నల్లజాతి సురీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా జాతీ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహాయోధుడని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కీర్తించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి. ఈ సందర్బంగా మండేలా మృతికి సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆ సందర్బంగా సీఎం కిరణ్ మాట్లాడుతూ...మానవ జాతి చరిత్రలో మండేలా మహా శిఖరమని కిరణ్ అభివర్ణించారు.మండేలా మృతి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం పోరాడే ప్రతి ఒక్కరికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.
నెల్సన్ మండేలా జీవితంలో ఎన్నో ఆటుపోట్లును ఎదుర్కొన్నారని తెలిపారు. నెల్సన్ మండేలాకు వచ్చిన పురస్కారాలకు లెక్కలేదని చెప్పారు. అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ... మండేలా మృతితో ఓ యుగపురుషుడిని కోల్పోయామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో మండేలా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారని ఆయన గుర్తు చేశారు. వర్ణ వివక్షపై పోరాడే క్రమంలో మండేలా మరణానికి వెరవకుండా పోరాటం సాగించారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. బతుకంతా పోరాటానికి ఆంకితం చేసిన మహానుభావుడు అని మండేలా పోరాటాన్ని కేటీఆర్ కొనియాడారు.