
జస్టిస్ వర్మ మృతికి కారణాలేంటి?
వైద్య నిర్లక్ష్యం వల్లే సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ జేఎస్ వర్మ మరణించారన్న ఆరోపణలపై తీసుకున్న చర్యలను బహిర్గతపరచాలంటూ కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు గురువారం భారత వైద్య మండలి(ఎంసీఐ)ని ఆదేశించారు.
ఎంసీఐకి కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి ఆదేశం
న్యూఢిల్లీ: వైద్య నిర్లక్ష్యం వల్లే సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ జేఎస్ వర్మ మరణించారన్న ఆరోపణలపై తీసుకున్న చర్యలను బహిర్గతపరచాలంటూ కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు గురువారం భారత వైద్య మండలి(ఎంసీఐ)ని ఆదేశించారు. గుర్గావ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే వర్మ 2013 ఏప్రిల్‌లో మృతిచెందారని, దీనిపై దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ వెంకటాచలయ్యతో పాటు మరో 34 మంది నాటిప్రధాని మన్మోహన్‌కు లేఖ రాశారు.
దీనిపై ప్రభుత్వ చర్యలు, ఆస్పత్రి వివరాలు తెలపాలని సుభాష్ అనే వ్యక్తి సమాచార కమిషన్(సీఐసీ)ను ఆశ్రయించగా సీఐసీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు ఎంసీఐకి ఆదేశాలు జారీ చేశారు. న్యాయవృత్తికి జీవితాంతం అంకితమైన న్యాయకోవిదుడు పదవీ విరమణ తర్వాత అద్దె ఇంట్లో నివసించారని, ఆయన మృతిపై అనుమానాలు రావడం ఆందోళనకరమని అన్నారు. రాజకీయాల్లో ఉన్నత పదవులు అనుభవించిన వారికి బంగళాలు, వైద్యసాయం వంటి ప్రభుత్వ సదుపాయాలు అందుతుంటే సీజేఐగా పనిచేసి రిటైరైన వ్యక్తికి ఆ సేవలేవీ అందలేదన్నారు.