యూపీఏకు ఇక గడ్డు రోజులే.. | bad started to upa government | Sakshi
Sakshi News home page

యూపీఏకు ఇక గడ్డు రోజులే..

Published Wed, Dec 25 2013 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM

bad started to upa government

 కలెక్టరేట్, న్యూస్‌లైన్: యూపీఏ ప్రభుత్వం ఓ వైపు సంపన్నులకు రాయితీలు కల్పిస్తూ.. మరోవైపు అన్ని రకాల ధరలు పెంచుతూ పేద ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. యూపీఏ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలనుందని ఆయన జోస్యం చెప్పారు. సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేవల్ కిషన్ స్మారక రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం సంగారెడ్డిలో ‘వర్తమాన రాజకీయాలు, వామపక్షాల పాత్ర’ అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా బీవీ రాఘవులు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ విధానాల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చా రు.
 
 వర్ణ వ్యవస్థ, సామాజిక మార్పు కోసం నెల్సన్ మండేలా పోరాట పటిమ ప్రజా ఉద్యమాలకు ప్రేరణ కావాలన్నారు. ఆర్థిక సంక్షోభం దేశంలోని పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ప్రైవేటు కంపెనీలకు రుణాలిచ్చేందుకు మొగ్గు చూపుతున్న ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రయత్నిం చడం లేదని విమర్శించారు. రూ.9,320 కోట్ల విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. విభజన, సమైక్య ఉద్యమాల పేరుతో ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రాబోయే కాలంలో ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి చుక్కా రాములు మాట్లాడుతూ కేవల్ కిషన్ వర్ధంతిని గురువారం జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. సెమినార్‌లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.మల్లేశం, రాాజయ్య, జయరాజ్, జిల్లా కమిటీ సభ్యులు అడివయ్య, మాణిక్యం, ప్రవీణ్, నాగేశ్వర్, గణేశ్, రేవంత్, సాయిలు, నర్సింలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement