ramachandra moorthy
-
అవధుల్లేని అవకాశవాదం
త్రికాలమ్ నిర్దిష్టమైన సిద్ధాంతాలూ, విలువల ఆధారంగా రాజకీయాలు ఉంటాయన్న సంగతి రాజకీయ నేతలు మరచిపోయారు. సూత్రబద్ధమైన రాజకీయాలూ, జన హితమైన విధానాల కంటే ఎత్తులూ, వ్యూహాలూ నేటి రాజకీయాలను శాసిస్తు న్నాయి. గెలుపే ప్రధానంగా అభ్యర్థులను ఎంపిక చేయడం, సర్వేలు జరిపించి ఎవరికి విజయావకాశాలు ఉంటే వారికే టిక్కెట్లు ఇస్తామని ప్రకటించడం సర్వ సాధారణమైపోయింది. ఎన్నికలలో గెలుపుకోసం డబ్బు ఖర్చు చేయాలనీ, కుల సంఘాల నాయకులను పట్టుకోవాలనీ, ఏ కులం ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ కులానికి చెందిన అభ్యర్థికే టిక్కెట్టు ఇవ్వాలనీ, అలవికాని హామీలు గుప్పించైనా సరే, నిన్నటి వరకూ ప్రబల ప్రత్యర్థులుగా పరిగణించినవారిని కలుపుకొని పోవ లసి వచ్చినా సరే ఆ పని నిస్సంకోచంగా చేసేయాలనీ మినహాయింపు లేకుండా అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. పచ్చి అవకాశవాదం రాజ్యమేలుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకుల విన్యాసాలు చూస్తుంటే ప్రజా స్వామ్యంలో విశ్వాసం ఉన్నవారి మనసు వికలం అవుతుంది. పరమ నికృష్టమైన క్రీడలో పావులవుతున్నందుకు ప్రజల పట్ల సానుభూతి పెరుగుతుంది. నేతలను ప్రశ్నించకుండా, నిలదీయకుండా వెన్నెముకలేని అమాయక జనం వారినే పదే పదే గెలిపిస్తున్నందుకు ఆగ్రహం కలుగుతుంది. కాంగ్రెస్–టీడీపీ చెలిమి తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న దశలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు తనదైన శైలిలో కొత్త ఎత్తుగడతో ముందుకు వచ్చారు. అదే ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలోనూ, లోక్‌సభ ఎన్నికలలోనూ అమలు చేయబోతున్నట్టు సమాచారం. 2014లో భాగస్వామ్య పక్షాలతో వైరం పెట్టు కోవాలనీ, అప్పటి వైరిపక్షాలతో స్నేహం చేయాలన్నది తాజా వ్యూహం. నాలుగు న్నర సంవత్సరాలలో సాధించిన ఘనకార్యం ఏదీ ప్రజలకు చూపించడానికి లేదు కనుక తాను ఏమీ చేయలేకపోవడానికి ఎన్డీఏ సర్కార్, ప్రధాని నరేంద్రమోదీ కారణమని చెప్పాలని కొన్ని మాసాల కిందటే నిర్ణయించుకు న్నారు. ఆ విధంగానే ముందుకు పోతున్నారు. అయినదానికీ, కానిదానికీ మోదీతో లింకు పెట్టి ఆయనను ప్రతినాయకుడిగా చిత్రించడానికి చేయవల సిందంతా చేస్తున్నారు. ఒక పథకంగా ప్రకారం అడుగులు వేస్తున్నారు. అటు వంటి అడుగే ఒకటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా వేశారు. తెలంగాణ ఎన్నికలలో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నాననీ, బీజేపీ పడనీయలేదనీ, తనకూ, కేసీఆర్‌కీ మధ్య మోదీ దూరం పెంచారనీ చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. మోదీలో లౌకికతత్వం లోపించిందని టీడీపీ లెజిస్లేచర్‌పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు. గోధ్రా ఉదంతాన్నీ, గుజరాత్ అల్లర్లనూ ప్రస్తావించారు. ‘నారా హమారా’ అంటూ ముస్లింల సమావేశం ఏర్పాటు చేశారు (అది బెడిసికొట్టిందనేది వేరే విషయం). బీజేపీతో కూటమి కట్టడం వల్ల మైనారిటీలు దూరమైనారు. వారిని ఆకర్షించడానికి ఏదో ఒక నినాదం పట్టుకొని, ఒక సభ పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టుకోవచ్చునని ఆశ. ఒక్క ముస్లిం మంత్రి కూడా లేకుండా ఇంతకాలం ప్రభుత్వం నడిపిన సంగతి ముస్లిం ప్రజలు గుర్తించకుండా గుడ్డిగా ‘నారా హమారా’ అంటారని అనుకోవడం భ్రమ. గుజరాత్లో అల్లర్లు జరిగిన తర్వాత కూడా చంద్రబాబు బీజేపీతో తెగతెంపులు చేసుకోలేదు. 2004లో బీజేపీతో కలిసే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేశారు. ఓడిపోగానే ‘జీవితంలో బీజేపీతో కలిసి పోటీ చేసే సమస్య లేదు’ అంటూ ప్రకటించారు. అల్లర్లు జరిగినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారో, ఎవరికి రాజ ధర్మం గురించి నాటి ప్రధాని వాజపేయి ప్రబోధం చేశారో ఆ మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీతోనే 2014లో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలో, రాష్టప్రభుత్వంలో భాగస్వాములుగా సహజీవనం చేశారు. మోదీకి తిరుపతి ప్రసాదం తీసుకొని వెళ్ళి ఇచ్చేవారు. అణుకువగా ఉండేవారు. ఎన్నికలు దగ్గరపడేవరకూ ఒక బలిపశువు అవసరం ఏర్పడింది. బీజేపీని బలి చేయాలని నిర్ణయించుకున్నారు. రెండుసార్లు పొత్తు పెట్టుకొని విడిపోయిన చంద్రబాబు 2019 ఎన్నికల తర్వాత బీజేపీతో మూడోసారి సంబంధం కలుపుకోరన్న పట్టింపు ఏమీ లేదు. మోదీ సైతం రియల్‌పొలిటిక్ (ఏది ఆచ రణయోగ్యమో, ఏది అవసరమో అదే చేసే గడుసు రాజకీయం) తెలిసిన నేత కనుక ఎన్నికల తర్వాత అవసరం ప్రకారం వ్యవహరిస్తారు. 2002లో తనను చంద్రబాబు ఏ విధంగా విమర్శించారో మోదీకి తెలుసు. అయినా టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే కాదు ఉమ్మడి వేదికలపైన ప్రచారం చేశారు. ఒకరినొకరు పొగుడుకున్నారు. ఇప్పుడు చేస్తున్న విమర్శలను సైతం రాజకీయ అవస రార్థమేనని మోదీ అర్థం చేసుకుంటారు. కాంగ్రెస్పార్టీనీ, సోనియాగాంధీని ఇటలీ మాఫియా అనీ, అవినీతి అనకొండ అనీ, ప్రజలు కత్తులూ, కొడవళ్ళతో వీధులలోకి వచ్చి కాంగ్రెస్‌ని నరికి భూస్థాపితం చేయాలనీ, మన్మోహన్ సింగ్ పనికిమాలిన ప్రధాని అనీ తిట్టిన తిట్టు తిట్టకుండా నాలుగున్నర సంవత్సరాలు తిట్టి ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి తహతహలాడటాన్ని అస్మదీయులు చక్రం తిప్పడంగా అభివర్ణించి ఆనందించవచ్చు. సాధారణ ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? రాజకీయ నాయకుల అవసరాలకు అను గుణంగా రంగులు మార్చితే ప్రజలు కూడా అదే విధంగా అభిప్రాయాలు మార్చుకుంటూ పోవాలా? టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుందామని అనుకున్నారట. అదేమీ చంద్ర బాబుకి కొత్త కాదు. 2009 ఎన్నికలలో టీఆర్ఎస్తో కలిసే పోటీ చేశారు. మరోసారి అదే పని చేయాలని అనుకున్నా అది ఏకపక్ష నిర్ణయమే. టీఆర్ఎస్ టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటుంది? శాసనసభ్యుల ఫిరాయింపులతో దాదాపు గల్లంతైన పార్టీకి మళ్ళీ ఊపిరెందుకు పోస్తుంది? టీడీపీ టిక్కెట్టుపై గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ టీఆర్ఎస్లో చేరినప్పుడు హైదరాబాద్‌లో చంద్రబాబు ఎంత తీవ్రంగా టీఆర్ఎస్నీ, కేసీఆర్నీ నిందించారో అవసరార్థం ఆయన మరచిపోవచ్చును కానీ కేసీఆర్ మరచిపోతారా? ‘ఓటుకు కోట్ల’ కేసులో ఏసీబీకి చిక్కినప్పుడు ‘చంద్రబాబూ, నిన్ను బ్రహ్మదేవుడుకూడా రక్షించలేడు’ అంటూ కేసీఆర్ హుంకరించిన విషయం ప్రజలకు గుర్తుండదా? నాయకులు మరచిపోయినట్టు నటించవచ్చును కానీ ప్రజలకు నటించవలసిన అవసరం ఏమున్నది? ప్రతి ఎన్నికలకూ భాగస్వామ్య పక్షాలను మార్చి కొత్త కూటములు కట్టడం తెలివైన రాజకీయపుటెత్తుగడ కావచ్చునేమో కానీ నైతికం మాత్రం కానేకాదు. ఏ పార్టీతో పడితే ఆ పార్టీతో పొత్తులు పెట్టుకొని, విడిపోయి, మళ్ళీ కలిసి, మళ్ళీ విడిపోయి రకరకాల కపట విన్యాసాలు చేసే రాజకీయ నాయ కులను ప్రజలు ఎందుకు గౌరవించాలి? నలభై ఏళ్ళు అధికార రాజకీయాలలో అనుభవం ఉన్నా విలువలు లుప్తమైనప్పుడు ఆదరించవలసిన అవసరం ఏమున్నది? తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ స్నేహం అందుకే కృతకంగా కనిపిస్తోంది. ఇది అవకాశవాద రాజకీయానికి పరాకాష్ఠ. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించి ఆంధ్రులకు అన్యాయం చేసిందంటూ తిట్టిపోసిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు చంద్రబాబుకి ఎందుకు అవసరం? కాంగ్రెస్‌తో భాగస్వామ్యం ఉన్నట్లయితే దళితులలో, ఆదివాసీలలో, ముస్లింలలో కొంత శాతమైనా ఓట్లు దక్కు తాయేమోనన్న ఆశ. నరేంద్రమోదీకీ, పవన్‌కల్యాణ్‌కీ దూరం జరిగిన అనంతరం కేవలం టీడీపీ ఓట్లు మాత్రమే చంద్రబాబు చేతిలో ఉన్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ ఓట్లు కలిస్తేనే ఒకటిన్నర శాతం తేడాతో 2014లో అతికష్టంపైన గట్టెక్కగలిగారు. అప్పుడు లేని కొత్త అంశం ప్రభుత్వం పట్ల బలంగా ఉన్న వ్యతిరేకత. అదనుకోసం ఎదురు చూస్తున్న జనం ప్రభుత్వం చేతల వల్ల, చేతకానితనం వల్ల, చిత్తశుద్ధిలేమి వల్ల నష్టపోయిన ప్రజలు టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు అదను కోసం ఎదురు చూస్తున్నారు. నెపం అంతా మోదీపైకి తోసినంత మాత్రాన ప్రజలు చంద్రబాబును క్షమించరు. మోదీపట్ల వ్యతిరేకత పెరుగుతుంది. కానీ చంద్రబాబుపట్ల సానుకూలత పెరిగే అవకాశం లేదు. దొందూ దొందే అని ప్రజలు ఛీత్కరించే అవకాశాలే ఎక్కువ. మోదీ, చంద్రబాబు మాత్రమే ప్రజల ముందున్న ప్రత్యామ్నాయాలు కాదు. మోదీకి కానీ బీజేపీకి కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ప్రాబల్యం లేదు. టీడీపీకి ప్రత్యామ్నాయం వైఎస్ఆర్సీపీ రూపంలో సిద్ధంగా ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకుడు రేపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయబోతున్నారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో జనసందోహం, ప్రజలలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న ఆశాభావం, ఆనందోత్సాహాలు ఇప్పుడు గాలి ఎటు వీస్తున్నదో స్పష్టం చేస్తున్నాయి. రాజకీయం అంటే కేవలం ఎత్తుగడలూ, వ్యూహాలూ, ధనబలం, కండబలం, కులబలం మాత్రమే కాదనీ ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను ఆలకిస్తూ, సమస్యలను పరిష్కరిస్తామనే నమ్మకం కలిగిస్తూ నిజా యితీగా నడిచే రాజకీయాన్ని జనం గౌరవిస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావంచకుండా ప్రజల దృష్టిని సమస్యలపై నుంచీ, వాస్తవాలపై నుంచీ మరల్చేందుకు టీవీ చానళ్ళలో ‘టాక్‌షోల’లో విని యోగిస్తూ, సోషల్ మీడియాను ప్రయోగిస్తూ సంచలనాత్మక, వినోదాత్మక, వ్యూహాత్మక, ఊహాజనిత సన్నివేశాలను ప్రదర్శిస్తూ వచ్చే ఎన్నికలలో గెలు పొందవచ్చునని భావించడం ప్రజలనూ, వారి వివేకాన్నీ అవమానపరచడమే. ప్రజల విషయమే కాదు సొంత పార్టీలోని నాయకుల, కార్యకర్తల వివేకం పట్ల కూడా టీడీపీ అధినేతకు గౌరవం లేదు. 2009లో సీమాంధ్ర నాయకులకు ఇష్టం లేకపోయినా ఆదరాబాదరాగా ఒక కమిటీ వేసి, దాన్ని రాష్ట్రం అంతటా తిప్పించి, తనకు కావలసిన నివేదికను ఇప్పించుకొని, పార్టీ పొలిట్‌బ్యూరో చేత ఒప్పించి రాష్ట్ర విభజనకు సుముఖమేనంటూ ప్రణబ్కుమార్ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చారు. తీరా 2009 డిసెంబర్ 9న నాటి హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ ఎంపీలూ, ఎంఎల్ఏలతో కలిసి టీడీపీ ఎంపీలూ, ఎంఎల్ఏలూ రాజీనామా చేయడాన్ని నిరోధించకపోవడం చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతానికి నిదర్శనం. ఇప్పుడు కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ టీడీపీలో అత్యధికులకు కాంగ్రెస్‌తో పొత్తు సుతరామూ ఇష్టం లేదు. నిజానికి జీవితకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులలో చాలామందికి ఇది మింగుడుపడటం లేదు. మింగలేకా కక్కలేకా సతమతం అవుతున్నారు. బాబు జాగ్రత్త మొన్న కర్నూలు సభ తర్వాత ఢిల్లీకి తిరిగి వెడుతూ శంషాబాద్ విమానా శ్రయంతో తనను కలిసిన కాంగ్రెస్ నాయకులతో రాహుల్ మాట్లాడుతూ, ‘బాబు మీద ఈగ వాలనివ్వకండి. ఒకవేళ టీఆర్ఎస్ నేతలు బాబుని విమర్శిస్తే మీరు ఎదురుదాడి చేయండి’ అంటూ ఉద్బోధించారని వార్త. కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ ఓట్లు టీడీపీకీ, టీడీపీ ఓట్లు కాంగ్రెస్కీ బదిలీ అవుతాయో లేదో తెలియదు కానీ టీఆర్ఎస్కి బలమైన ప్రచారాస్త్రాలు లభిం చాయి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇస్తామంటూ వాగ్దానం చేస్తున్న కాంగ్రెస్‌ని గెలిపిస్తే, కాంగ్రెస్–టీడీపీ సర్కార్ ఏర్పడితే, ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణలో పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కి తరలివెడతాయని టీఆర్ఎస్ బలంగా ప్రచారం చేస్తుంది. ఇప్పటికే హరీష్‌రావు, కేటీఆర్ ఈ దిశగా ప్రచారం ప్రారంభించారు. కేసీఆర్ సభలు ఆరంభమైతే ఇది అనూహ్యంగా ఊపందుకుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెబుతూ కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వం 30 లేఖలు రాసిందంటూ టీఆర్ఎస్ ధ్వజం ఎత్తుతుంది. టీడీపీ వల్ల కాంగ్రెస్‌కూ, కాంగ్రెస్ వల్ల టీడీపీకీ నష్టం జరుగుతుందనీ, రెండు పార్టీల వల్ల తెలంగాణకు విపరీతంగా అపకారం జరుగుతుందనీ టీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. కమిటీలు వేస్తేనే భగ్గుమన్న కాంగ్రెస్ నాయకులు అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత ఎన్ని వీరంగాలు వేస్తారో, కుంటియానూ, గులాంనబీనీ ఎంతగా కడిగిపారేస్తారో ఊహించుకోవచ్చు. మొత్తంమీద తెలంగాణలో ఎన్నికల ప్రచారం అత్యంత వేడిగా, వాడిగా, రసవత్తరంగా, బూటకంగా, నాటకీయంగా జరగబోతున్నదని మాత్రం నిస్పందేహంగా చెప్పవచ్చు. కె. రామచంద్ర మూర్తి ఎడిటోరియల్ డైరెక్టర్ సాక్షి దినపత్రిక -
దళితులకు రాజ్యాధికారం రావాలి
సాక్షి, హైదరాబాద్: ప్రణయ్ హత్యోదంతం ఒక కులానికి మాత్రమే సంబంధించింది కాదని, సమాజ సమస్య అని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దళితులపై జరుగుతున్న ఇలాంటి దాడులు ఆగాలంటే అంబేడ్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కుల పరిరక్షణ జరగాలని, ఆయన ఆశించినట్టు దళితులకు రాజ్యాధికారం రావాలని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యోదంతంపై జనచైతన్య వేదిక అ«ధ్యక్షుడు లక్ష్మణ్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొన్ని నెలలుగా అమ్మాయి కుటుంబం కుట్ర పన్ని ప్రణయ్‌ను హత్య చేయించిందని పేర్కొన్నారు. అయితే దీని వెనకున్న రాజకీయ నేతలు, పెద్దలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే బాధిత కుటుంబానికే కాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటుందన్న నమ్మకం కలిగేదన్నారు. రాజకీయ హత్య అని ఎవరూ ఆరోపించకపోయినా పోలీసు శాఖ మాత్రం అది రాజకీయ హత్య కాదంటూ వెల్లడించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కేసు దర్యాప్తు పూర్తి కాకుండానే పోలీసులు రాజకీయ హత్య కాదని చెప్పడం సమంజసం కాదని చెప్పారు. అలాగే దళితులను అణగదొక్కాలన్న ధోరణి మారాలని, ప్రణయ్ çఘటనను కుల సంఘాలు, పౌరహక్కుల సంఘాలే ఖండించడం కాకుండా యావత్ సమాజం ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రి పదవులు దళితులకు కేటాయించినప్పుడే అంబేడ్కర్ ఆశయాలు అమలైనట్లు భావించాలని పేర్కొన్నారు. అఘాతం పెరుగుతోంది: చుక్కా రామయ్య పాత పద్ధతులను తల్లిదండ్రులు పిల్లలపై రుద్దడం వల్ల ఇలాంటి కుల దురహంకారాలు, పరువు హత్యలు పెరిగిపోతున్నాయని విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య పేర్కొన్నారు. సమాజంలో తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య తీవ్రమైన అగాథం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కుల, మతాలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రణయ్ హత్య నిందితుల అరెస్టుతో సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. పదవుల్లో ఉన్న వారు ఒక్కరు కూడా ప్రణయ్ కుటుంబాన్ని పరామర్శించకపోవడం, ఘటనను ఖండించకపోవడం పీడిత వర్గాలను మరింత అణగదొక్కే ధోరణిలా కనిపిస్తోందని విమర్శించారు. అరెస్ట్ చేయాల్సిందే: రమా మేల్కొటే ప్రణయ్ హత్యకు ముందు ఆ జంటను విడదీసేందుకు బెదిరింపులకు దిగిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలను కూడా అరెస్ట్ చేయాలని ప్రొఫెసర్ రమామేల్కొటే డిమాండ్ చేశారు. పరువు హత్యలు, కులహంకార హత్యలతో సమాజాన్ని విడదీసేలా చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాచౌక్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సంతోషాన్నిచ్చినా ప్రణయ్లాంటి ఘటనలతో ఆ సంతోషం నిమిషాల్లో ఆవిరైపోతున్నాయన్నారు. పదవుల్లో ఉన్నవాళ్లు పరామర్శించాల్సింది: ‘సాక్షి’ఈడీ రామచంద్రమూర్తి ప్రణయ్ సంఘటనను పదవుల్లో ఉన్నవారు ఖండించపోవడం, కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం విచారకరమని ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. సీఎం కానీ, దళిత ఉపముఖ్యమంత్రి కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించి ఉంటే దళితుల్లో ధైర్యం పెరిగేదన్నారు. ఇందిరాగాంధీ పదవిలో ఉన్నప్పుడు బిహార్‌లో జరిగిన ఇలాంటి ఓ హత్య సమయంలో వేగంగా స్పందించారన్నారు. ఘటనా స్థలికి వెళ్లేందుకు మార్గం లేకపోయినా ఏనుగుపై వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారన్నారు. నెహ్రూ, ఇందిర కుటుంబాలను దళితులు ఎప్పుడూ మరవలేరని చెప్పారు. ప్రణయ్ హత్యను సమాజం మొత్తం ఖండించాలని, ఇది దళిత హక్కులను కాలరాసేలా కనిపిస్తోందని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలోని మేధావులు, పెద్దలు ఈ ఘటనను ఖండించాలన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ సురేశ్‌చంద్ర హరి, సెంటర్ ఫర్దళిత్ స్టడీస్ ప్రతినిధులు, తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి: జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ఒకప్పుడు పరువు హత్యలంటే ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా జరిగేవని జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోనూ పరువు హత్యలు, కుల హత్యలు జరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కులాలుండవని, అక్కడ 90 శాతం ప్రేమ వివాహాలే జరుగుతున్నట్లు చెప్పారు. సమాజ సమస్యగా మారుతున్న ప్రణయ్ హత్యలాంటి ఘటనలను నియంత్రించాలన్నా, నిరోధించాలన్నా కులాంతర వివాహాలను ప్రభుత్వాలే పోత్సహించాలని డిమాండ్ చేశారు. -
సభలు సరే, సందేశం ఏమిటి?
త్రికాలమ్ ప్రభుత్వం సంకల్పిస్తే అసాధ్యం ఏముంటుంది? ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అభీష్టం మేరకు ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా ప్రారంభమైనాయి. అద్భుతమైన ప్రసంగాలతో, ఆకట్టుకునే లేజర్‌షోతో వీనుల విందుగా, కన్నుల పండువగా శుక్రవారం సాయంత్రం తెలుగు భాషాభిమానులు మురిసిపోయారు. హైదరాబాద్ నగరంలో తెలుగు జయకేతనం ఎగురవేశారు. తెలుగు భాష స్వతంత్ర భారత స్వరూప స్వభావాలను నిర్దేశించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు తెలుగువారికి సొంత రాష్ట్రం లేదు. మద్రాసు రాష్ట్రం లోనే తమిళులూ, కన్నడిగులూ, మలయాళీలతో సహజీవనం చేసేవారు. మరి కొందరు నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో కన్నడిగులూ, మరాఠీలూ, తమిళులతో, ఉత్తరాది నుంచి వచ్చి స్థిరపడిన వివిధ భాషలవారితో కలసి నివసించేవారు. మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్రులు తమిళుల ఆధిపత్యాన్ని ధిక్కరించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేశారు. భాషే ఈ ఉద్యమంలో ఆయుధం. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం తర్వాత మద్రాసు లేని తెలుగు ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంగా అవతరించింది. హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకు సారథ్యం వహించింది ఆంధ్రమహాసభ. ఈ పోరాటంలో సైతం భాషే ఆయుధం. ఉర్దూ ఆధిక్యాన్ని ధిక్కరించి ఉద్యమించిన తెలుగువారు నిజాం పాలన నుంచి విమోచన సాధించారు. ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలలోని తెలుగు ప్రాంతాలు 1956లో ఏకమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించడానికి బలమైన కారణం భాషే. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రం. అటు తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, తదితరాలు ఆ ప్రాతిపదికన ఏర్పడినాయి. 58 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. హైదరాబాద్ సహజంగానే తెలంగాణకు దక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని నిర్మించుకోవలసిన అవసరం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రధానాం శాలు నిధులూ, నియామకాలూ, నీళ్ళూ అయినప్పటికీ భాష, సాంస్కృతిక చైతన్యం పాత్ర కూడా అంతే ప్రధానమైనది. అంటే తెలుగువారి రాజకీయంలో భాష అంతర్భాగం. భాషలో రాజకీయం అనివార్యం. 1975లో జలగం వెంగళరావు తొలి ప్రపంచ మహాసభలు నిర్వహించడం వెనుక రాజకీయ లక్ష్యం ఉంది. 1969–70, 1971–72లో తెలంగాణ, ఆంధ్ర ఉద్యమాల ఫలితంగా వందలమంది బలి కావడం, ఇద్దరు ముఖ్యమంత్రులు పదవీచ్యుతులు కావడంతో పాటు అనైక్యత ప్రబలి తెలుగు ప్రజల హృదయాలు అశాంతితో రగిలాయి. ఆ దశలో ఇరు ప్రాంతాల మధ్య ఐక్యత సాధించేందుకు భాషను సాధనంగా వినియోగించుకునే ప్రయత్నం చేశారు. అంజయ్య హయాంలో ప్రవాసాంధ్రుల ప్రోత్సాహంతో 1981లో మలేసియాలో జరిగిన సభలకూ, 1990లో ఫిలిప్పీన్స్ సభలకూ రాజకీయ ప్రాముఖ్యం లేదు. కిరణ్‌కుమార్ రెడ్డి తిరుపతిలో నిర్వహించిన మహాసభల లక్ష్యం తెలుగువారి సమైక్య సాధనే. అవి కూడా నిష్ఫలమైనాయి. తెలుగు భాషపై కేసీఆర్ అధికారం తెలుగు ముఖ్యమంత్రులలో తెలుగుభాషపైన అధికారం, మమకారం కలిగినవారి జాబితాలో దామోదరం సంజీవయ్య, పీవీ నరసింహారావు, నందమూరి తారక రామారావు, కేసీఆర్ పేర్లు ముందుంటాయి. ఈ సభల వెనుక సైతం రాజకీయం ఉంది. కదన కుతూహలం, కవన కుతూహలం దండిగా కలిగిన ముఖ్యమంత్రి ఉద్యమ సేనానిగా పరాక్రమించి ప్రత్యేక రాష్ట్ర సారథిగా పరిశ్రమిస్తున్న నేపథ్యంలో అచ్చ తెలుగు భాషకు మూలాలు తెలంగాణంలోనే ఉన్నాయని నిరూపించవలసిన చారిత్రక అవసరం ఉన్నదని భావించి ఉంటారు. రెండున్నర జిల్లాల ప్రజలు మాట్లాడే భాషనే ప్రామాణికం చేసి ఇతర ప్రాంతాలవారి మాండలికాలనూ, యాసలనూ ఎద్దేవా చేసిన ఫలితంగానే తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం దెబ్బతిన్నదనే మాట నిజం. ఉద్యమ సమయంలో సీమాంధ్ర రాజకీయ నాయకులనూ, ప్రజలనూ ఘాటు విమర్శలతో తూర్పారబట్టిన కేసీఆర్ రాష్ట్ర విభజన జరిగి తాను అధికారంలో కుదురుకున్న అనంతరం సీమాంధ్ర ప్రజల హృదయాలలో విభజన చేసిన గాయం మాన్పడానికి లేపనం అద్దడానికి ప్రయత్నిస్తున్నట్టే తెలుగు మహాసభలను సైతం యావన్మంది తెలుగు ప్రజల సంఘీభావ సాధన కోసం ఉద్దేశించారా? కేవలం హైదరాబాద్‌లో, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలలో స్థిరపడిన సీమాంధ్రుల ఓట్ల కోసమే కేసీఆర్ రూ. 50 కోట్లకు పైగా ఖర్చుతో ఇంత హంగామా చేశారా? విడిపోయినా కలసి ఉందాం అనే సద్భావనను ప్రోత్సహించాలనుకుంటే సీమాంధ్ర తెలుగు వెలుగుల ప్రస్తావన విధిగా ఉండేది. పాల్కురికి సోమనాథుడూ, పోతనతో పాటు కవిత్రయం, శ్రీనాథుడు వెంకయ్యనాయుడి లిఖిత ప్రసంగంలోనైనా ఉండవలసింది. గిడుగు, గురజాడల జాడ లేదు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ పేరు విస్మరించారు. ముఖ్యమంత్రి మదిలో ఆలోచన మెదిలిన తర్వాత నాలుగు మాసాలలో ఇంతటి బృహత్కార్యక్రమం నిర్వహించాలంటే చాలా కష్టం. వ్యవధి చాలక కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. అదే కారణమైతే రాద్ధాంతం చేయనక్కరలేదు. అట్లా కాకుండా, బుద్ధిపూర్వకంగా తెలంగాణ వేడుకగానే నిర్వహించి ఉంటే భాషను తాజాగా రాజకీయ ప్రయోజనం కోసం వినియోగించుకున్నట్టు భావిం చాలి. గత పాలకులు చేసిన తప్పిదాన్నే కేసీఆర్ సైతం చేశారని చరిత్రలో నమోదు అవుతుంది. ఐదు రోజుల కార్యక్రమాలకీ నిర్దిష్టమైన చర్చనీయాంశాలు సూచిం చారా లేక ఎవరి పాట వారు పాడుకొని వెళ్ళిపోవడమేనా? కార్యక్రమాల జాబితా చూసినప్పుడు పూసలలో దారం లాగా అంతస్సూత్రం ఏదీ కనిపించదు. ఈ సమావేశాల కొనసాగింపు ఏమిటనే స్పష్టత లేదు. దేశ, విదేశాల నుంచి వచ్చిన హేమాహేమీలు ఒక చోట చేరి చర్చించుకున్న తర్వాత తెలుగు భాషాసాహిత్య వికాసానికి భవిష్యత్ చిత్రపటం రూపకల్పన జరగాలి. సాహిత్య అధ్యయనాన్ని ప్రోత్సహిం చేందుకూ, భాషాజ్ఞానం పెంపొందించేందుకూ, భాష వాడుకను విస్తరించేందుకూ ఎటువంటి వ్యవస్థలు, ఎటువంటి కార్యక్రమాలు అవసరమో నిర్ణయించాలి. తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిన అనంతరం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మహాసభలు ఇవి. ప్రణాళికాబద్ధంగా చర్చలూ, సమాలోచనలూ జరిగితే తెలుగు జాతికి ప్రయోజనం ఉంటుంది. అధికార భాషగా తెలుగును ప్రకటించిన తర్వాత ఏమి జరిగిందో లేదా ఏమేమి జరగలేదో, బోధనాభాషగా తెలుగు ఉండాలంటూ భాషాభిమానులు చేస్తున్న వాదనకు సమాధానం ఏమి చెప్పాలో కూలంకషంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటే ఈ సభలు సార్థకం అవుతాయి. లేకపోతే తానా, ఆటా, నాటా సభలలాగే ఇవి కూడా తెలంగాణ తెలుగు సంబురాలుగానే మిగిలిపోతాయి. బోధనాభాషగా సాధ్యమా? తెలంగాణలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ తెలుగును ఒక సబ్జెక్టుగా నిర్బంధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు కేసీఆర్‌ను మనస్ఫూర్తిగా అభినందించాలి. భాషకు సంబంధించి లోగడ ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. చిత్తశుద్ధి లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. తాజా ఉత్తర్వులను నిష్కర్షగా అమలు చేస్తే ప్రభుత్వం పట్ల గౌరవం పెరుగుతుంది. తెలుగు సబ్జెక్టును నిర్బంధం చేయాలని నిర్ణయించారంటే తెలుగును బోధనా భాషగా చేయడం సాధ్యం కాదని భావించి ఉంటారు. ఈ విషయంలో రెండు అభిప్రాయాలు ఉన్నాయి. తక్కువ ఆదాయవర్గాల వారు సైతం సర్వస్వం ఒడ్డి తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో బోధించే విద్యాసంస్థలలో చేర్చుతున్నారు. ఉద్యోగావకాశాలు వినియోగించుకోవాలంటే ఇంగ్లీషు ప్రావీణ్యం తప్పనిసరి. ఈ క్షేత్ర వాస్తవికతని గర్తించాలి. అయితే మాతృభాషకీ, ఆంగ్లానికీ మధ్య వైరుధ్యం లేదు. ఎనిమిదో తరగతి వరకూ బోధన మాతృభాషలో ఉంటే పిల్లలకు చదువు బాగా ఒంటపడుతుందనీ, ఆ సమయంలో మెదడు పెరుగుతుంది కనుక ఒకటి కంటే ఎక్కువ భాషలను బాలలు సులభంగా నేర్చుకోగలుగుతారనీ పాశ్చాత్య దేశాలలో జరిగిన పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కనీసం ప్రాథమిక పాఠశాల స్థాయి వరకైనా బోధన మాతృభాషలో చేసి, ఇంగ్లీషును ఒక భాషగా తప్పనిసరి చేయగలిగితే విద్యార్థులకు రెండు భాషలలోనూ గట్టి పునాది పడుతుంది. ఆరో తరగతి నుంచి ఇంగ్లీషును బోధనాభాషగా చేసి తెలుగు సబ్జెక్టును నిర్బంధం చేయడం వల్ల ఉద్యోగార్హత ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి పై చదువులు చదువుకోవచ్చు. ఉద్యోగాలు చేసుకోవచ్చు. మాతృభాష బాగా వచ్చినవారికి మరో భాష నేర్చుకోవడం సులువు. పునరుక్తి భయం ఉన్నప్పటికీ ఒక్క అనుభవం మనవి చేస్తాను. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం కోర్సు చదువుతున్న రోజుల్లో (1972–73) ‘దక్కన్ క్రానికల్’ న్యూస్ ఎడిటర్ మూర్తి పాఠాలు చెప్పేవారు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చినప్పుడు నన్ను విజయవాడ వెళ్ళి ఆయనను ఇంటర్వ్యూ చేసి రమ్మనమని పురమాయించారు. సత్యనారాయణ తెలుగులో మహాకవి. నేను ఇంగ్లీషులో ఇంటర్వ్యూ రాయాలి. ‘మాస్టారూ, నేను తెలుగులో ప్రశ్నలు అడుగుతాను. మీరు తెలుగులోనే సమాధానాలు చెప్పండి పర్వాలేదు. నేను తర్వాత ఇంగ్లీషులోకి అనువాదం చేసుకుంటాను’ అని వినయం ఉట్టిపడుతుండగా అన్నాను. ‘అంత శ్రమ ఎందుకు. ఇంగ్లీషులోనే అడగవోయ్’ అన్నారు చిర్నవ్వుతో. నేను అడిగిన ప్రశ్నలన్నింటికీ తడుముకోకుండా టకటకా జవాబులు చెప్పాడు మహానుభావుడు. చెప్పింది చెప్పినట్టు పొల్లుపోకుండా రాసి మూర్తిగారికి సమర్పించాను. ఆయన అక్షరం మార్చకుండా ఎడిట్ పేజీలో పై నుంచి కింది దాకా ఆ వ్యాసం ప్రచురిం చారు. ఎంతో మంది మెచ్చుకున్నారు. ఒక భాషలో పట్టు ఉన్నవారికి మరో భాష నేర్చుకోవడం సులువని చెప్పడానికి ఇది నిదర్శనం. భాష సంపద్వంతం కావాలంటే... తెలుగులో మహా నిఘంటువు లేకపోవడం పెద్ద లోపమని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఏ భాష అయినా సంపద్వంతం కావాలంటే మడికట్టుకొని కూర్చోకూడదు. తన అస్తిత్వానికి ముప్పు లేకుండా అన్య భాషాపదాలను స్వీకరించాలి. అన్ని భాషల నుంచీ పదాలు సొంతం చేసుకుంటుంది కనుకనే ఇంగ్లీషు అంతర్జాతీయ భాషగా అనునిత్యం ఎదుగుతూ ఎదురు లేని ప్రస్థానం సాగి స్తోంది. ప్రామాణిక భాష మాండలికాలపైన ఆధిక్యం చెలాయించకూడదు. వాటిని తనలో కలుపుకోవాలి. కొత్త కొత్త పరికరాలూ, ఆవిష్కరణలూ శాస్త్రసాంకేతిక రంగాలలో కొత్త పదజాలాన్ని తీసుకొస్తుంటాయి. ఆ సమాచారం సర్వసాధారణంగా ఇంగ్లీషులో పీటీఐ లేదా యూఎన్ఐ న్యూస్ ఏజెన్సీ ద్వారా వస్తుంది. దానిని తెలుగులో తర్జుమా చేసే బాధ్యత పత్రికా కార్యాలయంలో పనిచేస్తున్న ఉప సంపాదకులపైన పడుతుంది. ఎవరికి తోచినట్టు వారు తర్జుమా చేస్తారు. అన్నిటినీ పరిశీలించి ఒక్క మాటను ఖరారు చేయడానికి శాశ్వత ప్రాతిపదికన ఒక వ్యవస్థను నెలకొల్పాలి. పొత్తూరి వెంకటేశ్వరరావు ఇటువంటి ప్రయత్నం చేశారు కానీ అది కొనసాగలేదు. ఒకసారి పబ్లిక్ గార్డెన్‌లోని జూబిలీ హాలులో పత్రికాభాషపైన జరిగిన సభలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పాల్గొన్నారు. ‘టెలివిజన్‌కు తెలుగులో ఏమి రాయాలో మనకు తెలియదు. ఒక పని చేయండి. ఒక పల్లెటూరులో అందరూ గుమిగూడే చోట టీవీ పెట్టండి. దాన్ని ప్రజలు ఏ పేరు పెట్టి పిలుస్తారో దాన్ని ఖాయం చేయండి. వారు బొమ్మలపెట్టె అంటే అదే రాయండి’ అని సలహా చెప్పారు. ప్రజల దగ్గరికి భాషను తీసుకొని వెళ్ళడం అంటే అదే. ఈ పని ఎంత ఎక్కువగా జరిగితే భాష అంత సజీవంగా ఉంటుంది. దేశంలో హిందీ తర్వాత తెలుగే ఎక్కువ మంది మాట్లాడే భాష. ప్రాచీన భాష హోదా వచ్చి ఏళ్ళు గడిచిపోతున్నా దానికి ఒక భవనం ఏర్పాటు చేసి భాష, సాహిత్యం అధ్యయనానికీ, పరిశోధనకూ అవసరమైన హంగులు ఏర్పాటు చేయలేదు. సాంకేతిక పరిభాషగా తెలుగు ఇంకా ఎంతో అభివృద్ధి చెందవలసి ఉంది. గూగుల్ సాఫ్ట్వేర్ లైబ్రరీలో తెలుగు వాటా పెంచుకోవాలి. ఈ విషయంలో తమిళనాడు, కర్ణాటకలను చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది. అక్కడ ప్రభుత్వ ఉత్తర్వులూ, దిగువ కోర్టులలో తీర్పులూ మాతృభాషలోనే వెలువడుతున్నాయి. ఈ విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. గతంలో జరిగిన లోపాలను సరిదిద్ది తెలుగుభాషకు కొత్త వెలుగూ, కొత్త చూపూ, కొత్త ఊపూ తేగలిగితే కేసీఆర్ జన్మ చరితార్థం అవుతుంది. కె. రామచంద్రమూర్తి -
విజయాల హోరు–విలువల బేజారు
త్రికాలమ్ దేశంలోని వివిధ రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధీనంలోకి వస్తున్నాయి. ప్రతిపక్ష రాజకీయ నాయకులు బీజేపీకి వరుసకట్టి విధేయత ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులలో సమర్థులుగా, జనాదరణ ఉన్నవారుగా గుర్తింపు పొందినవారు ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడి అధికార బీజేపీలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్రమోదీకి దీటైన ప్రత్యర్థిగా, ప్రతిపక్షాల అభ్యర్థిగా రంగంలో నిలిచి 2019 ఎన్నికలలో పోరాటం చేస్తారని అనుకున్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఆర్జేడీ నేత లాలూప్రసాద్‌తో తెగ తెంపులు చేసుకొని మహాఘటబంధన్ నుంచి నిష్క్రమించి ఎన్డీఏ శిబిరంలోకి అత్యంత లాఘవంగా గెంతేశారు. కాంగ్రెస్ ముక్త్ భారత్‌ను నిర్మిస్తానంటూ నరేంద్రమోదీ 2014 ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రతిజ్ఞను అక్షరాలా పాటిస్తున్నారంటూ జాతీయ మీడియా ప్రశంసిస్తోంది. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ తన పార్టీ నుంచి బీజేపీకి వలసలు ఆపలేక సమస్యల సుడిగుండంలో చిక్కుకొని దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టా డుతున్నట్టు మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా చాకచక్యాన్నీ, చాణక్యాన్నీ, చమత్కారాన్నీ మనస్ఫూర్తిగా అభి నందిస్తున్నాయి. అధికార రంధిలో రాజకీయ నాయకులు అనైతిక విన్యా సాలు చేయడాన్ని సామాన్య మానవులు ఎట్లా పరిగణిస్తున్నారు? ఏ తీరానికి ఈ ప్రస్థానం? మూడేళ్ళ కిందట ఎన్నికలలో అనూహ్యమైన ఆధిక్యంతో, అట్ట హాసంగా గెలిచిన బీజేపీ నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ(టీడీపీ), తెలం గాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చాయి. పరిపాలనలో హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఎవరి శైలిలో వారు పరిపాలిస్తు న్నారు. కానీ ప్రభుత్వాల పనితీరు రాజ్యాంగసమ్మతంగా ఉన్నదా? ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకోవడానికి దోహదం చేస్తుందా? రాజకీయాల పట్ల ప్రజలలో విశ్వాసం పెంపొందిస్తుందా? నిరర్థక రాజకీయం అన్ని రకాలా భ్రష్టుపట్టిన యూపీఏ–2 ప్రభుత్వం పోయి నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్డీఏ–2 ప్రభుత్వం రావడం దేశ ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇచ్చిన సన్నివేశం. మూడేళ్ల పాలనలో మోదీ సమర్థమైన ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు. అవినీతి ఆరోపణలు లేని ప్రభుత్వంగా ఎన్డీఏ–2 సర్కార్‌ను ప్రజలు పరిగణిస్తున్నారు. వివిధ దేశాలలో పర్యటించి దౌత్యరంగంలో భారత్‌ను కొత్తపుంతలు తొక్కించిన ఘనత మోదీదే. కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా, వాజపేయి వ్యవహారశైలికి సైతం దూరంగా తనదంటూ ప్రత్యేక బాణిని రూపొందించుకొని సమర్థ ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు. ఢిల్లీ, బిహార్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో అపజయాలను మినహాయిస్తే ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలోనూ విజయశంఖం పూరించిన మోదీ–షా ద్వయం అజేయమైన జట్టుగా నిలిచి జాతిని అబ్బురపరుస్తున్నారు. వీరిని ఎదిరించి గెలవగల ధీరులు ప్రతి పక్షాలలో ఎవ్వరూ లేరనే అభిప్రాయం ప్రజలలో బలపడుతోంది. గెలుపే ప్రధానంగా, మార్గం కంటే లక్ష్యం ప్రధానమనే ధోరణిలో అధికార పక్షాలు వ్యవహరిస్తున్నాయి. ఇది ముమ్మాటికీ నిరర్థకమైన,ఆత్మహత్యాసదృశమైన రాజకీయం. దేశంలో ఈ రోజున అత్యంత అధికంగా ప్రజాదరణ కలిగిన నాయకుడు మోదీ అనడంలో ఎవ్వరికీ సందేహం లేదు. ప్రతిపక్ష నాయకులు కూడా అంగీకరించవలసిన వాస్తవం ఇది. కానీ మోదీ వచ్చినప్పటి నుంచీ వివిధ రాష్ట్రాలలో అధికార పార్టీలు, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో అవసరం ఉన్నా లేకపోయినా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో తొక్కిన తీరు ముమ్మాటికి ఆక్షేపణీయం, ప్రమాదకరం. ఇది కొత్తగా వచ్చిన జాడ్యం కాదు. ఇందిరాగాంధీ కాలంలో వివిధ రాష్ట్రాలలోని ప్రతిపక్షాలను అస్థిరపరచిన సందర్భాలు అనేకం. కాంగ్రెస్ చేసింది కనుక బీజేపీ కూడా అదే తప్పు చేయడాన్ని సమర్థిస్తామంటే కాంగ్రెస్ కంటే బీజేపీ ఏ విధంగా భిన్నమైనది? కాంగ్రెస్ కంటే టీడీపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎట్లా నైతికంగా ఉన్న తమైనవి? కాంగ్రెస్ చేసిన రాజ్యాంగ వ్యతిరేక చర్యలను పరిహరిస్తే, రాజ్యాం గబద్ధంగా మాత్రమే వ్యవహరిస్తే కాంగ్రెస్ కంటే బీజేపీ ఉన్నతమైన పార్టీగా స్థాపితం అవుతుంది. ఇతర పార్టీ నేతలను బీజేపీ శిబిరం లోకి ఆహ్వానించడం ఫిరాయింపులను ప్రోత్సహించడం కాక ఏమవుతుంది? వాజపేయి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి పకడ్బందీగా రూపొందించిన ఫిరాయింపుల నిరోధక చట్టంలోనూ కంతలు వెతికి భ్రష్టరాజకీయాలకు తెరలేపడం రాజకీయ విలువలకూ, నైతిక విలువలకూ పాతర వేయడం కాదా? రాజ్యాంగస్ఫూర్తికి తూట్లు ఆశ్చర్యం ఏమంటే రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నామనే సంకోచం కానీ బెరుకు కానీ నేతలలో కనిపించడం లేదు. విక్టరీ సంకేతం చూపిస్తూ బోర విరిచి సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతిపక్షంలో పలుకున్న నేతల ఫిరా యింపులను ప్రోత్సహించి, వారికి బీజేపీ టిక్కెట్టు ఇచ్చి ఎన్నికలలో నిలపడం అనైతికమనే భావన అధికారపక్షంలో బొత్తిగా లేదు. ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా రాజ్యాంగ పదవులలో ఉన్నవారు ఎవ్వరూ ఉలకడం లేదు. పల కడం లేదు. కాంగ్రెస్‌లో అతిముఖ్యమైన నేతలలో మూడవ స్థానంలో ఉన్న అహ్మద్‌పటేల్‌కు రాజ్యసభ స్థానం దక్కకుండా చేసేందుకు అమిత్‌షా అత్యంత లాఘవంగా పావులు కదపడంలో భాగంగా గుజరాత్లో ఆరుగురు కాంగ్రెస్ శాసనసభ్యులు బీజేపీ వైపు ఫిరాయించారు. ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో అన్ని పదవులూ అనుభవించిన శంకర్‌సిన్హ్ వఘేలా నాయకత్వంలో మరో పది మంది ఫిరాయింపునకు సిద్ధంగా ఉన్నారంటూ వఘేలా తనయుడు వెల్లడించారు. విజయానికి అవసరమైన 44 ఓట్లు అహ్మద్‌పటేల్‌కు రాబోవని అతను ఘంటాపథంగా చెబుతున్నాడు. మిగిలినవారినైనా రక్షించుకునేందుకు నలభై మంది ఎంఎల్ఏలను కర్ణాటకకు తరలించారు. కోట్ల రూపాయలు ఎర చూపుతున్నారనీ, పోలీసులను ప్రయోగించి ఒత్తిడి చేస్తున్నారనీ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎంఎల్ఏ లను రక్షించుకునే తెలివితేటలూ, సామర్థ్యం సోనియాగాంధీకి లేవా అంటూ మీడియా ప్రతినిధులు ఎద్దేవా చేస్తున్నారు కానీ ఇటువంటి నీతిమాలిన పనులను ప్రశ్నించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష శాసనసభ్యులను కబళించి వారిలో కొందరిని మంత్రులుగా నియమించినా రాజ్యాంగ పరిపోషకులు అభ్యంతరం చెప్పలేదు. తెలంగాణలో డిటో. ఇటీవల తమిళనాడులో శశికళ వర్గం శాసనసభ్యులను రక్షించుకునేందుకు క్యాంపు రాజకీయాలు నిర్వహించింది. ఇప్పుడు కాంగ్రెస్‌కూ అదే గతి పట్టింది. అయినా ఫలితం దక్కేది అనుమానమే. నవజోత్సిద్ధూ ఒక్కరే బీజేపీని కాదని కాంగ్రెస్ శిబిరంలోకి నడిచారు. తక్కిన ఫిరాయింపు నాయకులందరూ ప్రతిపక్షాల నుంచి అధికార పక్షం వైపు జంప్ చేసిన జిలానీలే. ఇందుకు బీజేపీ నాయకుల ప్రోత్సాహం ఉంది. రాజ్యాంగం పట్ల బేపర్వా ఉంది. నీతినియమాల పట్ల పట్టింపు లేదు. గుజరాత్లో నడుస్తున్న అడ్డగోలు రాజకీయంలో భాగంగానే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన రాజ్‌పూత్‌ను పార్టీ మారిన వెంటనే రాజ్యసభ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. అస్సాంలో, అరుణాచల్‌లో, గోవాలో, మణిపూర్‌లో, ఉత్తర ప్రదేశ్‌లో, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ నుంచీ, ఇతర ప్రతిపక్షాల నుంచీ బలమైన నాయకులు బీజేపీలోకి ఫిరాయించడం రాజకీయ వ్యవస్థకు కానీ, న్యాయవ్యవస్థకు కానీ అభ్యంతరకరమైన అంశంగా కనిపించకపోవడం ఆశ్చర్యం, ఆవేదన కలిగిస్తున్నది. బహుశా యూపీఏ–2 హయాంలో పెచ్చరిల్లిన అవినీతిని చూసి రోసిన ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని బేషరతుగా సమర్థిస్తున్నారు కాబోలు. బలహీనపడుతున్నదీ, దారీతెన్నూ తెలియక అయోమయావస్థలో పడి కొట్టుకుంటున్నదీ ఒక్క కాంగ్రెస్ మాత్రమే కాదు. ఇతర ప్రతిపక్షాలు కూడా ఆత్మాహుతి బాటలోనే ఉన్నాయి. పట్నాలో నితీశ్‌కుమార్ నాటకీయ రాజ కీయం నడుస్తుంటే ఢిల్లీలో మార్క్సిస్టు పార్టీ వేదికపైన మరో రకమైన నిశ్శబ్ద యుద్ధం జరిగింది. ఏచూరికి చుక్కెదురు సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం రాజ్యసభ సభ్యత్వం ముగిం పునకు వచ్చింది. మూడో విడత ఆయనను పశ్చిమబెంగాల్ నుంచి అభ్యర్థిగా నిర్ణయిస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది. కానీ సీపీఎం పొలిట్‌బ్యూరో పోయిన ఆదివారం జరిగిన సమావేశంలో ఏచూరి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది. సీపీఎం అగ్రనాయకులు ఏచూరి, ప్రకాశ్ కరత్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ ఫెడరేషన్ రాజకీయాలతో ఎదిగి పార్టీలో ఉన్నతస్థాయికి చేరినవారు. వారు ఇద్దరూ రాజ్యసభలో ఉంటే పార్టీకీ, సమాజానికీ ఎంతో కొంత మేలు జరిగేది. ఇప్పుడు ఏచూరి గెలుపొందితే తర్వాత కేరళ నుంచి కరత్ రాజ్యసభలో ప్రవేశించవచ్చు. పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాలలోని సీపీఎం నాయకులు ఏచూరిని సమర్థిస్తున్నట్టూ, కరత్‌కు కేరళ నాయకత్వం మద్దతు సంపూర్ణంగా ఉన్నట్టూ సమాచారం. పశ్చిమబెంగాల్ కామ్రేడ్లు ఏచూరి అభ్యర్థిత్వంపైన పట్టుపట్టి సెంట్రల్ కమిటీ సమావేశంలో చర్చకు పెట్టి చివరికి ఓటింగ్దాగా లాగారు. ఏచూరి ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఆయనకు అనుకూలంగా 30 ఓట్లూ, వ్యతిరేకంగా 50 ఓట్లూ రావడంతో మూడో విడత రాజ్యసభలో ఏచూరి ప్రవేశానికి అవకాశం లేకుండా పోయింది. కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ కరత్‌కు బాసటగా నిలిచాయి. కాంగ్రెస్‌కూ, బీజేపీకీ సమాన దూరం పాటించాలన్న పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా కాంగ్రెస్ మద్దతు స్వీకరించే ప్రశ్న లేదని సీపీఎం అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ భావించింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు చట్టసభలలో ప్రవేశించి కాలక్షేపం చేయకుండా పార్టీ నిర్మాణంలో నిమగ్నం కావాలన్న వాదన కూడా ఉన్నది. కరత్ మితవాది. సీపీఎం అగ్రనేత జ్యోతిబసుకు 1996లో ప్రధాని పదవి దక్కే అవకాశం వచ్చినప్పుడు కాదూ కూడదూ అంటూ పార్టీ తీర్మా నించింది కరత్ ధోరణి వల్లనే. తాను రాష్ట్రపతి కాకుండా అడ్డుకున్నది సీపీఏం సెంట్రల్ కమిటీయేనని ఆ పార్టీ సీనియర్ నాయకుడూ, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ వారంరోజుల కిందట బెంగాలీ దినపత్రిక ‘ఆజ్ కల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కరత్‌కు భిన్నంగా ఏచూరి కాస్త ఉదారవాది. మాజీ ప్రధాన కార్యదర్శి హర్‌కిషన్‌సింగ్ సూర్జిత్ మార్గం ఏచూరిది. ప్రతిపక్ష శిబిరంలో ఎప్పుడు వివాదం వచ్చినా తీర్పరిగా సూర్జిత్ వ్యవహరించేవారు. కాంగ్రెస్‌కు దగ్గరగా, బీజేపీకి దూరంగా ఉండేవారు. సీపీఎం సెంట్రల్ కమిటీలో తెలుగు రాష్ట్రాల సభ్యులలో అత్యధికులు ప్రకాశ్ కరత్ అనుయాయులు. ఆంధ్రప్రదేశ్ నుంచి బివి రాఘవులు, పి మధు, ఎంఏ గఫూర్, పాటూరు రామయ్య, పుణ్యవతి సభ్యులు కాగా తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, ఎస్ వీరయ్య, సిహెచ్ సీతారాములు సభ్యులు. మల్లు స్వరాజ్యం శాశ్వత ఆహ్వానితురాలు. మంగళవారం జరిగిన ఓటింగ్‌లో వీరిలో అత్యధికులు ఏచూరికి వ్యతిరేకంగా ఓటు చేయడం విశేషం. ఎడతెగని విభేదాల కారణంగా సీపీఎం మరింత బలహీనమయ్యే ప్రమాదం ఉన్నది. రాహుల్‌గాంధీకి నాయకత్వ లక్షణాలు లేని కారణంగా కాంగ్రెస్, నితీశ్‌కుమార్ అధికారవాద రాజకీయాల వల్ల జేడీ(యూ), అధినేత అవదులు మీరిన ఆత్మవిశ్వాసంతో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ చీలిక రాజ కీయాల వల్ల బీఎస్పీ, అధికార కుటుంబంలో కలహాల వల్ల సమాజ్‌వాదీ పార్టీ, అనైక్యత కారణంగా వామపక్షాలు నానాటికీ క్షీణిస్తుంటే తన కత్తికి ఎదురు లేకుండా బీజేపీ జైత్రయాత్ర సాగిస్తున్నది. అవకాశవాదానికీ, అవినీతికీ, పార్టీ ఫిరాయింపులకూ ఒడిగట్టకుండా రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ బీజేపీ కానీ దాని మిత్రపక్షాలు కానీ ఎన్నేళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ అభ్యంతరం లేదు. కానీ ప్రతిపక్షాలను బలహీనం చేసే క్రమంలో రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీలు దేశాన్ని అవాంఛనీయమైన, అప్రజాస్వామికమైన మార్గంలో నడి పిస్తున్నాయనీ, విలువలు లేని రాజకీయాలకు పట్టం కడుతున్నాయనీ గ్రహించాలి. కె. రామచంద్రమూర్తి