త్రికాలమ్
నిర్దిష్టమైన సిద్ధాంతాలూ, విలువల ఆధారంగా రాజకీయాలు ఉంటాయన్న సంగతి రాజకీయ నేతలు మరచిపోయారు. సూత్రబద్ధమైన రాజకీయాలూ, జన హితమైన విధానాల కంటే ఎత్తులూ, వ్యూహాలూ నేటి రాజకీయాలను శాసిస్తు న్నాయి. గెలుపే ప్రధానంగా అభ్యర్థులను ఎంపిక చేయడం, సర్వేలు జరిపించి ఎవరికి విజయావకాశాలు ఉంటే వారికే టిక్కెట్లు ఇస్తామని ప్రకటించడం సర్వ సాధారణమైపోయింది. ఎన్నికలలో గెలుపుకోసం డబ్బు ఖర్చు చేయాలనీ, కుల సంఘాల నాయకులను పట్టుకోవాలనీ, ఏ కులం ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ కులానికి చెందిన అభ్యర్థికే టిక్కెట్టు ఇవ్వాలనీ, అలవికాని హామీలు గుప్పించైనా సరే, నిన్నటి వరకూ ప్రబల ప్రత్యర్థులుగా పరిగణించినవారిని కలుపుకొని పోవ లసి వచ్చినా సరే ఆ పని నిస్సంకోచంగా చేసేయాలనీ మినహాయింపు లేకుండా అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. పచ్చి అవకాశవాదం రాజ్యమేలుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకుల విన్యాసాలు చూస్తుంటే ప్రజా స్వామ్యంలో విశ్వాసం ఉన్నవారి మనసు వికలం అవుతుంది. పరమ నికృష్టమైన క్రీడలో పావులవుతున్నందుకు ప్రజల పట్ల సానుభూతి పెరుగుతుంది. నేతలను ప్రశ్నించకుండా, నిలదీయకుండా వెన్నెముకలేని అమాయక జనం వారినే పదే పదే గెలిపిస్తున్నందుకు ఆగ్రహం కలుగుతుంది.
కాంగ్రెస్–టీడీపీ చెలిమి
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న దశలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు తనదైన శైలిలో కొత్త ఎత్తుగడతో ముందుకు వచ్చారు. అదే ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలోనూ, లోక్‌సభ ఎన్నికలలోనూ అమలు చేయబోతున్నట్టు సమాచారం. 2014లో భాగస్వామ్య పక్షాలతో వైరం పెట్టు కోవాలనీ, అప్పటి వైరిపక్షాలతో స్నేహం చేయాలన్నది తాజా వ్యూహం. నాలుగు న్నర సంవత్సరాలలో సాధించిన ఘనకార్యం ఏదీ ప్రజలకు చూపించడానికి లేదు కనుక తాను ఏమీ చేయలేకపోవడానికి ఎన్‌డీఏ సర్కార్, ప్రధాని నరేంద్రమోదీ కారణమని చెప్పాలని కొన్ని మాసాల కిందటే నిర్ణయించుకు న్నారు. ఆ విధంగానే ముందుకు పోతున్నారు.
అయినదానికీ, కానిదానికీ మోదీతో లింకు పెట్టి ఆయనను ప్రతినాయకుడిగా చిత్రించడానికి చేయవల సిందంతా చేస్తున్నారు. ఒక పథకంగా ప్రకారం అడుగులు వేస్తున్నారు. అటు వంటి అడుగే ఒకటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా వేశారు. తెలంగాణ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నాననీ, బీజేపీ పడనీయలేదనీ, తనకూ, కేసీఆర్‌కీ మధ్య మోదీ దూరం పెంచారనీ చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. మోదీలో లౌకికతత్వం లోపించిందని టీడీపీ లెజిస్లేచర్‌పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు. గోధ్రా ఉదంతాన్నీ, గుజరాత్ అల్లర్లనూ ప్రస్తావించారు. ‘నారా హమారా’ అంటూ ముస్లింల సమావేశం ఏర్పాటు చేశారు (అది బెడిసికొట్టిందనేది వేరే విషయం). బీజేపీతో కూటమి కట్టడం వల్ల మైనారిటీలు దూరమైనారు. వారిని ఆకర్షించడానికి ఏదో ఒక నినాదం పట్టుకొని, ఒక సభ పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టుకోవచ్చునని ఆశ.
ఒక్క ముస్లిం మంత్రి కూడా లేకుండా ఇంతకాలం ప్రభుత్వం నడిపిన సంగతి ముస్లిం ప్రజలు గుర్తించకుండా గుడ్డిగా ‘నారా హమారా’ అంటారని అనుకోవడం భ్రమ. గుజరాత్‌లో అల్లర్లు జరిగిన తర్వాత కూడా చంద్రబాబు బీజేపీతో తెగతెంపులు చేసుకోలేదు. 2004లో బీజేపీతో కలిసే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేశారు. ఓడిపోగానే ‘జీవితంలో బీజేపీతో కలిసి పోటీ చేసే సమస్య లేదు’ అంటూ ప్రకటించారు. అల్లర్లు జరిగినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారో, ఎవరికి రాజ ధర్మం గురించి నాటి ప్రధాని వాజపేయి ప్రబోధం చేశారో ఆ మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీతోనే 2014లో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలో, రాష్టప్రభుత్వంలో భాగస్వాములుగా సహజీవనం చేశారు.
మోదీకి తిరుపతి ప్రసాదం తీసుకొని వెళ్ళి ఇచ్చేవారు. అణుకువగా ఉండేవారు. ఎన్నికలు దగ్గరపడేవరకూ ఒక బలిపశువు అవసరం ఏర్పడింది. బీజేపీని బలి చేయాలని నిర్ణయించుకున్నారు. రెండుసార్లు పొత్తు పెట్టుకొని విడిపోయిన చంద్రబాబు 2019 ఎన్నికల తర్వాత బీజేపీతో మూడోసారి సంబంధం కలుపుకోరన్న పట్టింపు ఏమీ లేదు. మోదీ సైతం రియల్‌పొలిటిక్ (ఏది ఆచ రణయోగ్యమో, ఏది అవసరమో అదే చేసే గడుసు రాజకీయం) తెలిసిన నేత కనుక ఎన్నికల తర్వాత అవసరం ప్రకారం వ్యవహరిస్తారు. 2002లో తనను చంద్రబాబు ఏ విధంగా విమర్శించారో మోదీకి తెలుసు. అయినా టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే కాదు ఉమ్మడి వేదికలపైన ప్రచారం చేశారు. ఒకరినొకరు పొగుడుకున్నారు.
ఇప్పుడు చేస్తున్న విమర్శలను సైతం రాజకీయ అవస రార్థమేనని మోదీ అర్థం చేసుకుంటారు. కాంగ్రెస్‌పార్టీనీ, సోనియాగాంధీని ఇటలీ మాఫియా అనీ, అవినీతి అనకొండ అనీ, ప్రజలు కత్తులూ, కొడవళ్ళతో వీధులలోకి వచ్చి కాంగ్రెస్‌ని నరికి భూస్థాపితం చేయాలనీ, మన్మోహన్ సింగ్ పనికిమాలిన ప్రధాని అనీ తిట్టిన తిట్టు తిట్టకుండా నాలుగున్నర సంవత్సరాలు తిట్టి ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి తహతహలాడటాన్ని అస్మదీయులు చక్రం తిప్పడంగా అభివర్ణించి ఆనందించవచ్చు. సాధారణ ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? రాజకీయ నాయకుల అవసరాలకు అను గుణంగా రంగులు మార్చితే ప్రజలు కూడా అదే విధంగా అభిప్రాయాలు మార్చుకుంటూ పోవాలా?
టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుందామని అనుకున్నారట. అదేమీ చంద్ర బాబుకి కొత్త కాదు. 2009 ఎన్నికలలో టీఆర్‌ఎస్‌తో కలిసే పోటీ చేశారు. మరోసారి అదే పని చేయాలని అనుకున్నా అది ఏకపక్ష నిర్ణయమే. టీఆర్‌ఎస్ టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటుంది? శాసనసభ్యుల ఫిరాయింపులతో దాదాపు గల్లంతైన పార్టీకి మళ్ళీ ఊపిరెందుకు పోస్తుంది? టీడీపీ టిక్కెట్టుపై గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు హైదరాబాద్‌లో చంద్రబాబు ఎంత తీవ్రంగా టీఆర్‌ఎస్‌నీ, కేసీఆర్‌నీ నిందించారో అవసరార్థం ఆయన మరచిపోవచ్చును కానీ కేసీఆర్ మరచిపోతారా? ‘ఓటుకు కోట్ల’ కేసులో ఏసీబీకి చిక్కినప్పుడు ‘చంద్రబాబూ, నిన్ను బ్రహ్మదేవుడుకూడా రక్షించలేడు’ అంటూ కేసీఆర్ హుంకరించిన విషయం ప్రజలకు గుర్తుండదా? నాయకులు మరచిపోయినట్టు నటించవచ్చును కానీ ప్రజలకు నటించవలసిన అవసరం ఏమున్నది? ప్రతి ఎన్నికలకూ భాగస్వామ్య పక్షాలను మార్చి కొత్త కూటములు కట్టడం తెలివైన రాజకీయపుటెత్తుగడ కావచ్చునేమో కానీ నైతికం మాత్రం కానేకాదు.
ఏ పార్టీతో పడితే ఆ పార్టీతో పొత్తులు పెట్టుకొని, విడిపోయి, మళ్ళీ కలిసి, మళ్ళీ విడిపోయి రకరకాల కపట విన్యాసాలు చేసే రాజకీయ నాయ కులను ప్రజలు ఎందుకు గౌరవించాలి? నలభై ఏళ్ళు అధికార రాజకీయాలలో అనుభవం ఉన్నా విలువలు లుప్తమైనప్పుడు ఆదరించవలసిన అవసరం ఏమున్నది? తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ స్నేహం అందుకే కృతకంగా కనిపిస్తోంది. ఇది అవకాశవాద రాజకీయానికి పరాకాష్ఠ. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించి ఆంధ్రులకు అన్యాయం చేసిందంటూ తిట్టిపోసిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు చంద్రబాబుకి ఎందుకు అవసరం? కాంగ్రెస్‌తో భాగస్వామ్యం ఉన్నట్లయితే దళితులలో, ఆదివాసీలలో, ముస్లింలలో కొంత శాతమైనా ఓట్లు దక్కు తాయేమోనన్న ఆశ. నరేంద్రమోదీకీ, పవన్‌కల్యాణ్‌కీ దూరం జరిగిన అనంతరం కేవలం టీడీపీ ఓట్లు మాత్రమే చంద్రబాబు చేతిలో ఉన్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ ఓట్లు కలిస్తేనే ఒకటిన్నర శాతం తేడాతో 2014లో అతికష్టంపైన గట్టెక్కగలిగారు. అప్పుడు లేని కొత్త అంశం ప్రభుత్వం పట్ల బలంగా ఉన్న వ్యతిరేకత.
అదనుకోసం ఎదురు చూస్తున్న జనం
ప్రభుత్వం చేతల వల్ల, చేతకానితనం వల్ల, చిత్తశుద్ధిలేమి వల్ల నష్టపోయిన ప్రజలు టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు అదను కోసం ఎదురు చూస్తున్నారు. నెపం అంతా మోదీపైకి తోసినంత మాత్రాన ప్రజలు చంద్రబాబును క్షమించరు. మోదీపట్ల వ్యతిరేకత పెరుగుతుంది. కానీ చంద్రబాబుపట్ల సానుకూలత పెరిగే అవకాశం లేదు. దొందూ దొందే అని ప్రజలు ఛీత్కరించే అవకాశాలే ఎక్కువ. మోదీ, చంద్రబాబు మాత్రమే ప్రజల ముందున్న ప్రత్యామ్నాయాలు కాదు. మోదీకి కానీ బీజేపీకి కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ప్రాబల్యం లేదు. టీడీపీకి ప్రత్యామ్నాయం వైఎస్‌ఆర్‌సీపీ రూపంలో సిద్ధంగా ఉంది. వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు రేపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయబోతున్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో జనసందోహం, ప్రజలలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న ఆశాభావం, ఆనందోత్సాహాలు ఇప్పుడు గాలి ఎటు వీస్తున్నదో స్పష్టం చేస్తున్నాయి. రాజకీయం అంటే కేవలం ఎత్తుగడలూ, వ్యూహాలూ, ధనబలం, కండబలం, కులబలం మాత్రమే కాదనీ ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను ఆలకిస్తూ, సమస్యలను పరిష్కరిస్తామనే నమ్మకం కలిగిస్తూ నిజా యితీగా నడిచే రాజకీయాన్ని జనం గౌరవిస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావంచకుండా ప్రజల దృష్టిని సమస్యలపై నుంచీ, వాస్తవాలపై నుంచీ మరల్చేందుకు టీవీ చానళ్ళలో ‘టాక్‌షోల’లో విని యోగిస్తూ, సోషల్ మీడియాను ప్రయోగిస్తూ సంచలనాత్మక, వినోదాత్మక, వ్యూహాత్మక, ఊహాజనిత సన్నివేశాలను ప్రదర్శిస్తూ వచ్చే ఎన్నికలలో గెలు పొందవచ్చునని భావించడం ప్రజలనూ, వారి వివేకాన్నీ అవమానపరచడమే. ప్రజల విషయమే కాదు సొంత పార్టీలోని నాయకుల, కార్యకర్తల వివేకం పట్ల కూడా టీడీపీ అధినేతకు గౌరవం లేదు.
2009లో సీమాంధ్ర నాయకులకు ఇష్టం లేకపోయినా ఆదరాబాదరాగా ఒక కమిటీ వేసి, దాన్ని రాష్ట్రం అంతటా తిప్పించి, తనకు కావలసిన నివేదికను ఇప్పించుకొని, పార్టీ పొలిట్‌బ్యూరో చేత ఒప్పించి రాష్ట్ర విభజనకు సుముఖమేనంటూ ప్రణబ్‌కుమార్‌ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చారు. తీరా 2009 డిసెంబర్ 9న నాటి హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ ఎంపీలూ, ఎంఎల్‌ఏలతో కలిసి టీడీపీ ఎంపీలూ, ఎంఎల్‌ఏలూ రాజీనామా చేయడాన్ని నిరోధించకపోవడం చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతానికి నిదర్శనం. ఇప్పుడు కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ టీడీపీలో అత్యధికులకు కాంగ్రెస్‌తో పొత్తు సుతరామూ ఇష్టం లేదు. నిజానికి జీవితకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులలో చాలామందికి ఇది మింగుడుపడటం లేదు. మింగలేకా కక్కలేకా సతమతం అవుతున్నారు.
బాబు జాగ్రత్త
మొన్న కర్నూలు సభ తర్వాత ఢిల్లీకి తిరిగి వెడుతూ శంషాబాద్ విమానా శ్రయంతో తనను కలిసిన కాంగ్రెస్ నాయకులతో రాహుల్ మాట్లాడుతూ, ‘బాబు మీద ఈగ వాలనివ్వకండి. ఒకవేళ టీఆర్‌ఎస్ నేతలు బాబుని విమర్శిస్తే మీరు ఎదురుదాడి చేయండి’ అంటూ ఉద్బోధించారని వార్త. కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ ఓట్లు టీడీపీకీ, టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కీ బదిలీ అవుతాయో లేదో తెలియదు కానీ టీఆర్‌ఎస్‌కి బలమైన ప్రచారాస్త్రాలు లభిం చాయి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇస్తామంటూ వాగ్దానం చేస్తున్న కాంగ్రెస్‌ని గెలిపిస్తే, కాంగ్రెస్–టీడీపీ సర్కార్ ఏర్పడితే, ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణలో పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కి తరలివెడతాయని టీఆర్‌ఎస్ బలంగా ప్రచారం చేస్తుంది. ఇప్పటికే హరీష్‌రావు, కేటీఆర్ ఈ దిశగా ప్రచారం ప్రారంభించారు.
కేసీఆర్ సభలు ఆరంభమైతే ఇది అనూహ్యంగా ఊపందుకుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెబుతూ కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వం 30 లేఖలు రాసిందంటూ టీఆర్‌ఎస్ ధ్వజం ఎత్తుతుంది. టీడీపీ వల్ల కాంగ్రెస్‌కూ, కాంగ్రెస్ వల్ల టీడీపీకీ నష్టం జరుగుతుందనీ, రెండు పార్టీల వల్ల తెలంగాణకు విపరీతంగా అపకారం జరుగుతుందనీ టీఆర్‌ఎస్ ప్రచారం చేస్తుంది. కమిటీలు వేస్తేనే భగ్గుమన్న కాంగ్రెస్ నాయకులు అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత ఎన్ని వీరంగాలు వేస్తారో, కుంటియానూ, గులాంనబీనీ ఎంతగా కడిగిపారేస్తారో ఊహించుకోవచ్చు. మొత్తంమీద తెలంగాణలో ఎన్నికల ప్రచారం అత్యంత వేడిగా, వాడిగా, రసవత్తరంగా, బూటకంగా, నాటకీయంగా జరగబోతున్నదని మాత్రం నిస్పందేహంగా చెప్పవచ్చు.
కె. రామచంద్ర మూర్తి
ఎడిటోరియల్ డైరెక్టర్
సాక్షి దినపత్రిక
అవధుల్లేని అవకాశవాదం
Published Sun, Sep 23 2018 3:15 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment