలిగిన వారు మణిపూర్ మహిళల్లో ఎంతో మంది ఉన్నారు. మణిపూర్ పోరాట చరిత్రలోకి వెళితే మహిళా పోరాట యూధులే ఎక్కువగా కనిపిస్తారు. వారిలాంటి వారు ముందుకొచ్చి షర్మిల పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. -
జస్టిస్ వర్మ మృతికి కారణాలేంటి?
ఎంసీఐకి కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి ఆదేశం న్యూఢిల్లీ: వైద్య నిర్లక్ష్యం వల్లే సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ జేఎస్ వర్మ మరణించారన్న ఆరోపణలపై తీసుకున్న చర్యలను బహిర్గతపరచాలంటూ కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు గురువారం భారత వైద్య మండలి(ఎంసీఐ)ని ఆదేశించారు. గుర్గావ్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే వర్మ 2013 ఏప్రిల్‌లో మృతిచెందారని, దీనిపై దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ వెంకటాచలయ్యతో పాటు మరో 34 మంది నాటిప్రధాని మన్మోహన్‌కు లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వ చర్యలు, ఆస్పత్రి వివరాలు తెలపాలని సుభాష్ అనే వ్యక్తి సమాచార కమిషన్(సీఐసీ)ను ఆశ్రయించగా సీఐసీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు ఎంసీఐకి ఆదేశాలు జారీ చేశారు. న్యాయవృత్తికి జీవితాంతం అంకితమైన న్యాయకోవిదుడు పదవీ విరమణ తర్వాత అద్దె ఇంట్లో నివసించారని, ఆయన మృతిపై అనుమానాలు రావడం ఆందోళనకరమని అన్నారు. రాజకీయాల్లో ఉన్నత పదవులు అనుభవించిన వారికి బంగళాలు, వైద్యసాయం వంటి ప్రభుత్వ సదుపాయాలు అందుతుంటే సీజేఐగా పనిచేసి రిటైరైన వ్యక్తికి ఆ సేవలేవీ అందలేదన్నారు.